ఈ సవాలును ఎదుర్కోగల ప్రభుత్వం
“మితిలేకుండ . . . వృద్ధియు క్షేమమును” కలుగును
ఐక్యరాజ్య సమితి “ప్రపంచవ్యాప్త పౌరసత్వం” అనే ఆలోచనను ప్రాచుర్యంలోకి తెస్తుంది. అంతర్జాతీయ సహకారం, మానవ హక్కులను గౌరవించడం, మన గ్రహాన్ని కాపాడుకోవడం అనే లక్ష్యాలను ప్రోత్సహిస్తుంది. కారణం? UN క్రానికల్ పత్రికలో మాహెర్ నసెర్ చెప్పినట్లు “వాతావరణంలో మార్పు, పెరిగిపోతున్న మూకుమ్మడి హింస, పెరుగుతున్న అసమానతలు, పరిష్కారం కాని పోరాటాలు, అధిక సంఖ్యలో ప్రజల వలసలు, అంతర్జాతీయ తీవ్రవాదం, అంటువ్యాధులు, ఇలాంటి కొన్ని ప్రమాదాలకు . . . సరిహద్దులు తెలియవు.”
ఇంకొంతమంది ఒక అడుగు ముందుకెళ్లి ప్రపంచవ్యాప్త ప్రభుత్వం గురించి అభ్యర్థిస్తున్నారు. వాళ్లలో ఇటలీకి చెందిన తత్త్వవేత్త, కవి, రాజకీయవేత్త అయిన డాన్టే (1265-1321) మరియు భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నారు (1879-1955). రాజకీయపరంగా విభజించబడిన ప్రపంచంలో శాంతి నెలకొనడం కష్టం అని డాన్టే నమ్మాడు. “ఒక రాజ్యం దానిమీద అదే తిరగబడి చీలిపోతే, . . . నాశనమౌతుంది” అని యేసుక్రీస్తు అన్న మాటలను ఆయన ఉల్లేఖించాడు.—లూకా 11:17.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన కొంతకాలానికే మనం రెండు అణుబాంబుల ప్రయోగాన్ని చూశాము. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి బహిరంగంగా రాసిన ఉత్తరంలో ఇలా పేర్కొన్నాడు: “ఐక్యరాజ్య సమితి నిజమైన ప్రపంచ ప్రభుత్వానికి పునాది వేయడం ద్వారా అంతర్జాతీయ భద్రతకు తోడ్పడే పరిస్థితులను తీసుకురావడానికి వేగంగా పనిచేయాలి.”
కానీ అలాంటి శక్తివంతమైన ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు అవినీతిపరులు కారని, అసమర్థులు కారని, అణచివేయరని నమ్మకంగా చెప్పగలమా? లేదా వాళ్లు కూడా ఇతర నాయకుల్లానే చెడు లక్షణాలు చూపిస్తారా? ఈ ప్రశ్నలు బ్రిటీష్ చరిత్రకారుడైన లార్డ్ ఆక్టన్ అన్న మాటలను గుర్తు చేస్తాయి. ఆయన ఇలా అన్నాడు: “అధికారం భ్రష్టుపట్టిస్తుంది, సంపూర్ణాధికారం సంపూర్ణంగా భ్రష్టుపట్టిస్తుంది.”
అయినప్పటికీ, మనుషులంతా నిజమైన శాంతిసామరస్యాలను అనుభవించాలంటే, మనమంతా ఐక్యమై ఉండాలి. కానీ ఆ లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చు? అది నిజంగా సాధ్యమా? సాధ్యమే అని బైబిలు జవాబిస్తుంది. దాన్ని సాధించవచ్చు, అది సాధ్యమౌతుంది. ఎలా? అది అవినీతిపరులైన రాజకీయ నాయకులున్న ప్రపంచ ప్రభుత్వం ద్వారా కాదు. కానీ, దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వం ద్వారా సాధ్యం. ఇంకా చెప్పాలంటే, ఆ ప్రభుత్వం సృష్టి అంతటిపైన పరిపాలించడానికి దేవునికున్న హక్కును చూపిస్తుంది. ఆ ప్రభుత్వం ఏంటి? బైబిలు దానికి ఒక పేరును కూడా ఇచ్చింది—“దేవుని రాజ్యం” లేదా దేవుని ప్రభుత్వం.—లూకా 4:43.
