కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు వాస్తవాలు తెలుసా?

మీకు వాస్తవాలు తెలుసా?

“సంగతి [వాస్తవాలు, NW] వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.”సామె. 18:13.

పాటలు: 126, 95

1, 2. (ఎ) మనం ఏమి నేర్చుకోవాలి? ఎందుకు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

 మనకేదైనా సమాచారం అందినప్పుడు, అది ఎంతవరకు నిజమో, దాన్నుండి సరైన ముగింపుకు ఎలా రావాలో మనందరం నేర్చుకోవాలి. (సామె. 3:21-23; 8:4, 5) లేదంటే, సాతాను అలాగే అతని లోకం మన ఆలోచనల్ని తేలిగ్గా తప్పుదారి పట్టిస్తాయి. (ఎఫె. 5:6; కొలొ. 2:8) నిజానికి మనం సరైన ముగింపుకు రావాలంటే మన దగ్గర వాస్తవాలు ఉండాలి. సామెతలు 18:13 ఇలా చెప్తుంది, “సంగతి [వాస్తవాలు, NW] వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.”

2 వాస్తవాలు తెలుసుకోవడం, సరైన ముగింపుకు రావడం ఎందుకు కష్టమో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అంతేకాదు మనకు అందిన సమాచారం ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి సహాయపడే బైబిలు సూత్రాలు, ఉదాహరణలు కూడా పరిశీలిస్తాం.

“ప్రతి మాట” నమ్మకండి

 3. సామెతలు 14:15⁠లో ఉన్న బైబిలు సూత్రాన్ని మనమెందుకు పాటించాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)

3 నేడు ఎన్నో మాధ్యమాల ద్వారా మనకు సమాచారం అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు ఇంటర్నెట్‌, టీవీ వంటివాటి ద్వారా మనకు సమాచారం దొరుకుతుంది. అంతేకాదు మన స్నేహితులు కూడా ఎన్నో ఈ-మెయిల్స్‌, మెసేజ్‌లు పంపిస్తుంటారు. కొన్నిసార్లు, అసలు ఈ సమాచారానికి అంతే లేదని అనిపించవచ్చు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. బహుశా మన స్నేహితులకు మంచి ఉద్దేశాలే ఉండవచ్చు. కానీ వేరేవాళ్లు కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు లేదా వాస్తవాలను మారుస్తారు. అయితే మనం వినే సమాచారం ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ఏ బైబిలు సూత్రం సహాయం చేస్తుంది? సామెతలు 14:15 ఇలా చెప్తుంది, “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.”

 4. సరైన సమాచారాన్ని ఎంపిక చేసుకోవడం గురించి ఫిలిప్పీయులు 4:8, 9 ఏమి చెప్తుంది? (“ వాస్తవాలను తెలియజేసే కొన్ని మాధ్యమాలు” అనే బాక్సు కూడా చూడండి.)

4 మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే నమ్మదగిన వాస్తవాలు ఉండాలి. అందుకే, మనం చదివే సమాచారాన్ని జాగ్రత్తగా ఎంపికచేసుకోవాలి. (ఫిలిప్పీయులు 4:8, 9 చదవండి.) పుకార్లను వ్యాప్తి చేసే వెబ్‌సైట్‌లు చూస్తూ, ఈ-మెయిల్స్‌ చదువుతూ మన సమయాన్ని వృథా చేసుకోకూడదు. ముఖ్యంగా మతభ్రష్టుల వెబ్‌సైట్‌లను అస్సలు చూడకూడదు. వాళ్లు దేవుని ప్రజల విశ్వాసాన్ని నీరుగార్చి, సత్యాన్ని వదిలేసేలా చేస్తారు. తప్పుడు సమాచారాన్ని నమ్మితే చెడ్డ నిర్ణయాలు తీసుకుంటాం. అలాంటి సమాచారం మీపై ప్రభావం చూపించదని ఎన్నడూ అనుకోకండి.—1 తిమో. 6:20, 21.

