రక్తమార్పిడులు—అనే వివాదాంశానికున్న దీర్ఘకాల చరిత్ర
రక్తమార్పిడులు—అనే వివాదాంశానికున్న దీర్ఘకాల చరిత్ర
“నేడు ఎర్ర రక్త కణాలే క్రొత్త మందైతే, దానికి లైసెన్స్ సంపాదించడం చాలా కష్టమౌతుంది.”—డా. జెఫ్రీ మకలో.
అది 1667 చలికాలం. ఫ్రాన్స్‌లోని కింగ్ లూయీస్ XIV గారి ప్రముఖ వైద్యుడైన జేన్-బాటీస్ట్ డనీ దగ్గరికి, హింసాత్మకంగా మారిన ఆన్‌ట్వాన్ మోరా అనే పిచ్చివాడిని తీసుకువచ్చారు. ఆవు రక్తాన్ని ఎక్కించడమే మోరా జబ్బుకు డనీ దగ్గర ఉన్న ఆదర్శవంతమైన “చికిత్స.” ఆవు రక్తాన్ని ఎక్కిస్తే, ఈ రోగి శాంతస్వభావి అవుతాడని ఆయన అనుకున్నాడు. అయితే మోరాకు ఆ చికిత్స వల్ల ప్రయోజనం కలుగలేదు. నిజానికి, రెండవసారి ఆవు రక్తాన్ని ఎక్కించినప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడింది. కానీ త్వరలోనే ఈ ఫ్రాన్స్ దేశస్థుడికి మళ్ళీ పిచ్చి పట్టింది, ఎంతో కాలం గడవక ముందే ఆయన మరణించాడు.
నిజానికి పాషాణ విషంవల్లే మోరా చనిపోయాడని తర్వాత నిర్ధారించబడినప్పటికీ, జంతు రక్తంతో డనీ చేసిన ప్రయోగాలను గురించి ఫ్రాన్స్‌లో గొప్ప వివాదం తలెత్తింది. చివరికి, 1670లో, ఈ ప్రక్రియ నిషేధించబడింది. కాలక్రమేణా, ఇంగ్లీష్ పార్లమెంటూ, పోపూ కూడా ఈ ప్రక్రియను నిషేధించారు. తర్వాతి 150 సంవత్సరాల వరకూ రక్త మార్పిడి ప్రక్రియ మరుగున పడిపోయింది.
తొలినాటి ప్రమాదాలు
19వ శతాబ్దంలో, రక్త మార్పిడులు తిరిగి రంగప్రవేశం చేశాయి. ఆంగ్లేయుడూ ప్రసూతి వైద్యుడూ అయిన జేమ్స్ బ్లండల్ ఈ పునరుద్ధరణకు నేతృత్వం వహించాడు. మెరుగుపరచిన పద్ధతులతో మెరుగైన ఉపకరణాలతో, మానవ రక్తం మాత్రమే ఉపయోగించాలని నొక్కి చెబుతూ, రక్తమార్పిడులను బ్లండల్ మళ్లీ వెలుగులోకి తెచ్చాడు.
కానీ, 1873లో, ఎఫ్. గెజెలీయస్ అనే పోలండ్ వైద్యుడు, భయానకమైన ఒక విషయాన్ని కనుగొనడంతో రక్తమార్పిడుల పునరుద్ధరణ వేగం తగ్గింది. రక్తమార్పిడులు జరిగినవారిలో సగం కన్నా ఎక్కువ మంది రక్తమార్పిడుల ఫలితంగా చనిపోయారన్నదే ఆ భయానక విషయం. ఈ విషయాన్ని తెలుసుకుని, ప్రముఖ వైద్యులు రక్తమార్పిడులను నిందించడం మొదలుపెట్టారు. రక్తమార్పిడులకున్న జనాదరణ మరొకసారి తగ్గుముఖం పట్టింది.
తర్వాత, 1878లో, ఫ్రాన్స్‌వాడైన వైద్యుడైన జోర్జస్ హయమ్ ఒక సలైన్ సొల్యూషన్‌కి అంతిమ రూపమిచ్చాడు. అది రక్తానికి ప్రత్యామ్నాయంగా పనిచేయగలదని ఆయన అన్నాడు. రక్తంలాగా ఈ సలైన్ వల్ల సైడ్ ఎఫక్ట్‌లు కలుగవు. అది గడ్డ కట్టదు. దానిని సులభంగా రవాణా చేయవచ్చు. హయమ్ సలైన్ విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చిందన్నది అర్థం చేసుకోగల విషయమే. అయితే, వింతైన విషయమేమిటంటే, రక్తానికి మళ్ళీ జనాదరణ లభించింది. ఎందుకని?
