కొత్త లోకంలో జీవించాలంటే మీరేం చేయవచ్చు
ఈ లోకంలో ఉన్న చెడ్డ ప్రజల్ని, వాళ్ల వల్ల కలిగిన సమస్యలన్నిటినీ దేవుడు త్వరలోనే తీసేస్తాడని మనం ముందటి ఆర్టికల్స్‌లో చూశాం. అలా జరుగుతుందని మనం నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకు? ఎందుకంటే దేవుని వాక్యమైన బైబిలు ఇలా మాటిస్తుంది:
“లోకం, దాని ఆశ నాశనం కాబోతున్నాయి.”—1 యోహాను 2:17.
అందరు నాశనం కారు కానీ, కొంతమంది జీవిస్తారని మనం నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకంటే పైన ప్రస్తావించిన బైబిలు వచనం ఇంకా ఇలా మాటిస్తుంది:
“అయితే దేవుని ఇష్టాన్ని చేసే వ్యక్తి నిరంతరం జీవిస్తాడు.”
కాబట్టి మనం కాపాడబడాలి అంటే దేవుని ఇష్టాన్ని చేయాలి. అయితే మనం దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవడానికి మొదట ఆయన గురించి నేర్చుకోవాలి.
“దేవున్ని తెలుసుకోవడం” వల్ల లోకాంతం నుండి తప్పించుకుంటాం
“ఒకేఒక్క సత్యదేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం” అని యేసు చెప్పాడు. (యోహాను 17:3) లోకాంతం నుండి తప్పించుకుని శాశ్వతకాలం జీవించాలంటే, మనం ‘దేవుని గురించి తెలుసుకోవాలి.’ అంటే దేవుడున్నాడని నమ్మడం లేదా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం మాత్రమే కాదు. మనం దేవునికి స్నేహితులు అవ్వాలి. ఎవరితోనైన మన స్నేహం బలపడాలంటే, ఆ వ్యక్తితో ఎక్కువ సమయం గడపాలి. దేవునితో చేసే స్నేహం కూడా అంతే. దేవునితో స్నేహాన్ని పెంపొందించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి బైబిల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన సత్యాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
దేవుని వాక్యమైన బైబిల్ని ప్రతిరోజూ చదవండి
జీవించడానికి మనం ప్రతిరోజూ ఆహారం తీసుకుంటాం. కానీ యేసు ఇలా అన్నాడు: “మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదుగానీ యెహోవా నోటినుండి వచ్చే ప్రతీ మాట వల్ల జీవించాలి.”—మత్తయి 4:4.
యెహోవా మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. మీరు ఆ పవిత్ర పుస్తకాన్ని చదువుతున్నకొద్దీ గతంలో దేవుడు ఏం చేశాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో, త్వరలో ఏం చేయబోతున్నాడో తెలుసుకుంటారు.
సహాయం కోసం దేవునికి ప్రార్థించండి
దేవునికి లోబడాలనే కోరిక మీకు ఉన్నా, ఆయన చేయొద్దు అన్న పనులు మానడం కష్టంగా అనిపిస్తే, అప్పుడు మీరేం చేయొచ్చు? దేవుని గురించి బాగా తెలుసుకున్నప్పుడు మీకు సహాయం దొరుకుతుంది.
అనైతిక జీవితాన్ని గడిపిన సకూర అనే ఒక స్త్రీ ఉదాహరణ గురించి ఆలోచించండి. ఆమె బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టినప్పుడు, “లైంగిక పాపానికి దూరంగా పారిపోండి” అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ గురించి నేర్చుకుంది. (1 కొరింథీయులు 6:18) బలం కోసం సకూర దేవునికి ప్రార్థించింది. అలా ఆమెకు ఉన్న చెడ్డ అలవాట్లను మానుకోగలిగింది. కానీ, ఇప్పటికీ ఆమె తప్పు చేయాలనే కోరికలతో పోరాడుతుంది. “ఎప్పుడైనా అనైతిక ఆలోచనలు వచ్చినప్పుడు, నేను యెహోవాతో మనసు విప్పి మాట్లాడతాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే దీనితో పోరాడలేనని నాకు తెలుసు. పట్టుదలగా ప్రార్థించడం వల్ల నేను యెహోవాకు చాలా దగ్గరయ్యాను” అని ఆమె చెప్తుంది. సకూరలా నేడు లక్షలమంది దేవుని గురించి తెలుసుకుంటున్నారు. ప్రజలు తమ జీవితంలో మార్పులు చేసుకొని ఆయన్ని సంతోషపెట్టేలా దేవుడు వాళ్లకు సహాయం చేస్తున్నాడు.—ఫిలిప్పీయులు 4:13.
మీరు దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే “దేవుడు మీ గురించి అంత ఎక్కువగా తెలుసుకుంటాడు.” అలా మీరు దేవునితో దగ్గరి సంబంధాన్ని ఆనందిస్తారు. (గలతీయులు 4:9; కీర్తన 25:14) అప్పుడు, మీరు దేవుడు తీసుకొచ్చే కొత్త లోకంలోకి వెళ్లే అర్హతను సంపాదించుకుంటారు. అయితే, కొత్త లోకం ఎలా ఉంటుంది? దాని గురించి తర్వాతి ఆర్టికల్ వివరిస్తుంది.
a దేవుని పేరు యెహోవా అని బైబిలు చెప్తుంది.