కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భారతీయ రైల్వేలు దేశమంతటా వ్యాపించివున్న మహత్తరమైన వ్యవస్థ

భారతీయ రైల్వేలు దేశమంతటా వ్యాపించివున్న మహత్తరమైన వ్యవస్థ

భారతీయ రైల్వేలు దేశమంతటా వ్యాపించివున్న మహత్తరమైన వ్యవస్థ

ఇండియాలోని తేజరిల్లు! రచయిత

నాలుగు వేల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం క్రితం, ఉత్తర భారతదేశంలో ఇటికలు తయారుచేసే నిర్మాణకులు ఉండేవారు. అయితే ఆ ఇటికలు భారత ఉపఖండానికి సంబంధించిన మహత్తరమైన రైల్వేల వ్యవస్థను నిర్మించడానికి ఉపయోగించబడతాయని వారు ఎన్నడూ ఊహించి ఉండరు.

భారతీయ రైల్వేలు ఒక మహత్తరమైన వ్యవస్థ! దాని రైళ్ళు 100 కోట్లకు పైగా జనాభాగల భారతదేశంలో ప్రాముఖ్యమైన రవాణా మాధ్యమాలు. సాధారణంగా ప్రజలు చేసే రోజువారీ ప్రయాణాలే కాకుండా, భారతీయ సాంప్రదాయక సంస్కృతి ప్రకారం తమ బంధువుల నుండి దూరంగా ఉండే కోట్లాది మంది ప్రజలు, జననమరణాలు, పండుగలు, వివాహాలు, అనారోగ్యాలు వంటి కుటుంబ సంబంధిత సందర్భాలకు తరచూ ప్రయాణిస్తుంటారు.

ప్రతిరోజు, సగటున 8,350 కంటే ఎక్కువ రైళ్ళు 125 లక్షలమంది ప్రయాణికులను తీసుకుని ప్రస్తుతం ఉపయోగంలోవున్న దాదాపు 80,000 కిలోమీటర్ల పొడవున్న పట్టాలపై ప్రయాణిస్తాయి. గూడ్సు రైళ్ళు పదమూడు లక్షల టన్నుల కంటే ఎక్కువ బరువున్న సరుకులను తీసుకువెళతాయి. గూడ్సు రైళ్ళు, ప్యాసింజర్‌ రైళ్ళు కలిపి ప్రతిరోజు భూమినుండి చంద్రునికి మధ్యవున్న దూరానికి మూడున్నర రెట్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి!

6,867 రైల్వేస్టేషన్లు, 7,500 ఇంజన్లు, 2,80,000 కంటే ఎక్కువ ప్యాసింజర్‌ బోగీలు మరియు గూడ్సు బోగీలు, ప్రధాన రైలు మార్గాలకు ప్రక్కన ఉండే రైలు మార్గాలతోపాటు మొత్తం కలిపి 1,07,969 కిలోమీటర్ల పొడవున్న రైలుమార్గాల గురించి ఆలోచించండి, భారతీయ రైల్వేలు 16 లక్షల మంది ఉద్యోగస్థులను అంటే ప్రపంచంలోని ఏ కంపెనీ కన్నా ఎక్కువ ఉద్యోగస్థులను ఎందుకు ఉపయోగించుకుంటుందో మీకే అర్థమవుతుంది. అవును ఇది నిజంగా మహత్తరమైన వ్యవస్థ!

ఈ మహత్తరమైన వ్యవస్థ ఎలా ఉనికిలోకి వచ్చింది?

భారతదేశంలో రైల్వేల నిర్మాణాన్ని ఏది ప్రేరేపించింది? ఈ విస్తృతమైన ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించబడింది? మరి 4,000 సంవత్సరాల పురాతన ఆ ఇటికల సంగతి ఏమిటి?​—పైన బాక్సును చూడండి.

