భవిష్యత్తుపై ఆశ నింపే విషయాలు
త్వరలో మంచి రోజులు వస్తాయని దేవుడే స్వయంగా చెప్పాడు. అతిత్వరలో మన కష్టాలన్నీ తీసేసి, మనుషులందరూ ఈ భూమ్మీద సంతోషంగా జీవించేలా చేస్తానని ఆయన చెప్పాడు. (కీర్తన 37:11) ఇచ్చిన మాటను ఆయన ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే “దేవుడు మనుషుల్లా అబద్ధాలు చెప్పడు.” (సంఖ్యాకాండం 23:19) మనకు మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం, దేవుడు అతిత్వరలో ఏమేం చేయబోతున్నాడో తెలుసుకుందామా.
దేవుడు చెడ్డవాళ్లను నాశనం చేస్తాడు
“శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోవడానికే [లేదా, నాశనం అవ్వడానికే] దుష్టులు కలుపు మొక్కల్లా చిగురిస్తారు, తప్పుచేసే వాళ్లంతా వర్ధిల్లుతారు.”—కీర్తన 92:7.
చివరిరోజుల్లో మనుషులు చాలా చెడ్డపనులు చేస్తారని పవిత్ర గ్రంథం ఎంతోకాలం క్రితమే చెప్పింది. (2 తిమోతి 3:1-5) ముందు పేజీల్లో తెలుసుకున్నట్టు, లోకంలో ప్రజలు ఇప్పుడు అలానే ప్రవర్తిస్తున్నారు. రోజురోజుకీ చెడుతనం పెరిగిపోతోంది. అతిత్వరలో, దేవుడు చెడ్డ ప్రజలందర్నీ నాశనం చేస్తాడు. ఆ తర్వాత, ఆయన మాట వినే మంచి ప్రజలు మాత్రమే ఈ భూమ్మీద మిగిలివుంటారు. “నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు” అని పవిత్ర గ్రంథం చెప్తోంది.—కీర్తన 37:29.
దేవుడు సాతానును అంతం చేస్తాడు
‘శాంతిని అనుగ్రహించే దేవుడు సాతానును చితకతొక్కిస్తాడు.’—రోమీయులు 16:20.
అతి త్వరలో, మనం భయపడుతూ జీవించాల్సిన పరిస్థితి ఉండదని మన సృష్టికర్త చెప్తున్నాడు. ఎందుకంటే అప్పుడు సాతాను, చెడ్డదూతలు, చెడ్డ ప్రజలు వీళ్లు ఎవ్వరూ ఉండరు. వాళ్లు నాశనమయ్యాక ఈ భూమ్మీద అందరూ శాంతిగా జీవిస్తారు.—మీకా 4:4.
దేవుడు జబ్బుల్ని, మరణాన్ని తీసేస్తాడు
“దేవుని నివాసం మనుషులతో ఉంది . . . వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ, ఏడ్పు గానీ, నొప్పి గానీ ఇక ఉండవు.”—ప్రకటన 21:3, 4.
సాతాను వల్ల, ఆదాముహవ్వల వల్ల, మన సొంత లోపాల వల్ల మనం అనుభవిస్తున్న కష్టాలన్నీ దేవుడు తీసేస్తాడు. అప్పుడు ఎవ్వరూ జబ్బుపడరు, చనిపోరు. సృష్టికర్తను ప్రేమిస్తూ, ఆయన మాట వినే వాళ్లందరూ ఏ కష్టాలు లేకుండా కలకాలం జీవించి ఉంటారు. మరి వాళ్లు ఎక్కడ ఉంటారు?
మన సృష్టికర్త ఈ భూమిని అందమైన తోటలా మారుస్తాడు
“ఎడారి, ఎండిన భూమి ఉల్లసిస్తాయి, ఎడారి మైదానం సంతోషించి కుంకుమ పువ్వులా వికసిస్తుంది.” —యెషయా 35:1.
దేవుడు చెడ్డవాళ్లందర్నీ నాశనం చేసిన తర్వాత ఈ భూమి అందమైన తోటలా అవుతుంది. రకరకాల చెట్లతో ఎటుచూసినా పచ్చదనం కనిపిస్తుంది. ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. (కీర్తన 72:16) సముద్రాలు, చెరువులు, నదులు స్వచ్ఛమైన నీళ్లతో, రకరకాల జీవులతో నిండివుంటాయి. కాలుష్యం అనే మాటే వినబడదు. ప్రతీ ఒక్కరం మన సొంత ఇల్లు కట్టుకుని అందులో ఉంటాం. ఇల్లులేక రోడ్డు పక్కన బ్రతకాల్సిన అవసరం గానీ, ఆకలితో పడుకోవాల్సిన అవసరం గానీ, పేదరికంతో ఇబ్బంది పడాల్సిన అవసరం గానీ ఎవ్వరికీ ఉండదు. —యెషయా 65:21, 22.
చనిపోయిన వాళ్లను దేవుడు తిరిగి బ్రతికిస్తాడు
‘దేవుడు తిరిగి బ్రతికిస్తాడు.’—అపొస్తలుల కార్యాలు 24:15.
మీకు ఇష్టమైనవాళ్లు ఎవరైనా చనిపోయారా? వాళ్లను మళ్లీ ప్రాణాలతో చూడాలనుకుంటున్నారా? త్వరలో వాళ్లందర్నీ తిరిగి బ్రతికిస్తానని సర్వశక్తిగల దేవుడు మాటిచ్చాడు. అందమైన తోటలా మారిన భూమ్మీద వాళ్లు మళ్లీ జీవిస్తారు. అప్పుడు మీరు వాళ్లను గుర్తుపడతారు, వాళ్లు కూడా మిమ్మల్ని గుర్తుపడతారు. ఆరోజు మీరెంత సంతోషంగా ఉంటారో ఊహించుకోగలరా! ఇదంతా జరుగుతుందని మీరు ఖచ్చితంగా నమ్మవచ్చు. ఎందుకంటే గతంలో, చనిపోయిన కొంతమంది పెద్దవాళ్లు, పిల్లలు తిరిగి బ్రతికించబడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎంతోమంది చూస్తుండగా, వాళ్ల కళ్లముందే యేసు కొంతమంది చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించాడు. వాళ్లు మళ్లీ తమ కుటుంబ సభ్యులతో కలిసి జీవించారు.—లూకా 8:49-56; యోహాను 11:11-14, 38-44.