పాఠకుల ప్రశ్నలు
దేవుని ప్రజలు మహాబబులోనుకు ఎప్పటినుండి బంధీలుగా ఉన్నారు?
సుమారు సా.శ. రెండవ శతాబ్దం నుండి 1919 వరకు దేవుని ప్రజలు ఆధ్యాత్మికంగా బంధీలుగా ఉన్నారు. మన అవగాహనలో ఈ సవరణ ఎందుకు అవసరం?
ఆధారాలన్నిటిని బట్టి చూస్తే, 1919లో అభిషిక్త క్రైస్తవులు మహాబబులోను నుండి విడుదలై శుద్ధీకరించబడిన సంఘంగా సమకూర్చబడ్డారు. దీనిగురించి ఆలోచించండి: 1914లో దేవుని పరిపాలన పరలోకంలో మొదలైన వెంటనే, దేవుని ప్రజలు పరీక్షించబడి అబద్ధ ఆరాధన నుండి క్రమక్రమంగా శుద్ధీకరించబడ్డారు. a (మలా. 3:1-4) ఆ తర్వాత, శుద్ధీకరించబడిన దేవుని ప్రజలకు “తగినవేళ అన్నము” పెట్టడానికి ‘నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడిని’ యేసు 1919లో నియమించాడు. (మత్త. 24:45-47) ఇదే సంవత్సరంలో, దేవుని ప్రజలు సూచనార్థకమైన మహాబబులోను నుండి విడుదలయ్యారు. (ప్రక. 18:4) ఇంతకీ దేవుని ప్రజలు ఎప్పుడు మహాబబులోను చెరలో ఉన్నారు?
దేవుని ప్రజలు 1918 మొదలుకొని కొంతకాలం వరకు మహాబబులోను చెరలో ఉన్నారని గతంలో మన సంస్థ వివరించింది. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు బబులోనులో బంధీలుగా ఉన్నట్లు, 1918లో దేవుని ప్రజలు మహాబబులోనుకు బంధీలు అయ్యారని కావలికోట మార్చి 15, 1992 సంచిక చెప్పింది. కానీ మరింత పరిశోధన చేశాక, దేవుని ప్రజలు 1918 కన్నా ఎన్నో సంవత్సరాల ముందు నుండే మహాబబులోనుకు బంధీలుగా ఉన్నారని తేలింది.
అయితే దేవుని ప్రజలు బంధించబడి తర్వాత విడుదలౌతారని యెహెజ్కేలు 37:1-14 వచనాల్లో బైబిలు ముందే చెప్పింది. యెహెజ్కేలుకు ఓ దర్శనంలో, ఎముకలతో నిండివున్న ఒక లోయ కనిపించింది. ‘ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందర్నీ సూచిస్తున్నాయి’ అని యెహోవా ఆయనకు చెప్పాడు. (11వ వచనం) ఈ మాటలు, ఇశ్రాయేలు జనాంగంతోపాటు అభిషిక్తులైన ‘దేవుని ఇశ్రాయేలుకు’ కూడా వర్తిస్తాయి. (గల. 6:16; అపొ. 3:21) తర్వాత ఆ ఎముకలన్నిటికీ జీవం వచ్చి గొప్ప సైన్యంగా మారడం యెహెజ్కేలు ఆ దర్శనంలో చూశాడు. 1919లో దేవుని ప్రజలు మహాబబులోను నుండి విడుదలైన విధానాన్ని అది వివరించింది. కానీ దేవుని ప్రజలు మహాబబులోనుకు చాలాకాలం నుండి బంధీలుగా ఉన్నారని ఆ దర్శనం ఎలా చూపిస్తుంది?
మొదటిగా, యెహెజ్కేలు ఆ దర్శనంలో చూసిన ఎముకలన్నీ బాగా ‘ఎండిపోయి’ ఉన్నాయి. (యెహె. 37:2, 11) అంటే వాళ్లు చనిపోయి చాలాకాలం అవుతోందని అర్థమౌతోంది. రెండవదిగా, ఆ ఎముకలు ఒక్కసారిగా కాదుగానీ క్రమక్రమంగా జీవానికి రావడాన్ని యెహెజ్కేలు చూశాడు. ముందు ‘గడగడమను ధ్వని ఒకటి పుట్టింది,’ ఆ తర్వాత ‘ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి.’ తర్వాత ‘నరములును మాంసమును వాటిమీదికి వచ్చాయి,’ దాని తర్వాత “వాటిపైన చర్మము” వచ్చింది. అప్పుడు ‘జీవాత్మ వాళ్లలోకి వచ్చింది, వారు సజీవులై లేచారు.’ చివరిగా యెహోవా వాళ్లకు జీవించడానికి దేశాన్ని ఇచ్చాడు. కాబట్టి, ఇదంతా జరగడానికి సమయం పడుతుంది.—యెహె. 37:7-10, 14.
