కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డూమ్స్‌డే క్లాక్‌ ఊహాగానాలు నిజం అవ్వవు, ఎందుకంటే దేవుడు ఈ భూమి మీద మనుషులందరికీ మంచి భవిష్యత్తు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు

పత్రిక ముఖ్యాంశం | ఈ ప్రపంచం నాశనం అయిపోతుందా?

బైబిల్‌ ఏమి చెప్తుంది?

బైబిల్‌ ఏమి చెప్తుంది?

లోకంలో ఇప్పుడున్న భయంకరమైన పరిస్థితి గురించి చాలా సంవత్సరాల ముందే బైబిల్‌ చెప్పింది. మనుషుల కోసం ఒక మంచి భవిష్యత్తు ఉందని కూడా బైబిల్‌ చెప్పింది. బైబిల్‌ చెప్తున్న విషయాలను వెంటనే కొట్టిపారేయలేము ఎందుకంటే బైబిల్లో జరుగుతాయని ముందే చెప్పిన విషయాలు ఇప్పటివరకు ఖచ్చితంగా జరిగాయి.

ఉదాహరణకు, కొన్ని పరిశీలిద్దాం:

  • “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, భూకంపాలు వస్తాయి.”—మత్తయి 24:7.

  • “చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: స్వార్థపరులు, డబ్బును ప్రేమించేవాళ్లు, గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, దైవదూషణ చేసేవాళ్లు, అమ్మానాన్నలకు లోబడనివాళ్లు, కృతజ్ఞత లేనివాళ్లు, నమ్మకంగా ఉండనివాళ్లు, మమకారం లేనివాళ్లు, మొండివాళ్లు, లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు, నమ్మకద్రోహులు, మూర్ఖులు, గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు, దేవుణ్ణి కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు.”—2 తిమోతి 3:1-4.

కొంతమంది చెప్తున్నట్లు లోకం ఎవ్వరూ ఆపలేని విధంగా చాలా ఫాస్ట్‌గా తిరుగుతుందని ఆ ప్రవచనాలు వివరిస్తున్నాయి. అంటే మన ప్రపంచం ఎవరూ ఆపలేని విధంగా ఉంది. మనుషుల చేయి దాటిపోయింది. బైబిల్‌ ప్రకారం, శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి కావాల్సిన జ్ఞానం, శక్తి మనిషికి లేవు అనేది నిజం. ఈ విషయాలు కొన్ని లేఖనాల్లో ఇలా ఉన్నాయి:

  • “ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.”—సామెతలు 14:12.

  • “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.”—ప్రసంగి 8:9.

  • ‘తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు.’—యిర్మీయా 10:23.

లోకాన్ని దాని ఇష్టానికి వదిలేస్తే, ఈ ప్రపంచం బహుశా పెద్ద నాశనాన్ని చూడాల్సి వస్తుంది. కానీ జరిగేది అది కాదు! ఎందుకు? ఎందుకో బైబిలు ఇలా చెప్తుంది:

  • “భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన [దేవుడు] దానిని పునాదులమీద స్థిరపరచెను.”—కీర్తన 104:5.

  • “తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.”—ప్రసంగి 1:4.

  • “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.

  • “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 72:16.

ఈ బైబిల్‌ బోధలు మనకు స్పష్టమైన జవాబులు ఇస్తున్నాయి. మనుషులు కాలుష్యం వల్ల, ఆహారం-నీళ్లు లేకపోవడం వల్ల లేదా ప్రపంచాన్ని వణికించే వ్యాధి వల్ల చనిపోరు. ప్రపంచం అణు ఆయుధాల చేతిలో నాశనం అవ్వదు. ఎందుకు? భూమి భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. మనుషులు వాళ్ల ఇష్టప్రకారం ఉండే స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడు. కానీ వాళ్లు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చే పర్యవసానాలను మాత్రం వాళ్లు అనుభవించాలి. (గలతీయులు 6:7) ప్రపంచం పట్టాలు తప్పిన రైలులా అదుపు చేయలేని స్థితిలో నాశనం వైపుకు దూసుకెళ్తుంది. మనుషులు వాళ్లకు వాళ్లు పూర్తిగా నష్టం చేసుకోలేరు. ఎందుకంటే దేవుడు ఆ విషయంలో హద్దులు లేదా పరిమితులు పెట్టాడు.—కీర్తన 83:18; హెబ్రీయులు 4:13.

అంతేకాదు దేవుడు ఇంకా ఎక్కువే చేయబోతున్నాడు. ఆయన “బహు క్షేమము” తీసుకొస్తాడు. (కీర్తన 37:11) బంగారు భవిష్యత్తుకు సంబంధించి ఈ ఆర్టికల్‌లో వివరించిన విషయాలు లక్షలమంది యెహోవాసాక్షులు బైబిల్‌ స్టడీ చేసి నేర్చుకున్న విషయాల్లో కొన్ని మాత్రమే.

యెహోవాసాక్షులు భూవ్యాప్తంగా వేర్వేరు వయసులు, వేర్వేరు నేపథ్యాలు ఉన్న స్త్రీ, పురుషుల సమాజం. వాళ్లు ఒక నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తారు, ఆయన పేరు యెహోవా అని బైబిల్లో ఉంది. వాళ్లు భవిష్యత్తు గురించి భయపడరు, ఎందుకంటే, బైబిలు ఇలా చెప్తుంది: “ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా—యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.”—యెషయా 45:18.

భూమి భవిష్యత్తు గురించి, మనుషుల భవిష్యత్తు గురించి బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూశాం. ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషురులో 5వ పాఠం చూడండి. దీన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు, www.dan124.com వెబ్‌సైట్‌లో కూడా ఇది అందుబాటులో ఉంది

ఇంకా మీరు దేవుడు భూమిని ఎందుకు చేశాడు? అనే వీడియో కూడా చూడవచ్చు, అది www.dan124.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. (ప్రచురణలు > వీడియోలు చూడండి)