కంటికి కనిపించేవాటిని మించి మీరు చూస్తారా?
కంటికి కనిపించేవాటిని మించి మీరు చూస్తారా?
రోడ్డు మరీ వంపుగా ఉన్నప్పుడు డ్రైవర్లకు సాధారణంగా అటునుండి వస్తున్న వాహనాలు కనబడవు. కానీ ఆ వంపు దగ్గర పెట్టిన అద్దం సహాయంతో ఎదురుగా వస్తున్న వాహనాల్ని గుర్తించవచ్చు, తద్వారా యాక్సిడెంట్లను నివారించవచ్చు. అలాగే, మానవులు నిజానికి అదృశ్య సృష్టికర్తను చూడలేరు. మరి ఒక అదృశ్య సృష్టికర్త ఉన్నాడని తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా?
మనం చూడలేని వాటిని ఎలా గ్రహించగలమో మొదటి శతాబ్దంలోని ఒక రచయిత పేర్కొన్నాడు. ఆయనిలా వ్రాశాడు: “[దేవుని] అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.”—రోమీయులు 1:20.
ఒక్కసారి ఆలోచించండి. సృష్టించే విషయంలో మానవ సామర్థ్యానికి మించిన, మన చుట్టూ ఉన్న వస్తువుల్లో ప్రతిఫలిస్తున్న మేధాశక్తిని మీరు చూస్తున్నారా? అలాంటి వస్తువులు మానవుడి కన్నా ఉన్నతమైన వాడు ఉన్నాడని మీరు మీ “గ్రహణ నయనాల”తో చూసేలా సహాయం చేస్తున్నాయా? మనం కొన్ని ఉదాహరణల్ని పరిశీలిద్దాము.—ఎఫెసీయులు 1:18, కింగ్ జేమ్స్ వెర్షన్.
సృష్టి నుండి నేర్చుకోవడం
చంద్రుడు లేనప్పుడు రాత్రిపూట ఆకాశమంతా ప్రకాశవంతమైన నక్షత్రాలతో నిండిపోయి ఉండడం మీరెప్పుడైనా చూశారా, చూసి ఆశ్చర్యపోయారా? “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది” అని అచ్చెరువొందాడు ప్రాచీన కాలంలో ఆకాశాన్ని పరిశీలించిన ఒక వ్యక్తి. “నీ చేతిపనియైన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?” అని ధ్యానపూర్వకంగా అన్నాడా వ్యక్తి.—కీర్తన 8:3, 4; 19:1.
మానవులు కాపీ చెయ్యలేనంత గొప్ప రీతిలో ఉన్న సృష్టి అద్భుతాలను
చూసి మనం అచ్చెరువొందడం మినహా ఏమీ చేయలేము. ప్రసిద్ధిచెందిన ఒక కవిత్వంలో ఒక వచనం ఇలా ఉంది: “దేవుడు మాత్రమే చెట్టును చేయగలడు.” అయితే అంతకన్నా ఎంతో అద్భుతమైనది శిశువు సృష్టి. ఇందుకు తల్లిదండ్రుల నుండి ఎటువంటి సృష్టిపరమైన నిర్దేశకాలూ అవసరం ఉండవు. తండ్రి నుండి ఒక శుక్రకణము, తల్లి నుండి ఒక అండము ఐక్యమైనప్పుడు బిడ్డను ఉత్పత్తి చేయడానికిగాను క్రొత్తగా ఏర్పడిన డిఎన్ఎలో వెంటనే ప్లాన్లు వేయబడతాయి. డిఎన్ఎలో ఉండే ఆదేశాల్ని గనుక “ఒకవేళ వ్రాసినట్లైతే, 600 పేజీలుగల వెయ్యి పుస్తకాలు నిండిపోతాయి” అని శాస్త్రజ్ఞులు చెబుతారు.ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా ముందుకు వెళ్తే, ఈ తొలి కణం రెండుగా విడిపోతుంది, అటు తర్వాత నాలుగు, తర్వాత ఎనిమిది, ఇలా కొనసాగుతుంది. దాదాపు 270 రోజుల తరువాత, 200కన్నా ఎక్కువ రకాలకు చెందిన కోట్ల జీవ కణాలతో చక్కని బిడ్డ జన్మిస్తాడు. ఇన్ని రకాల కణాల్ని చేయడానికీ, అదీ సరిగ్గా సమయానికి చేయడానికీ కావాల్సిన సమాచారం అంతా ఆ మొదటి కణంలో ఉందన్న తలంపే విభ్రాంతిని కలిగిస్తోంది కదూ! మీరు మన సృష్టికర్తను స్తుతించేందుకు కదిలించబడడం లేదా? కీర్తనల గ్రంథకర్త తన స్తుతుల్ని ఎలా చెల్లించాడో చూడండి: “నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి; నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.”—కీర్తన 139:13-16.
ఈ “అద్భుతాల్ని” అధ్యయనం చేసినవారు ఒక విధమైన భయంతో కూడిన ఆశ్చర్యానికి లోనౌతారు. మునుపు చికాగో అండ్ ఇల్లినాయిస్ స్టేట్ మెడికల్ సొసైటీస్కు అధ్యక్షునిగా ఉన్న డాక్టర్ జేమ్స్ హెచ్. హట్టన్, “ఏ సమాచారం అయితే పునరుత్పత్తి అవ్వాలని తొలి కణం కోరుకుంటుందో ఆ సమాచారాన్ని తన తర్వాతి కణాలకు అందజేసే దాని మాయా సామర్థ్యం” తనలో ఎంతో ఆశ్చర్యాన్ని నింపింది అని అంటూ ఇంకా ఇలా అంటున్నాడు: “మా పరిశోధక శాస్త్రజ్ఞులు ఇలాంటి విషయాల్ని కనుగొనగల్గడం చాలా అద్భుతం. కానీ ఈ అసాధారణమైన ప్రక్రియ కోసం నిశ్చయంగా ఎంతో మేధస్సుగల ఒక దేవుడు ప్రణాళిక వేసివుంటాడు.”