బైబిలు ముందే చెప్పినట్లు ఇశ్రాయేలీయులు ఎంతోకాలంపాటు బంధీలుగా ఉన్నారు. ఇశ్రాయేలు పది గోత్రాల ఉత్తర రాజ్యంలోని చాలామంది తమ దేశం నుండి వెళ్లిపోవాల్సి వచ్చినప్పుడు అంటే సా.శ.పూ. 740లో ఇశ్రాయేలీయులు చెరపట్టబడ్డారు. ఆ తర్వాత సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసినప్పుడు యూదా దక్షిణ రాజ్యంలోని ప్రజలు కూడా తమ దేశం నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. చివరికి సా.శ.పూ. 537లో వాళ్లు చెర నుండి విడుదలయ్యారు. అప్పుడు ఆ యూదుల చిన్నగుంపు యెరూషలేముకు తిరిగొచ్చి ఆలయాన్ని మళ్లీ నిర్మించి యెహోవాను ఆరాధించారు.
ఈ వివరాలన్నిటిని బట్టి, అభిషిక్త క్రైస్తవులు కేవలం 1918 నుండి 1919 వరకు కాదుగానీ ఎంతోకాలంపాటు మహాబబులోను చెరలో బంధీలుగా ఉండివుంటారని చెప్పవచ్చు. యేసు కూడా ఈ సుదీర్ఘమైన కాలం గురించి మాట్లాడుతూ, గురుగులు అంటే అబద్ధ క్రైస్తవులు గోధుమలతో కలిసి అంటే ‘రాజ్యసంబంధులతో’ కలిసి పెరుగుతాయని చెప్పాడు. (మత్త. 13:36-43) ఆ కాలంలో, నిజక్రైస్తవులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. కానీ క్రైస్తవులమని చెప్పుకున్న చాలామంది అబద్ధ బోధలను నమ్మి మతభ్రష్టులుగా మారారు. అందుకే, క్రైస్తవ సంఘం మహాబబులోను చెరలో ఉండేదని మనం చెప్పవచ్చు. అలా ఆ సంఘం సుమారు సా.శ. రెండవ శతాబ్దం నుండి యుగసమాప్తిలో దేవుని ఆధ్యాత్మిక ఆలయం శుద్ధీకరించబడే వరకు మహాబబులోను చెరలో ఉంది.—అపొ. 20:29, 30; 2 థెస్స. 2:3, 6-8; 1 యోహా. 2:18, 19.
ఆ వందలాది సంవత్సరాలు క్రైస్తవ మతనాయకులకు చాలా అధికారం ఉండేది. ఆఖరికి రాజకీయ నాయకులపై కూడా. ఆ మతనాయకులు ప్రజలందర్నీ తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని అనుకున్నారు. ఉదాహరణకు, ప్రజల దగ్గర బైబిల్ని ఉంచుకోవడానికి గానీ, వాళ్లకు అర్థమయ్యే భాషలో ఉన్న బైబిల్ని చదవడానికి గానీ మతనాయకులు అనుమతించేవాళ్లు కాదు. బైబిలు చదివిన కొంతమందిని మ్రానుకు కట్టి సజీవదహనం చేశారు. అంతేకాదు, చర్చిలో బోధిస్తున్న వాటికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కఠినంగా శిక్షించేవాళ్లు. దాంతో సత్యం నేర్చుకోవడానికి గానీ, దాన్ని ఇతరులకు బోధించడానికి గానీ దాదాపు సాధ్యమయ్యేది కాదు.
