కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పిల్లలకు అవసరమైనదానిని వాళ్ళకు ఇవ్వడం

పిల్లలకు అవసరమైనదానిని వాళ్ళకు ఇవ్వడం

పిల్లలకు అవసరమైనదానిని వాళ్ళకు ఇవ్వడం

చిన్నపిల్లలను ఎంతో శ్రద్ధగా చూసుకోవాలని స్పష్టమవుతోంది, కానీ చాలామంది పిల్లలకు అలాంటి ప్రేమపూర్వకమైన శ్రద్ధ లభించడంలేదని రుజువులు చూపిస్తున్నాయి. నేటి యౌవనస్థుల పరిస్థితి అదే సూచిస్తోంది. “నేటి యౌవనస్థులు మునుపెన్నడూ తమ కుటుంబాలకు ఇంతగా దూరమైపోలేదు, వారికి ఆచరణాత్మకమైన అనుభవం గానీ ఆచరణాత్మకమైన జ్ఞానం గానీ మునుపెన్నడూ ఇంతగా కొరవడలేదు” అని కెనడాలోవున్న టొరంటోకు చెందిన ద గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ వార్తాపత్రికలో ఉల్లేఖించబడిన ఒక పరిశోధకురాలు తన విచారాన్ని వ్యక్తం చేసింది.

ఎక్కడ పొరపాటు జరిగింది? చిన్నపిల్లలను శ్రద్ధగా చూసుకోవడం ఎంత ప్రాముఖ్యమో గ్రహించకపోవడం సమస్యకు కనీసం కొంతమేరకైనా కారణమని చెప్పవచ్చా? “తల్లిదండ్రులుగా ఉండేందుకు కావలసిన నైపుణ్యాలను మనందరం నేర్చుకోవాలి” అని ఒక మానసిక వైద్యురాలు చెబుతోంది, ఆమె తక్కువ ఆదాయంగల స్త్రీలకు తమ నవజాత శిశువులను ఎలా చూసుకోవాలో నేర్పిస్తుంది. “మనం ఇప్పుడు మన పిల్లలతో సమయం గడిపితే, భవిష్యత్తులో అది గొప్ప ప్రతిఫలాలను తీసుకువస్తుందని మనం గ్రహించాలి” అని ఆమె అంటోంది.

పసిపిల్లలకు కూడా క్రమమైన ఉపదేశం అవసరం. అప్పుడప్పుడు కేవలం కొద్ది నిమిషాలు వారితో గడిపితే సరిపోదు, క్రమంగా అంటే రోజంతటిలో వారికి ఉపదేశిస్తుండాలి. పిల్లలు చక్కగా ఎదగాలంటే పసితనం నుండే వాళ్ళతో సమయం గడపడం ఎంతో ఆవశక్యం.

సిద్ధపడడం అవసరం

తల్లిదండ్రులు తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి, బిడ్డ జన్మించకముందే సిద్ధపడడం అవసరం. ముందుగానే ప్రణాళిక వేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో సూచిస్తూ యేసుక్రీస్తు చెప్పిన సూత్రం నుండి వారు నేర్చుకోవచ్చు. “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?” అని ఆయన అడిగాడు. (లూకా 14:28) పిల్లలను పెంచడం తరచూ 20 యేళ్ళ ప్రాజెక్టు అని పిలువబడుతోంది, అది గోపురం కట్టడం కంటే ఎంతో క్లిష్టమైన పని. కాబట్టి పిల్లలను సమర్థవంతంగా పెంచాలంటే, దాని కోసం ఒక బ్లూ ప్రింట్‌లాంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.

మొదటిగా తల్లిదండ్రులుగా బాధ్యతలను స్వీకరించడానికి మానసికంగా ఆధ్యాత్మికంగా సిద్ధపడడం ప్రాముఖ్యం. జర్మనీలో 2,000 మంది గర్భవతులను అధ్యయనం చేసినప్పుడు, పిల్లలు కావాలని కోరుకోని తల్లులకు జన్మించిన పిల్లలకంటే పిల్లలు కావాలని ఆశతో ఎదురుచూసిన తల్లులకు పుట్టిన పిల్లలు భావోద్వేగపరంగా శారీరకంగా ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నారని వెల్లడయ్యింది. మరోవైపున సంతోషకరమైన వివాహబంధపు భద్రతను అనుభవిస్తున్న స్త్రీకంటే సమస్యలతో నిండివున్న వివాహంలో చిక్కుకుపోయిన స్త్రీ, భావోద్వేగపరంగాను శారీరకంగాను హాని పొందిన శిశువును కనే అవకాశాలు 237 శాతం ఎక్కువగా ఉన్నాయని ఒక పరిశోధకుడు అంచనా వేశాడు.

