సంతృప్తితో ఎలా జీవించవచ్చు?
పెళ్లైన వాళ్లమైనా, పెళ్లికాని వాళ్లమైనా, ముసలివాళ్లమైనా, యౌవనస్థులమైనా అందరం కోరుకునేది ఒకటే. మనం సంతోషంగా, సంతృప్తిగా జీవించాలి. మనం అలా జీవించాలనే మన సృష్టికర్త కూడా కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మనకోసం అద్భుతమైన సలహాలు ఇచ్చాడు.
కష్టపడి పనిచేయండి
“కష్టపడి పనిచేయాలి, అవసరంలో ఉన్నవాళ్లకు ఎంతోకొంత ఇవ్వగలిగేలా తమ సొంత చేతులతో నిజాయితీగల పని చేయాలి.”—ఎఫెసీయులు 4:28.
మనం కష్టపడి పనిచేయాలని సృష్టికర్త కోరుకుంటున్నాడు. ఆయనిచ్చే ఈ సలహా పాటిస్తే మనమే సంతోషంగా ఉంటాం. ఎందుకంటే కష్టపడి పనిచేసే వ్యక్తి తననూ తన కుటుంబాన్నీ పోషించుకుంటాడు, అవసరంలో ఉన్నవాళ్లకు వీలైన సహాయం చేయగలుగుతాడు. అతని పని చూసి యజమాని సంతోషిస్తాడు కాబట్టి, ఉద్యోగం పోతుందనే భయం ఉండదు. పవిత్ర గ్రంథం చెప్తున్నట్లు, కష్టానికి వచ్చిన ప్రతిఫలం నిజంగా “దేవుడు ఇచ్చిన బహుమతి.”—ప్రసంగి 3:13.
నిజాయితీగా ఉండండి
“మేము అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తించాలని అనుకుంటున్నాం, మంచి మనస్సాక్షి కలిగివున్నామని నమ్ముతున్నాం.”—హెబ్రీయులు 13:18.
నిజాయితీగా ఉండే వ్యక్తి ఎవ్వరికీ భయపడడు, రాత్రిపూట హాయిగా నిద్రపోతాడు. వేరేవాళ్లు కూడా అతన్ని నమ్ముతారు, గౌరవిస్తారు. కానీ నిజాయితీలేని వ్యక్తికి, అతని మీద అతనికే గౌరవం ఉండదు. తప్పు చేశాననే ఆలోచన అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో సరిగ్గా నిద్రపట్టదు.
డబ్బు వెనుక పరుగెత్తకండి
“డబ్బును ప్రేమించకండి, ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి.”—హెబ్రీయులు 13:5.
ఆహారం కోసం, ఇతర అవసరాల కోసం డబ్బు అవసరమే. అయితే, డబ్బు వెనుక పరుగెత్తడం లేదా దాన్ని ప్రేమించడం మాత్రం చాలా ప్రమాదకరం. డబ్బును ప్రేమించే వ్యక్తి కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా తన సమయాన్ని, శక్తిని డబ్బు సంపాదించడానికే ధారపోస్తాడు. దానివల్ల భార్యాపిల్లలతో అతనికున్న సంబంధం దెబ్బతింటుంది, అతని ఆరోగ్యం కూడా పాడౌతుంది. (1 తిమోతి 6:9, 10) అన్నిటికన్నా ముఖ్యంగా, అతను అవినీతిగా నడుచుకునే అవకాశం ఉంది. అందుకే, ఒక తెలివైన వ్యక్తి ఇలా చెప్పాడు: “నమ్మకమైనవాడు ఎన్నో దీవెనలు పొందుతాడు, ధనవంతుడు అవ్వడానికి తొందరపడేవాడు నిర్దోషిగా ఉండడు.”—సామెతలు 28:20.
అత్యుత్తమ విద్యను ఎంచుకోండి
“తెలివిని, ఆలోచనా సామర్థ్యాన్ని భద్రంగా కాపాడుకో.” —సామెతలు 3:21.
మంచిగా చదువుకుంటే మన కాళ్ల మీద మనం నిలబడతాం, మన కుటుంబాన్ని కూడా బాగా చూసుకోగలుగుతాం. కానీ ఎక్కువ చదువుకున్నంత మాత్రాన ఎప్పుడూ సంతోషంగా ఉంటామని గ్యారెంటీ లేదు. మనం ప్రతీ పనిలో నిజమైన విజయం సాధించాలంటే, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకుని వాటి ప్రకారం నడుచుకోవాలి. పవిత్ర గ్రంథంలో ఏమని ఉందంటే: దేవుని మాట వినే వ్యక్తి “చేసే ప్రతీది సఫలమౌతుంది.”—కీర్తన 1:1-3.