కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అసలు ఆశావాదానికి ఆస్కారముందా?

అసలు ఆశావాదానికి ఆస్కారముందా?

అసలు ఆశావాదానికి ఆస్కారముందా?

“విపద్దశలో ఉన్న వివాహబంధాల్లో ఉన్న ఒక సమస్య ఏమిటంటే పరిస్థితులు మెరుగయ్యే అవకాశమే లేదన్న గట్టి నమ్మకం. అలాంటి నమ్మకం మార్పును నిరోధిస్తుంది ఎందుకంటే దాని మూలంగా ఏదన్నా నిర్మాణాత్మకమైనది చేయాలన్న ప్రేరణే లేకుండా పోతుంది.”​—డా. ఏరన్‌ టి. బెక్‌.

ఉదాహరణకు మీకు శరీరంలో నలతగా ఉండి పరీక్ష నిమిత్తం డాక్టరు దగ్గరికి వెళ్ళారనుకోండి. మీరు చాలా కలవరపడుతూ ఉన్నారు​—అది అర్థం చేసుకొనదగినదే. ఎంతైనా మీ ఆరోగ్యం​—బహుశా మీ జీవితమే​—ప్రమాదంలో ఉండివుండవచ్చు. కానీ, డాక్టరు పరీక్ష చేసిన తరువాత మీ సమస్య చిన్నది కాకపోయినా దానికి చికిత్సచేయడం సాధ్యమేనని ఒక శుభవార్త చెప్పాడనుకోండి. నిజానికి డాక్టరు, మీరు జాగ్రత్తగా పథ్యం చేస్తే కాస్త వ్యాయామం చేస్తే పూర్తిగా కోలుకోగలరని చెప్పాడనుకోండి. మీరప్పుడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని ఆయనిచ్చిన సలహాల్ని ఆనందంగా పాటిస్తారనడంలో సందేహంలేదు!

దీన్ని మనం ప్రస్తుతం చర్చిస్తున్న అంశంతో పోల్చండి. మీరు మీ వివాహజీవితంలో బాధల్ననుభవిస్తున్నారా? ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రతి వివాహంలోనూ సమస్యలు విభేదాలు ఉండనే ఉంటాయి. కాబట్టి మీ బంధంలో కొన్ని కష్టతరమైన సమయాలున్నాయంటే దానర్థం మీది ప్రేమరహిత వివాహమని కాదు. కానీ ఆ కష్టతరమైన పరిస్థితి కొన్ని వారాలపాటు, నెలలపాటు చివరికి కొన్ని సంవత్సరాలపాటు కొనసాగితే అప్పుడేమిటి? అలాంటప్పుడు మీరు చింతించడం సరియే, ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. నిజానికి మీ వివాహ నాణ్యత మీ జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది​—చివరికి మీ పిల్లల జీవితాల్ని కూడా. ఉదాహరణకు, డిప్రెషన్‌కు లోనుకావడం, పనిలో ఉత్పాదకత తగ్గడం, స్కూల్లో పిల్లలు సరైన సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోవడం వంటి సమస్యలకు వైవాహిక అలజడి పెద్ద కారణమై ఉండగలదని విశ్వసించబడుతుంది. అంతేకాదు, తమ వివాహ భాగస్వాములతో తాము కలిగివున్న సంబంధం దేవునితో తమకు గల సంబంధాన్నే ప్రభావితం చేయగలదని క్రైస్తవులు గుర్తిస్తారు.​—1 పేతురు 3:7.

మీకూ మీ భర్తకు/భార్యకు మధ్య సమస్యలున్నాయంటే దానర్థం ఇక ఆశావాదానికి ఆస్కారమే లేదని కాదు. వివాహజీవితంలోని ఒక వాస్తవాన్ని అంగీకరించడం​—అంటే సమస్యలు ఉంటాయి అని అంగీకరించడం​—తమ సమస్యల్ని సరైన కోణంలోంచి దృష్టిస్తూ పరిష్కారాలకై కృషిచేయడానికి ఒక జంటకు సహాయం చేస్తుంది. ఐజక్‌ అనే ఒక భర్త ఇలా అంటున్నాడు: “వివాహ జీవితంలో ఎగుడుదిగుళ్ళనేవి ఉండడం సర్వసాధారణం అని నేనేమాత్రం అనుకోలేదు. మాలో ఏదో లోపం ఉందనే నేననుకున్నాను!”