19వ శతాబ్దపు మధ్య కాలంలో, భారతదేశం అధిక మొత్తంలో ముతక పత్తిని ఉత్పత్తి చేసేది, ఆ పత్తి ఎగుమతి చేయబడడానికి రోడ్ల ద్వారా ఓడరేవులకు రవాణా చేయబడేది. అయితే బ్రిటీష్‌లోని బట్టల మిల్లులకు పత్తిని సరఫరా చేసేది ప్రధానంగా భారతదేశం కాదు; వారికి అధికశాతం పత్తి అమెరికాలోని ఆగ్నేయ రాష్ట్రాలనుండి వచ్చేది. కానీ 1846వ సంవత్సరంలో అమెరికాలోని పత్తి పంట పాడైపోవడంతో, ఆ తర్వాత 1861 నుండి 1865 వరకు అంతర్యుద్ధం జరగడంతో బ్రిటీష్‌వారికి వేరే స్థలం నుండి పత్తిని దిగుమతి చేసుకోవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యకు పరిష్కారం భారతదేశమే! కానీ ఇంగ్లాండులోని లాంక్‌షైర్‌ బట్టల మిల్లులు ఆగకుండా నడుస్తూనే ఉండడానికి పత్తిని మరింత వేగంగా రవాణా చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈస్ట్‌ ఇండియా రైల్వే కంపెనీ (1845), గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులా రైల్వే (1849) స్థాపించబడ్డాయి. భారత ఉపఖండంలో ప్రధాన వర్తకులైన ఆంగ్లేయ ఈస్ట్‌ ఇండియా కంపెనీవారితో కూడా కాంట్రాక్టులు సైన్‌ చేయబడ్డాయి. పని త్వరితగతిన సాగింది, 1853వ సంవత్సరం ఏప్రిల్‌ 16వ తేదీన భారతదేశంలోని తొలి రైలు బొంబాయి (ప్రస్తుతం ముంబయి) బోరీ బందర్‌ అనే డాక్‌ ప్రాంతం (రైల్వే లైను అంతమయ్యే స్టేషనులోని ఆవరణ) నుండి బయలుదేరి 34 కిలోమీటర్ల పొడవున్న రైలుమార్గంలో ప్రయాణించి థానే పట్టణానికి చేరుకుంది.

బొంబాయినుండి పత్తిని ఉత్పత్తి చేసే మారుమూల గ్రామీణ ప్రాంతానికి చేరుకోవాలంటే, ఎత్తుపల్లాలుగా ఉండే కొండల వరుస అయిన పడమటి కనుమలను దాటవలసి ఉంటుంది. బ్రిటీష్‌ ఇంజనీర్లు మరియు కూలీలు, వేలాదిమంది భారతీయ కూలీలతో కలిసి, కొన్నిసార్లు ఒక్కసారికి 30,000 మంది కూలీల చొప్పున, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయం లేకుండా శ్రమించి పనిచేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్విచ్‌బ్యాక్‌లను (నిటారుగా ఉండే కొండ శిఖరాన్ని చేరుకోవడానికి కోణాలలో మలుపులు తిరిగేలా రైలు పట్టాలను అమర్చే ఏర్పాటు) ఉపయోగిస్తూ కేవలం 24 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించి 555 మీటర్ల ఎత్తును అధిరోహించడానికి వీలుగా రైలుమార్గాన్ని నిర్మించారు. వారు మొత్తం కలిపి 3,658 మీటర్ల పొడవున్న 25 సొరంగ మార్గాలను తవ్వారు. ఒకసారి దక్కన్‌ పీఠభూమిని చేరుకున్న తర్వాత రైలు ప్రయాణానికి మార్గం సిద్ధమయ్యింది. వ్యాపారం కోసమే కాక, బ్రిటీష్‌వారు ఉపఖండానికి సంబంధించి వాణిజ్యపరమైన, రాజకీయపరమైన విషయాల్లో ఎక్కువగా ఆసక్తిని చూపించడం మొదలుపెట్టారు కాబట్టి దళాలు, అధికారులు త్వరగా ప్రయాణించి రావడానికి వీలుగా రైలు మార్గాలు వేసే పని దేశవ్యాప్తంగా వేగంగా జరిగింది.

19వ శతాబ్దపు ఫస్ట్‌ క్లాసు రైలు ప్రయాణానికి డబ్బు ఖర్చుపెట్టగల స్థోమతవున్న కొందరికి అది వేడినీ ధూళినీ తట్టుకోవడానికి సహాయపడేది. ఒక ప్రైవేటు కంపార్ట్‌మెంట్‌లో పరుపు, బాత్‌రూమ్‌ మరియు టాయిలెట్‌, ఉదయం టీ నుండి రాత్రి భోజనం వరకూ ఉపాహారాలు అందించడానికి సేవకులు, చల్లదనం కోసం మంచు గడ్డలతో నింపబడిన పాత్రకు పైగా తిరుగుతూ ఉండే ఒక ఫ్యాను, మంగలి, భారతదేశంలో జన్మించిన రచయిత రడ్‌యార్డ్‌ కిప్లింగ్‌ వ్రాసిన క్రొత్త నవలలతో పాటు వీలర్స్‌ రైల్వే లైబ్రరీ సిరీస్‌నుండి సాహిత్యం ఉండేవి. 1860లలో ప్రయాణించిన లూయిస్‌ రస్సల్‌, “ఈ అపారమైన దూరాన్ని చాలా తక్కువ శ్రమతో” ప్రయాణించగలిగాను అని చెప్పాడు.