1900లో, ఆస్ట్రియన్ పెతోలజిస్ట్ అయిన కార్ల్ లాండ్‌స్టెయినర్ రక్తంలో కూడా వివిధ రకాలు ఉన్నాయని, ఒక రకం రక్తం మరొక రకం రక్తంతో ప్రతిసారీ కలిసిపోలేదని ఆయన కనుగొన్నాడు. గతంలో జరిగిన రక్తమార్పిడుల వల్ల ప్రజలు చనిపోవడంలో ఆశ్చర్యం లేదు ! రక్త దాత యొక్క రక్తం, ఎక్కించుకునే వ్యక్తి రక్తంతో కలిసిపోగలదా అన్నది నిశ్చయపరచుకుంటే, అలాంటి మరణాలు సంభవించవు. ఈ పరిజ్ఞానంతో, వైద్యులు రక్తమార్పిడులు చేయడంలో తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. ఈలోగా, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.
రక్త మార్పిడులూ, యుద్ధమూ
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, గాయపడిన సైనికులకు రక్తం యథేచ్ఛగా ఎక్కించబడింది. నిజమే, రక్తం త్వరగా గడ్డ కడుతుంది, మునుపు, రక్తాన్ని రణరంగంలోకి రవాణా చేయడం అసాధ్యంగా ఉండేది. అయితే 20వ శతాబ్దపు తొలి భాగంలో, న్యూయార్క్ సిటిలోని మౌంట్ సైనాయ్ హాస్పిటల్‌లోని డా. రిచర్డ్ లూసన్, ప్రయోగాలు చేసి, రక్తం గడ్డకట్టడాన్ని నివారించే పదార్థాన్ని కనుగొనడంలో విజయం సాధించారు. ఈ పదార్థాన్ని సోడియమ్ సిట్రేట్ అని అంటారు. ఈయన కనుగొన్న విషయాన్ని ఒక అద్భుతంగా కొందరు వైద్యులు ఎంచారు. “ఇది సూర్యుడ్ని నిలబెట్టడంలాంటిదే” అని డా. బర్ట్రమ్ ఎమ్. బర్న్‌హైమ్ వ్రాశారు. ఆయన ఆ కాలంనాటి విశిష్ట వైద్యుడు.
రెండవ ప్రపంచ యుద్ధంతో, రక్త మార్పిడుల డిమాండ్ పెరిగింది. “ఇప్పుడు రక్తం ఇవ్వండి,” “మీ రక్తం ఆయనను కాపాడగలదు,” “ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు, మీరు మీ రక్తాన్ని ఇస్తారా?” వంటి నినాదాలు గల పోస్టర్లు అనేకానేకం కనిపించాయి. రక్తాన్ని ఇవ్వండి అన్న అభ్యర్థనకు ఎంతో మంది ప్రతిస్పందించారు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు, అమెరికాలో దాదాపు 1,30,00,000 యూనిట్ల రక్తం దానం చేయబడింది. లండన్‌లో 68,500 గ్యాలన్‌ల కన్నా ఎక్కువ రక్తం సేకరించబడి, పంపిణీ చేయబడింది.
నిజమే, రక్త మార్పిడుల వల్ల తర్వాత అనేక ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి అన్నది తర్వాత స్పష్టమైంది.రక్తమార్పిడుల వలన కలిగిన రుగ్మత
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, వైద్య రంగంలో సాధించిన గొప్ప కార్యాలు, మునుపు ఊహించను కూడా లేని శస్త్రచికిత్సలను సాధ్యం చేశాయి. దాని ఫలితంగా, సంవత్సరానికి అనేక కోట్ల డాలర్ల లాభాలను ఆర్జించే భూగోళవ్యాప్త పరిశ్రమ ఉనికిలోకి వచ్చింది, అది రక్తమార్పిడుల కోసం రక్తాన్ని సరఫరా చేసే పరిశ్రమ. డాక్టర్లు రక్తమార్పిడులను ప్రామాణిక ఆపరేషన్ ప్రక్రియగా పరిగణించనారంభించారు.
అయితే, త్వరలోనే, రక్తమార్పిడి సంబంధిత రుగ్మతను గురించిన చింత మొదలైంది. ఉదాహరణకు కొరియాలో యుద్ధం జరుగుతున్న సమయంలో ప్లాస్మాను ఎక్కించుకున్నవారిలో దాదాపు 22 శాతం మందికి తర్వాత హెపటైటిస్ సోకింది. అంటే, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు రక్తం ఎక్కించుకోగా హెపటైటిస్ సోకినవారి సంఖ్యకన్నా మూడు రెట్లు ఎక్కువన్నమాట. 1970లలో, రక్తమార్పిడుల వల్ల సంవత్సరానికి 3,500 మందికి హెపటైటిస్ సోకినట్లు యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అంచనావేసింది. అంత కన్నా పది రెట్లు ఎక్కువ మందికి హెపటైటిస్ సోకినట్లు ఇతరులు అంచనావేస్తున్నారు.
