కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యూకలిప్టస్‌ అదెంత ఉపయోగకరమైనది?

యూకలిప్టస్‌ అదెంత ఉపయోగకరమైనది?

యూకలిప్టస్‌ అదెంత ఉపయోగకరమైనది?

ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! రచయిత

కొన్ని అసాధారణమైన ఎత్తుంటాయి—90 మీటర్లకన్నా ఎత్తు​—⁠ఇవి ప్రపంచంలోకెల్లా ఎత్తయిన చెట్లలో కొన్ని అని పరిగణించబడుతున్నాయి. మరికొన్ని పొట్టిగా ఉండి, వంకర్లు తిరిగిపోయి ఎండిన నేలను తాకుతున్నట్లుగా ఉంటాయి. వాటి ఆకుల రూపనిర్మాణం ఒక అద్భుతం, వాటి పూలగుచ్ఛాలు నయనానందకరంగా ఉంటాయి. ఆ చెట్టులోని ఏదో ఒక భాగాన్ని మీరు ఏదోవిధంగా ఉపయోగించుకునే ఉంటారు.

వీటిలో కొన్నింటికి ఆల్పైన్‌ ఆష్‌, టాస్మాన్యన్‌ ఓక్‌ వంటి విశిష్టమైన పేర్లు ఉన్నప్పటికీ, చాలా మటుకు ఇవి జిగురు చెట్లుగానే పిలువబడతాయి. వాస్తవానికి నిజమైన జిగురు నీటిలో కరిగిపోయే పదార్థం, అది పిండిపదార్థాలతో తయారవుతుంది. ఏ యూకలిప్టస్‌ చెట్టూ ఈ జిగురును ఉత్పత్తి చేయదు. కాబట్టి జిగురు చెట్టు అన్నది దీనికి సరైన పేరు కాదు. ఈ చెట్లను యూకలిప్టస్‌ జాతికి చెందిన చెట్లని పిలవడమే సబబుగా ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఎక్కువగా పెరిగే ఈ జాతి చెట్లలో 600 కంటే ఎక్కువ రకాలున్నాయి.

ఆస్ట్రేలియా గ్రామీణ ప్రాంతాల్లోని ఎండిన నేలల్లోనూ, ఉత్తర ప్రాంతపు ఉష్ణమండల వేడిలోనూ యూకలిప్టస్‌ చెట్లు బాగా పెరుగుతాయి. అంతేగాక అవి, దక్షిణ టాస్మానియా నుండి అంటార్కిటికా గాలులు వీస్తున్నప్పటికీ, తీరప్రాంతంలోని పర్వత శ్రేణుల్లో ఉండే పొగమంచులో కూడా బాగానే పెరుగుతాయి. అవి ఎంతగా వ్యాపిస్తాయంటే, 19వ శతాబ్దానికి చెందిన పరిశీలకుడూ జంతుశాస్త్ర నిపుణుడూ అయిన ఒక వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు: “చూపుకు అందినంత మేర ఎటు చూసినా యూకలిప్టస్‌ చెట్లే: మైళ్లకు మైళ్లు అవే చెట్లు.”

19వ శతాబ్దంలో ఐరోపా వాసులు ప్రవాహంలా ఆస్ట్రేలియాకు వలసవచ్చి అక్కడ స్థిరపడినప్పటి నుండి యూకలిప్టస్‌ చెట్లు బాగా దెబ్బతిన్నాయి. వాళ్లు ఈ చెట్లు అభివృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయని భావించి 3,00,000 చదరపు కిలోమీటర్ల స్థలంలోని చెట్లను కూకటి వేళ్లతో పెకిలించి వేసినట్లు ఒక అంచనా. అయితే, ఈ అమూల్యమైన సంపదను అందరూ అలాగే చిన్నచూపు చూడలేదు. 19వ శతాబ్దంలో ఈ యూకలిప్టస్‌ జాతి మళ్లీ తన జైత్రయాత్రను ప్రారంభించింది.

