అద్భుతమైన ఎంపరర్
అద్భుతమైన ఎంపరర్
పెంగ్విన్లలో అన్నిటికన్నా పెద్దదైన ఎంపర్ పెంగ్విన్ ఎత్తు, ఒక మీటరుపైగా ఉంటుంది, దాని బరువు 40 కిలోల వరకూ ఉంటుంది. అంటార్కిటికాలో అంధకారం అలుముకునే శీతాకాలంలో మిగతా పెంగ్విన్లు ఉత్తర దిశలో పయనిస్తుంటే, ఎంపరర్లు మాత్రం దక్షిణ దిశలో—అంటార్కిటికా దిశలో పయనిస్తాయి! ఎందుకని? పిల్లల్ని కనటానికి అన్న జవాబు మీకు ఆశ్చర్యాన్ని కల్గించవచ్చు.
ఆడ ఎంపరర్ గ్రుడ్డు పెట్టినప్పుడు మగది వెంటనే దాన్ని మంచులో నుండి ఎత్తి తన పాదాలపైన పెట్టుకుంటుంది. తర్వాత దాన్ని తన పొత్తికడుపు దగ్గరున్న పిల్లల సంచి క్రింద జాగ్రత్తగా పొదువుకుంటుంది. ఇక ఆడది ఆహారం నిమిత్తం సముద్రంలోకి వెళ్తుంది. వాతావరణం అతి తీవ్రంగా ఉన్నప్పుడు మగది తన శరీరంలోని క్రొవ్వుపై ఆధారపడి జీవిస్తూ 65 రోజులపాటు గ్రుడ్డును పొదుగుతుంది. గంటకి 200 కిలోమీటర్ల వేగానికి చేరుకోగల మంచు తుపానులు చెలరేగుతున్నప్పుడు తమ శరీరంలోని ఉష్ణాన్ని కాపాడుకోవడానికి ఈ తెలివైన ప్రాణులు పెద్ద సమూహాలుగా దగ్గర చేరతాయి. ఒకదానికొకటి అతుక్కుని ఉన్న గుంపులో లోపలివి వంతులవారిగా కొంతసేపు బయటికి వచ్చి తుపాను గాలి తమ వీపులకు తగిలేలా నిలబడతాయి.
ఆడది సరిగ్గా తిరిగి వచ్చేసరికి గ్రుడ్డులోంచి పిల్ల బయటికి వస్తుంది, అది అద్భుతమైన టైమింగ్. కానీ అది ఒకేలా కన్పించే వేలాది పెంగ్విన్లలో తన జతను ఎలా కనుగొంటుంది? పాట ద్వారా. తొలిసారి జతకట్టినప్పుడు ఈ జంట ఒకరికోసం ఒకరు పాడుకున్న పాటలు తమ తమ జ్ఞాపకాల పొరల్లో జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకునివున్నాయి. ఇప్పుడు ఆడువి తిరిగివచ్చాయి గనుక, ఆడువీ మగవీ కలిసి తమ హృదయాలను విప్పి గానం చేస్తాయి. వీటి బెకబెకలు విని మనుషులు తికమకలు పడతారేమో గాని ఈ ఎంపరర్లు మాత్రం తమ జోడీలను త్వరలోనే కనుగొంటాయి. అప్పుడే పుట్టిన పిల్లల్ని అనిష్టంతోనే అప్పగించిన అనంతరం ఆకలితో అలమటిస్తున్న మగవి అంగలు వేసుకుంటూ కడుపులపై జారుకుంటూ ఆహారం కోసం నీటికోసం అన్వేషిస్తూ దాదాపు 75 కిలోమీటర్ల దూరం వెళ్తాయి.
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
By courtesy of John R. Peiniger