మరణం అనే శత్రువును ఓడించడం ఎలా?
మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము, హవ్వ దేవుని మాట వినకపోవడం వల్ల మనుషులందరికీ పాపం, మరణం వారసత్వంగా వచ్చాయి. అయినప్పటికీ మనుషుల విషయంలో దేవుని ఉద్దేశం మారలేదు. దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకోలేదని ఆయన రాయించిన బైబిలంతటిలో చాలాసార్లు చూస్తాం.
-
“నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” —కీర్తన 37:29.
-
“మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.”—యెషయా 25:8.
-
“ఆయన నాశనం చేసే చివరి శత్రువు, మరణం.”—1 కొరింథీయులు 15:26.
-
“మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.”—ప్రకటన 21:4.
దేవుడు మరణాన్ని ఎలా మింగేస్తాడు? ఆయన మరణం అనే శత్రువును ఎలా నాశనం చేస్తాడు? మనం చూసినట్లు, ‘నీతిమంతులు నిత్యం నివసిస్తారని’ బైబిలు స్పష్టంగా చెప్తుంది. అదే సమయంలో, “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు” అని కూడా బైబిల్లో ఉంది. (ప్రసంగి 7:20) మరి అపరిపూర్ణ మనుషులకు శాశ్వత జీవితం ఇవ్వడానికి, బైబిల్లో తానే స్వయంగా చెప్పిన విషయాలను దేవుడు పక్కన పెట్టేస్తాడా? అది అసాధ్యం, ఆయన అలా ఎప్పుడూ చేయడు, ఎందుకంటే దేవుడు ‘అబద్ధమాడలేడు.’ (తీతు 1:2) అయితే, మనుషుల్ని ఏ ఉద్దేశంతో సృష్టించాడో దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తాడు?
“మరెన్నడును ఉండకుండ మరణమును [దేవుడు] మ్రింగివేయును.”
విమోచనా మూల్యాన్ని ఇచ్చి మరణాన్ని ఓడించడం
మనుషుల్ని మరణం నుండి విడిపించడానికి యెహోవా దేవుడు ఎంతో ప్రేమతో ఒక ఏర్పాటు చేశాడు. ఆయన విమోచనా మూల్యాన్ని ఇచ్చాడు. దేన్నైనా విమోచించడం అంటే, జరిగిన నష్టాన్ని పూరించడం లేదా న్యాయపరంగా తగిన మూల్యాన్ని చెల్లించడం. మనుషులందరూ పాపులు, కాబట్టి మరణశిక్ష పొందారు; అందుకే బైబిలు ఇలా చెప్తుంది: “ఏ వ్యక్తీ ఎప్పటికీ ఇంకో వ్యక్తిని విడిపించలేడు, అతని కోసం దేవునికి విమోచన క్రయధనం చెల్లించలేడు, (వాళ్ల ప్రాణ విమోచనా మూల్యం ఎంత ఎక్కువంటే దాన్ని వాళ్లు ఎప్పటికీ చెల్లించలేరు).”—కీర్తన 49:7, 8, NW.
ఒక అపరిపూర్ణ మనిషి చనిపోయాడంటే, అతను కేవలం తను చేసిన పాపాలకు మాత్రమే తగిన మూల్యం చెల్లించినట్లు అవుతుంది. అంతేగానీ అతను అపరిపూర్ణత నుండి తనను తాను విడిపించుకోలేడు, ఇతరులనూ విడిపించలేడు. (రోమీయులు 6:7) కాబట్టి ఏ పాపం చేయని ఒక పరిపూర్ణ మనిషి, తన పాపాల కోసం కాకుండా మన పాపాల కోసం తన ప్రాణాన్ని అర్పించాలి.—హెబ్రీయులు 10:1-4.
దేవుడు అదే ఏర్పాటు చేశాడు. ఆయన తన కుమారుడైన యేసును పాపం లేని, ఒక పరిపూర్ణ మనిషిగా పరలోకం నుండి భూమ్మీదకు పంపించాడు. (1 పేతురు 2:22) తాను “ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి” వచ్చానని యేసు చెప్పాడు. (మార్కు 10:45) మరణం అనే శత్రువును ఓడించి, మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన చనిపోయాడు.—యోహాను 3:16.
మరణం ఎప్పుడు ఓడిపోతుంది?
బైబిలు ముందే చెప్పిన ‘ప్రమాదకరమైన, కష్టమైన కాలాల్లో’ మనం ఇప్పుడు జీవిస్తున్నాం, కాబట్టి ఈ చెడ్డ లోకానికి “చివరి రోజుల్లో” మనం ఉన్నామని చెప్పవచ్చు. (2 తిమోతి 3:1) ‘దైవభక్తిలేని ప్రజలు నాశనమయ్యే తీర్పు రోజుతో’ ఈ చివరి రోజులు ముగుస్తాయి. (2 పేతురు 3:3, 7) అయితే, దేవుణ్ణి ప్రేమించే ప్రజలు ఆ నాశనాన్ని తప్పించుకొని “శాశ్వత జీవితాన్ని పొందుతారు.”—మత్తయి 25:46.
చనిపోయిన కోట్లమంది తిరిగి బ్రతికినప్పుడు లేదా పునరుత్థానం అయినప్పుడు, శాశ్వతంగా జీవించే అవకాశాన్ని పొందుతారు. యేసు నాయీను అనే పట్టణంలో చనిపోయిన ఒకతన్ని తిరిగి బ్రతికించాడు. ఒక విధవరాలి ఒక్కగానొక్క కొడుకు చనిపోయినప్పుడు యేసు జాలి పడి అతన్ని తిరిగి బ్రతికించాడు. (లూకా 7:11-15) అపొస్తలుడైన పౌలు కూడా ఇలా అన్నాడు: “నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు పునరుత్థానం చేస్తాడని . . . నమ్మకంతో ఎదురుచూస్తున్నాను.” బలమైన రుజువులతో ఉన్న ఈ నిరీక్షణ దేవునికి మనుషుల పట్ల ఎంత ప్రేమ ఉందో చూపిస్తుంది.—అపొస్తలుల కార్యాలు 24:15.
కోట్లమంది నిరంతరం జీవించే అవకాశం కోసం ఎదురుచూడవచ్చు. బైబిలు ఇలా చెప్తుంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) అప్పుడు వాళ్లు, దాదాపు 2,000 సంవత్సరాల క్రితం అపొస్తలుడైన పౌలు రాసిన మాటలు నిజమవ్వడం చూస్తారు. ఆయనిలా అన్నాడు: “మరణమా, నీ విజయం ఎక్కడ? మరణమా, నీ విషపు కొండి ఎక్కడ?” (1 కొరింథీయులు 15:55) చివరికి మనుషుల భయంకరమైన శత్రువు మరణం ఓడిపోతుంది!