ఒక సామ్రాట్టు, ఒక వైద్యుడు

1880లలో అబిసినియా​—⁠ఇప్పుడిది ఇతియోపియా అని పిలువబడుతుంది​—⁠సామ్రాట్టు అయిన మెనెలిక్‌ II నీరులేని భూమిగల తన క్రొత్త రాజధానియైన అడీస్‌ అబాబాకు నీడనిచ్చే చెట్లూ, వంట చెరుకూ కావాలనుకున్నాడు. అటవీ నిర్మూలన జరిగిన ఈ ప్రాంతం, ఆఫ్రికాలో సాధారణంగా పెరిగే ఏ చెట్టుకూ అనుకూలమైనదిగా కనబడలేదు. కాబట్టి చక్రవర్తి దగ్గర పనిచేస్తున్న నిపుణులు, తమ ప్రాంతంలోలాగే మండుటెండలు కాస్తున్న ప్రాంతంలో కూడా తట్టుకుని బ్రతుకగలిగే చెట్ల కోసం వెదికారు. “అడీస్‌ అబాబా” అంటే “క్రొత్త పువ్వు” అని భావం, కాబట్టి ఇతియోపియా ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర నిర్వహించడానికి వచ్చిన ఈ ఉపయోగకరమైన యూకలిప్టస్‌ గౌరవార్థం దానికి ఆ పేరు పెట్టి ఉండవచ్చు.

యూకలిప్టస్‌ ఈ ఆధునికకాలంలో వలస వెళ్లడానికి దోహదపడిన మరో వ్యక్తి డా. ఎడ్మండో నవర్రో డె అండ్రాడ్‌. రోజురోజుకూ అంతరించిపోతున్న బ్రెజిల్‌ అడవులను పునరుద్ధరించాలనే నిశ్చయతతో, ఆయన 1910లో ఆస్ట్రేలియా నుండి యూకలిప్టస్‌ చెట్లను దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆయన 3.8 కోట్ల చెట్లను నాటించాడు. నేడు బ్రెజిల్‌లో రెండు వందల కోట్ల కన్నా ఎక్కువ యూకలిప్టస్‌ చెట్లను పెంచుతున్నారు.

కాబట్టి బ్రెజిల్‌ తన స్వతఃసిద్ధమైన వర్షపాత అడవులకే గాక ఆస్ట్రేలియా తర్వాత అతిపెద్ద సంఖ్యలో యూకలిప్టస్‌ చెట్లున్న ప్రాంతంగా కూడా పేరుపొందింది. దాని వల్ల బ్రెజిల్‌ ఆర్థిక వ్యవస్థకు చేకూరిన మేలు ఇంతా అంతా కాదు. అందుకే, తన దేశానికి ఈ అమూల్యమైన సంపదను పరిచయం చేసినందుకు డా. నవర్రోకు ప్రత్యేక సేవలకై ఇచ్చే అతిప్రత్యేకమైన మెడల్‌ను బహుకరించడం జరిగింది.

జీవదాయక వృక్షం

మలీస్‌ వంటి కొన్ని రకాల యూకలిప్టస్‌ చెట్లు, ఎండి బీటలుపడిన భూమి నుండి వీలైనంత నీటిని పీల్చుకుని తమ వేర్లలో పెద్ద మొత్తంలో నిలువ ఉంచుకుంటాయి. ఈ భూగర్భ నీటి సీసాల మూలంగానే, ఆస్ట్రేలియాలోని ఆదివాసులు, తొలి పరిశోధకులు ఆస్ట్రేలియాలోని నీరులేని మారుమూల గ్రామాల్లో తమ ప్రాణాలను దక్కించుకోగలిగారు. పైపైనున్న పొడవైన వేర్లను త్రవ్వి తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసేవారు. ఒక చివర నుండి వాటిలోకి గాలి ఊదితే మరో చివర నుండి లేత గోదుమ వర్ణపు ద్రవం బయటికి వస్తుంది. అది ఎంతో రుచికరమైన పానీయం కాకపోయినప్పటికీ, తొమ్మిది మీటర్ల పొడవైన వేరు నుండి ఒకటిన్నర లీటర్ల ఈ జీవదాయక ద్రవాన్ని తీయవచ్చునని అంచనా వేయబడుతుంది.

