ఒక భరించలేని నిజం
మీరు బాగా పేరున్న ఒకరి గురించి, బహుశా మీకు ఇష్టమైన ఒక సింగర్ లేదా గాయని గురించి సినిమా చూస్తున్నారు అనుకోండి. ఆ సింగర్ చిన్నతనానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, ఆమె ఎలా సంగీతం నేర్చుకుంది, ఎలా సాధన చేసింది లాంటి విషయాలతో ఆ సినిమా మొదలౌతుంది. అందులో ఆమె పాటలు పాడిన సంగీత కార్యక్రమాలు, దేశవిదేశాల్లో ఆమె చేసిన పర్యటనలు, అంతర్జాతీయంగా ఎలా పేరు సంపాదించుకుంది వంటివన్నీ ఉన్నాయి. తర్వాత ఆమె వయసు పైబడిపోయి చివరికి చనిపోతుంది, అంతటితో సినిమా అయిపోతుంది.
ఈ సినిమా కల్పితం కాదుగానీ ఒక మనిషి జీవితంలో సాధారణంగా ఏమి జరుగుతుందో చూపించే నిజమైన కథ. ఆ కథ ఒక సింగర్ గురించి కావచ్చు, ఒక శాస్త్రవేత్త, ఒక క్రీడాకారుడు లేదా బాగా పేరు సంపాదించుకున్న ఎవరి గురించైనా కావచ్చు, ఈ కథలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. వాళ్లు బ్రతికున్నప్పుడు ఎన్నో గొప్ప పనులు చేసి ఉంటారు. కానీ వాళ్లు ముసలివాళ్లై చనిపోకుండా ఉంటే ఇంకెంత సాధించి ఉండేవాళ్లో ఒకసారి ఆలోచించండి.
అవును, మరణం ఒక భరించలేని నిజం, కానీ మనందరికీ జరిగేది అదే. (ప్రసంగి 9:5) మనం ఎంత ప్రయత్నించినా ముసలితనాన్ని, మరణాన్ని తప్పించుకోలేం. అంతేకాదు, కొన్నిసార్లు యాక్సిడెంట్ల వల్ల, లేదా భయంకరమైన అనారోగ్యం వల్ల జీవితం ముందే ముగిసిపోవచ్చు. ఒక పవిత్ర గ్రంథం వర్ణించినట్లు మనం ‘కాసేపు కనబడి మాయమైపోయే పొగమంచు లాంటివాళ్లం.’—యాకోబు 4:14.
ఎప్పుడేమి జరుగుతుందో తెలీక, జీవితానికి అర్థం లేదనుకుని కొంతమంది, “ఎలాగూ రేపు చచ్చిపోతాం కదా, రండి తిందాం, తాగుదాం” అనే విధంగా ఉంటారు. (1 కొరింథీయులు 15:32) వాళ్లు అలా జీవిస్తున్నారంటే మరణాన్ని తప్పించుకోలేం అనే విషయాన్ని ఒప్పుకుంటున్నట్లే కదా. అయితే ఎప్పుడోకప్పుడు, ముఖ్యంగా ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు ‘జీవితం అంటే ఇంతేనా?’ అని మీకు అనిపించవచ్చు. ఈ ప్రశ్నకు జవాబు మీరు ఎలా తెలుసుకోవచ్చు?
ఈ రోజుల్లో చాలామంది సైన్స్‌లో ఆ ప్రశ్నకు జవాబు ఉందని అనుకుంటారు. విజ్ఞానశాస్త్రంలో, వైద్యశాస్త్రంలో జరిగిన అభివృద్ధి వల్ల ఇప్పుడు మనుషులు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు జీవితాన్ని ఇంకా పొడిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లు చేస్తున్న ప్రయత్నాల ఫలితం ఏదైనప్పటికీ, కొన్ని ప్రశ్నలు మాత్రం అలానే ఉన్నాయి, అంటే మనం ఎందుకు ముసలివాళ్లమై చనిపోతున్నాం? మరణమనే శత్రువును ఓడించడం ఎప్పటికైనా సాధ్యమేనా? తర్వాత ఆర్టికల్స్‌లో ఈ విషయాల గురించి చూస్తాం. అంతేకాదు, జీవితం అంటే ఇంతేనా? అనే ప్రశ్నకు జవాబు కూడా చూస్తాం.