మీ నియామకంలో మనసుపెట్టి పనిచేయండి!
ఒక మంచి స్నేహితుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉత్తరం రాసినప్పుడు మీకెలా అనిపిస్తుంది? అపొస్తలుడైన పౌలు శిష్యుడైన తిమోతికి అలాంటి ఒక ఉత్తరమే రాశాడు. అదే, ఇప్పుడు మన బైబిల్లో ఉన్న రెండో తిమోతి పుస్తకం. తిమోతి ఒక ప్రశాంతమైన చోటు చూసుకొని, తన ప్రాణ స్నేహితుడు రాసిన ఉత్తరాన్ని ఆత్రంగా చదవడం మనం ఊహించుకోవచ్చు. బహుశా తిమోతి ఇలా ఆలోచించి ఉంటాడు: ‘పౌలు ఎలా ఉన్నాడు? నా నియామకాలకు సంబంధించి ఇందులో ఏమైనా సలహాలు రాశాడా? పరిచర్యను బాగా చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగపడే విషయాలు ఈ ఉత్తరంలో ఉన్నాయా?’ తిమోతి ప్రశ్నలకు ఆ ఉత్తరంలో జవాబులున్నాయి, అలాగే మరిన్ని విలువైన విషయాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి, ఆ ఉత్తరంలో మనకు ఉపయోగపడే కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని పరిశీలిద్దాం.
“నేను అన్నిటినీ సహిస్తూ ఉన్నాను”
ఆ ఉత్తరంలోని మొదటి మాటల్ని చదవగానే, వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం తిమోతికి గుర్తొచ్చి ఉంటుంది. పౌలు తిమోతిని “నా ప్రియమైన కుమారుడు” అని ఆప్యాయంగా పిలిచాడు. (2 తిమో. 1:2) దాదాపు క్రీ.శ. 65 లో ఈ ఉత్తరాన్ని అందుకునే సమయానికి, తిమోతికి 30 కన్నా ఎక్కువ సంవత్సరాల వయసు ఉండివుంటుంది. అప్పటికే ఆయన అనుభవంగల సంఘపెద్ద. తిమోతి పది కన్నా ఎక్కువ సంవత్సరాలు పౌలుతో కలిసి పనిచేశాడు, ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు.
పౌలు కష్టాల్ని నమ్మకంగా సహిస్తున్నాడని తెలుసుకుని తిమోతికి ఎంతో ప్రోత్సాహంగా అనిపించి ఉంటుంది. పౌలు రోములో ఖైదీగా ఉన్నాడు, మరణాన్ని ఎదుర్కోబోతున్నాడు. (2 తిమో. 1:15, 16; 4:6-8) “నేను అన్నిటినీ సహిస్తూ ఉన్నాను” అని పౌలు చెప్పిన మాటల వెనక ఆయనకున్న ధైర్యాన్ని తిమోతి చూడగలిగాడు. (2 తిమో. 2:8-13) కష్టాల్ని సహించే విషయంలో పౌలు ఉంచిన చక్కని ఆదర్శం మనల్ని కూడా బలపరుస్తుంది.
“నీకు ఇచ్చిన వరాన్ని అగ్ని రాజేసినట్టు రాజేయి”
దేవుని సేవలో తనకున్న నియామకాన్ని చాలా అమూల్యంగా ఎంచమని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు. తనలో ఉన్న వరాన్ని అంటే, ‘దేవుడు తనకు ఇచ్చిన వరాన్ని అగ్ని రాజేసినట్టు రాజేయమని’ పౌలు తిమోతికి చెప్పాడు. (2 తిమో. 1:6) ఇక్కడ “వరం” అని చెప్పడానికి పౌలు ఉపయోగించిన గ్రీకు పదం ఖరిస్మా. సాధారణంగా ఆ గ్రీకు పదం, అర్హత లేకపోయినా ఉచితంగా పొందే బహుమానాన్ని సూచిస్తుంది. సంఘంలో ఒక ప్రత్యేకమైన సేవకు ఎంచుకోబడినప్పుడు, తిమోతి ఆ వరాన్నే పొందాడు.—1 తిమో. 4:14.
ఆ వరంతో తిమోతి ఏం చేయాలి? “అగ్ని రాజేసినట్టు రాజేయి” అనే మాట చదవగానే తిమోతికి, ఆరిపోయే స్థితిలో ఉన్న బొగ్గులు గుర్తొచ్చి ఉండవచ్చు. ఆ బొగ్గులు మళ్లీ మండుకొని వేడిగా అవ్వాలంటే, వాటిని కదిలించాలి. ఇక్కడ పౌలు ఉపయోగించిన గ్రీకు క్రియా పదానికి (అనాజొపీరియో) “తిరిగి రగిలించడం, నూతన ఉత్తేజాన్ని నింపడం, మంటల్లోకి గాలి ఊదడం” అనే అర్థాలు ఉన్నాయని ఒక డిక్షనరీ చెప్తోంది. అంటే ఒక పనిని కొత్త ఉత్సాహంతో చేయడమని అర్థం. ఒక్కమాటలో చెప్పాలంటే పౌలు తిమోతికి, ‘నీ నియామకంలో మనసుపెట్టి పనిచేయి’ అని సలహా ఇస్తున్నాడు. నేడు మనం కూడా అలాగే చేయాలి, అంటే మన నియామకంలో ఉత్సాహంగా పనిచేయాలి.
