పత్రిక ముఖ్యాంశం | ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు. . .
దుఃఖించడం తప్పా?
మీకెప్పుడైనా ఒక చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందా? బహుశా మీరు దానినుండి త్వరగా కోలుకోవడం వల్ల ఆ సంగతే మర్చిపోయి ఉంటారు. కానీ ఎవరైనా చనిపోతే వచ్చే దుఃఖం అలా కాదు. “ఆ దుఃఖం నుండి ‘బయటపడడం’ అనేదే జరగదు. కాలం గడుస్తుండగా, ఇతరుల సహాయంతో మీ దుఃఖం కాస్త తగ్గుతుంది అంతే,” అని డాక్టర్ ఆలన్ వుల్‌ఫెల్ట్ Healing a Spouse’s Grieving Heart అనే పుస్తకంలో చెప్తున్నారు.
ఉదాహరణకు, అబ్రాహాము భార్య శారా చనిపోయినప్పుడు ఆయన ఎలా బాధపడ్డాడో చూడండి. బైబిలు మూల ప్రతుల్లో ఆయన దుఃఖించడం మొదలుపెట్టాడని ఉంది. మొదలుపెట్టాడు అంటే ఆయన కొంతకాలం దుఃఖిస్తూనే ఉన్నాడని, కోలుకోవడానికి ఆయనకు కొంత సమయం పట్టిందని అర్థం. a ఇంకో ఉదాహరణ యాకోబు. ఆయన కొడుకు యోసేపును ఒక అడవి జంతువు చంపేసిందని యాకోబును మోసం చేశారు. అప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినా “అనేక దినములు” ఆయన బాధపడ్డాడని బైబిల్లో ఉంది. ఎన్నో సంవత్సరాలు తర్వాత కూడా యోసేపు మరణం ఆయన్ని ఇంకా బాధిస్తూనే ఉంది.—ఆదికాండము 23:2; 37:34, 35; 42:36; 45:28.
ఈరోజుల్లో కూడా బాగా దగ్గరివాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధను తట్టుకోవడం చాలామందికి కష్టం. ఈ రెండు ఉదాహరణలు గమనించండి.
-
“నా భర్త రాబర్ట్, జూలై 9, 2008లో చనిపోయాడు. రోజూ ఉదయంలానే యాక్సిడెంట్ జరిగిన రోజు కూడా మొదలైంది. టిఫిన్ చేశాక ఆయన పనికి వెళ్లే ముందు, ఎప్పటిలానే ముద్దుపెట్టుకుని, కౌగిలించుకుని, ‘ఐ లవ్ యూ’ చెప్పుకున్నాం. యాక్సిడెంట్ జరిగి ఆరు సంవత్సరాలు అయినా నా బాధ అలానే ఉంది. రాబ్ లేని జీవితం నావల్ల కావట్లేదు.”—గాల్, 60 సంవత్సరాలు.
-
“నా భార్య చనిపోయి 18 సంవత్సరాలు గడిచినా, ఆమె నాకు ఇంకా గుర్తొస్తుంది. ఇంకా ఆమె లేదని బాధపడతాను. ప్రకృతిలో ఏదైనా అందంగా కనిపిస్తే నాకు వెంటనే ఆమె గుర్తొస్తుంది. నేను చూస్తున్నది, ఆమె కూడా చూసుంటే ఎంత ఆనందించేదో అనుకుంటాను”—ఆట్యన్, 84 సంవత్సరాలు.
ఇదంతా చూసినప్పుడు బాధపడడం, సంవత్సరాలు గడిచినా దుఃఖిస్తూ ఉండడం సహజమేనని అర్థమౌతుంది. ఒక్కొక్కరు ఒక్కోలా దుఃఖిస్తారు. విషాద సంఘటనలు జరిగినప్పుడు ఒకరు ప్రతిస్పందించిన తీరును మనం వేలెత్తి చూపించడం మంచిది కాదు. అంతేకాకుండా మనం ఎక్కువగా బాధపడుతున్నామని మనకు మనమే నిందించుకోకూడదు. ఈ దుఃఖాన్ని ఎలా తట్టుకోవచ్చు? (w16-E No. 3)
a అబ్రాహాము కొడుకు ఇస్సాకు కూడా చాలా సంవత్సరాలు బాధపడ్డాడు. తన తల్లి శారా చనిపోయిన మూడు సంవత్సరాల వరకు ఇస్సాకు బాధపడ్డాడని బైబిలు చెప్తుంది.—ఆదికాండము 24:67.