 5. ఇశ్రాయేలీయులు ఏ తప్పుడు సమాచారాన్ని విన్నారు? దానికి వాళ్లు ఎలా స్పందించారు?

5 తప్పుడు సమాచారం వల్ల చెడు పర్యవసానాలు రావచ్చు. ఉదాహరణకు, మోషే కాలంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆలోచించండి. వాగ్దాన దేశాన్ని వేగు చూడ్డానికి వెళ్లిన 12 మందిలో పదిమంది తప్పుడు సమాచారంతో తిరిగొచ్చారు. (సంఖ్యా. 13:25-33) వాళ్లు గోరంత వాస్తవాలను కొండంత చేసి చెప్పారు, దాంతో ఇశ్రాయేలీయులు భయపడి, నిరుత్సాహపడ్డారు. (సంఖ్యా. 14:1-4) వేగు చూడ్డానికి వెళ్లినవాళ్లలో పదిమంది ఒకే విషయాన్ని చెప్పారు కాబట్టి అదే నిజమని ఇశ్రాయేలీయులు అనుకొనివుంటారు. దానివల్ల మిగతా ఇద్దరు వేగులవాళ్లు చెప్పిన మంచి సమాచారాన్ని వినడానికి వాళ్లు ఇష్టపడలేదు. (సంఖ్యా. 14:6-10) వాళ్లు వాస్తవాలను తెలుసుకుని యెహోవాపై నమ్మకం ఉంచే బదులు, తప్పుడు సమాచారాన్ని నమ్మాలని నిర్ణయించుకున్నారు. ఎంత తెలివితక్కువ పనో కదా!

 6. యెహోవా ప్రజల గురించి ఏదైనా తప్పుడు సమాచారాన్ని విన్నప్పుడు మనం ఎందుకు ఆశ్చర్యపోము?

6 యెహోవా ప్రజల గురించి ఏదైనా సమాచారాన్ని విన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన శత్రువైన సాతాను “మన సోదరుల్ని నిందించేవాడు” అని బైబిలు చెప్తుంది. (ప్రక. 12:10) వ్యతిరేకులు మన గురించి ‘అబద్ధాలు చెప్తూ మనకు వ్యతిరేకంగా అన్నిరకాల చెడ్డ మాటలు’ మాట్లాడతారని యేసు హెచ్చరించాడు. (మత్త. 5:11) మనం ఆ హెచ్చరికను గంభీరంగా తీసుకుంటే, యెహోవా ప్రజల గురించి ఏదైనా తప్పుడు సమాచారాన్ని విన్నప్పుడు ఆశ్చర్యపోము.

 7. ఈ-మెయిల్స్‌, మెసేజ్‌లు పంపించే ముందు ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

7 స్నేహితులకు ఈ-మెయిల్స్‌, మెసేజ్‌లు పంపించడం మీకు ఇష్టమా? ఏదైనా ఆసక్తికరమైన విషయాన్ని వార్తల్లో చూసినప్పుడు లేదా విన్నప్పుడు ఒక రిపోర్టర్‌లా దాన్ని వెంటనే షేర్‌ చేయాలని మీకు అనిపిస్తుందా? ఈ-మెయిల్స్‌ లేదా మెసేజ్‌లు పంపించే ముందు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ సమాచారం నిజమేనా? నాకు వాస్తవాలు తెలుసా?’ పూర్తి వివరాలు తెలీకపోతే, మీరు అబద్ధాల్ని వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా విషయం నిజమో కాదో మీకు తెలీకపోతే దాన్ని పంపకండి. డిలీట్‌ చేయండి!

 8. కొన్ని దేశాల్లో వ్యతిరేకులు ఏమి చేశారు? జాగ్రత్తగా లేకపోతే మనకు తెలియకుండానే వాళ్లకు ఎలా మద్దతిచ్చే అవకాశముంది?