ఈ జాతికి చెందిన ఇతర రకాలు, బురద మట్టి నుండి నీటిని ఆత్రంగా పీల్చుకుంటూ చిత్తడి నేలల్లో బాగా పెరుగుతాయి. ఇటలీ వాసులు ఈ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ, ఒకప్పుడు దోమలతో నిండిపోయి ఉన్న పోన్‌టైన్‌ చిత్తడినేలలను ఎండబెట్టేందుకు, బురదనిష్టపడే యూకలిప్టస్‌ చెట్లను నాటారు. ఇప్పుడీ నేల సారవంతమైన వ్యవసాయ భూమిగా మారింది.

ఆఫ్రికా, అమెరికాలు, ఆసియా, ఐరోపాల్లోని 50కన్నా ఎక్కువ దేశాలు యూకలిప్టస్‌ చెట్లకున్న వాణిజ్యపరమైన, సౌందర్యపరమైన విలువను బట్టి వాటిని తమ స్వంతం చేసుకున్నాయి. కలప సామాను తయారు చేసేవారు సుసంపన్నమైన-ఎరుపు, తేనె-బంగారు వర్ణాల కలయికతో ఉండే వాటి కలపను ఎంతో విలువైనదిగా ఎంచుతారు. “యూకలిప్టస్‌ చెట్లు బరువైన, దృఢమైన, ఎంతో మన్నికైన కలపను ఇస్తాయి. కలప నాణ్యత మూలంగా, సత్వర పెరుగుదల మూలంగా . . . ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత దృఢమైన కలపగా పరిగణించబడుతుంది.”

ఈ చెట్లలో నీటిరోధక రకాలు ఓడలను, ఓడరేవులను, టెలిఫోన్‌ స్థంబాలను, ప్రహరీ కంచెలను, చప్టాలను నిర్మించడానికి ఉపయోగించబడతాయి. అంతేగాక, ఎల్లో బాక్స్‌, అయన్‌బార్క్‌ వంటి రకాల అందమైన పువ్వులు తియ్యని మకరందాన్ని ఉత్పత్తి చేస్తాయి, తేనెటీగలు దాన్ని ఒక ప్రత్యేకమైన రుచిగల తేనెగా మారుస్తాయి. ఇటీవలి సంవత్సరాల్లో, ఆస్ట్రేలియా 45 లక్షల టన్నుల యూకలిప్టస్‌ కొయ్య దుంగలను ఎగుమతి చేసి సాలీన 25 కోట్ల అమెరికా డాలర్ల లాభాన్ని పొందింది.

కినొ, తైలం, టానిన్‌

యూకలిప్టస్‌ బెరడు నుండి, కలప నుండి కినొ అని పిలువబడే ఎర్రని జిగురువంటి పదార్థం వెలువడుతుంది. కలపకు చెదలు పట్టకుండా కాపాడేందుకు కొన్ని రకాలైన కినొను ఉపయోగిస్తారు. రక్తస్రావాన్ని అపడానికి సహాయం చేసే ఒక మందును ఉత్పత్తి చేయడానికి కూడా కినొను ఉపయోగిస్తారు. ఇతర రకాల చెట్ల బెరడు నుండి లభించే టానిన్‌ను తోలు పదార్థానికీ, బట్టలకూ రంగు వేయడానికి ఉపయోగిస్తారు.

