కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు ఏం చెప్తుంది

బైబిలు ఏం చెప్తుంది

“భూమిని, ఆకాశాన్ని సృష్టించిన రోజున వాటి చరిత్ర ఇది.” (ఆదికాండం 2:4) బైబిల్లో ఉన్న ఈ మాటలు భూమి ఎలా వచ్చిందో స్పష్టం చేస్తున్నాయి. బైబిల్లో ఉన్న విషయాలు సైన్స్‌ చెప్పే విషయాలతో సరిపోతున్నాయా? మీరే చూడండి.

సృష్టి ఆరంభంలో: దేవుడు ఆకాశాన్ని, భూమిని చేశాడు

విశ్వానికి ఒక ఆరంభం ఉందా?

ఆదికాండం 1:1 ఇలా చెప్తుంది: “మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.”

విశ్వానికి ఒక ఆరంభం లేదని అది ఎప్పుడూ ఉనికిలోనే ఉందని, పేరున్న ఎంతోమంది సైంటిస్టులు సుమారు 1950 ముందు వరకు నమ్ముతూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనల్ని గమనించాక, విశ్వానికి ఒక ఆరంభం ఉందని చాలామంది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు.

మొదట్లో భూమి ఎలా ఉండేది?

మొదట్లో భూమి “ఖాళీగా, పనికిరాకుండా,” నీళ్లతో నిండి ఉండేదని ఆదికాండం 1:2, 9 చెప్తుంది.

మనకాలంలో సైంటిస్టులు చేసిన పరిశోధనలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. ప్యాట్రిక్‌ షీ అనే బయోలజిస్టు మాట్లాడుతూ, మొదట్లో భూమ్మీద ఆక్సిజన్‌ గానీ, చెట్లు గానీ, ఊపిరి ఉన్న ప్రాణులు గానీ ఉండేవి కావని చెప్పారు. ఆస్ట్రానమీ పత్రిక కూడా ఇలా రాసింది: “మొదట్లో భూమి నీటి కుండలా ఉండేది, పొడి నేల అనేదే దాదాపు ఎక్కడా కనిపించేది కాదని కొత్త పరిశోధనల్లో బయటపడింది.”

కాలం గడిచే కొద్దీ, భూవాతావరణంలో ఎలాంటి మార్పులు జరుగుతూ వచ్చాయి?

ఆదికాండం 1:3-5 చెప్తున్నట్టు, మొట్టమొదటిసారిగా వెలుగు ప్రకాశించడం మొదలైనప్పుడు, ఆ వెలుగుకు కారణమైన సూర్యుడు గానీ, చంద్రుడు గానీ భూమ్మీద నుండి కనిపించేవి కావు. భూమి చుట్టూ దట్టమైన వాతావరణం ఉండడం వల్ల అవి కనిపించడానికి కొంతకాలం పట్టింది.—ఆదికాండం 1:14-18.

రోజుకు 24 గంటలు ఉండే ఆరు రోజుల్లో సృష్టి తయారు చేయబడిందని బైబిలు చెప్పట్లేదు

మొదట్లో భూమ్మీద చాలా తక్కువ కాంతి మాత్రమే ప్రసరించేదని స్మిత్‌సోనియన్‌ వాతావరణ రీసెర్చ్‌ సెంటర్‌ తెలిపింది. ఎందుకో తెలుసా? “భూమి తయారైన కొత్తలో మీథేన్‌ బిందువులు దట్టమైన పొరలా భూమిని కప్పివుంచాయి. కొంతకాలానికి ఆ బిందువులు పోయాయి, ఆకాశం నీలంగా మారింది” అని ఆ రీసెర్చ్‌ సెంటర్‌ వివరించింది.

భూమ్మీదున్న జీవుల్లో మొదట ఏవి పుట్టాయి?

ఆదికాండం 1:20-27 వచనాల ప్రకారం, మొదట చేపలు, తర్వాత పక్షులు, ఆ తర్వాత నేలమీద జీవించే జంతువులు సృష్టించబడ్డాయి; చివరిగా మనుషులు తయారు చేయబడ్డారు. భూమ్మీద క్షీరదాలు (mammals) పుట్టడానికి ఎంతోకాలం ముందునుండే చేపలు ఉన్నాయని, మనుషులు ఆ తర్వాత చాలాకాలానికి ఉనికిలోకి వచ్చారని సైంటిస్టులు కనుగొన్నారు.

