వాళ్లు సవాలు ఎదుర్కొన్నారు
రీకార్డో, ఆన్‌డ్రేస్ జీవిత కథలు
బైబిలు విద్యకు, జీవితాల్ని మెరుగుపర్చే అద్భుతమైన శక్తి ఉంది. రెండు ఉదాహరణలు పరిశీలించండి: రీకార్డో, ఆన్‌డ్రేస్.
రీకార్డో: నాకు అప్పుడు 15 సంవత్సరాలు, దేనికైనా బాగా ప్రభావం చెందే ఆ వయసులో నేను ఒక ముఠాలో చేరాను. కొత్త స్నేహితుల ప్రభావం నా మీద బాగా పడింది. నిజానికి, పది సంవత్సరాలు జైల్లో గడపాలని నేను లక్ష్యం పెట్టుకున్నాను. ఇదేమి లక్ష్యం అని అనిపించవచ్చు. కానీ మా పొరుగు వాళ్లంతా, జైలుకి వెళ్లి వచ్చిన వాళ్లను చాలా గొప్పగా చూసేవాళ్లు, వాళ్లను గౌరవించేవాళ్లు. నేను కూడా వాళ్లలా ఉండాలని అనుకున్నాను.
ఒక ముఠాతో కలిసి ఉంటున్నప్పుడు చేసే వాటన్నిటిని నేను అనుభవించాను అంటే డ్రగ్స్, సెక్స్, హింస లాంటివి. ఒక రోజు రాత్రి వేరే ముఠా వాళ్లు మామీద తుపాకులతో కాల్పులు చేసినప్పుడు నేను కూడా ఉన్నాను. ఆ రోజు నేను చనిపోతానని అనుకున్నాను, కానీ ఏమి అవకుండా తప్పించుకోగలిగాను. తర్వాత నుండి, నా జీవితం గురించి, నా లక్ష్యాల గురించి బాగా ఆలోచించడం మొదలుపెట్టాను, నేను మారాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎలా? నాకు సహాయం ఎక్కడ దొరుకుతుంది?
మా బంధువుల్లో చాలామంది సంతోషంగా లేరు. వాళ్ల జీవితాలు సమస్యలతో నిండిపోయాయి. కానీ మా మామయ్య కుటుంబం మాత్రం అలా లేదు. వాళ్లు మంచివాళ్లు, బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తారు అని నాకు తెలుసు. ఒకసారి నేను దేవుని పేరు యెహోవా అని వాళ్ల నుండి తెలుసుకున్నాను. ఆ కాల్పులు జరిగి ఎంతో కాలం గడవక ముందే, నేను యెహోవాకు ప్రార్థన చేశాను, ఆయన పేరును ఉపయోగించి ప్రార్థన చేశాను, నాకు సహాయం చేయమని అడిగాను. ఆశ్చర్యంగా తర్వాత రోజు ఒక యెహోవాసాక్షి నా తలుపు తట్టాడు! ఆయన నాకు బైబిలు గురించి నేర్పించాడు.
ఎంతోకాలం అవ్వకముందే నాకు ఒక పెద్ద సవాలు ఎదురైంది. నా పాత స్నేహితులు నాకు చాలాసార్లు ఫోన్‌చేసి, వాళ్ల దగ్గరకు రమ్మని అడిగేవాళ్లు. అంత సులువు కాకపోయినా నేను రానని వాళ్లతో చెప్పాను. నా బైబిలు స్టడీ ఆపకుండా చేయాలని నేను నిర్ణయించుకున్నాను, అలా చేసినందుకు సంతోషంగా ఉంది. నా జీవితం చాలా మారింది, నాకు నిజమైన సంతోషం దొరికింది.
ఒకసారి ప్రార్థనలో దేవునికి నేను ఒకప్పుడు ముఠాలో సభ్యుడిగా గౌరవం సంపాదించుకోవడానికి పది సంవత్సరాలు జైల్లో ఉండడానికి సిద్ధపడ్డానని చెప్పిన విషయం నాకు గుర్తుంది. కాబట్టి ఇప్పుడు నేను కనీసం 10 సంవత్సరాలు అయినా పూర్తికాల సేవకుడిగా అంటే ఎక్కువ సమయం దేవుని సేవ చేసేలా అనుమతించమని అడిగాను, అలా చేస్తే, నాకు సహాయం దొరికినట్లే నాలాంటి వాళ్లకు నేను సహాయం చేయగలను. దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, నేను 17 సంవత్సరాలు పూర్తికాల సేవ చేయగలిగాను, ఇంకో విషయం ఏంటంటే, నేను ఎప్పుడూ జైలుకి వెళ్లలేదు.