మహత్తరమైన వ్యవస్థ పెరుగుతూనే ఉంది

భారతదేశంలోని రైల్వే వ్యవస్థ 1900కల్లా ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఐదవ స్థానాన్ని సంపాదించుకుంది. అంతకుముందు దిగుమతి చేసుకోబడిన స్టీమ్‌, డీసెల్‌, ఎలెక్ట్రిక్‌ ఇంజన్‌లు, కంపార్ట్‌మెంట్‌లు, పట్టాలపై ఉపయోగించే ఇతర వాహనాలన్నింటినీ స్థానికంగా ఉత్పత్తి చేయడం ప్రారంభమయ్యింది. 230 టన్నుల బరువున్న ఇంజన్లు, 6,000 హార్స్‌పవర్‌ల ఎలక్ట్రిక్‌ ఇంజన్‌లు, 123 టన్నుల బరువుకలిగిన 3,100 హార్స్‌పవర్‌ల డీసెల్‌ ఇంజన్‌ వంటి కొన్ని ఇంజన్లు నిజంగా మహత్తరమైనవే. 1862వ సంవత్సరంలో ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి రెండంతస్థుల రైలు ప్రవేశపెట్టబడింది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో ప్రపంచంలోకెల్లా పొడవైన ప్లాట్‌ఫారమ్‌ అంటే 833 మీటర్ల ప్లాట్‌ఫారమ్‌, కలకత్తాలోని సీల్డాలో పైన కప్పుగల అతిపొడవైన ప్లాట్‌ఫారమ్‌లు అంటే ఒక్కోటి 300 మీటర్ల పొడవున్న ప్లాట్‌ఫారమ్‌లు ఉన్న ఖ్యాతి భారతదేశానికే చెందుతుంది.

తొలి రైళ్ళు బ్రాడ్‌ గేజ్‌ పట్టాలపై ప్రయాణించేవి. తర్వాత, డబ్బు ఆదా చేయడం కోసం మీటర్‌ గేజ్‌ పట్టాలు ప్రవేశపెట్టబడ్డాయి. మీటర్‌ గేజ్‌తోపాటు కొండలమీద ప్రయాణం కోసం నారో గేజ్‌ ప్రవేశపెట్టబడింది. 1992లో ప్రాజెక్ట్‌ యూనీగేజ్‌ (అన్ని గేజ్‌లను ఒకే విధంగా మార్చడం కోసం చేపట్టిన ప్రాజెక్టు) ప్రారంభించబడింది, అప్పటినుండి ఇప్పటివరకూ 7,800 కిలోమీటర్ల పట్టాలు నారో గేజ్‌ మరియు మీటర్‌ గేజ్‌ల నుండి బ్రాడ్‌ గేజ్‌కు మార్చబడ్డాయి.

ముంబయి సబ్‌ అర్బన్‌ రైళ్ళు, లక్షలాదిమంది ప్రయాణికులను తీసుకుని వెళ్తూ ఎప్పుడూ మోతాదుకు మించి నింపబడినట్లే కనిపిస్తాయి. కలకత్తాలోని భూగర్భమార్గంలో ప్రయాణించే మెట్రో రైలు రోజుకు 17 లక్షలమంది ప్రయాణికులను తీసుకుని వెళ్ళగలదు. చెన్నై (మునుపు మద్రాసు) భారతదేశంలోని తొలి ఎలివేటెడ్‌ రైలు వ్యవస్థను కలిగివుంది. రైల్వే వ్యవస్థకు కంప్యూటరైజ్డ్‌ బుకింగ్‌ మరియు మల్టీమీడియా సమాచార కియోక్స్‌ ఇటీవలే జోడించబడ్డాయి. ఇది చాలా బిజీగా ఉంటూ అంతకంతకూ వృద్ధి చెందుతున్న మహత్తరమైన వ్యవస్థ.

ఉత్తేజపరిచే “బుల్లి రైళ్ళు”

