నేటి బాకా శబ్దాలకు స్పందించండి
‘చివరిరోజుల్లో’ యెహోవా తన ప్రజల్ని నడిపిస్తున్నాడని, తనను అంటిపెట్టుకుని ఉండడానికి కావల్సినవన్నీ ఇస్తున్నాడని మనందరం నమ్ముతున్నాం. (2 తిమో. 3:1) అయితే మనలో ప్రతీఒక్కరం ఆయనకు లోబడాలి. నేడు మన పరిస్థితిని, ఇశ్రాయేలీయులు ఎడారిలో ప్రయాణించినప్పటి పరిస్థితితో పోల్చవచ్చు. ఆ సమయంలో వాళ్లు బాకా శబ్దాల్ని విని దానికి తగ్గట్టు స్పందించాల్సి వచ్చేది.
యెహోవా మోషేకు “వెండిని సుత్తితో మలుస్తూ” రెండు బాకాలు తయారు చేసుకోమని చెప్పాడు. “ఇశ్రాయేలు సమాజాన్ని పిలవడానికి, డేరాలు ఎప్పుడు తీసేయాలో సూచించడానికి” ఆ బాకాలు ఉపయోగపడేవి. (సంఖ్యా. 10:2) యాజకులు వాటిని వేర్వేరు విధాలుగా ఊదడం ద్వారా, ప్రజలు ఏం చేయాలో సూచించేవాళ్లు. (సంఖ్యా. 10:3-8) నేడు కూడా దేవుని ప్రజలు వేర్వేరు విధాలుగా నిర్దేశాల్ని పొందుతున్నారు. అలాంటి మూడు విధానాలు ఏంటంటే: పెద్దపెద్ద సమావేశాలు, పెద్దలకు శిక్షణనిచ్చే పాఠశాలలు, సంస్థ తీసుకొస్తున్న మార్పులు. ఈ ఆర్టికల్‌లో వాటి గురించి పరిశీలిస్తూ, వాటిని ప్రాచీనకాల బాకా శబ్దాలతో ఎందుకు పోల్చవచ్చో తెలుసుకుంటాం.
పెద్దపెద్ద సమావేశాలు
కొన్నిసార్లు యాజకులు ఒకేసారి రెండు బాకాల్ని ఊదేవాళ్లు. ఇశ్రాయేలు ‘సమాజమంతా’ ప్రత్యక్ష గుడారానికి తూర్పు వైపున్న ప్రవేశ ద్వారం ఎదుట సమావేశమవ్వాలని యెహోవా చెప్తున్నాడని దానర్థం. (సంఖ్యా. 10:3) ఆ బాకాల శబ్దం ప్రత్యక్ష గుడారం చుట్టూ నాలుగు విభాగాలుగా డేరాలు వేసుకున్న ఇశ్రాయేలు గోత్రాల వాళ్లందరికీ వినిపించేది. ప్రవేశ ద్వారానికి దగ్గరగా ఉన్నవాళ్లు కొన్ని నిమిషాల్లోనే సమావేశమయ్యేవాళ్లు. కానీ దూరంలో ఉన్నవాళ్లు రావడానికి కాస్త ఎక్కువ సమయం, కృషి అవసరమయ్యేది. ఏదేమైనా, అందరూ సమావేశమవ్వాలని, తానిచ్చే నిర్దేశాల నుండి ప్రయోజనం పొందాలని యెహోవా కోరుకున్నాడు.
ఇప్పుడు, దేవుని ప్రజలమైన మనం ప్రత్యక్ష గుడారం దగ్గరికి కాదుగానీ ప్రాదేశిక సమావేశాలు, ప్రత్యేక కార్యక్రమాలు వంటివాటికి హాజరవ్వాలనే నిర్దేశాన్ని పొందుతున్నాం. అక్కడ మనం ప్రాముఖ్యమైన సమాచారాన్ని, ఉపదేశాన్ని పొందుతాం. ప్రపంచమంతటా ఉన్న యెహోవా ప్రజలు ఒకే రకమైన ఉపదేశాన్ని పొందుతారు. కాబట్టి ఆ సమావేశాలకు హాజరవ్వమనే నిర్దేశానికి స్పందించినవాళ్లు, యెహోవా ప్రజల పెద్ద గుంపుతో కలిసి ఆనందిస్తారు. అందుకోసం కొందరు, మిగతావాళ్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించి వస్తారు. ఏదేమైనా, సమావేశానికి హాజరైన వాళ్లందరూ తమ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం పొందామని గుర్తిస్తారు.