ఒకప్పటి నా స్నేహితుల్లో చాలామంది ఎంతోకాలం నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నారు, మిగిలినవాళ్లు చనిపోయారు. నేను వెనక్కి తిరిగి చూస్తే, నేను నా సాక్షులైన బంధువులకు ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్లు వేరుగా ఉండడానికి, బైబిలు ప్రకారం జీవించడానికి ఇష్టపడ్డారు. నేను ముఠాలో వాళ్లను గౌరవించిన దానికంటే ఎంతో ఎక్కువగా వాళ్ల మీద గౌరవం పెంచుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా, నేను శ్రేష్ఠమైన విధంగా జీవించడం ఎలాగో నేర్పించిన దేవుని పట్ల కృతజ్ఞతతో ఉన్నాను.
ఆన్‌డ్రేస్: నేను పుట్టి, పెరిగిన వాతావరణం సరిగ్గా లేదు, మా దగ్గర డ్రగ్స్ తీసుకోవడం, దోపిడీలు చేయడం, హత్యలు, వ్యభిచారం మామూలు విషయాలు. మా నాన్న త్రాగుబోతు, కొకైన్ బానిస. ఆయనా, మా అమ్మ ఎప్పుడు తిట్టుకునేవాళ్లు, కొట్టుకునేవాళ్లు.
చిన్న వయసునుండే నేను మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. నేను దొంగతనాలు చేస్తూ, దొంగతనం చేసిన వాటిని అమ్ముతూ ఎక్కువగా నా సమయాన్ని వీధుల్లో గడిపేవాణ్ణి. నేను పెద్దవాణ్ణి అవుతున్నప్పుడు, మా నాన్న నాకు దగ్గర అవ్వాలని అనుకున్నాడు, కానీ ఆయన దాన్ని సరైన విధంగా చేయలేదు. ఆయన నాకు డ్రగ్స్‌ను, నిషేధించిన వస్తువులను దొంగతనంగా మా దేశంలోకి ఎలా తీసుకురావాలో, ఎలా అమ్మాలో నేర్పించాడు. నేను చాలా త్వరగా ఎంతో డబ్బు సంపాదించాను. ఒక రోజు పోలీసులు మా ఇంటికి వచ్చారు. నన్ను అరెస్ట్ చేసి హత్యాయత్నం అనే నేరంతో నాకు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వేశారు.
ఒకరోజు ఉదయం జైల్లో మైక్ నుండి ఒక ప్రకటన చేశారు. బైబిలు విషయాల గురించి యెహోవాసాక్షులు చేసే చర్చకు జైల్లో ఉన్నవాళ్లను ఆహ్వానించారు. నేను వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నేను విన్న విషయాలు సరైనవని నాకు అనిపించింది, కాబట్టి నేను సాక్షులతో బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాను. వాళ్లు నాకు చెప్తున్నప్పుడు బైబిల్లో ఉన్న విషయాలు ఇతరులను బాధపెడతాయని దేవుని ఉన్నతమైన నైతిక ప్రమాణాల విలువను తగ్గించలేదు.
సహాయం లేకుండా నేను నా జీవితంలో మార్పులు చేసుకోలేనని కొన్నిరోజుల్లోనే గుర్తించాను, మరిముఖ్యంగా నేను చేసేవాటిని ఇష్టపడని నా తోటి ఖైదీలు నన్ను బెదిరించారు. నేను బలం కోసం, తెలివి కోసం ప్రార్థించాను, యెహోవా నాకు సహాయం చేశాడు. నన్ను బెదిరించినా నేను బైబిలు గురించి ఇతర ఖైదీలకు ధైర్యంగా చెప్పగలిగాను.
నన్ను జైలు నుండి విడుదల చేసే సమయం వచ్చినప్పుడు, చాలా భయం వేసింది, నిజానికి నేను ఇంకాస్త ఎక్కువకాలం జైల్లోనే ఉండాలని అనుకున్నాను. నేను వెళ్లిపోతున్నప్పుడు చాలామంది ఖైదీలు వీడ్కోలు చెప్తూ చేతులు ఊపారు. కొంతమంది ప్రేమతో, “ఇంటికి వెళ్లు, చిన్న కాపరి” అని చెప్పారు.
దేవుడు నాకు ఇచ్చిన విద్యను నేను తీసుకోకపోయివుంటే నా జీవితం ఎలా ఉండేదో ఆలోచిస్తే చాలా భయం వేస్తుంది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నందుకు, నన్ను పనికిరాని వాడిగా చూడనందుకు నేను దేవునికి ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. a
a jw.org వెబ్‌సైట్‌లో జీవితాలను మార్చగల శక్తి బైబిలుకు ఉందని వివరించే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దానికోసం ఆ వెబ్‌సైట్‌లో లైబ్రరీ కింద, ఆర్టికల్ సిరీస్‌లో “బైబిలు జీవితాల్ని మారుస్తుంది” చూడండి.