వేడినుండి తప్పించుకోవడానికి బ్రిటీష్‌ కాలనీలవారు కొండప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడేవారు. అక్కడకు త్వరగా చేరుకోవాలనే కోరిక, “బుల్లి రైళ్ళు” నడిచేలా కొండలలో రైలుమార్గాలను నిర్మించడానికి వారిని ప్రేరేపించింది. అప్పుడు ప్రయాణాలు వేగవంతమయ్యాయి​—అంటే, గుర్రం మీద స్వారీ చేయడం లేదా పల్లకిలో మోయబడడం కంటే ఇప్పుడు వేగంగా ప్రయాణించవచ్చు. ఉదాహరణకు, దక్షిణ భారతదేశంలోని ‘బుల్లి రైలు’ తన ప్రయాణికులను నీలగిరి కొండలకు తీసుకుని వెళుతుంది. అది గంటకు 10.4 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, బహుశా భారతదేశంలోకెల్లా అతిమెల్లగా నడిచే రైలు అదే. అయితే కూనూర్‌ వరకూ కొండలలోని టీ మరియు కాఫీ తోటల మధ్యనుండి 1,712 మీటర్ల ఎత్తులో చేసే ప్రయాణం ఖచ్చితంగా అద్భుతమైన ప్రయాణమే! 19వ శతాబ్దపు చివరిభాగంలో నిర్మించబడిన ఆ రైలుమార్గం ప్రతి 12 మీటర్ల దూరానికి ఒక మీటరు ఎత్తు పైకి వెళుతూ 208 మలుపులు తిరిగి 13 సొరంగాలను దాటుతుంది. అది ఆబ్ట్‌ పీనియన్‌-ర్యాక్‌ వ్యవస్థను ఉపయోగిస్తుంది. పళ్ళలా ఉండే ర్యాక్‌ బార్లు నిచ్చెనలా పనిచేస్తాయి, రైలును వెనక నుండి నెట్టుకుంటూ ఇంజన్‌ ఆ నిచ్చెనలాంటి ర్యాక్‌లమీద ప్రయాణిస్తుంది. ఈ రైలుమార్గం, ప్రపంచంలో ర్యాక్‌ మరియు అడ్‌హెషన్‌ టెక్నాలజీని ఉపయోగించే రైలుమార్గాలలో అతిపురాతనమైనది మరియు చాలా నిటారుగా ఉండేది.

డార్జిలింగ్‌ హిమాలయన్‌ రైల్వే 22.5 మీటర్లకు 1 మీటరు చొప్పున క్రమంగా అధిరోహిస్తూ కేవలం రెండు అడుగులు దూరంగా ఉన్న పట్టాలమీద, భారతదేశంలోని కొండల మీద చాలా ఎత్తున అంటే 2,258 మీటర్ల ఎత్తులోవున్న ఘుమ్‌ స్టేషన్‌కు ప్రయాణిస్తుంది. ఆ రైలు మార్గంలో మూడు గుండ్రని వంపులు మరియు ఆరు రివర్సింగ్‌ జిగ్‌జాగ్‌లు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రఖ్యాతి గాంచినది బటాషియా వంపు. దానిగుండా ప్రయాణిస్తుండగా, ప్రయాణికులు రైలులోంచి క్రిందికి దూకి పచ్చగడ్డితోవున్న ఏటవాలు ప్రదేశాల్లోకి ఎక్కి రైలు మలుపు తిరిగిన తర్వాత మళ్ళీ రైలులోకి ఎక్కాలనిపించేంతగా వారిని ఆకర్షిస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణం, ప్రపంచంలోని అతిపెద్ద పర్వతాల్లో మూడవదైన కాంచనజంగ పర్వతాన్ని చూడడంతో ముగుస్తుంది. ఈ రైలుమార్గం భవిష్యత్తుకు భద్రతను చేకూరుస్తూ 1999వ సంవత్సరంలో ఈ రైల్వేకు యునెస్కో ద్వారా వరల్డ్‌ హెరిటేజ్‌ స్టేటస్‌ ఇవ్వబడింది.

బ్రిటీష్‌ పరిపాలనలో భారతదేశానికి వేసవి కాలపు రాజధానిగా, 2,200 మీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లాను చేరుకోవడానికి, రైలు 102 సొరంగాల గుండా ప్రయాణించి, 869 వంతెనలను దాటి, కేవలం 95 కిలోమీటర్ల దూరంలోనే 919 మలుపులను తిరిగి వెళుతుంది! పెద్ద కిటికీలనుండి, ఫైబర్‌ గ్లాస్‌తో చేసిన పైకప్పునుండి అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. అవును “బుల్లి రైళ్ళు” నిజంగా ఆహ్లాదకరమైనవి. అయితే విచారకరంగా, టిక్కెట్టు ధరలు తక్కువగానే ఉంచబడ్డాయి కాబట్టి కొండప్రాంతాల్లోని రైల్వే నష్టాల్లో నడుస్తోంది. ఈ ఉత్తేజకరమైన బుల్లి రైళ్ళను కాపాడడానికి మార్గం కనిపెట్టబడుతుందని రైల్వే అభిమానులు ఆశిస్తున్నారు.

