కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కాపర్‌ లోయకు సుస్వాగతం

కాపర్‌ లోయకు సుస్వాగతం

కాపర్‌ లోయకు సుస్వాగతం

మెక్సికోలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

కాపర్‌ లోయ అనేది ఒక ప్రకృతి అద్భుతం. అది సియార మడ్రె ఓక్సిడెంటల్‌ అని పిలువబడే ఉత్తర మెక్సికో పర్వత శ్రేణి ప్రాంతంలో నెలకొని ఉంది. ఆ లోయ, దాదాపు 50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అంటే కోస్టా రీకాకు సరిసమానమైన విస్తీర్ణాన్ని కల్గివుంది.

అయితే కాపర్‌ లోయ అనే పేరు మాత్రం కాస్త తప్పుదోవ పట్టించేదిగానే ఉంది. కాపర్‌ లోయ అనేది కేవలం ఒక్క లోయ మాత్రమే కాదుగానీ, ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడిన 20 లోయల సమాహారం. వాటిలో ఒకటి కాపర్‌ లోయ, దాని నుండే ఆ మొత్తం లోయల అనుసంధానానికి ఆ పేరు వచ్చింది. రిచర్డ్‌ ఫిషర్‌ అనే అన్వేషకుడు చెప్పినదాని ప్రకారం ఈ లోయలలో కనీసం మూడు లోయలు, అమెరికాలోని గ్రాండ్‌ లోయకన్నా లోతైనవి. *

కాపర్‌ లోయ యొక్క అసాధారణమైన పరిమాణాన్ని బట్టి సందర్శకుల్లో చాలామంది దాని అనేక సహజ గోచర స్థలాల్లో కొన్నింటిని మాత్రమే దర్శించగల్గుతారు. కాపర్‌, సిన్‌ఫొరొసా, యురీక్‌ లోయల దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అయితే, డీవీసడేరో దగ్గర అత్యద్భుతంగా ఉంటుందని కొంతమంది భావిస్తారు, అక్కడ కాపర్‌, యురీక్‌, టారారెక్వా లోయల సంగమపు విహంగ దృశ్యం కనబడుతుంది.

విభిన్నమైన వాతావరణం

పర్వత శ్రేణులపై జరిగే ఆకస్మికమైన మార్పులు కాపర్‌ లోయ వాతావరణంపైనా, అక్కడి వృక్ష జీవనంపైనా ప్రభావం చూపిస్తాయి. మీగల్‌ గ్లీసన్‌ అనే వ్యక్తి తన బృందంతో కలిసి యురీక్‌ లోయలోకి దిగినప్పుడు దీన్ని స్వయంగా అనుభవించాడు. మెక్సికో డెస్కీనోసీడో అనే పత్రికలో ఆయనిలా వ్రాశాడు: “వాతావరణం వేడెక్కుతోందని మేము గమనించాము, దేవదారు అడవులు కనుమరుగై, అరటిపండ్లు, బేరిజాతి పండ్లు, చివరికి నారింజ పండ్ల చెట్లతో ఉష్ణమండల మొక్కలు కనిపించడం మొదలుపెట్టాయి. మేము నమ్మలేకపోయాము. శీతోష్ణ అడవుల నుండి వెచ్చని ఉప ఉష్ణమండల అడవుల్లోకి నేను నా జీవితంలో ఎన్నడూ అంత తక్కువ సమయంలో, అంత తక్కువ దూరంలో వెళ్లలేదని చెప్తే సరిపోతుంది.”

లోయల సమీపంలో ఉన్న ఎత్తైన పీఠభూములు 15 రకాల దేవదారు వృక్ష జాతులతోనూ, 25 రకాల ఓకు వృక్ష జాతులతోనూ నిండివున్నాయి. కాపర్‌ లోయలో నిరవంజి చెట్లు, సరళ వృక్షాలు కూడా ఉన్నాయి. వేసవి కాలంలో సియార లోయ అంతటా వివిధ రకాలైన పువ్వులు పూస్తాయి, వాటిలో కొన్నింటిని టారాహుమారా అని పిలవబడే స్థానికులు ఆహారంగా లేదా సహజ వైద్యంగా ఉపయోగించుకుంటారు. సముద్ర మట్టానికి 1,800 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తున ఉన్న సియార లోయ వాతావరణం సంవత్సరంలో ఎక్కువ భాగం సమశీతోష్ణ స్థితి నుండి చల్లదనానికి మారుతూ ఉంటుంది. చలికాలంలో వర్షాలు పలచగా కురుస్తాయి, అప్పుడప్పుడూ మంచు కూడా కురుస్తుంది.

సందర్శకులు లోయలోకి దిగుతుండగా, వివిధ రకాలైన చెట్లు, నాగజెముడు మొక్కలు కనిపించడాన్ని వాళ్లు గమనిస్తారు. క్రింద ఉప ఉష్ణమండల వాతావరణంలో చలికాలం ఆహ్లాదకరంగా ఉంటుంది, అక్కడ సగటు ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే ఉంటుంది. దానికి భిన్నంగా, ఈ ప్రాంతంలో వేసవి కాలం చాలా అసౌకర్యంగా ఉంటుంది, ఉష్ణోగ్రత 35 నుండి 45 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉండి, నదులు పొంగిపొర్లేంత ఎక్కువగా వర్షాలు కురుస్తాయి.