అయితే, దేవుని ప్రజలు ఆధ్యాత్మికంగా తిరిగి జీవానికి వచ్చి క్రమక్రమంగా అబద్ధమతం నుండి విడుదల పొందారని యెహెజ్కేలు దర్శనం బట్టి తెలుసుకున్నాం. ఇది జరగడం ఎప్పుడు, ఎలా మొదలైంది? ఆ దర్శనంలో యెహెజ్కేలుకు ‘గడగడమను ధ్వని ఒకటి’ వినిపించింది. ఇది, యుగసమాప్తికి
కొన్ని వందల సంవత్సరాల ముందు మొదలైంది. ఆ కాలంలో, చుట్టూ అబద్ధ బోధలు ఉన్నప్పటికీ కొంతమంది నమ్మకమైన వ్యక్తులు మాత్రం సత్యం కోసం తపిస్తూ దేవున్ని ఆరాధించాలనుకున్నారు. దాంతో వాళ్లు బైబిల్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి, నేర్చుకున్నవాటిని ప్రజలకు చెప్పడానికి శాయశక్తులా ప్రయత్నించారు. మరికొంతమంది, ప్రజలకు అర్థమయ్యే భాషల్లోకి బైబిల్ని అనువదించడానికి చాలా కష్టపడ్డారు.తర్వాత ఎముకలపై మాంసం, చర్మము ఏర్పడినట్లుగా దాదాపు 1870వ సంవత్సరంలో ఛార్లెస్ తేజ్ రస్సెల్ అలాగే ఆయన స్నేహితులు బైబిలు సత్యాలను తెలుసుకొని యెహోవాను సేవించడానికి చాలా కష్టపడ్డారు. అంతేకాదు, వాటిని అర్థంచేసుకోవడానికి జాయన్స్ వాచ్‌టవర్ అలాగే ఇతర ప్రచురణల ద్వారా ప్రజలకు సహాయం చేశారు. వాటితోపాటు 1914లో “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్,” 1917లో ద ఫినిష్ట్ మిస్టరీ అనే పుస్తకం దేవుని ప్రజల విశ్వాసాన్ని మరింత బలపర్చాయి. చివరిగా 1919లో, ప్రజలు ఆధ్యాత్మికంగా పునరుద్ధరణ అయ్యి, కొత్త ఆధ్యాత్మిక దేశాన్ని పొందారు. అప్పటినుండి భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణ ఉన్నవాళ్లు అభిషిక్తులకు తోడయ్యారు. వాళ్లందరూ కలిసి యెహోవాను ఆరాధిస్తూ ‘మహాసైన్యంగా’ తయారయ్యారు.—యెహె. 37:10; జెక. 8:20-23. b
దీన్నిబట్టి, సా.శ. రెండవ శతాబ్దంలో మతభ్రష్టత్వం ఎక్కువవ్వడంతో దేవుని ప్రజలు మహాబబులోనుకు బంధీలుగా అయ్యారని స్పష్టమౌతోంది. చాలా సంవత్సరాలపాటు, యెహోవాను సేవించడం ఎంతో కష్టమైంది. బబులోను చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ నేడు ప్రతీఒక్కరికి సత్యం ప్రకటించబడుతోంది. ‘బుద్ధిమంతులు జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు’ అని బైబిలు చెప్తున్న కాలంలో జీవిస్తున్నందుకు మనమెంత సంతోషిస్తున్నామో కదా! కాబట్టి నేడు చాలామంది “తమ్మును శుద్ధిపరచుకొని” ‘నిర్మలంగా’ మారి సత్య దేవున్ని ఆరాధించవచ్చు.—దాని. 12:3, 10.
సాతాను యేసును శోధించినప్పుడు ఆయన్ను నిజంగా దేవాలయానికి తీసుకెళ్లాడా లేదా ఒక దర్శనంలో దేవాలయాన్ని చూపించాడా?
సాతాను యేసుకు దేవాలయాన్ని ఎలా చూపించాడో మనకు ఖచ్చితంగా తెలీదు.
బైబిలు రచయితలైన మత్తయి, లూకా ఆ సంఘటన గురించి రాశారు. సాతాను యేసును యెరూషలేముకు “తీసుకొనిపోయి,” ‘దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టాడు,’ అని మత్తయి రాశాడు. దేవాలయంలో ఉన్న ఎత్తైన స్థలం ఆ శిఖరమే. (మత్త. 4:5) అపవాది యేసును ‘యెరూషలేముకు తీసుకొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయన్ను నిలబెట్టాడు’ అని లూకా కూడా చెప్పాడు.—లూకా 4:9.