8 అనాలోచితంగా ఈ-మెయిల్స్‌, మెసేజ్‌లు పంపడం వల్ల మరో ప్రమాదం కూడా ఉంది. కొన్ని దేశాల్లో మన పనిపై ఆంక్షలు లేదా నిషేధాలు ఉన్నాయి. ఆ దేశాల్లో వ్యతిరేకులు మనల్ని భయపెట్టడానికి, ఒకరిమీద ఒకరికి అనుమానం కలిగేలా చేయడానికి కావాలనే అబద్ధాలు వ్యాప్తి చేయవచ్చు. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో ఏమి జరిగిందో పరిశీలించండి. సంస్థలో పెద్దపెద్ద బాధ్యతల్లో ఉన్న కొంతమంది సహోదరులు యెహోవాసాక్షుల్ని మోసం చేశారని కె.జి.బి. అని పిలువబడే రహస్య పోలీసులు పుకార్లు పుట్టించారు. a విచారకరంగా, చాలామంది సహోదరులు ఆ అబద్ధాల్ని నమ్మి యెహోవా సంస్థను విడిచిపెట్టారు. కాలం గడిచిన కొద్దీ వాళ్లలో చాలామంది తిరిగొచ్చారు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటివరకు తిరిగి రాలేదు. వాళ్లు ఆ అబద్ధాల వల్ల విశ్వాసాన్ని కోల్పోయారు. (1 తిమో. 1:19) అలాంటి పరిస్థితి రాకుండా మనమెలా జాగ్రత్తపడవచ్చు? తప్పుడు సమాచారాన్ని లేదా ఎలాంటి ఆధారాల్లేని సమాచారాన్ని వ్యాప్తి చేయకండి. మీరు వినే ప్రతీదాన్ని నమ్మే బదులు వాస్తవాలు తెలుసుకోండి.

పూర్తి వాస్తవాలు లేని సమాచారం

 9. సరైన ముగింపుకు రావడం దేనివల్ల కూడా కష్టం కావచ్చు?

9 కొన్నిసార్లు మనం వినే సమాచారంలో సగమే నిజం ఉండొచ్చు లేదా వాస్తవాలన్నీ ఉండకపోవచ్చు. కాబట్టి దానివల్ల కూడా మనం సరైన ముగింపుకు రావడం కష్టం. మనకు అందే సమాచారంలో 10 శాతమే నిజమున్నా అది మనల్ని 100 శాతం తప్పుదారి పట్టించవచ్చు. అలాంటి సమాచారం వల్ల మోసపోకుండా ఉండడానికి మనమేమి చేయాలి?—ఎఫె. 4:14.

10. కొంతమంది ఇశ్రాయేలీయులు తమ సహోదరులతో యుద్ధం చేయడానికి ఎందుకు సిద్ధపడ్డారు? కానీ యుద్ధానికి వెళ్లకుండా ఏది సహాయం చేసింది?

10 యెహోషువ కాలంలో, యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న ఇశ్రాయేలీయుల నుండి మనమెంతో నేర్చుకోవచ్చు. (యెహో. 22:9-34) తూర్పున ఉన్న ఇశ్రాయేలీయులు యొర్దాను నది దగ్గర పెద్ద బలిపీఠాన్ని కట్టారని వాళ్లకు తెలిసింది. అది కొంతవరకు నిజమే, కానీ వాళ్లకు పూర్తి వాస్తవాలు తెలియవు. తూర్పున ఉన్న ఇశ్రాయేలీయులు యెహోవాకు ఎదురుతిరిగారని అనుకుని పశ్చిమాన ఉన్న ఇశ్రాయేలీయులు వాళ్లమీదకు యుద్ధానికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. (యెహోషువ 22:9-12 చదవండి.) కానీ యుద్ధానికి వెళ్లే ముందు, వాస్తవాలు తెలుసుకోవడానికి కొంతమందిని పంపించారు. వాళ్లు ఏమి తెలుసుకున్నారు? తూర్పున ఉన్న ఇశ్రాయేలీయులు అబద్ధ దేవుళ్లకు బలులు అర్పించడానికి కాదుగానీ, తాము యెహోవా ఆరాధకులమని అందరికీ తెలియజేయడానికి ఒక సాక్ష్యంగా బలిపీఠాన్ని కట్టారు. పశ్చిమాన ఉన్న ఇశ్రాయేలీయులు తొందరపడి యుద్ధానికి వెళ్లకుండా, సమయం తీసుకుని వాస్తవాలన్నీ తెలుసుకున్నందుకు ఎంత సంతోషించివుంటారో కదా!

