కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యెహోవా ‘నా దారుల్ని తిన్నగా చేశాడు’

యెహోవా ‘నా దారుల్ని తిన్నగా చేశాడు’

ఒకసారి ఓ యువ సహోదరుడు, “మీకు ఇష్టమైన లేఖనం ఏంటి?” అని నన్ను అడిగాడు. నేను ఏమాత్రం తడుముకోకుండా “సామెతలు 3:5, 6” అని చెప్పాను. అక్కడ ఇలా ఉంది: “నీ నిండు హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచు, నీ సొంత అవగాహన మీద ఆధారపడకు. నీ మార్గాలన్నిట్లో ఆయన్ని పరిగణనలోకి తీసుకో, అప్పుడు ఆయన నీ దారుల్ని తిన్నగా చేస్తాడు (అధస్సూచి).” అవును, నిజంగానే యెహోవా నా దారుల్ని తిన్నగా చేశాడు. ఎలా?

మా అమ్మానాన్నలు నాకు సరైన దారి చూపించారు

1920లలో మా అమ్మానాన్నలకు పెళ్లయింది. పెళ్లికి ముందే వాళ్లకు సత్యం తెలుసు. నేను 1939⁠లో పుట్టాను. చిన్నప్పుడు ఇంగ్లాండ్‌లో మా అమ్మానాన్నలతో కలిసి మీటింగ్స్‌కి వెళ్లేవాడిని. అంతేకాదు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో కూడా చేరాను. ఆ పాఠశాలలో నా మొదటి నియామకం ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నాకు పోడియం మైకు అందక ఒక బాక్సు ఎక్కి నిలబడ్డాను. అప్పుడు నాకు ఆరేళ్లు, ప్రేక్షకుల్లో పెద్దవాళ్లందర్నీ చూసి చాలా భయమేసింది.

మా అమ్మానాన్నలతో కలిసి వీధి సాక్ష్యం చేస్తూ

నేను పరిచర్యలో ఉపయోగించడం కోసం మా నాన్న ఒక కార్డు మీద చిన్న సందేశాన్ని టైప్‌ చేసి ఇచ్చాడు. ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు, మొదటిసారి ఒక్కడినే ఒక ఇంట్లో మాట్లాడడానికి వెళ్లాను. ఇంటివ్యక్తి నేను చూపించిన కార్డు చదివి, “దేవుడు సత్యవంతుడై ఉండునుగాక” (ఇంగ్లీషు) పుస్తకాన్ని వెంటనే తీసుకోవడం నాకు ఎంత ఆనందంగా అనిపించిందో! ఆ వీధిలో ఉన్న మా నాన్న దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లి దాని గురించి చెప్పాను. పరిచర్య, మీటింగ్స్‌ నాకు ఆనందాన్ని ఇచ్చాయి, పూర్తికాల సేవ చేయాలనే కోరికను నాలో కలిగించాయి.

మా నాన్న నా కోసం కూడా కావలికోట సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నప్పుడు, బైబిలు సత్యం ఇంకా ఎక్కువగా నా హృదయాన్ని తాకింది. పోస్ట్‌ రాగానే ప్రతీ పత్రికను ఆసక్తిగా చదివేవాడిని. యెహోవా మీద నాకు నమ్మకం పెరిగింది, ఆయనకు సమర్పించుకునేలా అది నన్ను కదిలించింది.

