సైంటిస్టులు వివరించలేని విషయాలు
విశ్వంలో ఉన్న దాదాపు ప్రతీ అంశం మీద సైంటిస్టులు పరిశోధన చేశారంటారు. కానీ, ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలకు వాళ్లకింకా జవాబు దొరకలేదు.
విశ్వం ఎలా వచ్చిందో, జీవం ఎలా మొదలైందో సైంటిస్టులు వివరించగలరా? ఒక్క మాటలో చెప్పాలంటే, వివరించలేరు. కాస్మాలజీ (విశ్వశాస్త్రం) అనే సైన్స్ విభాగం, విశ్వం ఎలా వచ్చిందో వివరించగలదని కొందరు అంటారు. మార్సిలో గ్లేజర్ అనే ప్రొఫెసర్ డార్ట్‌మౌత్ కాలేజీలో ఖగోళశాస్త్రం బోధిస్తుంటారు. ఈయన ఒక అజ్ఞేయతావాది, అంటే దేవుడు ఉన్నాడని తెలుసుకోవడం అసాధ్యమని భావించే వ్యక్తి. ఆయన ఇలా అంటున్నారు: “విశ్వం ఎలా వచ్చిందో ఇప్పటిదాకా మేము అస్సలు వివరించలేకపోయాం.”
అదేవిధంగా, జీవం ఎలా పుట్టిందనే విషయం గురించి సైన్స్ న్యూస్ అనే పత్రిక ఇలా రాసింది: “భూమ్మీద జీవం ఎలా మొదలైందో ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం అనిపిస్తోంది. ఎందుకంటే, భూమి పుట్టుక గురించి తెలిపే పురాతన రాళ్లు, శిలాజాలు ఎప్పుడో అంతరించిపోయాయి.” ఈ విషయాల్ని బట్టి చూస్తే, విశ్వం ఎలా వచ్చింది, జీవం ఎలా మొదలైంది అనే ప్రశ్నలకు సైన్స్ ఇంకా జవాబు చెప్పలేకపోతోందని అర్థమౌతోంది.
అయితే మీకు ఇలాంటి కొన్ని సందేహాలు రావచ్చు: ‘జీవాన్ని ఎవరో సృష్టించివుంటే, ఆ సృష్టికర్త ఎవరు? నిజంగానే ఒక తెలివైన, ప్రేమగల సృష్టికర్త ఉన్నట్లయితే, ఆయన సృష్టించిన మనుషులు కష్టాలుపడడానికి ఎందుకు అనుమతిస్తున్నాడు? ప్రజలు రకరకాల దేవుళ్లను ఆరాధిస్తున్నా, ఆయన ఎందుకు ఏమీ అనట్లేదు? తనను ఆరాధించేవాళ్లు చెడ్డపనులు చేస్తుంటే, ఆయనెందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు?’
ఈ ప్రశ్నలన్నిటికీ సైన్స్ జవాబు ఇవ్వలేదు. అలాగని ఇవి జవాబులే దొరకని అంతుచిక్కని ప్రశ్నలేమీ కాదు. చాలామందికి వీటి జవాబులు బైబిల్లో దొరికాయి.
బైబిల్ని చదివి, అధ్యయనం చేసిన కొంతమంది సైంటిస్టులు సృష్టికర్త ఉన్నాడని నమ్ముతున్నారు. ఎందుకో తెలుసుకోవాలని ఉందా? అయితే jw.org/teలో జీవారంభం గురించిన అభిప్రాయాలు అనే వీడియో సిరీస్‌ని వెతకండి.