11. (ఎ) మెఫీబోషెతుకు ఎలాంటి అన్యాయం జరిగింది? (బి) దావీదు ఏమి చేసివుంటే మెఫీబోషెతుకు అన్యాయం జరగకుండా ఉండేది?

11 ప్రజలు పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా మన గురించి తప్పుడు ప్రచారం చేసినప్పుడు మనకు బాధ కలగవచ్చు. మెఫీబోషెతుకు జరిగిన దానిగురించి ఆలోచించండి. రాజైన దావీదు మెఫీబోషెతుకు అతని తాతయిన సౌలు ఆస్తిని ఉదారంగా ఇచ్చాడు. (2 సమూ. 9:6, 7) కానీ కొంతకాలం తర్వాత మెఫీబోషెతు గురించి దావీదు తప్పుడు సమాచారం విన్నాడు. అది నిజమో కాదో తెలుసుకోకుండా దావీదు మెఫీబోషెతు ఆస్తినంతా తీసుకున్నాడు. (2 సమూ. 16:1-4) కొంతకాలానికి మెఫీబోషెతుతో మాట్లాడిన తర్వాత తాను తప్పుచేశానని దావీదు గ్రహించాడు. దాంతో మెఫీబోషెతుకు కొంత ఆస్తిని తిరిగిచ్చాడు. (2 సమూ. 19:24-29) తనకు అందిన అరకొర సమాచారాన్ని బట్టి దావీదు తొందరపడకుండా, వాస్తవాలు తెలుసుకోవడానికి సమయం తీసుకునివుంటే మెఫీబోషెతుకు అన్యాయం జరిగేది కాదు.

12, 13. (ఎ) ప్రజలు తన గురించి అబద్ధాలు చెప్పినప్పుడు యేసు ఏమి చేశాడు? (బి) మన గురించి ఎవరైనా అబద్ధాలు చెప్తే ఏమి చేయవచ్చు?

12 మీ గురించి ఎవరైనా అబద్ధాలు వ్యాప్తి చేస్తే ఏమి చేయవచ్చు? యేసు విషయంలో, బాప్తిస్మమిచ్చే యోహాను విషయంలో అదే జరిగింది. (మత్తయి 11:18, 19 చదవండి.) కానీ యేసు ఏమి చేశాడు? తన గురించి చెప్పినవన్నీ అబద్ధాలని నిరూపించడానికి యేసు తన సమయాన్ని, శక్తిని వృథా చేసుకోలేదు. బదులుగా వాస్తవాలను అంటే ఆయన పనుల్ని, బోధల్ని చూడమని ప్రజల్ని ప్రోత్సహించాడు. యేసు ఇలా చెప్పాడు, “ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివైనవాడని చూపిస్తాయి.”—మత్త. 11:19.

13 మనం యేసు నుండి విలువైన పాఠం నేర్చుకోవచ్చు. కొన్నిసార్లు ప్రజలు మన గురించి లేనిపోనివి చెప్పినప్పుడు, మన పేరు పాడౌతుందేమోనని మనం ఆందోళనపడవచ్చు. కానీ నిజమేంటో మన జీవన విధానం ద్వారా చూపించవచ్చు. యేసు నుండి నేర్చుకున్నట్లు, మన గురించి ప్రజలు వ్యాప్తి చేసినవి అబద్ధాలని, పూర్తి వాస్తవాలు కావని మన మంచి ప్రవర్తన ద్వారా నిరూపించవచ్చు.