అయితే మీ వివాహ జీవితం ప్రేమరహిత స్థితికి దిగజారినా, దాన్ని కాపాడుకోవడం సాధ్యమే. నిజమే, సంబంధం కల్లోలభరితంగా ఉండడం మూలంగా ఏర్పడిన గాయాలు చాలా లోతుగా ఉంటుండవచ్చు, ప్రాముఖ్యంగా సమస్యలు కొన్ని సంవత్సరాలపాటు కొనసాగినప్పుడు. అయినా ఆశావాదంతో ఉండడానికి గట్టి కారణం ఉంది. ప్రేరణే కీలకాంశం. గంభీరమైన వైవాహిక సమస్యలు ఉన్న భార్యాభర్తలు సహితం తాము కలిసివుండడం ముఖ్యమైన విషయమని వారిద్దరూ భావించినప్పుడు వారు తమ జీవితాల్లో మెరుగులు దిద్దుకోవడం సాధ్యమే. *

కాబట్టి మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘ఒక సంతృప్తికరమైన సంబంధాన్ని ఏర్పర్చుకోవాలన్న నా కోరిక ఎంత బలంగా ఉంది?’ మీరూ మీ భాగస్వామి మీ వివాహాన్ని మెరుగుపర్చుకోవడానికి కృషిచేసేందుకు ఇష్టపడుతున్నారా? మునుపు ఉదహరించబడిన డా. బెక్‌ ఇలా చెబుతున్నాడు: “ఇద్దరి మధ్యా సంబంధాలు చాలా ఘోరంగా ఉన్నట్లు కన్పిస్తున్న వివాహాల్లో కూడా, లోపాల్ని సరిదిద్దుకోవడానికీ, మంచి విషయాల్ని మరింతగా బలపర్చుకోవడానికీ భార్యాభర్తలిద్దరూ కలిసి కృషిచేసినప్పుడు వచ్చిన ఫలితాల్ని చూసి నేను తరచూ ఆశ్చర్యపోయేవాడిని.” కానీ మీ భార్య/భర్త సహకరించడానికి నిరాకరిస్తుంటే అప్పుడేమిటి? లేక ఆమెకు/ఆయనకు అసలు సమస్య ఉన్నట్లే అనిపించకపోతే అప్పుడేమిటి? ఒంటరిగా వివాహాన్ని కాపాడుకోవడానికి కృషిచేయడం వ్యర్థమా? ఎంతమాత్రం కాదు! “ఒకవేళ మీరు కొన్ని మార్పులు చేసుకున్నట్లైతే, మీ జత కూడా మార్పులు చేసుకోవడానికి పురికొల్పబడవచ్చు​—అలా చాలా తరచుగా జరుగుతుంది” అని డా. బెక్‌ అంటున్నాడు.

మీ విషయంలో అలా జరగదని త్వరపడి ఒక ముగింపుకు వచ్చేయకండి. అలా ఓటమిని అంగీకరించే స్వభావమే మీ వివాహానికి అతి గొప్ప ముప్పును తీసుకురాగలదు! మీ ఇద్దర్లో ఒకరు ముందుగా అడుగు వేయాల్సివుంది. అది మీరై ఉండగలరా? ఒక్కసారి అడుగులు ముందుకు పడ్డాయంటే, మీ భార్య/భర్త మరింత సంతోషకరమైన వివాహాన్ని నిర్మించుకోవడానికి మీతో కలిసి కృషిచేయడంలోని ప్రయోజనాల్ని గ్రహిస్తుండవచ్చు.

కాబట్టి, ఒంటరిగానైనా లేక ఇద్దరూ కలిసైనా మీ వివాహాన్ని కాపాడుకోవడానికి మీరేం చేయగలరు? ఈ ప్రశ్నకు జవాబివ్వడంలో బైబిలు శక్తివంతమైన సహాయకంగా ఉంది. అదెలాగో చూద్దాం.

(g01 1/8)

[అధస్సూచి]

^ కొన్ని తీవ్రమైన సందర్భాల్లో భార్యాభర్తలు విడిపోవడానికి సరైన కారణాలు ఉండవచ్చన్నది ఒప్పుకోవల్సిందే. (1 కొరింథీయులు 7:10, 11) అంతేగాక, వ్యభిచారం జరిగినప్పుడు విడాకులకు బైబిలు అనుమతిస్తుంది. (మత్తయి 19:9) విశ్వాసఘాతుకం చేసిన వివాహ భాగస్వామి నుండి విడాకుల్ని పొందాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం, పాపం చేయని భార్య/భర్త పలాని నిర్ణయం తీసుకోవాలని వేరెవ్వరూ ఒత్తిడి చేయకూడదు.​—వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యం పుస్తకంలో 158-61 పేజీలు చూడండి.