1950⁠లో, నేను మా అమ్మానాన్నలతో కలిసి న్యూయార్క్‌లో జరిగిన థియోక్రెసీస్‌ ఇంక్రీస్‌ అనే సమావేశానికి వెళ్లాను. ఆగస్టు 3, గురువారం రోజు అంశం: “మిషనరీ రోజు.” సహోదరుడు క్యారీ బార్బర్‌ ఆ రోజు బాప్తిస్మ ప్రసంగం ఇచ్చాడు. ఆయన ఆ తర్వాత పరిపాలక సభ సభ్యునిగా సేవ చేశాడు. ఆయన తన ప్రసంగం ముగింపులో బాప్తిస్మ అభ్యర్థుల్ని రెండు ప్రశ్నలు అడిగినప్పుడు, నేను నిలబడి “అవును!” అని సమాధానం ఇచ్చాను. అప్పుడు నాకు 11 ఏళ్లు, కానీ బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమైనదో నేను గుర్తించాను. కాకపోతే నీళ్లలోకి దిగడానికి నేను భయపడ్డాను, ఎందుకంటే అప్పటికి నాకింకా ఈత రాదు. బాప్తిస్మం ఇచ్చే పూల్‌ వరకు మా బాబాయి నాకు తోడుగా వచ్చాడు, ఏమీ కాదని ధైర్యం చెప్పాడు. బాప్తిస్మం ఎంత త్వరగా అయిపోయిందంటే, నా పాదాలు కనీసం పూల్‌ అడుగుభాగాన్ని కూడా తాకలేదు. నన్ను ఒక సహోదరుడి నుండి ఇంకో సహోదరుడికి అప్పగించారు; ఒకరేమో నాకు బాప్తిస్మం ఇచ్చారు, ఇంకొకరేమో నన్ను పూల్‌లో నుండి పైకి ఎత్తారు. ప్రాముఖ్యమైన ఆ రోజు నుండి ఈ రోజు వరకు, యెహోవా నా దారుల్ని తిన్నగా చేస్తూనే ఉన్నాడు.

యెహోవా మీద నమ్మకం ఉంచాలని నిర్ణయించుకున్నాను

స్కూల్‌ చదువు అయిపోయిన తర్వాత నేను పయినీరు సేవ మొదలుపెట్టాలనుకున్నాను. కానీ పై చదువులు చదవమని మా టీచర్లు నన్ను ప్రోత్సహించారు. వాళ్ల ఒత్తిడికి లొంగిపోయి నేను యూనివర్సిటీలో చేరాను. ఒకవైపు నేను చదువు మీద ధ్యాసపెడుతూనే, మరోవైపు సత్యంలో స్థిరంగా ఉండడం కుదరదని వెంటనే గుర్తించాను. అందుకే వాటిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం గురించి యెహోవాకు ప్రార్థించాక, మొదటి సంవత్సరం చివర్లో చదువు మానేస్తున్నానని గౌరవపూర్వకంగా వివరిస్తూ టీచర్లకు ఉత్తరం రాశాను. యెహోవా మీద పూర్తి నమ్మకంతో వెంటనే పయినీరు సేవ మొదలుపెట్టాను.

1957, జూలైలో లండన్‌ బ్రాంచి నన్ను వెల్లింగ్‌బరో అనే పట్టణానికి పంపించింది. అక్కడ నేను నా పూర్తికాల సేవ మొదలుపెట్టాను. నేను కలిసి పనిచేయడానికి అనుభవంగల ఒక పయినీరు సహోదరుణ్ణి పంపించమని బ్రాంచిని అడిగాను. వాళ్లు సహోదరుడు బర్ట్‌ వెయిసీని పంపించారు. ఆయన నాకు చాలా విషయాలు నేర్పించాడు. ఆయన ఉత్సాహంగా పరిచర్య చేసేవాడు. మంచి ప్రణాళిక ప్రకారం పరిచర్య చేసేలా ఆయన నాకు సహాయం చేశాడు. మా సంఘంలో ఆరుగురు వృద్ధ సహోదరీలు, నేను, సహోదరుడు వెయిసీ ఉండేవాళ్లం. అన్ని మీటింగ్స్‌కి సిద్ధపడడం, వాటిలో పాల్గొనడం వల్ల యెహోవా మీద నమ్మకం పెంచుకునే అవకాశాలు, నా విశ్వాసాన్ని తెలియజేసే అవకాశాలు ఎన్నో వచ్చాయి.