మీ సొంత తెలివి మీద ఆధారపడకండి

14, 15. మన సొంత తెలివి మీద ఎందుకు ఆధారపడకూడదు?

14 నమ్మదగిన వాస్తవాలు దొరకడం కష్టమని తెలుసుకున్నాం. మరో సమస్య ఏమిటంటే, మన అపరిపూర్ణత. మనం యెహోవాను ఎంతో కాలంగా సేవిస్తుండవచ్చు, కొన్ని విషయాల్లో తెలివిగా నడుచుకుని ఉండవచ్చు. దేన్నైనా సరిగ్గా అంచనా వేసే మన సామర్థ్యాన్నిబట్టి ఇతరులు మనల్ని గౌరవిస్తుండవచ్చు. అయితే, దానివల్ల కూడా మనం తప్పుదారి పట్టే అవకాశం ఉందా?

15 ఉంది. మన సొంత తెలివి మీద ఆధారపడడం మొదలుపెట్టే ప్రమాదం ఉంది. మన సొంత భావాలు, అభిప్రాయాలు మన ఆలోచనల్ని నిర్దేశించే అవకాశం ఉంది. మన దగ్గర వాస్తవాలన్నీ లేకపోయినా ఫలానా విషయాన్ని పూర్తిగా అర్థంచేసుకోగలమని నమ్మడం మొదలుపెట్టవచ్చు. ఇది చాలా ప్రమాదకరం! మన సొంత తెలివి మీద ఆధారపడకూడదని బైబిలు హెచ్చరిస్తుంది.—సామె. 3:5, 6; 28:26.

16. ఈ సన్నివేశంలో రెస్టారెంట్‌లో ఏమి జరిగింది? ప్రభాకర్‌ ఏమి ఆలోచించాడు?

16 ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: ఎంతోకాలం నుండి సంఘపెద్దగా సేవచేస్తున్న ప్రభాకర్‌ ఒకరోజు సాయంత్రం రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ భాస్కర్‌ అనే మరో సంఘపెద్ద ఒక అమ్మాయితో కనిపించాడు. ఆమె అతని భార్య కాదు. వాళ్లిద్దరూ చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లు నవ్వుకోవడం, కౌగలించుకోవడం కూడా ప్రభాకర్‌ చూశాడు. ఆయన చాలా కంగారుపడి, ‘ఇక భాస్కర్‌, అతని భార్య విడాకులు తీసుకుంటారా? వాళ్ల పిల్లల సంగతేంటి?’ అని ఆలోచించాడు. ప్రభాకర్‌కు అలాంటి అనుభవాలు అంతకుముందు కూడా ఎదురయ్యాయి. మీరు ఒకవేళ ప్రభాకర్‌ స్థానంలో ఉంటే ఎలా ఆలోచించేవాళ్లు?

17. ప్రభాకర్‌ ఏ విషయాన్ని తెలుసుకున్నాడు? ఈ సన్నివేశం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

17 కాస్త ఆగండి! భాస్కర్‌ తన భార్యకు అన్యాయం చేస్తున్నాడని ప్రభాకర్‌ అనుకున్నాడు, కానీ ఆయనకు వాస్తవాలన్నీ తెలుసా? ఆ రోజు రాత్రి ప్రభాకర్‌ భాస్కర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాక తెలిసిన విషయమేమిటంటే, ఆ అమ్మాయి ఎవరో కాదు తన సొంత చెల్లి. ఆమె వేరే దేశంలో ఉంటుంది. వాళ్లు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. ఆమె కొన్ని గంటలే ఉంటుంది కాబట్టి ఇంటికి వెళ్లేంత సమయం లేక రెస్టారెంట్‌లో భోజనం చేయడానికి కలుసుకున్నారు. భాస్కర్‌ భార్య కొన్ని కారణాలవల్ల రాలేకపోయింది. ప్రభాకర్‌ తనకొచ్చిన సందేహాలను ఎవ్వరికీ చెప్పనందుకు ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సన్నివేశం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మనం ఎంతోకాలంగా యెహోవాను సేవిస్తున్నప్పటికీ, ఏదైనా విషయం గురించి సరైన ముగింపుకు రావాలంటే వాస్తవాలన్నీ తెలుసుకోవాలి.

