వాస్తవాలు తెలుసుకోండి
సమస్య
సాధారణంగా వివక్షకు కారణం, వాస్తవాలు తెలుసుకోకపోవడమే. ఈ ఉదాహరణలు పరిశీలించండి:
-
సైన్స్ లేదా టెక్నికల్ రంగాల్లో ఉద్యోగాలు చేయడానికి స్త్రీలు పనికిరారు అని కొంతమంది అనుకుంటారు.
-
తక్కువ కులం వాళ్లను పెళ్లి చేసుకుంటే అపవిత్రం అవుతామనే తప్పుడు అభిప్రాయం చాలామందికి ఉంది.
-
అంగవైకల్యం ఉన్న వాళ్లందరూ ఎప్పుడూ బాధగా, దిగులుగా ఉంటారని చాలామంది పొరపాటు పడతారు.
అలాంటివి నమ్మేవాళ్లు కొన్ని ఉదాహరణలు లేదా రుజువులు చూపించి తమ అభిప్రాయమే సరైనదని వాదిస్తారు. అంతేకాదు తమ అభిప్రాయాన్ని ఒప్పుకోని వాళ్లందర్నీ తెలివితక్కువ వాళ్లలా చూస్తారు.
బైబిలు సలహా
“జ్ఞానం లేకుండా ఉండడం మంచిదికాదు.”—సామెతలు 19:2.
అంటే . . . నిజానిజాలు తెలుసుకోకపోతే మనం తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటాం. వాస్తవాల్ని కాకుండా అపోహల్ని నమ్మితే, అనవసరంగా ప్రజల మీద తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకుంటాం.
వాస్తవాల్ని తెలుసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?
ప్రజల గురించి వాస్తవాలు తెలుసుకుంటే, వాళ్ల మీద జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మం. అంతేకాదు ఏదైనా ఒక వర్గం ప్రజల గురించి మనం విన్న సమాచారం తప్పు అని తెలుసుకున్నప్పుడు, మిగతా వర్గాల ప్రజల గురించి విన్న మాటల్లో కూడా నిజం ఉండకపోవచ్చని గుర్తిస్తాం.
మీరేం చేయవచ్చు?
-
సాధారణంగా ఒక వర్గం గురించి చెప్పే విషయాలు అందులోని ప్రతీ ఒక్కరికీ వర్తించవు అని గుర్తుంచుకోండి.
-
వాళ్ల గురించి మీకు అన్ని విషయాలూ తెలియకపోవచ్చు అని గుర్తించండి.
-
నమ్మదగిన వాళ్ల నుండి, నమ్మదగిన సంస్థల నుండి వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.