“ఈ అమూల్యమైన సంపదను . . . కాపాడు”
తన ప్రాణ స్నేహితుడు రాసిన ఉత్తరాన్ని చదువుతుండగా, తన పరిచర్యకు ఉపయోగపడే మరో మాటను తిమోతి అందులో గమనించాడు. పౌలు ఇలా రాశాడు: “నీకు అప్పగించబడిన ఈ అమూల్యమైన సంపదను మనలో నివసిస్తున్న పవిత్రశక్తి సహాయంతో కాపాడు.” (2 తిమో. 1:14) ఆ సంపద ఏంటి? తిమోతికి ఏం అప్పగించబడింది? ముందటి వచనంలో పౌలు, “మంచి మాటల” గురించి, అంటే లేఖనాల్లో ఉన్న సత్యం గురించి మాట్లాడాడు. (2 తిమో. 1:13) క్రైస్తవ పరిచారకుడిగా, తిమోతి ఆ సత్యాన్ని సంఘంలో అలాగే బయట బోధించాలి. (2 తిమో. 4:1-5) అంతేకాదు, దేవుని సంఘాన్ని కాసే సంఘపెద్దగా కూడా తిమోతి నియమించబడ్డాడు. (1 పేతు. 5:2) యెహోవా పవిత్రశక్తి మీద, ఆయన వాక్యం మీద ఆధారపడడం ద్వారా తిమోతి ఆ సంపదను, అంటే తాను బోధించాల్సిన సత్యాన్ని కాపాడగలుగుతాడు.—2 తిమో. 3:14-17.
నేడు మనకు కూడా సత్యం అప్పగించబడింది, మనం దాన్ని ఇతరులకు బోధించాలి. (మత్త. 28:19, 20) ఆ సంపదను ఎప్పటికీ విలువైనదిగానే ఎంచాలంటే మనం పట్టుదలగా ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేయాలి. (రోమా. 12:11, 12; 1 తిమో. 4:13, 15, 16) మనకు సంఘంలో పెద్దగా లేదా పూర్తికాల సేవకుడిగా సేవచేసే అదనపు నియామకం కూడా ఉండవచ్చు. అలాంటి విలువైన సంపద పొందినప్పుడు మనం వినయంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆ సంపదను విలువైనదిగా ఎంచడం ద్వారా, సహాయం కోసం యెహోవా మీద ఆధారపడడం ద్వారా మనం దాన్ని కాపాడుకోగలుగుతాం.
ఈ విషయాల్ని “నమ్మకమైన పురుషులకు అప్పగించు”
తిమోతి తన నియామకంలో భాగంగా, తాను చేస్తున్న పనిని ఇతరులకు నేర్పించాలి. అందుకే పౌలు తిమోతిని ఇలా ప్రోత్సహించాడు: “నువ్వు నా దగ్గర విన్న విషయాల్ని, . . . నమ్మకమైన పురుషులకు అప్పగించు. దానివల్ల వాళ్లు కూడా ఇతరులకు బోధించడానికి తగినవిధంగా అర్హులౌతారు.” (2 తిమో. 2:2) అవును, తిమోతి తాను నేర్చుకున్న వాటన్నిటినీ సహోదరులతో పంచుకోవాలి. నేడు క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతీ పెద్ద అలా కృషిచేయడం ప్రాముఖ్యం. ఒక మంచి పెద్ద ఏదైనా పని గురించి తనకు తెలిసిన విషయాన్ని తన దగ్గరే ఉంచుకోడు. బదులుగా వేరేవాళ్లు కూడా ఆ పని చేయగలిగేలా వాళ్లకు శిక్షణ ఇస్తాడు. అలా నేర్పిస్తే వాళ్లు జ్ఞానంలో లేదా సామర్థ్యంలో తనను మించిపోతారేమో అని ఆయన భయపడడు. కాబట్టి ఒక పర్యవేక్షకుడు విషయాల్ని కేవలం పైపైన చెప్పి వదిలేయడు. బదులుగా మంచి వివేచన-జ్ఞానం వృద్ధి చేసుకునేలా, అంటే పరిణతిగల క్రైస్తవులయ్యేలా సహోదరులకు సహాయం చేయాలనుకుంటాడు. అలాచేస్తే, ఆయన ఎవరికైతే శిక్షణ ఇచ్చాడో ఆ “నమ్మకమైన పురుషులు” సంఘానికి ఇంకా బాగా ఉపయోగపడతారు.
పౌలు ప్రేమగా రాసిన ఉత్తరాన్ని తిమోతి తప్పకుండా విలువైనదిగా ఎంచి ఉంటాడు. తిమోతి అందులో ఉన్న సలహాల్ని పదేపదే తీసి చూసుకోవడం, తన నియామకాల్లో ఆ సలహాల్ని ఎలా పాటించాలా అని ఆలోచించడం మనం ఊహించుకోవచ్చు.
ఆ సలహాల్ని పాటించాలని మనం కూడా కోరుకుంటాం. వాటిని ఎలా పాటించవచ్చు? మనకున్న వరాన్ని అగ్ని రాజేసినట్టు రాజేయడం ద్వారా, మనకున్న సంపదను కాపాడుకోవడం ద్వారా, మనకున్న అనుభవాన్ని-జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా వాటిని పాటించవచ్చు. అలా చేసినప్పుడు, పౌలు తిమోతికి చెప్పినట్టే మనం ‘పరిచర్యను పూర్తిగా నెరవేర్చగలుగుతాం.’—2 తిమో. 4:5.