రైలులో సుదూర ప్రయాణం

భారతదేశంలో రైళ్ళ రాక, “ఒక శకపు అంతాన్ని, మరో శకపు ఆరంభాన్ని” ప్రకటించిందనీ, “ఏ ఐక్యతా ప్రణాళిక కూడా ఇంతవరకూ సాధించలేనంతగా రైల్వే భారతదేశాన్ని ఐక్యపరచిందనీ” చెప్పబడుతుంది. నిజమే! మీరు ఇష్టపడితే, జమ్మూలో హిమాలయాల క్రింద ఉన్న కొండల వద్ద రైలు ఎక్కి, భారతదేశంలో దక్షిణాన ఉన్న చిట్టచివరి ప్రాంతమైన కన్యాకుమారి వద్ద దిగిపోవచ్చు, అదే అరేబియా సముద్రము హిందూ మహాసముద్రము బంగాళా ఖాతము కలిసే ప్రాంతం. మీరు అప్పటికి 12 రాష్ట్రాల గుండా 3,751 కిలోమీటర్లు ప్రయాణించి దాదాపు 66 గంటలు రైలులో గడిపివుంటారు. స్లీపర్‌ బెర్త్‌తో సహా మీ టిక్కెట్టుకు మీరు 600 రూపాయిల కంటే తక్కువ ఖర్చు చేసి ఉంటారు. అనేక సంస్కృతుల నుండి వచ్చిన స్నేహపూర్వకమైన మాటకారులైన ప్రజలను కలిసే అవకాశం, ఈ అద్భుతమైన దేశంలో ఎంతో భాగాన్ని చూసే అవకాశం మీకు దొరికివుంటాయి. రిజర్వేషన్‌ చేసుకోండి​—శుభప్రయాణం చేయండి! (g02 7/8)

[14వ పేజీలోని బాక్సు]

ఆ ప్రాచీన ఇటికలు

బ్రిటీష్‌ పరిపాలనా కాలంలో (1757-1947), భారత ఉపఖండంలోని రైల్వేలు, సైనిక దళాలు దూరప్రయాణాలు చేయడానికి ఉపయోగకరమని నిరూపించబడ్డాయి. భారతదేశంలోని మొదటి రైలును ప్రారంభించిన మూడు సంవత్సరాలలోపు, ఇంజనీర్లు నేడు పాకిస్తాన్‌గా ఉన్నదానిలోని కరాచి నుండి లాహోర్‌ వరకూ రైలుమార్గాలను నిర్మించడం ప్రారంభించారు. పట్టాలను పటిష్ఠం చేసేందుకు కంకరు వేయడానికి రాళ్ళు కొరవడ్డాయి, కానీ హరప్పా గ్రామం దగ్గర కూలీలు బట్టీలో కాల్చబడిన ఇటికలను కనుగొన్నారు. స్కాట్‌లాండ్‌కు చెందిన జాన్‌ మరియు విలియమ్‌ బ్రూటన్‌ అనే ఇంజనీర్లు, ఈ ఇటికలు తక్కువ ధరకు లభించే మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయని భావించారు. నిలువచేయబడిన అనేక ఇటికలను పనివారు బయటకు తీస్తుండగా, బంకమట్టితో చేసిన చిన్న చిన్న విగ్రహాలు మరియు ఏదో తెలియని భాషలో రాయబడిన గ్రంథపుచుట్టలు కనుగొనబడ్డాయి, అయితే ఇది అత్యంత ప్రాముఖ్యమైన రైలుమార్గ నిర్మాణపనిని ఆటంకపర్చలేదు. హరప్పా ఇటికలతో నూటా అరవై కిలోమీటర్ల పొడవుగల రైలుమార్గం నిర్మించబడింది. అరవై అయిదు సంవత్సరాల తర్వాత, పురాతత్త్వశాస్త్రజ్ఞులు క్రమబద్ధంగా హరప్పా ప్రాంతాన్ని తవ్వి ప్రాచీన మెసొపొటేమియా కాలానికి సమకాలీనమైనదైన, 4,000 సంవత్సరాల పురాతనమైనదైన అద్భుతమైన సింధు లోయ నాగరికతకు సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు!

[16వ పేజీలోని బాక్సు/చిత్రం]

కొంకణ్‌ రైల్వే​ఒక ఆధునిక అద్భుతం

భారతదేశ పడమటి తీరాన, అరేబియా సముద్రానికీ సహ్యద్రి పర్వత శ్రేణికీ మధ్య, 75 కిలోమీటర్ల భూవిస్తారం గల ప్రాంతమే కొంకణ. భారతదేశ ప్రధాన వాణిజ్య కేంద్రమైన ముంబయి నుండి దక్షిణాన మంగళూరులోని ప్రముఖ ఓడరేవు వరకు విస్తరించివున్న కొంకణ వ్యాపారానికి ప్రయోజనకరమైన ప్రదేశం. తీరప్రాంతానికి చెందిన ఓడరేవులు శతాబ్దాలుగా భారతదేశంలోనూ ఇతర దేశాలతోనూ ఈ వ్యాపారం చేస్తున్నాయి. కానీ సముద్ర ప్రయాణం అపాయకరంగా ఉండేది, ప్రత్యేకించి వర్షాకాలంలో నదుల్లో ప్రయాణించడం అననుకూలంగా ఉండేది. ప్రాకృతికమైన ఆటంకాలను అధిగమించడానికి రోడ్లు మరియు రైలుమార్గాలు దేశంలోపలి భాగానికి చాలా దూరం వెళ్ళేవి. పెద్ద మార్కెట్లకు సరుకులను, ప్రత్యేకించి నిల్వ ఉండని సరుకులను త్వరగా రవాణా చేయడానికి ఓడరేవు వరకు మార్గం ఉంటే బాగుంటుందని ఆ ప్రాంతపు ప్రజలు తీవ్రంగా కోరుకున్నారు. దానికి పరిష్కారం?