సైన్యంలో చేరడాన్ని నిరాకరించినందుకు కొంతకాలం జైల్లో ఉన్నాను. తర్వాత బార్బరా అనే ప్రత్యేక పయినీరు సహోదరిని కలిశాను. మేము 1959⁠లో పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లి సేవ చేయాలని కోరుకున్నాం. మొదట మమ్మల్ని వాయువ్య (northwest) ఇంగ్లాండ్‌లోని లాంకషైర్‌కు పంపించారు. తర్వాత 1961, జనవరిలో లండన్‌ బెతెల్‌లో నెల రోజుల పాటు జరిగే రాజ్య పరిచర్య పాఠశాలకు నన్ను ఆహ్వానించారు. ఆశ్చర్యకరంగా, ఆ పాఠశాల ముగిసిన తర్వాత నన్ను ప్రయాణ సేవకు నియమించారు. రెండు వారాల పాటు బర్మింగ్‌హామ్‌ నగరంలో అనుభవంగల ప్రాంతీయ పర్యవేక్షకుని దగ్గర నేను శిక్షణ పొందాను, నాతో పాటు ఉండడానికి బార్బరాను కూడా అనుమతించారు. తర్వాత మేము లాంకషైర్‌, చెషైర్‌ ప్రాంతాల్లో మా నియామకానికి తిరిగి వెళ్లాం.

యెహోవా మీద నమ్మకం ఉంచడం ఎప్పుడూ సరైనది

మేము 1962 ఆగస్టులో, సెలవులో ఉన్నప్పుడు బ్రాంచి కార్యాలయం నుండి ఒక ఉత్తరం వచ్చింది. అందులో గిలియడ్‌ పాఠశాలకు అప్లికేషన్లు ఉన్నాయి! వాటి గురించి ప్రార్థించిన తర్వాత నేను, బార్బరా అప్లికేషన్లు నింపి, వాళ్లు చెప్పినట్టే వెంటనే బ్రాంచి కార్యాలయానికి పంపించాం. ఐదు నెలల తర్వాత, మేము గిలియడ్‌ పాఠశాల 38వ తరగతికి హాజరవ్వడానికి న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌కు బయల్దేరాం. అది పది నెలల పాటు బైబిల్ని లోతుగా అధ్యయనం చేసే కోర్సు.

గిలియడ్‌ పాఠశాలలో మేము దేవుని వాక్యం గురించి, ఆయన సంస్థ గురించి మాత్రమే కాకుండా మన సహోదర బృందం గురించి కూడా ఎంతో నేర్చుకున్నాం. అప్పుడు నా వయసు 24, బార్బరా వయసు 23. తరగతిలో ఉన్న మిగతా విద్యార్థుల నుండి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. పాఠశాలలో నాకు ఇచ్చిన నియామకంలో భాగంగా, ప్రతీరోజు మా పాఠశాల ఉపదేశకుల్లో ఒకరైన సహోదరుడు ఫ్రెడ్‌ రస్క్‌తో కలిసి పని చేయడం ఒక గొప్ప అవకాశం. మనం ఎప్పుడూ నీతిగల సలహా ఇవ్వాలని, అంటే మన సలహా పూర్తిగా లేఖనాల మీద ఆధారపడి ఉండాలని ఆయన నొక్కిచెప్పేవాడు. మా కోర్సులో భాగంగా అప్పుడప్పుడు నేథన్‌ నార్‌, ఫ్రెడ్‌రిక్‌ ఫ్రాంజ్‌, కార్ల్‌ క్లీన్‌ వంటి అనుభవంగల సహోదరులు ప్రసంగాలు ఇచ్చేవాళ్లు. వినయస్థుడైన సహోదరుడు ఎ. హెచ్‌. మాక్‌మిలన్‌ నుండి మేము ఎంతో నేర్చుకున్నాం. 1914 నుండి 1919 తొలిభాగం వరకు ఉన్న పరీక్షా కాలంలో యెహోవా తన ప్రజలకు ఎలా సహాయం చేశాడో ఆయన తన ప్రసంగంలో వివరించాడు!

