దేవునికి తదనుభూతి లేదా సానుభూతి ఉందా?
సృష్టి ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చు
తదనుభూతి లేదా సానుభూతి అంటే “వేరేవాళ్ల పరిస్థితిలో మనం ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుని వాళ్ల భావాలను లేదా అనుభవాలను పంచుకోగల సామర్థ్యం.” మానసిక ఆరోగ్య నిపుణులు డా. రిక్ హన్సన్ “మనం తదనుభూతి చూపించే సామర్థ్యంతో పుట్టాము” అని అన్నారు.
ఆలోచించండి: వేరే ఏ జీవుల్లో లేని తదనుభూతి అనే లక్షణం మనలో ఎందుకుంది? దేవుడు మనుషుల్ని తన స్వరూపంలో చేశాడని బైబిలు చెప్తుంది. (ఆదికాండము 1:26) దేవుని స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి మనం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించగలం. అంటే ఆయన మంచి లక్షణాలను కొంతవరకు చూపించగలం. అందుకే కనికరం గలవాళ్లను తదనుభూతి కదిలించినప్పుడు వాళ్లు ఇతరులకు సహాయం చేస్తారు. అంటే వాళ్లు కనికరంగల సృష్టికర్తయైన యెహోవా దేవునికున్న తదనుభూతిని చూపిస్తారు. —సామెతలు14:31.
దేవునికున్న తదనుభూతి గురించి బైబిలు ఏమి నేర్పిస్తుంది
దేవుడు మన బాధలను అర్థం చేసుకోగలడు, మనం బాధపడడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ప్రాచీన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా చాలా కష్టాలు అనుభవించారు. అ తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో కూడా కష్టపడ్డారు. వాళ్ల గురించి బైబిలు ఇలా చెప్తుంది: “వారి యావద్బాధలో ఆయన బాధనొందెను.” (యెషయా 63:9) దేవునికి వాళ్ల కష్టాల గురించి తెలియడం మాత్రమే కాదు, వాళ్ల వేదనను కూడా ఆయన తెలుసుకోగలిగాడు అనేది గమనించాల్సిన విషయం. “నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని” అని ఆయన అన్నాడు. (నిర్గమకాండము 3:7) “మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని” దేవుడు చెప్తున్నాడు. (జెకర్యా 2:8) మనల్ని ఎవరైనా బాధపెడితే, మనతో పాటు ఆయన కూడా బాధపడతాడు.
మనల్ని మనం తప్పుబట్టుకుంటూ, దేవుని సానుభూతిని పొందడానికి అర్హులం కాదని అనుకోవచ్చు. కానీ ‘దేవుడు మన హృదయాల కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు’ అనే నమ్మకాన్ని బైబిలు ఇస్తుంది. (1 యోహాను 3:19, 20) మన గురించి మనకు తెలిసిన దానికన్నా దేవునికి బాగా తెలుసు. ఆయనకు మన పరిస్థితులు, మన ఆలోచనలు, మన భావాలు అన్నీ తెలుసు. ఆయన మన స్థానంలో ఉండి మన బాధను అర్థం చేసుకోగలడు.
బాధలో ఉన్నవాళ్లను ఆదుకోవడానికి దేవుడు ముందుకొస్తాడు అని తెలుసుకున్నప్పుడు, మనం ఓదార్పు కోసం, తెలివి కోసం, సహాయం కోసం దేవుని వైపు చూడవచ్చు
లేఖనాలు మనకు నమ్మకాన్ని ఇస్తున్నాయి
-
“నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన—నేనున్నాననును.” —యెషయా 58:9.
-
“నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.” —యిర్మీయా 29:11, 12.
-
“నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా.”—కీర్తన 56:8.
దేవుడు మనల్ని చూస్తాడు, అర్థం చేసుకుంటాడు, మనకోసం బాధపడతాడు
దేవుడు మన బాధను అర్థం చేసుకుంటాడని తెలుసుకోవడం వల్ల మనం కష్టాలను తట్టుకోవడం సాధ్యమౌతుందా? మారియా అనుభవాన్ని చూడండి:
“18 సంవత్సరాల వయసున్న నా కొడుకు రెండు సంవత్సరాలు క్యాన్సర్తో పోరాడి చనిపోయాడు. ఆ భయంకరమైన బాధను అనుభవించినప్పుడు జీవితం చాలా కష్టంగా ఉంది. చాలా అన్యాయం అనిపించింది. యెహోవా కలుగచేసుకుని నా కొడుకును బాగు చేయనందుకు నాకు ఆయన మీద చాలా కోపం వచ్చింది.
“ఆరు సంవత్సరాల తర్వాత, యెహోవాకు నా మీద ప్రేమ లేదని నేను అనుకుంటున్న విషయాన్ని సంఘంలో ఉన్న ప్రేమగల, కనికరంగల ఒక స్నేహితురాలికి చెప్పినప్పుడు ఆమె విన్నది. ఆమె దాదాపు రెండు గంటలు నేను చెప్పేదంతా ఆపకుండా విన్నది. తర్వాత, నన్ను కదిలించిన ఈ వచనాన్ని చెప్పింది, 1 యోహాను 3:19, 20. అక్కడ ఇలా ఉంది: ‘దేవుడు మన హృదయాల కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు.’ యెహోవా మన బాధను అర్థం చేసుకుంటాడని ఆమె వివరించింది.
“అయినా కూడా నా కోపాన్ని తీసేసుకోవడం నాకు కష్టంగా అనిపించింది. అప్పుడు నేను కీర్తన 94:19 చదివాను. అక్కడ ‘నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది’ అని ఉంది. ఈ వచనాలు నా కోసమే రాసినట్లు నాకు అనిపించింది. చివరికి, యెహోవాతో మాట్లాడితే ఆయన వింటాడని, అర్థం చేసుకుంటాడని తెలుసుకుని, నా బాధ గురించి ఆయనకు చెప్పుకున్నాక చాలా ప్రశాంతంగా అనిపించింది.”
దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడని మన గురించి బాధపడతాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుగా ఉంటుంది! కానీ అసలు ఎందుకు ఈ కష్టాలు ఉన్నాయి? మనం చేసిన తప్పుల వల్ల దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడా? కష్టాలన్నిటినీ తీసివేయడానికి దేవుడు ఏమైనా చేస్తాడా? ఈ విషయాల గురించి తర్వాత ఆర్టికల్లో ఉంది.