20వ శతాబ్దంలో ఈ ఉపఖండంలో కొంకణ్‌ రైల్వే ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టుగా తయారయ్యింది. దానిలో ఏమి ఇమిడివుంది? పట్టాలను సమానంగా ఉంచడానికి అవసరమైన చోట్ల 25 మీటర్ల ఎత్తు వరకూ రోడ్డును కట్టి, కొన్నిసార్లు భూమిని సమాంతరంగా చేయడానికి 28 మీటర్ల లోతు వరకూ త్రవ్వి 760 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించడం జరిగింది. 2,000 కంటే ఎక్కువ వంతెనలను నిర్మించారు. ఆసియాలోకెల్ల ఎత్తైనదైన 64 మీటర్ల ఎత్తున్న పన్వేల్‌ నాడీ వయాడక్ట్‌ వంతెన కూడా అందులో భాగమే. ఈ వంతెన 500 మీటర్ల వెడల్పున్న లోయమీద నిర్మించబడింది. నిర్మించబడిన వంతెనలలో 2.065 కిలోమీటర్ల పొడవున్న శరావతీ నది వంతెన కూడా ఉంది. పర్వత శ్రేణులను చీల్చుకుంటూ నిర్మించిన రైలు మార్గం వంకర్లు లేకుండా నిటారుగా ఉండాలని 92 సొరంగాలను త్రవ్వారు. వాటిలో 6 సొరంగాలు 3.2 కిలోమీటర్లకంటే ఎక్కువ పొడవున్నాయి. నిజానికి, ఇప్పటివరకూ భారతదేశంలోవున్న సొరంగాలన్నింటిలోకెల్లా పొడవైనది వీటిలో ఒకటి, అది 6.5 కిలోమీటర్ల పొడవున్న కార్‌బుడే సొరంగం.

వీటిని నిర్మించేటప్పుడు కుంభవృష్టిలా పెద్దవానలు కురవడం, కొండచరియలు విరిగి క్రిందకు జారి పడడం, మట్టి క్రిందికి జారిపోవడం, అలాగే స్థిరమైన రాళ్ళలోంచి సొరంగాలు త్రవ్వడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తాయి. మరింత కష్టభరితమైన సమస్య, టూత్‌పేస్ట్‌లా ఉండేదని వర్ణించబడిన లితోమార్జిక్‌ మెత్తని మట్టిని చీల్చుకుంటూ సొరంగాలను నిర్మించడం. ప్రాకృతికమైన ఈ ఆటంకాలన్నింటినీ ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో, సాంకేతిక పరిజ్ఞానంతో అధిగమించవలసి వచ్చింది. సొరంగాలలో సెంట్రీఫ్యూగల్‌ మరియు జెట్‌ఫాన్‌ వెంటిలేషన్‌తోపాటు ఇతర భద్రతా ఏర్పాట్లు కూడా విస్తృతమైన ప్రాజెక్ట్‌లు. 42,000 మంది వేర్వేరు భూస్వాములనుండి భూమిని సంపాదించవలసి వచ్చింది, అందుకు చట్టబద్ధంగా ఎంతో పని చేయవలసి వచ్చింది.

అయితే, కేవలం ఏడు సంవత్సరాల నిర్మాణ సమయం​—ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టుకు అంత తక్కువ సమయం రికార్డే​—తర్వాత 1998 జనవరి 26వ తేదీన కొంకణ్‌ రైల్వేకు సంబంధించిన మొదటి రైలు ప్రయాణం మొదలుపెట్టడానికి సిగ్నల్‌ ఇవ్వబడింది. ముంబయి నుండి మంగళూరు మునుపు చుట్టు తిరిగివెళ్ళే మార్గంకన్నా ఈ మార్గం 1,127 కిలోమీటర్లు చిన్నది, ప్రయాణ సమయంలో 26 గంటలు తగ్గించబడ్డాయి. కొంకణ్‌ రైల్వే, రైలు ప్రయాణికులకు కనువిందు చేసే అద్భుతమైన దృశ్యాలను, పర్యాటకులు పరిశీలించడానికి ఆసక్తికరమైన క్రొత్త ప్రదేశాలను అందుబాటులోకి తెచ్చి, కోట్లాది మంది ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చింది.

[మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ముంబయి

మంగళూరు

[చిత్రం]

పన్వేల్‌ నాడీ వయాడక్ట్‌, ఆసియాలోకెల్లా ఎత్తైన వంతెన

[చిత్రసౌజన్యం]

Dipankar Banerjee/STSimages.com

[16వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఫెయిరీక్వీన్‌

ఫెయిరీక్వీన్‌, ప్రపంచంలోకెల్లా ఇప్పటికీ పనిచేస్తున్న అతిపురాతనమైన స్టీమ్‌ ఇంజన్‌. కిట్సన్‌, థామ్‌సన్‌, హెవిట్‌సన్‌ల ఇంజనీరింగ్‌ ఫర్మ్‌ ద్వారా ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో 1855వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఇంజన్‌ కలకత్తాకు దగ్గర్లో ఉన్న హౌరా స్టేషన్‌ నుండి బెంగాల్‌లోని రాణిగంజ్‌ వరకు టపా తెచ్చే రైళ్ళను తీసుకుని వెళ్ళేది. 1909లో అది పనిచేయడం మానేసిన తర్వాత, రైలు ప్రియులను సంతోషపరుస్తూ దాన్ని న్యూ ఢిల్లీలోని నేషనల్‌ రైల్‌ మ్యూజియంలో పెట్టడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు గడిచిన సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి నమ్మకమైన ఈ పాత ఇంజన్‌ను తిరిగి ఉపయోగించడం ప్రారంభించారు. 1997 నుండి ఈ ఫెయిరీక్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీ నుండి రాజస్థాన్‌లోని అల్వార్‌ వరకూ అంటే 143 కిలోమీటర్ల దూరం టూరిస్టులను తీసుకుని చుక్‌ చుక్‌ మంటూ ప్రయాణిస్తుంది.

[17వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

విలాసం, వేగం​—భారతదేశంలో రెండూ ఉన్నాయి!

విలాసం భారతదేశానికి ప్రాచీనమైన, సుసంపన్నమైన చరిత్ర ఉంది. ప్రత్యేకమైన రైల్వే టూర్లు, ఖరీదైనవే అయినప్పటికీ ఆ చరిత్రలోని కొంత భాగాన్ని సౌకర్యవంతంగా దర్శించడానికి అవకాశాన్నిస్తాయి. స్టీమ్‌ ఇంజన్‌తో నడపబడే ప్యాలస్‌ ఆన్‌ వీల్స్‌ (చక్రాలపై రాజభవనం) 1982వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. పూర్వం మహారాజులు, వైస్రాయిలు ఉపయోగించిన రైలుపెట్టెలనే విలాసవంతంగా పునరుద్ధరించడం ద్వారా అవి వారి రాచరిక వారసత్వపు వాతావరణాన్ని తిరిగి సంతరించుకున్నాయి. ముత్యాల్లా తెల్లగా ఉండే వాటి బాహ్యరూపం, గోడలపై అమర్చబడిన బర్మా టేకుతో చేయబడిన పలకలు, క్రిస్టల్‌తో చేయబడిన షాండెలీర్‌లు, అద్భుతమైన ముదురు రంగు వస్త్రాలు వైభవం ఉట్టిపడేలా చేస్తాయి. నిద్రించడానికి మహత్తరమైన గదులు, భోజనశాలలు, తీరిక సమయాల్లో కూర్చోవడానికి వసారా, గ్రంథాలయం, రుచికరమైన అంతర్జాతీయ వంటకాలు, యూనిఫారమ్‌లో ఉన్న సేవకులు అందించే సేవలు, ఇవన్నీ ప్రయాణికులు తాము నిజంగా శ్రద్ధగా చూసుకోబడుతున్నాము అని భావించేలా చేస్తాయి.

1995వ సంవత్సరంలో పట్టాలను బ్రాడ్‌-గేజ్‌ పట్టాలుగా మార్చడం వల్ల పాత కంపార్ట్‌మెంట్‌లు తీసివేయబడి ఒక క్రొత్త ప్యాలస్‌ నిర్మించబడింది. పడమటి రాష్ట్రాలైన గుజరాత్‌, రాజస్థాన్‌లలో పాత మీటర్‌ గేజ్‌ పట్టాల మీద ద రాయల్‌ ఓరియంట్‌ అనే క్రొత్త విలాసవంతమైన రైలు ఇప్పటికీ నడుస్తుంది. ఈ రైళ్ళు ప్రాముఖ్యంగా రాత్రివేళల్లో ప్రయాణిస్తాయి, ప్రయాణికులు పగలు వేర్వేరు ప్రదేశాలను సందర్శిస్తూ గడుపుతారు. ప్రయాణికులు, ప్రాచీనమైన కోటలు, రక్షణ దుర్గాలు, ఆలయాలు ఉన్న విస్తారమైన థార్‌ ఎడారి గుండా ప్రయాణిస్తారు. ఎవరైనా ఇష్టపడితే ఇసుక దిబ్బల మీద ఒంటె సవారీ, ప్రఖ్యాతి గాంచిన అంబర్‌ కోటకు వెళ్ళడానికి ఏనుగు సవారీ చేయవచ్చు. దగ్గర్లలోనే పింక్‌ సిటీ అని పిలువబడే జైపూర్‌ పట్టణం ఉంది. అక్కడ ఎన్నో చారిత్రాత్మక సంఘటనలు జరిగాయి, రత్నాలు మరియు హస్తకళాకృతులకు ఆ పట్టణం ప్రఖ్యాతి గాంచింది. పర్యటనలో పక్షుల సాంక్చరీలు, పులులు సంరక్షించబడే ప్రాంతం, అరణ్యాలలో మిగిలివున్న ఆసియా సింహాలు ఉండే స్థలాన్ని సందర్శించవచ్చు. ఉదయపూర్‌ లేక్‌ ప్యాలస్‌ను తాజ్‌మహల్‌ను సందర్శించడం మర్చిపోకండి! ఇవన్నీ, మరితర విషయాలు కూడా రైలులో ప్రయాణించే ఆనందాన్ని అధికం చేస్తాయి.