ఒక కొత్త నియామకం

పాఠశాల ముగింపులో నన్ను, బార్బరాను ఆఫ్రికాలోని బురుండికి నియమిస్తున్నామని సహోదరుడు నార్‌ చెప్పారు. బురుండిలో ఎంతమంది ప్రచారకులు ఉన్నారో తెలుసుకుందామని మేము వెంటనే బెతెల్‌ లైబ్రరీకి వెళ్లి వార్షిక పుస్తకం (ఇంగ్లీషు) తీశాం. ఆశ్చర్యకరంగా, అసలు ఆ దేశంలో ప్రచారకులే లేరు! అవును, ఇంతకు ముందెప్పుడూ ప్రకటనా పని జరగని ఒక కొత్త ప్రాంతానికి మేము వెళ్తున్నాం. కనీసం ఆ ఖండం గురించి కూడా మాకు తెలీదు. మాకు చాలా ఆందోళనగా అనిపించింది, కానీ యెహోవాకు పట్టుదలగా ప్రార్థించడం వల్ల ఆందోళన తగ్గింది.

మా కొత్త నియామకంలో అన్నీ కొత్తగా అనిపించాయి. బురుండిలోని వాతావరణం, సంస్కృతి, భాష అన్నీ మాకు కొత్తే. మేము ఫ్రెంచ్‌ నేర్చుకోవాల్సి వచ్చింది, అంతేకాదు ఉండడానికి ఒక ఇల్లు వెతుక్కోవాలి. మేము అక్కడికి వెళ్లిన రెండు రోజుల తర్వాత, మా గిలియడ్‌ తోటి విద్యార్థి అయిన హారీ ఆర్నాట్‌ జాంబియాలో తన నియామకానికి వెళ్తూ దారిలో మమ్మల్ని కలిశాడు. ఆయన మాకొక ఇల్లు చూసిపెట్టాడు, అదే మా మొదటి మిషనరీ హోమ్‌ అయింది. కానీ కొంతకాలానికే యెహోవాసాక్షుల గురించి తెలియని స్థానిక ప్రభుత్వ అధికారుల నుండి వ్యతిరేకత వచ్చింది. మేము సంతోషంగా మా నియామకాన్ని మొదలుపెట్టే లోపే, పని చేయడానికి అనుమతి లేకుండా ఇక్కడ ఉండడం కుదరదని అధికారులు మాకు చెప్పారు. విచారకరంగా, మేము బురుండిని విడిచిపెట్టి ఉగాండా అనే కొత్త దేశానికి వెళ్లాల్సి వచ్చింది.

వీసా లేకుండా ఉగాండా వెళ్లడం గురించి మేము చాలా ఆందోళనపడ్డాం, కానీ యెహోవా మీద నమ్మకం ఉంచాం. ఉగాండాలో అవసరం ఎక్కువున్న చోట సేవ చేస్తున్న ఒక కెనడా సహోదరుడు, మా పరిస్థితిని ఇమిగ్రేషన్‌ ఆఫీసర్‌కి వివరించాడు. ఆ దేశంలో ఉండడానికి మాకు అనుమతి దొరికే వరకు కొన్ని నెలలు అక్కడ ఉండేందుకు ఆ ఆఫీసర్‌ ఒప్పుకున్నాడు. యెహోవా మాకు సహాయం చేస్తున్నాడని అది చూపించింది.