కాలం గడుస్తుండగా ప్రాణుల్లో మార్పులు జరగవని బైబిలు చెప్పట్లేదు

బైబిలు ఏమని చెప్పట్లేదు?

బైబిలు చెప్తున్న విషయాలు, సైంటిస్టులు కనుగొన్న విషయాలతో సరిపోవట్లేదని కొందరు అంటారు. బైబిలు చెప్తున్న విషయాల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే వాళ్లు అలాంటి అభిప్రాయానికి వచ్చారు.

విశ్వం లేదా భూమి 6,000 ఏళ్ల క్రితమే తయారైందని బైబిలు చెప్పట్లేదు. ఆకాశం, భూమి “మొదట్లో” సృష్టించబడ్డాయని మాత్రమే అది చెప్తుంది. (ఆదికాండం 1:1) ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల క్రితం అవి ఉనికిలోకి వచ్చాయనే విషయాన్ని బైబిలు చెప్పట్లేదు.

రోజుకు 24 గంటలు ఉండే ఆరు రోజుల్లో సృష్టి తయారు చేయబడిందని బైబిలు చెప్పట్లేదు. ఈ సందర్భంలో “రోజు” అనే పదం, 24 గంటల్ని కాదుగానీ ఇంకా ఎక్కువ కాలాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, యెహోవా a దేవుడు భూమిని, ఆకాశాన్ని సృష్టించిన “రోజున” అన్నప్పుడు, ఆరు సృష్టి రోజుల్ని అంటే భూమి, అందులోని ప్రాణులు (ఆదికాండం 1వ అధ్యాయంలో కనిపిస్తుంది) తయారవడానికి పట్టిన మొత్తం సమయాన్ని సూచిస్తుంది. (ఆదికాండం 2:4) కాబట్టి ప్రాణులు జీవించేలా భూమిని సిద్ధం చేయడానికి, ఆ తర్వాత వివిధ ప్రాణుల్ని సృష్టించడానికి పట్టిన ఆరు సృష్టి రోజులు, 24 గంటలు ఉండే ఆరు రోజుల్ని సూచించట్లేదు; బదులుగా మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సమయాన్ని సూచిస్తున్నాయి.

కాలం గడుస్తుండగా ప్రాణుల్లో మార్పులు జరగవని బైబిలు చెప్పట్లేదు. జంతువులు “వాటివాటి జాతుల ప్రకారం” సృష్టించబడ్డాయని ఆదికాండం పుస్తకం చెప్తుంది. (ఆదికాండం 1:24, 25) ‘జాతులు’ అనే పదాన్ని బైబిలు విస్తృతమైన అర్థంలో ఉపయోగిస్తుంది. కాబట్టి ఫలానా జాతి జంతువులు అన్నప్పుడు, ఏదో ఒక రకం జంతువులు కాదుగానీ, ఆ జాతికి చెందిన రకరకాల జంతువులు అని అర్థం. కాలం గడిచేకొద్దీ వాటిలో ఏదైనా ఒక రకం జంతువుల్లో మార్పులు జరిగి ఒక కొత్త రకం తయారుకావచ్చు, కానీ దాని జాతిలో మాత్రం ఏ మార్పూ ఉండదు.

మీకేమనిపిస్తుంది?

విశ్వం ఎలా వచ్చింది, మొదట్లో భూమి ఎలా ఉండేది, జీవం ఎలా మొదలైంది అనే ప్రశ్నలకు బైబిలు సూటిగా, కరెక్ట్‌గా జవాబు ఇచ్చిందని మనం చూశాం. అయితే, వాటిని ఒకరు సృష్టించారని బైబిలు చెప్తున్న మాట కూడా సరైనదే కావచ్చా? “మనుషులను మించిన ఏదో గొప్ప శక్తి వల్ల జీవం మొదలైందనే విషయాన్ని, ఆధునిక సైన్స్‌ పరిశోధనలు కూడా అంగీకరిస్తున్నాయి” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్తోంది. b

a దేవుని పేరు యెహోవా అని బైబిలు చెప్తుంది.

b సృష్టికర్త ఉన్నాడనే అభిప్రాయాన్ని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రచారం చేయట్లేదు.