మరి ఆ సమావేశాలు జరిగే ప్రాంతాన్ని చేరుకోలేనంత దూరంగా, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జీవిస్తున్నవాళ్ల సంగతేంటి? ఆధునిక టెక్నాలజీ వల్ల వాళ్లు కూడా ఆ కార్యక్రమం అంతటి నుండి ప్రయోజనం పొందుతున్నారు. అంతేకాదు, ఆ కార్యక్రమానికి హాజరైన పెద్ద గుంపు మధ్యే తామూ ఉన్నామని భావిస్తున్నారు. ఉదాహరణకు ప్రధాన కార్యాలయ ప్రతినిధి, బెనిన్ బ్రాంచిని సందర్శించినప్పుడు ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దాన్ని సహారా ఎడారిలోని నైజర్‌లో ఉన్న అర్లిట్ అనే గ్రామానికి ప్రసారం చేశారు. ఆ ప్రసారాన్ని 21 మంది సహోదర సహోదరీలు, కొంతమంది ఆసక్తిగలవాళ్లు చూశారు. వాళ్లు అంత మారుమూల
ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఆ సమావేశానికి హాజరైన 44,131 మందితోపాటే తామూ ఉన్నట్టు భావించారు. ఒక సహోదరుడు ఇలా రాశాడు: “ఈ కార్యక్రమాన్ని మాకు ప్రసారం చేసినందుకు చాలాచాలా థాంక్స్. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మరోసారి చూపించారు.”పెద్దలకు శిక్షణనిచ్చే పాఠశాలలు
కొన్నిసార్లు యాజకులు ఒక్క బాకానే ఊదేవాళ్లు. అప్పుడు, “ఇశ్రాయేలులో వేలమందికి పెద్దలుగా ఉన్న ప్రధానులు మాత్రమే” ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్లేవాళ్లు. (సంఖ్యా. 10:4) మోషే వాళ్లకు ఉపదేశాన్ని, శిక్షణను ఇచ్చేవాడు. గోత్రాల పెద్దలుగా తమకున్న బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించడానికి అది వాళ్లకు సహాయం చేసేది. మీరు ఆ ప్రధానుల్లో ఒకరైతే, గుడారం దగ్గరికి వెళ్లి అక్కడిచ్చే శిక్షణ నుండి ప్రయోజనం పొందడానికి కృషి చేసేవాళ్లు కదా!
నేడున్న సంఘపెద్దలు “ప్రధానులు” కాదు, తమ సంరక్షణలో ఉన్న దేవుని మంద మీద వాళ్లు పెత్తనం చెలాయించరు. (1 పేతు. 5:1-3) బదులుగా వాళ్లు దేవుని మందను కాయడానికి శాయశక్తులా కృషిచేస్తారు. కాబట్టి అదనపు శిక్షణ కోసం, రాజ్య పరిచర్య పాఠశాల లాంటి వాటికి హాజరవ్వమనే నిర్దేశం వచ్చినప్పుడు వాళ్లు వెంటనే స్పందిస్తారు. సంఘ బాధ్యతల్ని మరింత చక్కగా నిర్వర్తించడానికి కావల్సిన శిక్షణను వాళ్లు అక్కడ పొందుతారు. దానివల్ల పెద్దలతోపాటు, సంఘంలో ఉన్నవాళ్లందరూ యెహోవాకు ఇంకా దగ్గరౌతారు. మీరు అలాంటి పాఠశాలలకు హాజరవ్వకపోయినా, వాటికి హాజరైనవాళ్ల నుండి ప్రయోజనం పొందుతుండవచ్చు.
సంస్థ తీసుకొస్తున్న మార్పులు
కొన్నిసార్లు యాజకులు బాకాల్ని “పెరుగుతూ-తగ్గుతూ ఉండే శబ్దంతో” ఊదేవాళ్లు. అది విన్నప్పుడు, యెహోవా తమను అక్కడ నుండి బయల్దేరమని చెప్తున్నాడని సమాజమంతటికీ అర్థమయ్యేది. (సంఖ్యా. 10:5, 6) ఇశ్రాయేలు సమాజం ఒకచోటి నుండి ఇంకో చోటికి బయల్దేరడం ఒక క్రమపద్ధతిలో జరిగేది. కాకపోతే అది చాలా కష్టంతో కూడుకున్న పని. కొంతమంది ఇశ్రాయేలీయులు, తాము ఉన్న చోటు నుండి బయల్దేరడానికి కొన్నిసార్లు ఇష్టపడి ఉండకపోవచ్చు. ఎందుకు?
