ఒత్తిడి నుండి బయటపడండి
ఒత్తిడి అంటే ఏంటి?
ఏదైనా కష్టమైన పరిస్థితిలో మీ శరీరం స్పందించే తీరును ఒత్తిడి అంటారు. ఆ సమయంలో మీ శరీర భాగాలన్నిటిలో హార్మోన్‌లు విడుదలయ్యేలా మెదడు సంకేతాలు పంపిస్తుంది. ఆ హార్మోన్ల వల్ల మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, బి.పి పెరుగుతుంది లేదా తగ్గుతుంది, మీరు వేగంగా ఊపిరి పీల్చుకుంటారు, మీ కండరాలు బిగుసుకుపోతాయి. లోపల ఏం జరుగుతుందో మీకు పూర్తిగా తెలిసేలోపే మీ శరీరం చర్య తీసుకోవడానికి సిద్ధమౌతుంది. ఆ కష్టమైన పరిస్థితి నుండి బయటపడ్డాక పైన చెప్పిన లక్షణాలన్నీ తగ్గిపోయి, శరీరం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది.
ఒత్తిడి వల్ల మంచి లేదా చెడు జరగవచ్చు
కష్టమైన లేదా ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేలా మీ శరీరంలో కలిగే సహజ స్పందనే ఒత్తిడి. ఈ స్పందన మీ మెదడులో మొదలౌతుంది. కొన్నిసార్లు ఒత్తిడి వల్ల మంచి జరుగుతుంది. ఉదాహరణకు మీరు త్వరగా పని చేయగలుగుతారు, వెంటనే స్పందించగలుగుతారు. కొంత ఒత్తిడి వల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు, లేదా ఏదైనా పనిని ఇంకా బాగా చేయగలుగుతారు. అంటే పరీక్షలు బాగా రాసేలా, జాబ్ ఇంటర్వ్యూ చక్కగా ఇచ్చేలా, ఆటలు బాగా ఆడేలా అది సహాయపడవచ్చు.
అయితే, ఎక్కువకాలంగా లేదా తీవ్రంగా ఉండే ఒత్తిడి వల్ల మీకు చాలా హాని జరుగుతుంది. ఒత్తిడి కలిగినప్పుడు మీ శరీరంలో జరిగే మార్పులు అలానే ఉండిపోతే, లేదా పదేపదే అవి చోటుచేసుకుంటుంటే, మీలో శారీరక, భావోద్వేగ, మానసిక సమస్యలు మొదలౌతాయి. మీ ప్రవర్తన, ఇతరులతో మీరు వ్యవహరించే తీరు కూడా మారిపోవచ్చు. ఎక్కువకాలంగా ఒత్తిడికి గురౌతున్నవాళ్లు మద్యం అతిగా తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, కొన్నిరకాల మందులకు అలవాటుపడడం, అతిగా తినడం, పొగతాగడం మొదలుపెట్టవచ్చు, అలాగే వేరే చెడ్డ అలవాట్లకు బానిసలు అవ్వవచ్చు. చివరికి అది డిప్రెషన్‌కు, విపరీతమైన అలసటకు, లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు దారితీయవచ్చు.
ఒత్తిడి అందరి మీద ఒకేలా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ ఒత్తిడి వల్ల రకరకాల జబ్బులు రావచ్చు. శరీరంలో ఉన్న దాదాపు ప్రతీ భాగం మీద అది ప్రభావం చూపించవచ్చు.