దాని ఆకుల రూపనిర్మాణం ఒక అద్భుతం, అవి విలువైన తైలానికి ఆలవాలం. కుంటి చేతికి వేళాడుతున్న లెక్కలేనన్ని చేతి వేళ్లలా అవి క్రిందికి వేళాడుతుండగా వాటి చివరలు చెట్టు మొదలు వైపుకి తిరిగి ఉంటాయి. ఈ రూపనిర్మాణం, పత్ర సముదాయం ఒక పెద్ద గరాటాలా పనిచేసేందుకు సహాయం చేస్తుంది. అమూల్యమైన తేమను ఆకుల పైభాగం పీల్చుకుంటుంది, ఆ తేమ తోలులా ఉండే వాటి ఆకుల చివరల నుండి చుక్కలు చుక్కలుగా వేర్లపై రాలుతుంది.

ఆవిరి పట్టే, స్వేదనం చేసే ప్రక్రియ ద్వారా ఆకుల నుండి ఘాటైన, చైతన్యం కల్గించే సువాసనగల యూకలిప్టస్‌ (నీలగిరి) తైలాన్ని తయారు చేస్తారు. ఉదాహరణకు, అది పరిమళ ద్రవ్యాలు, సబ్బులు, మందులు, మిఠాయిలు, శుభ్రపర్చడానికి ఉపయోగించే ఉత్పత్తులు వంటి వాటి తయారీలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సహజసిద్ధంగా, ఆకుల నుండి వెలువడే తైలం గాలిని సూక్ష్మమైన నీటి బిందువులతో నింపుతుంది, ఆ నీటి బిందువులపై సూర్యరశ్మి పడి ప్రతిఫలించినప్పుడు యూకలిప్టస్‌ అడవంతా ఒక ప్రత్యేకమైన నీలివర్ణంతో కాంతులీనుతుంది. సిడ్నీ నగర పశ్చిమ ప్రాంతంలో వ్యాపించి ఉన్న బ్లూ మౌంటేన్స్‌కు ఆ అసాధారణమైన పేరు వచ్చింది ఈ ప్రక్రియ వల్లనే.

కోలా, ఒపొసొమ్‌ల నివాసగృహం

ముద్దొచ్చే కోలాలకు యూకలిప్టస్‌ అడవులే నివాస గృహాలు. ఈ శాకభక్షక జీవులకు దాదాపు 12 లేక అంతకన్నా ఎక్కువ రకాల యూకలిప్టస్‌ ఆకులే ప్రియమైన భోజనం. అలాంటి తిండి ఏ ఇతర జంతువులకైనా ప్రాణాంతకం కాగలదు గానీ కోలాలకు మాత్రం ఏమీ కాదు. ఎందుకు?

ఎందుకంటే, కోలాల జీర్ణకోశ విధానం చాలా విశిష్టమైనది, దానిలో ఒకటి నుండి రెండు మీటర్ల పొడవుండే ఆంత్రపుచ్ఛం ఉంటుంది. పోల్చిచూడాలంటే, మానవ ఆంత్రపుచ్ఛం కేవలం 8 నుండి 15 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. ఈ ఆకుల నుండి అవసరమైన మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వుపదార్థాలు తీసుకునేందుకు కోలాకున్న ఈ విశేషమైన ఆంత్రపుచ్ఛం సహాయం చేస్తుంది.

కోలాలాగే యూకలిప్టస్‌ ఆకులను తిని బ్రతుక గలిగే మరో ఆస్ట్రేలియా నివాసి గ్లైడింగ్‌ ఒపొసొమ్‌. ఇది దాదాపుగా, ఇళ్లలో తిరిగే పిల్లి పరిమాణంలో ఉంటుంది. దానికి దాదాపు 40 సెంటిమీటర్ల పొడవైన తోక ఉంటుంది. దాని వెనుక కాళ్లకూ ముందు కాళ్లకూ మధ్యన వేలాడుతున్నట్లుగా ఉండే చర్మం ఉంటుంది. రెక్కలలా ఉండే ఈ చర్మాన్ని ఉపయోగిస్తూ ఈ ఒపొసొమ్‌లు ఒక చెట్టు నుండి మరో చెట్టు మీదికి గెంతుతూ 100 మీటర్ల దూరం వరకూ ఎగిరి సురక్షితంగా మరో కొమ్మను చేరుకుంటాయి. అలా ఎగురుతూ అవి 90 డిగ్రీల మలుపు కూడా తిరుగ గల్గుతాయి.