వేగం ఫ్రాన్సు, జపానులలోని రైళ్ళ అధికవేగపు తీవ్రతతో భారతదేశంలోని రైళ్ళు పోటీపడలేవు. కానీ త్వరితమైన, సౌకర్యవంతమైన దూరప్రయాణాలు, భారతీయ రైల్వేకు సంబంధించిన 106 జతల సూపర్‌ఫాస్ట్‌ ఇంటర్‌సిటీ రైళ్ళతో సాధ్యమే. గంటకు దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రాజధాని, శతాబ్ది రైళ్ళు, సదుపాయ సౌకర్యాలు కల్పించడంలో విమాన ప్రయాణాలకు ఏమాత్రం తీసిపోవు. ఎ.సి కోచ్‌లలో వాలు కుర్చీలు లేక నిద్రపోవడానికి సౌకర్యవంతమైన బెర్త్‌లు ఉంటాయి. ఈ ప్రతిష్ఠాత్మకమైన రైళ్ళ టిక్కెట్టు ఖర్చులో, భోజనాలు మరియు ఉపాహారాలు, పరుపు దుప్పట్లు, సురక్షితమైన త్రాగే నీరు, వైద్యపరమైన సహాయానికి అయ్యే ఖర్చులు కూడా చేర్చబడతాయి.

[మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

జైపూర్‌

ఉదయపూర్‌

[చిత్రాలు]

హవా మహల్‌, జైపూర్‌

తాజ్‌మహల్‌, ఆగ్రా

ద రాయల్‌ ఓరియంట్‌

“ప్యాలస్‌ ఆన్‌ వీల్స్‌” లోపల

[చిత్రసౌజన్యం]

Hira Punjabi/STSimages.com

[13వ పేజీలోని మ్యాపు/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

న్యూ ఢిల్లీ

[చిత్రాలు]

పెద్ద రైల్వే లైన్లలో కొన్ని

స్టీమ్‌ ఇంజన్‌, జవార్‌

స్టీమ్‌ ఇంజన్‌, డార్జిలింగ్‌ హిమాలయన్‌ రైల్వే (డి.హెచ్‌.ఆర్‌)

ఎలెక్ట్రిక్‌ ఇంజన్‌, ఆగ్రా

ఎలెక్ట్రిక్‌ ఇంజన్‌, ముంబయి

డీసెల్‌ ఇంజన్‌, హైదరాబాదు

డీసెల్‌ ఇంజన్‌, సిమ్లా

[చిత్రసౌజన్యం]

పటం: © www.MapsofIndia.com

[15వ పేజీలోని మ్యాపు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ముంబయి

[చిత్రం]

చర్చిగేట్‌ స్టేషన్‌, ముంబయి

[చిత్రసౌజన్యం]

Sandeep Ruparel/STSimages.com

[15వ పేజీలోని మ్యాపు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

నీలగిరి కొండలు

[చిత్రం]

నీలగిరి ‘బుల్లి రైలును’ స్టీమ్‌ ఇంజన్‌ నిటారుగా ఉన్న శిఖరంపైకి తోస్తుంది

[18వ పేజీలోని మ్యాపు/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

డార్జిలింగ్‌

[చిత్రాలు]

బటాషియా వంపు, ఈ రైల్వే లైను వంపు తిరిగి మళ్ళీ అదే లైనుకు పైగా వెళుతుంది

బటాషియా వంపునుండి కాంచనజంగ కొండ యొక్క దృశ్యం

[14వ పేజీలోని చిత్రసౌజన్యం]

2వ పేజీ, 13వ పేజీ, 15వ పేజీ మధ్యలో, 16-18 పేజీల్లోని రైళ్ళు: Reproduced by permission of Richard Wallace