ఉగాండాలో పరిస్థితులు బురుండిలో ఉన్న పరిస్థితులకు చాలా వేరుగా ఉన్నాయి. ఉగాండాలో ప్రకటనా పని ఇదివరకే మొదలైంది, కాకపోతే దేశం మొత్తంలో 28 మంది సాక్షులే ఉన్నారు. పరిచర్యలో ఇంగ్లీషు మాట్లాడే ప్రజలు చాలామంది మాకు దొరికేవాళ్లు. కానీ ప్రగతి సాధించేలా ఆసక్తిపరులకు సహాయం చేయాలంటే అక్కడున్న ఎన్నో భాషల్లో కనీసం ఒకటైనా నేర్చుకోవాలని కొంతకాలానికే గుర్తించాం. మేము కంపాలా అనే ప్రాంతంలో ప్రకటించడం మొదలుపెట్టాం. అక్కడ ఎక్కువగా లుగాండా భాష మాట్లాడతారు, కాబట్టి ఆ భాష నేర్చుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఆ భాషను బాగా నేర్చుకోవడానికి మాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ దాన్ని నేర్చుకోవడం వల్ల ఇంకా చక్కగా పరిచర్య చేయగలిగాం, బైబిలు విద్యార్థుల ఆధ్యాత్మిక అవసరాల్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలిగాం. నేర్చుకుంటున్న విషయాల గురించి ఏమనుకుంటున్నారో వాళ్లు కూడా మనసువిప్పి మాతో చెప్పేవాళ్లు.

నేను చేసిన ఎన్నో ప్రయాణాలు

కొత్త ప్రాంతాల్ని వెదకడానికి, ఉగాండా అంతటా ప్రయాణిస్తూ

సత్యం తెలుసుకునేలా ప్రజలకు సహాయం చేసినందుకు మేము చాలా ఆనందించాం, దేశమంతా తిరుగుతూ ప్రయాణ సేవలో గడిపే అవకాశం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఆనందించాం. కెన్యా బ్రాంచి నిర్దేశం మేరకు మేము దేశమంతా తిరిగి, ఏయే ప్రాంతాల్లో ప్రత్యేక పయినీర్ల అవసరం ఉందో, ఏయే ప్రాంతాల్లో పరిచర్య మొదలుపెట్టవచ్చో పరిశీలించాం. ఇంతకు ముందెప్పుడూ సాక్షుల్ని కలవని వాళ్లు కూడా మాకు చక్కగా ఆతిథ్యం ఇచ్చారు. అలా చాలాసార్లు జరిగింది. వాళ్లు మమ్మల్ని ఆహ్వానించి, మాకు భోజనం కూడా పెట్టేవాళ్లు.

తర్వాత నేను మరో రకమైన ప్రయాణం చేశాను. నేను కంపాలా నుండి ట్రైన్‌లో రెండు రోజులు ప్రయాణించి కెన్యాలోని మొంబాసా అనే రేవు పట్టణానికి చేరుకున్నాను, అక్కడినుండి సీషెల్స్‌కు ఓడ ద్వారా ప్రయాణించాను. సీషెల్స్‌ అనేది హిందూ మహాసముద్రంలో ఉన్న కొన్ని దీవుల సముదాయం. తర్వాత 1965 నుండి 1972 వరకు నేను, బార్బరా కలిసి సీషెల్స్‌కు క్రమంగా వెళ్లాం. అప్పట్లో అక్కడ ఇద్దరు ప్రచారకులు మాత్రమే ఉండేవాళ్లు, కానీ ఆ తర్వాత ఒక గ్రూపు ఏర్పడడం, అది సంఘంగా మారడం మేము చూశాం. నా ప్రయాణంలో భాగంగా ఎరిట్రియ, ఇతియోపియా, సూడాన్‌లో ఉన్న సహోదరుల్ని కూడా కలిశాను.

ఉగాండాలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి, ఆ దేశం సైనిక ప్రభుత్వం కిందికి వెళ్లిపోయింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి, “కైసరువి కైసరుకు చెల్లించండి” అనే ఆజ్ఞను పాటించడం ఎంత తెలివైనదో అవి చూపించాయి. (మార్కు 12:17) ఉగాండాలో ఉంటున్న విదేశీయులందరూ తమకు దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో రిజిస్టర్‌ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఆదేశానికి మేము వెంటనే లోబడ్డాం. కొన్ని రోజుల తర్వాత, కంపాలా గుండా ప్రయాణిస్తున్నప్పుడు రహస్య పోలీసులు నా దగ్గరికి, ఇంకో మిషనరీ దగ్గరికి వచ్చారు. మా గుండె దడదడ కొట్టుకుంది! వాళ్లు మమ్మల్ని గూఢచారులని ఆరోపించి, ప్రధాన పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మేము మిషనరీలమని, శాంతియుతంగా మా పని చేసుకుంటున్నామని వివరించాం. మేము ఇదివరకే రిజిస్టర్‌ చేయించుకున్నామని ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. వాళ్లు మమ్మల్ని అరెస్టు చేసి, మా మిషనరీ హోమ్‌కు దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడున్న ఆఫీసర్‌, మేము ఇదివరకే రిజిస్టర్‌ చేయించుకున్నామని గుర్తుపట్టి మమ్మల్ని విడుదల చేయమని గార్డుకు చెప్పాడు. అప్పుడు మేము హాయిగా ఊపిరి పీల్చుకున్నాం!

అప్పట్లో రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు, బాగా తాగిన సైనికులు తరచూ మమ్మల్ని ఆపేవాళ్లు. అప్పుడు మాకు భయమేసేది. కానీ ప్రతీసారి మేము ప్రార్థించేవాళ్లం, వాళ్లు ఏ హానీ చేయకుండా మమ్మల్ని వెళ్లనిచ్చినప్పుడు ప్రశాంతంగా అనిపించేది. విచారకరంగా, 1973⁠లో విదేశీ మిషనరీలందరూ ఉగాండాను విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది.

అబీజాన్‌లోని కోటే డి ఐవరీ బ్రాంచిలో, మన రాజ్య పరిచర్య ప్రతుల్ని తయారుచేస్తూ

మళ్లీ మా నియామకం మారింది. ఈసారి మమ్మల్ని పశ్చిమ ఆఫ్రికాలోని కోటే డి ఐవరీకి పంపించారు. మేము పూర్తిగా కొత్త సంస్కృతికి అలవాటు పడాలి, మళ్లీ ఫ్రెంచ్‌లో మాట్లాడాలి, వేర్వేరు నేపథ్యాలకు చెందిన మిషనరీలతో జీవించాలి! అయినప్పటికీ యెహోవా మమ్మల్ని నిర్దేశిస్తున్నాడని మరోసారి చూపించాడు. మంచి మనసున్న వినయస్థులు బైబిలు సందేశానికి వెంటనే స్పందించడం మేము చూశాం. అంతేకాదు, మేము యెహోవా మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల మా దారులు తిన్నగా అయ్యాయని గ్రహించాం.

అయితే ఒకరోజు బార్బరాకు క్యాన్సర్‌ ఉందని వైద్య పరీక్షల్లో తేలింది. మంచి వైద్యం కోసం మేము వేర్వేరు దేశాలకు వెళ్లాం. ఇక ఆఫ్రికాలో మా నియామకాన్ని కొనసాగించలేమని 1983⁠లో మాకు అర్థమైంది. అది మా ఇద్దర్ని చాలా నిరుత్సాహపర్చింది.