డాక్టర్ హట్టన్ ఇలా కొనసాగిస్తున్నాడు: “నా సబ్స్పెషాలిటీ ఎండోక్రైనాలజీ, అంటే ఎండోక్రైన్ గ్రంథుల విధుల్నీ ఆ గ్రంథుల్లోని క్రమరాహిత్యాల్నీ అధ్యయనం, కీలకమైన ఈ నిర్మాణాల్లోని అద్భుతమైన సంక్లిష్టతకూ అవి నిర్వర్తించే విధులకూ ఒక దైవిక శక్తే కారణమై ఉంటుందన్న దృఢ నిశ్చయానికి బలాన్నిస్తుంది.” ఆయనిలా ముగింపుకు వచ్చాడు: “ఈ అద్భుతాల్ని గురించి ధ్యానించడం, సర్వశక్తుడు సర్వజ్ఞుడు అయిన ఎవరో ఒక వ్యక్తి ఈ విశ్వానికి ప్రణాళికలు వేసి సృష్టించాడనీ, దానికి గమనాన్నిచ్చి దానిపై పర్యవేక్షణ చేస్తున్నాడనీ నమ్మడానికి ఒప్పింపచేసే కారణాన్ని అందిస్తున్నట్టు నాకనిపిస్తుంది.”
ఈ విధంగా వ్యాఖ్యానాల్ని చేసిన తర్వాత డాక్టర్ హట్టన్ ఇలా అడుగుతున్నాడు: “ప్రతి పిచ్చుక నేలను రాలడాన్ని గమనించే వ్యక్తిత్వమున్న దేవుడేనా ఆయన?” దానికి జవాబుగా ఇలా అంటున్నాడాయన: “ఎందుకోగాని నేను దాన్ని సందేహిస్తాను. ఆయన ఏమాత్రం ప్రాముఖ్యంకాని నా దైనందిన కార్యకలాపాలపట్ల అవధానాన్ని ఉంచుతాడని కూడా నేన్నమ్మను.”
ఈ సృష్టి “అద్భుతాల్లో” మేధాశక్తి స్పష్టంగా కన్పిస్తుందని అనేకమంది అంగీకరించినా, మానవజాతిపట్ల శ్రద్ధను చూపించే వ్యక్తిత్వమున్న ఒక దేవుని ఉనికిని ఎందుకు ప్రశ్నిస్తారు?
దేవుడు మనపట్ల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
అసలు దేవుడంటూ ఉంటే, మానవులు ఇంతగా బాధల్ని అనుభవించేందుకు ఆయన అనుమతించి ఉండేవాడుకాదని చాలామంది తర్కిస్తారు. చాలామంది అడిగే ఒక ప్రశ్నేమిటంటే, “నేనెంతో అవసరంలో ఉన్నప్పుడు దేవుడెక్కడున్నాడట?” రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల చేతిలో హతులైన లక్షలాదిమందిలో తానూ ఒకడు కాబోయి తప్పించుకున్న ఒక వ్యక్తి తాను చూసిన మారణకాండను బట్టి ఎంతగా క్షోభచెందాడంటే, “మీరు నా హృదయానికి మీ నాలుకను తగిలించగలిగితే, దాని విషం మీ ప్రాణం తీయగలదు” అన్నాడాయన.
అలా మానవ బాధలు చాలామందిని సందిగ్ధావస్థలో పడేస్తుంటాయి. మునుపు పేర్కొనబడిన ఒక ప్రాచీన పరిశీలకుడు చెప్పినట్లుగా, మనం మన చుట్టూ ఉన్న వస్తువుల్లోని అద్భుతమైన క్రమాన్నీ రూపనిర్మాణాన్నీ చూసినప్పుడు ఒక సృష్టికర్త ఉన్నాడనడానికి కావాల్సిన రుజువులు దొరుకుతాయి. ఒకవేళ ఆయన మనపట్ల శ్రద్ధగల వ్యక్తియైతే, అలాంటి ఘోరమైన సంఘటనలు జరిగేందుకు ఎందుకు అనుమతిస్తాడు? మనం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకుని ఆయన్ను సరిగ్గా ఆరాధించాలంటే మనకు ప్రాముఖ్యమైన ఈ ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు దొరకాలి. మనం దాన్ని ఎక్కడ కనుగొనగలం?
దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూరు కాపీని పొందమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఈ తేజరిల్లు! పత్రిక 32వ పేజీలో మీరు దానికోసం ఎలా రిక్వెస్టు చేయాలో తెలియజేయబడింది. ఆ బ్రోషూరులోని “దేవుడు బాధనెందుకు అనుమతించెను” “తిరుగుబాటు ఫలితమేమిటి?” అనే భాగాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు సంతృప్తికరమైన జవాబుల్ని కనుగొంటారని మేము భావిస్తున్నాము.
[10వ పేజీలోని చిత్రాలు]
ఒక సృష్టికర్త ఉన్నాడనడానికి సాక్ష్యాధారాలు మీకు ఇక్కడ కనబడుతున్నాయా?