కొంతమంది ఇశ్రాయేలీయులు, బయల్దేరమని నిర్దేశించే బాకా శబ్దాలు ఎక్కువసార్లు వస్తున్నాయని, ఊహించని సందర్భాల్లో వస్తున్నాయని అనుకుని ఉండవచ్చు. “కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి ఉదయం వరకే గుడారం పైన నిలిచేది.” ఇంకొన్నిసార్లు మాత్రం “రెండు రోజులైనా, ఒక నెలైనా, అంతకన్నా ఎక్కువైనా, మేఘం గుడారం పైనే” ఉండేది. (సంఖ్యా. 9:21, 22) ఇంతకీ ఇశ్రాయేలు సమాజం అలా ఎన్నిసార్లు బయల్దేరింది? సంఖ్యాకాండం 33వ అధ్యాయం, వాళ్లు డేరాలు వేసుకున్న దాదాపు 40 ప్రాంతాల గురించి చెప్తోంది.
ఇంకొంతమంది ఇశ్రాయేలీయులు, నీడ ఉన్న చోట డేరాలు వేసుకుని ఉండవచ్చు. ‘భయంకరమైన మహా ఎడారిలో’ నీడపట్టున ఉండాలని కోరుకోవడం సహజమే. (ద్వితీ. 1:19) కాబట్టి అక్కడ నుండి బయల్దేరి కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడ నీడపట్టున ఉండే అవకాశం దొరకకపోవచ్చని వాళ్లు అనుకొని ఉండవచ్చు.
ఇంకొంతమందికి, సమాజం బయల్దేరడం మొదలుపెట్టిన సమయం నుండి తమ గోత్రం బయల్దేరాల్సిన సమయం వచ్చేవరకు ఓపిగ్గా ఎదురుచూడడం కష్టంగా అనిపించి ఉండవచ్చు. అవును, పెరుగుతూ-తగ్గుతూ ఉండే బాకా శబ్దం అందరికీ వినిపించినా, బయల్దేరే అవకాశం మాత్రం అందరికీ ఒకేసారి వచ్చేది కాదు. పెరుగుతూ-తగ్గుతూ ఉండే శబ్దంతో బాకాల్ని మొదటిసారి ఊదినప్పుడు, తూర్పు వైపు డేరాలు వేసుకున్న యూదా, ఇశ్శాఖారు, జెబూలూను గోత్రాలు బయల్దేరాలి. (సంఖ్యా. 2:3-7; 10:5, 6) యాజకులు పెరుగుతూ-తగ్గుతూ ఉండే శబ్దంతో బాకాల్ని రెండోసారి ఊదినప్పుడు, దక్షిణం వైపు డేరాలు వేసుకున్న మూడు గోత్రాల విభాగం బయల్దేరాలి. ఈ విధంగా పూర్తి సమాజమంతా బయల్దేరే వరకు యాజకులు దశలవారీగా బాకాల్ని ఊదేవాళ్లు.
కొన్నిసార్లు మీకు కూడా సంస్థ చేసిన మార్పుల్ని అంగీకరించడం కాస్త ఇబ్బందిగా అనిపించి ఉంటుంది. బహుశా మరీ ఎక్కువ మార్పులు వస్తున్నాయని మీరు అనుకుని ఉంటారు. లేదా ఒకప్పటి ఏర్పాట్లు బాగా నచ్చి, వాటిలో మార్పు రాకూడదని కోరుకుని ఉంటారు. కారణమేదైనా ఆ మార్పులు మీ ఓపికను పరీక్షించి ఉండవచ్చు, వాటికి అలవాటుపడడానికి మీకు కాస్త ఎక్కువ సమయం పట్టి ఉండవచ్చు. అయితే, ఆ మార్పుల్ని అంగీకరించడానికి కృషిచేస్తే, అవి మన మంచి కోసమే వచ్చాయని గుర్తిస్తాం. అంతేకాదు, మన కృషిని చూసి యెహోవా సంతోషిస్తున్నాడని అర్థం చేసుకుంటాం.
మోషే కాలంలో యెహోవా లక్షలమంది పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని ఎడారి గుండా నడిపించాడు. యెహోవా కాపుదల, నిర్దేశం లేకపోతే వాళ్లు ఆ ఎడారిలో నుండి ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. ఈ ప్రమాదకరమైన చివరి రోజుల్లో యెహోవా మనల్ని నడిపిస్తున్నాడు; తనకు దగ్గరవ్వడానికి, మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి సహాయం చేస్తున్నాడు. మనం నమ్మకమైన ఆ ఇశ్రాయేలీయుల్లా విధేయత చూపించడానికి కృషిచేస్తూ, నేడు మనకు వినిపిస్తున్న వేర్వేరు బాకా శబ్దాలకు స్పందిద్దాం.