మంచి స్క్రీనింగ్ మూలంగా, దాతలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ద్వారా, హెపటైటిస్ బి సోకిన కేసుల సంఖ్య తగ్గింది. అయితే, కొన్నిసార్లు మరింత ప్రాణాంతకం కాగల క్రొత్తదైన హెపటైటిస్ సి విలయతాండవం చేసింది. నలభై లక్షల మంది అమెరికన్‌లకు ఈ వైరస్ సోకిందని, వీరిలో అనేక లక్షల మందికి అది సోకింది రక్తమార్పిడి వల్లేనని అంచనా వేయబడింది. నిజమే, బాగా పరిశోధించిన తర్వాత మాత్రమే రక్తాన్ని ఎక్కించడం హెపటైటిస్ సి ప్రాబల్యాన్ని తగ్గించింది. అయినప్పటికీ, క్రొత్త ప్రమాదాలు పొంచి ఉండవచ్చనీ, అంతా జరిగిన తర్వాతనే అది తెలుస్తుండవచ్చనీ కొందరు భయపడతారు.
విభ్రాంతికరమైన మరో విషయం: హెచ్‌ఐవితో కలుషితమైన రక్తం
రక్తం ఎయిడ్స్‌కి దారితీసే హెచ్‌ఐవి వైరస్‌తో కలుషితమై ఉండగలదని 1980లలో కనుగొనబడింది. తాము సరఫరా చేసే రక్తం ఈ వైరస్‌తో కలుషితమై ఉంటుందా అన్నది పరిశీలించడానికి రక్త బ్యాంకర్లు మొదట్లో ఇష్టపడలేదు. అనేకులు హెచ్‌ఐవి ప్రమాదాన్ని గురించి అనుమానంగా చూశారు. “వాళ్ళు విన్నారు. కానీ నమ్మలేదు” అని డా. బ్రూస్ ఇవట్ అభిప్రాయపడుతున్నారు.
అయినప్పటికీ, అనేక దేశాల్లో విభ్రాంతికరమైన ఒక విషయం—హెచ్‌ఐవితో కలుషితమైన రక్తం ఎక్కించడం జరిగిందన్న విషయం—బయటపడింది. ఫ్రాన్స్‌లో, 1982 నుండి 1985 మధ్యకాలంలో రక్తం ఎక్కించుకున్న 6,000 నుండి 8,000 మందికి హెచ్‌ఐవి సోకింది అని అంచనా. ఆఫ్రికాలో పది శాతం హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌లకూ, పాకిస్తాన్‌లోని 40 శాతం ఎయిడ్స్ కేసులకూ కారణం రక్తమార్పిడులేనని చెప్పబడుతుంది. నేడు అభివృద్ధి చెందిన దేశాల్లో మెరుగైన స్క్రీనింగ్ పద్ధతుల మూలంగా రక్తమార్పిడుల ద్వారా హెచ్‌ఐవి సోకడం అరుదైంది. అయినప్పటికీ, స్క్రీనింగ్ ప్రోసెస్ లేని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, రక్తమార్పిడి ఒక సమస్యగానే కొనసాగుతోంది.
ఇటీవలి సంవత్సరాల్లో, రక్తరహిత మందుల్లోను, శస్త్రచికిత్సలోను ఆసక్తి ఎందుకు పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ ఇది సురక్షితమైన ప్రత్యామ్నాయమేనా?
[6వ పేజీలోని బాక్సు]
రక్తమార్పిడులకు వైద్య ప్రమాణం అంటూ ఏమీ లేదు
ప్రతి సంవత్సరం, కేవలం అమెరికాలోనే, 30,00,000 మంది రోగులకు 1,10,00,000 కన్నా ఎక్కువ యూనిట్ల ఎర్ర రక్త కణాలను ఎక్కిస్తున్నారు. ఇన్ని యూనిట్లు లెక్కించబడుతున్నదాని దృష్ట్యా, రక్తం ఎక్కించే విషయంలో డాక్టర్లకు ఖచ్చితమైన ఒక ప్రమాణం ఉండి ఉండవచ్చని ఒకరు అనుకోవచ్చు. అయితే, అలా “రక్తం ఎక్కించే విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు మార్గదర్శనమిచ్చే” సమాచారం డాక్టర్ల దగ్గర అంతగా లేదు అన్నది ఆశ్చర్యకరం అని ద న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ పేర్కొంటోంది. వాస్తవానికి రక్తం ఎక్కించే పద్ధతుల్లో చాలా వైవిధ్యాలున్నాయి. దేన్ని ఎక్కించాలి, ఎంత ఎక్కించాలి అన్నది మాత్రమే కాక, అసలు ఎక్కించడం అవసరమా అన్నది నిర్ణయించడంలో కూడా వివిధ పద్ధతులున్నాయి. “రక్తం ఎక్కించడమన్నది రోగిని బట్టి కాక వైద్యుడ్ని బట్టి ఉంటుంది” అని ఆక్టా అనెస్తీసియోలోజికా బెల్‌జీకా అనే మెడికల్ పత్రిక అంటోంది. పై విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, “66 శాతం మార్పిడులు అనుచితంగా జరుగుతున్నాయని అంచనా వేయబడింది” అని ద న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురించబడిన ఒక అధ్యయనం కనుగొనడంలో ఆశ్చర్యమేమీ లేదు.
[5వ పేజీలోని చిత్రం]
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రక్తం డిమాండ్ పెరిగింది
[చిత్రసౌజన్యం]
Imperial War Museum, London
U.S. National Archives photos