పరిస్థితుల్లో వచ్చిన మార్పులు

మేము లండన్‌ బెతెల్‌లో సేవ చేస్తుండగా బార్బరా ఆరోగ్యం క్షీణించింది, తర్వాత ఆమె చనిపోయింది. బెతెల్‌ కుటుంబం మాకెంతో సహాయం చేసింది. ముఖ్యంగా ఒక జంట నేను ఆ పరిస్థితికి అలవాటు పడడానికి, యెహోవా మీద నమ్మకం కోల్పోకుండా ఉండడానికి సహాయం చేసింది. తర్వాత బెతెల్‌లో కమ్యూటర్‌గా సేవ చేస్తున్న ఆన్‌ అనే సహోదరిని నేను కలిశాను. ఆమె అంతకుముందు ప్రత్యేక పయినీరుగా సేవ చేసింది. యెహోవా మీద ఆమెకున్న ప్రేమను బట్టి ఆమె ఆధ్యాత్మిక వ్యక్తి అని నాకర్థమైంది. నేను, ఆన్‌ 1989⁠లో పెళ్లి చేసుకున్నాం. అప్పటినుండి మేమిద్దరం లండన్‌ బెతెల్‌లో సేవ చేస్తున్నాం.

కొత్త బ్రిటన్‌ బెతెల్‌ ముందు ఆన్‌తో

1995 నుండి 2018 వరకు, నేను ప్రపంచ ప్రధాన కార్యాలయ ప్రతినిధిగా (అప్పట్లో, జోన్‌ పర్యవేక్షకుడు అని పిలిచేవాళ్లు) దాదాపు 60 దేశాల్ని సందర్శించాను. అది నాకు సంతోషాన్ని ఇచ్చింది. అలా సందర్శించిన ప్రతీసారి, వేర్వేరు పరిస్థితుల మధ్య యెహోవా తన సేవకుల్ని ఎలా ఆశీర్వదిస్తాడో కళ్లారా చూశాను.

2017⁠లో, దేశాల్ని సందర్శించడంలో భాగంగా నేను ఆఫ్రికాకు వెళ్లాను. ఆన్‌ని బురుండి వాళ్లకు పరిచయం చేయడం, పరిచర్యలో వాళ్లు సాధించిన అభివృద్ధిని చూడడం నాకు సంతోషాన్ని ఇచ్చింది! 1964⁠లో నేను ఏ వీధిలో అయితే ఇంటింటి పరిచర్య చేశానో, అదే వీధిలో ఇప్పుడు ఒక అందమైన బెతెల్‌ ఉంది. ఆ దేశంలో 15,500 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు.

2018⁠లో నేను ఏయే దేశాల్ని సందర్శించబోతున్నానో లిస్టు చూసుకున్నప్పుడు ఆనందం పట్టలేకపోయాను. ఆ లిస్టులో కోటే డి ఐవరీ కూడా ఉంది. దాని రాజధాని అయిన అబీజాన్‌లో అడుగుపెట్టినప్పుడు, నాకు ఇంటికి తిరిగి వెళ్లినట్టు అనిపించింది. నేను బెతెల్‌ గెస్ట్‌ రూమ్‌లో ఉన్నప్పుడు, పక్క రూమ్‌లో ఎవరున్నారా అని టెలిఫోన్‌ లిస్ట్‌లో చూస్తే, సోసూ అనే సహోదరుని పేరు కనిపించింది. అంతకుముందు నేను అబీజాన్‌లో ఉన్నప్పుడు ఆయన నగర పర్యవేక్షకుడిగా (సిటీ ఓవర్సీర్‌గా) సేవ చేశాడని నాకు గుర్తొచ్చింది. కానీ నేను పొరబడ్డాను. ఆయన నేను అనుకున్న సోసూ కాదు, వాళ్ల అబ్బాయి!

యెహోవా తన మాట నిలబెట్టుకున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా యెహోవా మీద నమ్మకం ఉంచితే, ఆయన నిజంగా మన దారుల్ని తిన్నగా చేస్తాడని గ్రహించాను. వెలుగు అంతకంతకు ఎక్కువౌతున్న మార్గంలో ప్రయాణించి కొత్తలోకంలో అడుగుపెట్టాలని మేము ఆత్రంగా ఎదురుచూస్తున్నాం. ఆ ప్రయాణం కొత్తలోకంలో కూడా కొనసాగుతుంది!—సామె. 4:18.