గతంలో మన ప్రచురణలు, సాతాను యేసును శోధించినప్పుడు ఆయన్ను నిజంగా దేవాలయానికి తీసుకెళ్లి ఉండకపోవచ్చని చెప్పాయి. అయితే ఈ సంఘటనను కావలికోట మార్చి 1, 1961 సంచిక, సాతాను యేసును ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్లి లోకరాజ్యాలన్నీ చూపించి శోధించిన సంఘటనతో పోల్చింది. కానీ లోకరాజ్యాలన్నీ కనిపించేంత ఎత్తైన కొండ భూమ్మీద లేదు కాబట్టి సాతాను యేసును నిజమైన కొండ మీదకు తీసుకెళ్లి ఉండకపోవచ్చని ఆ పత్రిక చెప్పింది. అదేవిధంగా, సాతాను యేసును నిజమైన ఆలయానికి తీసుకెళ్లలేదని కూడా ఆ కావలికోట చెప్పింది. ఒకవేళ యేసు అక్కడి నుండి దూకి ఉంటే చనిపోయివుండేవాడని ఆ తర్వాత వచ్చిన కావలికోట ఆర్టికల్స్ చెప్పాయి.
అయితే యేసు లేవీయుడు కాదు కాబట్టి ఆయనకు దేవాలయం పైకి వెళ్లే అనుమతి ఉండదని కొంతమంది అంటారు. అందుకే సాతాను యేసును ఒక దర్శనంలో దేవాలయానికి తీసుకెళ్లి ఉండవచ్చని వాళ్లంటారు. ఎందుకంటే, వందల సంవత్సరాల క్రితం యెహెజ్కేలు కూడా యెహె. 8:3, 7-10; 11:1, 24; 37:1, 2.
దర్శనంలో దేవాలయానికి తీసుకెళ్లబడ్డాడు.—కానీ ఒకవేళ సాతాను యేసుకు దేవాలయాన్ని దర్శనంలో చూపించివుంటే, కొంతమందికి ఈ సందేహాలు రావచ్చు:
-
దేవాలయం పైనుండి దూకాలనే శోధన యేసుకు నిజంగా ఎదురైవుంటుందా లేదా అది దర్శనమా?
-
ఇతర సందర్భాల్లో సాతాను యేసును రాళ్లను రొట్టెలుగా చేసుకోమని, తనకు మొక్కమని శోధించాడు. అయితే సాతాను అలా దర్శనంలో శోధించలేదు గానీ యేసుకు నిజమైన రాళ్లనే చూపించాడు, తనకు నిజంగానే సాగిలపడి నమస్కారం చేయమని చెప్పాడు. కాబట్టి, ఈ సందర్భంలో కూడా యేసును నిజమైన దేవాలయం పైనుండే దూకమని సాతాను శోధించివుంటాడా?
కానీ ఒకవేళ సాతాను దర్శనంలో కాకుండా యేసును నిజమైన దేవాలయం మీదికే తీసుకెళ్తే, కొంతమందికి ఈ సందేహాలు రావచ్చు:
-
దేవాలయం పైన నిలబడడం వల్ల యేసు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞను మీరాడా?
-
యేసు అరణ్యం నుండి యెరూషలేము దేవాలయానికి ఎలా వచ్చాడు?
ఈ చివరి రెండు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి సహాయం చేసే మరింత సమాచారాన్ని పరిశీలిద్దాం.
మత్తయి, లూకా ఉపయోగించిన “దేవాలయం” అనే గ్రీకు పదం, కేవలం లేవీయులు వెళ్లగలిగే ప్రదేశాన్ని మాత్రమే కాదుగానీ పూర్తి దేవాలయ ప్రాంగణాన్ని సూచిస్తుండవచ్చని డి. ఎ. కార్సన్ అనే ప్రొఫెసర్ రాశాడు. అయితే, ఆగ్నేయం వైపున దేవాలయానికి ఒక చదునైన పైకప్పు ఉంది, దేవాలయంలో అతి ఎత్తైన స్థలం అదే. బహుశా సాతాను యేసును అక్కడికే తీసుకెళ్లివుంటాడు. అక్కడినుండి కిద్రోను లోయ అడుగుభాగం దాదాపు 140 మీటర్ల (450 అడుగులు) లోతులో ఉంటుంది. దేవాలయంలోని ఈ భాగం చాలా ఎత్తుగా ఉంటుందని, ఒకవేళ ఎవరైనా అక్కడ నిలబడి కిందకు చూస్తే “కళ్లు తిరుగుతాయి” అని చరిత్రకారుడైన జోసిఫస్ చెప్పాడు. యేసు ఒక లేవీయుడు కాకపోయినా ఆయన అక్కడ నిలబడవచ్చు, దానికి ఎవ్వరూ అడ్డు చెప్పకపోయిండవచ్చు.