“నీ రాజ్యం రావాలి”
దేవుని రాజ్యాన్ని మనసులో ఉంచుకునే యేసు తన మాదిరి ప్రార్థనలో “నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం . . . భూమ్మీద కూడా నెరవేరాలి” అని చెప్పాడు. (మత్తయి 6:9, 10) అవును, దేవుని రాజ్యం దేవుని ఇష్టాన్ని భూమి మీద జరిగేలా చేస్తుంది కానీ, అధికార దాహంతో ఉన్న స్వార్థపరులైన మనుషుల ఇష్టాన్ని కాదు.
దేవుని రాజ్యాన్ని “పరలోక రాజ్యం” అని కూడా పిలిచారు. (మత్తయి 5:3) కారణం? భూమి మీద పరిపాలన చేసినా కూడా ఆ రాజ్యం భూమి మీదనుండి పరిపాలించదు, పరలోకం నుండి పరిపాలిస్తుంది. అంటే ఏంటో ఆలోచించండి. ఈ ప్రపంచ ప్రభుత్వానికి ఆర్థికపరమైన మద్దతు అంటే పన్నులు లాంటివి అవసరం లేదు. నిజంగా పౌరులకు అది ఎంత ఉపశమనంగా ఉంటుంది.
“రాజ్యం” అనే మాట చెప్తున్నట్లుగా దేవుని రాజ్యం ఒక రాజరిక ప్రభుత్వం. దానికి ఒక రాజు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ఆ అధికారం దేవుని నుండి పొందాడు. యేసు గురించి బైబిలు ఇలా చెప్తుంది:
-
“ఆయన భుజముమీద రాజ్యభారముండును. . . . ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును” కలుగును.—యెషయా 9:6, 7.
- “సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు.”—
-
“ఈ లోక రాజ్యం మన దేవునిది, ఆయన క్రీస్తుది అయింది.”—ప్రకటన 11:15.
యేసు మాదిరి ప్రార్థన నెరవేర్పుగా దేవుని రాజ్యం పూర్తిగా దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేరుస్తుంది. ఆ రాజ్యం కింద, ఈ గ్రహమంతా ఆరోగ్యంగా జీవరాశితో నిండి ఉండేలా ఎలా కాపాడుకోవాలో మనుషులంతా నేర్చుకుంటారు.
అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని రాజ్యం దాని పౌరులకు విద్యని ఇస్తుంది. అందరికీ ఒకే ప్రమాణాలు నేర్పించబడతాయి. వైషమ్యాలు గానీ, విభజనలు గానీ ఉండవు. ఏదీ ఏ “హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును” అని యెషయా 11:9 చెప్తుంది.
నిజంగా ఐక్యరాజ్య సమితి కోరుకున్న విధంగానే భూమి మీద నివసించే ప్రజలు శాంతిని ప్రేమించే ప్రపంచవ్యాప్త పౌరులుగా ఉంటారు. వాళ్లు “బహు క్షేమము కలిగి సుఖించెదరు” అని కీర్తన 37:11 చెప్తుంది. కొంతకాలానికి “నేరం,” “కాలుష్యం,” “పేదరికం,” “యుద్ధం,” అనేవి మన మాటల్లో కూడా ఉండవు. కానీ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? అవును, దేవుని రాజ్యం భూమి మీద పరిపాలన మొదలుపెట్టినప్పుడు జరుగుతుంది. అది పరిపాలించడం ఎలా మొదలుపెడుతుంది? ఆ పరిపాలన తెచ్చే ప్రయోజనాలు అనుభవించాలంటే మీరు ఏమి చేయాలి? ఇప్పుడు చూద్దాం.