విశ్వం ఏం రుజువు చేస్తుంది?
ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వాన్ని చూసి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. అంతేకాదు, విశ్వం గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి కొత్తకొత్త పరికరాల్ని తయారు చేస్తూనే ఉన్నారు. వాళ్లు ఏ విషయాలు తెలుసుకున్నారు?
విశ్వం ఎవరో అమర్చినట్లు ఉంది. “ఆకాశంలో నక్షత్రవీధులు లేదా గెలాక్సీలు చెల్లాచెదురుగా కాకుండా ఎవరో అమర్చినట్లు ఉన్నాయి” అని ఆస్ట్రానమీ అనే పత్రికలో వచ్చింది. అసలు అదెలా సాధ్యం? డార్క్‌మేటర్ లేదా చీకటి పదార్థం వల్లే అది సాధ్యమైందనీ, అందులోనే అసలు రహస్యమంతా దాగి ఉందనీ సైంటిస్టులు నమ్ముతున్నారు. ఈ డార్క్‌మేటర్ “కంటికి కనిపించని ఒక ఫ్రేమ్‌లా పనిచేస్తూ . . . గెలాక్సీలను, గెలాక్సీ గుంపులను . . . వాటి స్థానంలో పట్టి ఉంచుతుందని” వాళ్లు అంటారు.
ఇంత పద్ధతిగా ఉన్న ఈ విశ్వం, సృష్టికర్త ప్రమేయం లేకుండా దానంతటదే వచ్చే అవకాశం ఉందా? 20వ శతాబ్దానికి అత్యంత గొప్ప ఖగోళ శాస్త్రవేత్తగా పేరుపొందిన అలెన్ సాండేజ్, దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఆయన ఏమన్నాడో గమనించండి:
“ఒక గందరగోళం నుండి ఇంత పద్ధతిగా ఉన్న విశ్వం రావడం అసాధ్యమని నా అభిప్రాయం. దీని వెనక ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండి ఉండాలి.”
ఈ విశ్వం ప్రాణులు జీవించడానికి అనువుగా ఉంది. ఉదాహరణకు సూర్యుడు మండే ప్రక్రియను తీసుకుందాం. సూర్యుడు మండుతూ ఉండడానికి కారణమయ్యే శక్తి చాలా బలహీనంగా ఉండివుంటే, అసలు సూర్యుడు తయారయ్యే వాడే కాదు. ఒకవేళ ఆ శక్తి చాలా బలంగా ఉండివుంటే, ఈపాటికి సూర్యుడు లేకుండా పోయేవాడు.
ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. విశ్వంలో ఇలాంటి ఎన్నో నియమాలు, ప్రాణులు జీవించడానికి భూమ్మీద తగిన వాతావరణం ఉండేలా సహాయం చేస్తున్నాయి. సైన్స్ రచయిత అనిల్ అనంతస్వామి, విశ్వంలోని భౌతిక నియమాల గురించి మాట్లాడుతూ, వీటిలో ఏ ఒక్కటి వేరుగా ఉన్నా “నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు తయారై ఉండేవి కావు. అసలు జీవం సాధ్యమయ్యేదే కాదు” అని అన్నారు.
మనుషులు జీవించడానికి సరిపోయే వాతావరణం విశ్వంలో ఉంది. భూమ్మీద ఉన్న వాతావరణం, నీటి శాతం, చంద్రుని సైజు వల్ల మనుషులు జీవించడానికి ఈ భూమి అనువైన ప్రదేశంగా మారింది. ప్రకృతి వనరులు, ఇతర ప్రాణులు ఉండడం వల్ల భూగ్రహం మాత్రమే మనుషులు జీవించడానికి సరిపోయేలా ఉందని సైంటిస్టులు కనుగొన్నట్లు నేషనల్ జియోగ్రఫిక్ పత్రిక రాసింది. a
సౌర కుటుంబం మన నక్షత్రవీధిలోని “మిగతా నక్షత్రాలకు దూరంగా ఉంది” అని ఒక రచయిత అన్నాడు. దానివల్లే భూమ్మీద ప్రాణులు జీవించి ఉండడం సాధ్యమైంది. ఒకవేళ అది మిగతా నక్షత్రాలకు దగ్గరగా ఉండివుంటే, అంటే మన నక్షత్రవీధి మధ్యలో గానీ, చివరన గానీ ఉండివుంటే అక్కడ రేడియేషన్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రాణులు జీవించి ఉండడం కష్టమయ్యేది. కానీ, నక్షత్రవీధిలో భూమి ఏ చోట ఉంటే ప్రాణులు జీవించివుండడం సాధ్యపడుతుందో, సరిగ్గా అది ఆ చోటునే ఉంది.
పాల్ డేవిస్ అనే భౌతిక శాస్త్రవేత్త, విశ్వం గురించి, భౌతిక నియమాల గురించి ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి ఇలా అన్నారు: ‘అనుకోకుండానో, విస్ఫోటనం వల్లో ఈ విశ్వంలో జీవం ఏర్పడిందని నాకు నమ్మాలని అనిపించట్లేదు. . . . జీవానికి ఏదో కారణం ఖచ్చితంగా ఉండివుంటుంది.’ విశ్వాన్ని, మనుషుల్ని దేవుడు సృష్టించాడని ఇక్కడ డేవిస్ చెప్పట్లేదు. అయితే మీరేం అనుకుంటున్నారు? ప్రాణులు జీవించడానికే ఈ విశ్వం, భూమి తయారు చేయబడ్డాయా అన్నట్టు ఉన్నాయి. వాటిని ఆ విధంగా సృష్టించబట్టే అవి అలా ఉన్నాయా?
a భూమిని, మనుషులను దేవుడు సృష్టించాడని చెప్పడం ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఆర్టికల్ ఉద్దేశం కాదు. మనుషులు జీవించడానికి భూమి అనువుగా ఉందని చెప్పడం మాత్రమే దాని ఉద్దేశం.