18. మన సహోదరుని గురించి చెడుగా విన్నప్పుడు, దాన్ని ఎందుకు వెంటనే నమ్మే అవకాశం ఉంది?

18 సంఘంలో తోటి సహోదరునితో మనకు మనస్పర్థలు వచ్చినప్పుడు, అతని గురించి మనం సరిగ్గా అంచనా వేయలేకపోవచ్చు. ఆ మనస్పర్థల గురించే ఆలోచిస్తూ ఉంటే అతని మీద మనకు అనుమానాలు కలగవచ్చు. అప్పుడు, ఆ సహోదరుని గురించి ఏదైనా చెడుగా విన్నప్పుడు, ఎలాంటి ఆధారాలు లేకపోయినా అది నిజమని నమ్మేస్తాం. దీన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మన సహోదరుల మీద చెడు అభిప్రాయం ఏర్పర్చుకుంటే, వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు ముగింపుకు వచ్చేస్తాం. (1 తిమో. 6:4, 5) కాబట్టి మన మనసులో సహోదరుల మీద ఈర్ష్య, అసూయ వంటివి ఉంచుకోకూడదు. బదులుగా, దేవుడు చెప్తున్నట్లు మనం తోటి సహోదరసహోదరీలను ప్రేమించాలి, మనస్ఫూర్తిగా క్షమించాలి.—కొలొస్సయులు 3:12-14 చదవండి.

బైబిలు సూత్రాలు మనల్ని కాపాడతాయి

19, 20. (ఎ) మనకు అందిన సమాచారం ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

19 ఈ రోజుల్లో నమ్మదగిన వాస్తవాలు దొరకడం, వాటిని సరిగ్గా అంచనా వేయడం చాలా కష్టమైపోయింది. ఎందుకు? మనకు ఎక్కువశాతం అరకొర సమాచారమే దొరుకుతుంది లేదా పూర్తి వాస్తవాలు దొరకట్లేదు. అంతేకాదు మనందరం అపరిపూర్ణులం. మరి మనకు ఏది సహాయం చేస్తుంది? బైబిలు సూత్రాలు! ఉదాహరణకు, వాస్తవాలు తెలుసుకోకుండా ఒక విషయం గురించి మాట్లాడడం తెలివితక్కువతనం అని ఒక బైబిలు సూత్రం చెప్తుంది. (సామె. 18:13) మనం విన్న విషయం నిజమో కాదో తెలుసుకోకుండా దాన్ని నమ్మకూడదని మరో బైబిలు సూత్రం చెప్తుంది. (సామె. 14:15) యెహోవాను మనం ఎంతో కాలంగా సేవిస్తున్నప్పటికీ, మన సొంత తెలివి మీద ఆధారపడకుండా జాగ్రత్తపడాలి. (సామె. 3:5, 6) కాబట్టి వాస్తవాలను తెలుసుకుని సరైన ముగింపుకు వచ్చినప్పుడు, తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు బైబిలు సూత్రాలు మనల్ని కాపాడతాయి.

20 అయితే మరో సవాలు ఉంది. అదేంటంటే, పైకి కనిపించే వాటిని బట్టి మనం త్వరగా తీర్పు తీరుస్తాం. కాబట్టి అలాంటి పొరపాటు చేయకుండా ఎలా ఉండవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

a 2004 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఇంగ్లీషు) 111-112 పేజీలు, అలాగే 2008 వార్షిక పుస్తకం (ఇంగ్లీషు) 133-135 పేజీలు చూడండి.