ఇంతకీ యేసు అరణ్యం నుండి యెరూషలేము దేవాలయానికి ఎలా వచ్చాడు? మనకు ఖచ్చితంగా తెలీదు. సాతాను యేసును ‘యెరూషలేముకు తీసికొనిపోయాడు’ అని మాత్రమే బైబిలు చెప్తుంది. అంతేగానీ యేసు దేవాలయానికి ఎంత దూరంలో ఉన్నాడో, సాతాను ఆయన్ని ఎంతసేపటినుండి శోధిస్తున్నాడో చెప్పట్లేదు. కాబట్టి చాలా సమయం పట్టినప్పటికీ యేసు యెరూషలేముకు నడుచుకుంటూ రావడం సాధ్యమే.
సాతాను యేసుకు “లోకరాజ్యములన్నిటిని” బహుశా దర్శనం ద్వారా చూపించివుంటాడు. ఎందుకంటే లోక రాజ్యాలన్నీ కనిపించేంత పెద్ద కొండ భూమ్మీద ఎక్కడా లేదు. ఉదాహరణకు, మనం ఓ వ్యక్తికి ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల ఫోటోల్ని ప్రొజెక్టర్, స్క్రీన్ ఉపయోగించి చూపించినట్లే, యేసుకు లోకరాజ్యాలన్నీ చూపించడానికి సాతాను ఒక దర్శనాన్ని ఉపయోగించాడు. అయితే సాతాను దర్శనాన్ని చూపించినప్పటికీ, యేసు తనకు నిజంగానే సాగిలపడి, ఆరాధించాలని సాతాను కోరుకున్నాడు. (మత్త. 4:8, 9) కాబట్టి యేసును సాతాను దేవాలయానికి తీసుకెళ్లాడంటే, ఆయన నిజంగానే అక్కడి నుండి దూకాలని సాతాను కోరుకున్నాడు. కానీ యేసు అతను చెప్పింది చేయలేదు. ఒకవేళ సాతాను యేసును దర్శనంలో శోధించివుంటే యేసుకు ఇది అంతపెద్ద శోధనగా అనిపించివుండేదా!
కాబట్టి యేసు నిజంగానే యెరూషలేముకు వెళ్లి, దేవాలయంలోని ఎత్తైన స్థలంలో నిలబడడం సాధ్యమే. ఏదేమైనా, ఈ ఆర్టికల్ మొదట్లో చెప్పినట్లు సాతాను యేసుకు దేవాలయాన్ని ఎలా చూపించాడో మనకు ఖచ్చితంగా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, యేసు చేత తప్పు చేయించాలని సాతాను ప్రయత్నిస్తూనే వచ్చాడు. అయితే యేసు మాత్రం వాటిని తిప్పికొడుతూనే ఉన్నాడు.
a కావలికోట జూలై 15, 2013 సంచిక, 10-12 పేజీల్లోని 5-8, 12 పేరాలు చూడండి.
b యెహెజ్కేలు 37:1-14 అలాగే ప్రకటన 11:7-12 వచనాలు 1919లో జరిగిన వాటిగురించి మాట్లాడుతున్నాయి. దేవుని ప్రజలందరూ ఎంతోకాలంపాటు బంధీలుగా ఉండి 1919లో సత్యారాధనకు తిరిగి రావడాన్ని యెహెజ్కేలు 37:1-14 వచనాల్లో ఉన్న ప్రవచనం సూచిస్తోంది. కానీ ప్రకటన 11:7-12 వచనాలు, దేవుని ప్రజలను నడిపించిన అభిషిక్త సహోదరుల చిన్న గుంపును 1919లో నియమించడాన్ని సూచిస్తున్నాయి.