దావానలము, మళ్లీ పెరుగుదల

ఆస్ట్రేలియాలో బుష్‌ఫైర్‌ అని పిలువబడే దావానలము యూకలిప్టస్‌ అడవులకు ఎంతో ప్రమాదకరమైనది. అయినా, దాన్ని తట్టుకుని నిలువగలిగేలా ఆ చెట్లు రూపొందించబడ్డాయి. ఎలా?

చెట్టు బెరడు క్రింద దాని బోదె పొడవునా, కొమ్మల వెంబడీ నిద్రాణమై ఉండే చిన్ని చిన్ని ఆకు బుడిపెలుంటాయి. అగ్ని మూలంగా చెట్టు బెరడు, దాని ఆకులు కాలిపోయినప్పుడు, నిద్రాణమైవున్న ఈ ఆకు బుడిపెలు పెరగడం మొదలు పెడతాయి. ఇవి కాలి నల్లగా మారిపోయిన చెట్టు బోదెకు లేత ఆకుల పచ్చని వస్త్రాన్ని చుట్టబెడతాయి. తత్ఫలితంగా తల్లి చెట్టు ఊపిరిపోసుకుంటుంది. అంతేగాక, నేల మీద నిద్రాణంగా పడివున్న ఈ చెట్టు విత్తనాలు అవకాశం దొరికిన వెంటనే మొలకెత్తడంతో క్రొత్త పెరుగుదల ప్రారంభమౌతుంది.

విలువైనదిగా ఎంచవలసిన చెట్టు

యూకలిప్టస్‌ నుండి తీసిన మందుతో మీరు మీ గొంతును సరిచేసుకున్నారా లేక యూకలిప్టస్‌ తేనెతో చేసిన మిఠాయిని తిన్నారా? ఆ చెట్టు కలపతో తయారు చేసిన పడవలో ప్రయాణం చేశారా లేక యూకలిప్టస్‌ కలపతో కట్టిన ఇంట్లో ఉన్నారా లేదా యూకలిప్టస్‌ కొయ్యముక్కలతో చలికాచుకున్నారా? మీరు ఏదో విధంగా ఈ విశేషమైన చెట్టు నుండి ప్రయోజనం పొందే ఉంటారు. కాబట్టి ఈసారి మీరు ముద్దొచ్చే కోలాను చూసినా లేక దాని ఫోటోను చూసినా, దాని నివాసగృహమైన ఈ చెట్టు అద్భుత రూపనిర్మాణాన్ని గుర్తుచేసుకోండి.

నిజానికి బహుళ ప్రయోజనకరమైన, బలమైన ఈ యూకలిప్టస్‌ చెట్టుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.

(g01 2/22)

[22, 23వ పేజీలోని చిత్రం]

యూకలిప్టస్‌ చెట్లు ప్రపంచంలోనే ఎత్తైన చెట్లలో కొన్నింటిగా ఉన్నాయి

[23వ పేజీలోని చిత్రం]

రుచికరమైన తేనెను తయారు చేయడానికి తేనెటీగలు యూకలిప్టస్‌ మకరందాన్ని ఉపయోగిస్తాయి

[24వ పేజీలోని చిత్రం]

యూకలిప్టస్‌ చెట్లు “అత్యంత బరువైన, దృఢమైన, ఎంతో మన్నికైన కలపను ఉత్పత్తి చేస్తాయి”

[24వ పేజీలోని చిత్రాలు]

కోలాలకు (ఎడమ) గ్లైడింగ్‌ ఒపొసొమ్‌లకు (పైన) యూకలిప్టస్‌ ఆకులే ప్రియమైన భోజనం

[చిత్రసౌజన్యం]

© Alan Root/Okapia/PR

[22వ పేజీలోని చిత్రసౌజన్యం]

Geoff Law/The Wilderness Society

[23వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of the Mount Annan Botanic Gardens