వేరేవాళ్లలో ఉన్న మంచి లక్షణాల్ని, సామర్థ్యాల్ని గుర్తించండి
సమస్య
అహం లేదా ఇగో వల్ల ఒక వ్యక్తిలో వివక్ష మొదలవ్వవచ్చు. అహాన్ని చూపించే వ్యక్తి తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటాడు. తనే గొప్పవాడిని అనుకుంటూ, తనకు భిన్నంగా ఉన్నవాళ్లను చిన్నచూపు చూస్తాడు. ఆ ఉచ్చులో ఎవరైనా పడిపోయే ప్రమాదం ఉంది. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెప్తుంది: “చాలా సంస్కృతుల వాళ్లు తమ జీవన విధానం, ఆహారం, బట్టలు, అలవాట్లు, నమ్మకాలు, విలువలు మొదలైనవి వేరేవాళ్ల కన్నా గొప్పవని అనుకుంటారు.” ఈ తప్పుడు ఆలోచనను మనమెలా తీసేసుకోవచ్చు?
బైబిలు సలహా
“వినయంతో ఇతరుల్ని మీకన్నా గొప్పవాళ్లుగా ఎంచండి.”—ఫిలిప్పీయులు 2:3.
అంటే . . . అహంకారాన్ని తీసేసుకోవాలంటే వినయంగా ఉండడం నేర్చుకోవాలి. వినయం ఉంటే, వేరేవాళ్లు ఏదోక విషయంలో మనకన్నా గొప్పవాళ్లని గుర్తిస్తాం. అన్ని మంచి లక్షణాలు, సామర్థ్యాలు ఏదో ఒక్క వర్గానికే సొంతం కాదు.
స్టీఫన్ ఉదాహరణ పరిశీలించండి. అతను వేరేదేశాల ప్రజల మీద తనకున్న వివక్షను తీసేసుకోగలిగాడు. అతను ఇలా అంటున్నాడు: “వేరేవాళ్లను మనకన్నా గొప్పవాళ్లుగా ఎంచితే మనలో ఉన్న వివక్షను తీసేసుకోగలం అని నేను
నమ్ముతున్నాను. నాకు అన్నీ తెలియవు, కాబట్టి ప్రతీఒక్కరి నుండి ఏదోకటి నేర్చుకుంటాను.”మీరేం చేయవచ్చు?
మీరు కూడా పొరపాట్లు చేస్తారని గుర్తుంచుకోండి, మీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకోకండి. కొన్ని విషయాల్లో మీకన్నా వేరేవాళ్లకు ఎక్కువ సామర్థ్యాలు ఉంటాయని గుర్తించండి. ఒక వర్గానికి చెందిన ప్రజలందరిలో ఒకేలాంటి లోపాలు ఉంటాయని అనుకోకండి.
ఏదైనా ఒక వర్గానికి చెందిన వ్యక్తి మీద చెడు అభిప్రాయం ఏర్పర్చుకునే బదులు, ఈ ప్రశ్నలు వేసుకోండి:
కొన్ని విషయాల్లో మీకన్నా వేరేవాళ్లకు ఎక్కువ సామర్థ్యాలు ఉంటాయని గుర్తించండి
-
‘ఆ వ్యక్తిలో నేను కొన్ని విషయాల్ని ఇష్టపడక పోవడానికి కారణం అవి చెడ్డవనా లేక కాస్త వేరుగా ఉన్నాయనా?’
-
‘ఆ వ్యక్తి నాలో లోపాల్ని చూసే అవకాశం ఉందా?’
-
‘ఏ విషయాల్లో ఆ వ్యక్తికి నాకన్నా ఎక్కువ సామర్థ్యాలు ఉన్నాయి?’
అలా మిమ్మల్ని మీరు నిజాయితీగా పరిశీలించుకుంటే వివక్షను తీసేసుకుని, ఆ వ్యక్తిలో ఉన్న మంచిని అభిమానించడం మొదలుపెట్టే అవకాశం ఉంది.