ఆ ప్రాంతపు సౌందర్యం రెండు మహోన్నతమైన జలపాతాల మూలంగా ఇనుమడిస్తుంది. వాటిలో ఒకటి ప్యీడ్రాబోలడ, అది ప్రపంచంలోకెల్లా ఎత్తైన జలపాతాల్లో ఒకటి, అది 453 మీటర్ల ఎత్తునుండి క్రిందికి పడుతుంది, మరొకటి బససీచిక్‌, అది 246 మీటర్ల ఎత్తునుండి క్రిందికి పడుతుంది.

వన్యప్రాణులకు ఆశ్రయస్థానం

కాపర్‌ లోయ అనేక రకాలైన వన్యప్రాణులకు పట్టుగొమ్మగా ఉంది. మెక్సికోలో ఉన్నట్లు రిజిస్టరు చేయబడిన క్షీరదాల్లో 30 శాతం ఈ ప్రాంతంలోనే ఉన్నట్లు చెప్పబడుతుంది. వాటిలో నల్ల ఎలుగులు, పర్వత సింహాలు, ఒక రకం క్షీరద జాతి జలచరాలు, తెల్లతోక జింకలు, మెక్సికో తోడేళ్లు, మగపందులు, ఒక రకం పిల్లి జాతి జంతువులు, రాకూన్‌లు, నీటికుక్కలు, ఇతర పిల్లిజాతి జంతువులు, అలాగే గబ్బిలాలు, ఉడతలు, కుందేళ్లు చేరివున్నాయి.

కాపర్‌ లోయలో దాదాపు 400 రకాల పక్షులు నివాసం ఏర్పరచుకున్నాయి, వాటిలో బంగారు గ్రద్ద, వలస వెళ్లే డేగజాతి పక్షి కూడా ఉన్నాయి. ఈ లోయలు ఉత్తర అమెరికాకూ, మధ్య అమెరికాకూ నడుమ ప్రాముఖ్యమైన స్థలంలో ఉన్నాయి గనుక వలస వెళ్లే పక్షులు చలికాలం గడపటానికి ఇక్కడికే వస్తాయి. ఇతర పక్షులు తమ ప్రయాణాన్ని కొనసాగించే ముందు విశ్రాంతి కోసం ఇక్కడ కాసేపు ఆగుతాయి.

కాపర్‌ లోయ ప్రకృతి సంబంధమైన అద్భుతాలన్నింటికీ సృష్టికర్తయైన యెహోవా దేవునికి తప్పక ఘనతను తెస్తుంది. రాజైన దావీదు ఒకసారి వ్యక్తపర్చినట్లుగా, “యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి.”​—1 దినవృత్తాంతములు 29:11.

(g00 11/8)

[అధస్సూచి]

^ యురీక్‌ లోయ 1,879 మీటర్ల లోతునూ, సిన్‌ఫొరొసా లోయ 1,830 మీటర్ల లోతునూ, బటొపిలాస్‌ లోయ 1,800 మీటర్ల లోతునూ కల్గివున్నాయి. గ్రాండ్‌ లోయ దాదాపు 1,615 మీటర్ల లోతును కల్గివుంది.

[18వ పేజీలోని బాక్సు/చిత్రం]

ట్రెయిన్‌లో నుండి ఒక దృశ్యం

చిహువాహువా పసిఫిక్‌ రైల్వే అమెరికా-మెక్సికోల సరిహద్దులో ఒజినాగా నుండి పసిఫిక్‌ మహాసముద్రం దగ్గర టొపొలొబాంపొ ఓడరేవు వరకు 941 కిలోమీటర్ల పొడవున విస్తరించివుంది. ఈ రైలు మార్గం కాపర్‌ లోయ గుండా వెళ్తుంది. టోపోగ్రఫీ నైసర్గిక స్వరూపం మూలంగా ఈ రైలు మార్గం చాలా విశేషమైన ఇంజినీరింగ్‌ నైపుణ్యంగా పరిగణించబడుతుంది. ట్రెయిన్‌ దాని ప్రయాణంలో దాదాపు 37 ప్రముఖ వంతెనలను దాటుతుంది. వాటిలో, ఫ్వీర్టే నదిపైనున్న 500 మీటర్ల పొడవున్న వంతెన అతి పొడవైనది. ఎత్తైన వంతెన, చినిపాస్‌ నదిపై 90 మీటర్ల ఎత్తుంటుంది.

ఈ ట్రెయిన్‌ 99 సొరంగాల గుండా కూడా వెళ్తుంది. వీటిలో పొడవైనది ఎల్‌ డెస్కాన్సో అని పిలువబడుతుంది, అది 1,810 మీటర్ల పొడవుంటుంది. ఈ ప్రయాణంలో సందర్శకులు కాపర్‌ లోయ అందమైన దృశ్యాలను చూసి ఆనందించవచ్చు.

[15వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

కాపర్‌ లోయ ప్రాంతం

అమెరికా

మెక్సికో

చిహువాహువా

ఒజినాగా

లా జుంటా

చిహువాహువా

క్రీల్‌

డివిసడెరో

టొపొలొబాంపొ

[15వ పేజీలోని చిత్రం]

బససీచిక్‌ జలపాతం

[చిత్రసౌజన్యం]

© Tom Till

[16, 17వ పేజీలోని చిత్రాలు]

డివిసడెరో నుండి దృశ్యం

[చిత్రసౌజన్యం]

© Tom Till

[17వ పేజీలోని చిత్రం]

లోయ అంతటిలో టారాహుమారాలు నివసిస్తారు

[చిత్రసౌజన్యం]

George Hunter/ H. Armstrong Roberts

[17వ పేజీలోని చిత్రం]

అరారెకో సరస్సు

[15వ పేజీలోని చిత్రసౌజన్యం]

George Hunter/H. Armstrong Roberts