కాబట్టి పిల్లలు సమర్థవంతంగా ఎదగాలంటే తండ్రులు పోషించే పాత్ర కూడా ప్రాముఖ్యమైనదని స్పష్టమవుతోంది. డా. థామస్‌ వెర్ని ఇలా వ్యాఖ్యానించాడు: “గర్భవతిగావున్న తన భార్యను తిట్టే కొట్టే లేదా నిర్లక్ష్యం చేసే తండ్రి ఉండడం పిల్లవాడికి భావోద్వేగపరంగాను శారీరకంగాను చాలా ప్రమాదకరం.” నిజానికి ఒక పిల్లవాడు పొందగల అత్యుత్తమమైన బహుమతి, తన తల్లిని ప్రేమించే తండ్రి లభించడమే అని తరచూ చెప్పబడుతుంది.

తల్లి రక్తప్రవాహంలోకి విడువబడిన చింతకు ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు పిండంపై ప్రభావం చూపగలవు. అయితే అప్పుడప్పుడు ప్రతికూలమైన భావోద్వేగాలతో లేదా ఒత్తిడితో నిండిన సంఘటనలవల్ల బాధపడినప్పుడు కాకుండా ఎక్కువకాలంపాటు తీవ్రమైన చింతకు గురైనప్పుడు మాత్రమే అది ప్రమాదకరంగా మారుతుందని రుజువులు సూచిస్తున్నాయి. అయితే అన్నింటికంటే ముఖ్యమైనది, గర్భవతియైన తల్లి తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఎలా భావిస్తుంది అనే విషయమేనని అనిపిస్తోంది. *

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ భర్త మీకు మద్దతివ్వకపోతే, లేదా మీకే తల్లి కావడం ఇష్టం లేకపోతే అప్పుడెలా? పరిస్థితులవల్ల ఒక స్త్రీ తన గర్భధారణ విషయమై మానసికంగా కృంగిపోవడం అసాధారణమైన విషయమేమీ కాదు. అయితే ఆ తప్పు మీకు పుట్టబోయే బిడ్డది కాదనే విషయాన్ని మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మరి ప్రతికూలమైన పరిస్థితుల్లో మీరు ప్రశాంతమైన దృక్పథాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

దేవుని వాక్యమైన బైబిలులో ఇవ్వబడిన మార్గనిర్దేశం లక్షలాదిమందికి సహాయం చేసింది. అది ఇలా చెబుతోంది: “ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” ఆ మాటలను అన్వయించుకోవడం, “దేనిని గూర్చియు చింతపడకుడి” అనే ఉపదేశాన్ని అనుసరించడానికి ఎలా సహాయం చేయగలదో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. (ఫిలిప్పీయులు 4:6, 7) మీ గురించి శ్రద్ధ తీసుకోగల సృష్టికర్త ఆదర హస్తం మీకు తోడుగా ఉందని మీరు గ్రహిస్తారు.​—1 పేతురు 5:7.

అసాధారణమైన అనుభవమేమీ కాదు

యౌవనస్థులైన కొంతమంది తల్లులు ప్రసవించిన తర్వాత కొన్ని వారాలపాటు వివరించలేని దుఃఖానికి నిరుత్సాహానికి గురవుతారు. బిడ్డ పుట్టబోతున్నందుకు సంతోషించిన స్త్రీలు కూడా నిరాశా నిస్పృహలకు గురికావచ్చు. వారి మానసిక స్థితి ఇలా మారుతూ ఉండడం అసాధారణమేమీ కాదు. ప్రసవించిన తర్వాత స్త్రీలోని హార్మోన్ల పరిమాణాలు అనూహ్యంగా మారతాయి కాబట్టి అలా జరుగుతుంది. మొదటిసారి తల్లిగా బాధ్యతలు చేపట్టిన స్త్రీ పసివాడికి పాలివ్వడం, డైపర్‌లు మార్చడం, ఏది సరైన సమయం ఏది కాదు అనేది ఏమాత్రం తెలియని తన బిడ్డ అవసరాలను తీర్చడం వంటివాటితో సతమతమవడం కూడా సాధారణమే.

తన బిడ్డ కేవలం తనను హింసించడానికి మాత్రమే ఏడుస్తున్నాడని ఒక తల్లి భావించింది. “పిల్లలను పెంచడం అనే బాధ్యత తీసుకువచ్చే ఒత్తిడిని ఎవ్వరూ తప్పించుకోలేరు” అని జపానుకు చెందిన పిల్లలను పెంచడానికి సంబంధించిన నిపుణుడు చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ నిపుణుడు చెబుతున్నదాని ప్రకారం “ఒక తల్లి అందరికీ దూరమై ఒంటరిదైపోకుండా ఉండడమే అత్యంత ప్రాముఖ్యమైన విషయం.”

తల్లి అప్పుడప్పుడు కృంగుదలను అనుభవించినప్పటికీ, ఆమె తరచూ మారుతూ ఉండే తన మానసిక స్థితి తన బిడ్డపై ప్రభావం చూపకుండా ఉండేలా చూసుకోవచ్చు. టైమ్‌ పత్రిక ఇలా నివేదించింది: “మానసిక కృంగుదలతో బాధపడే తల్లులు తమ దుఃఖాన్ని అధిగమించి తమ పసివాళ్ళకు కావలసినదానికంటే ఎక్కువ అవధానమిస్తూ వాళ్ళతో ఆడుతూపాడుతూ గడిపినప్పుడు, వారి పిల్లలు మరింత సంతోషకరమైన వ్యక్తులుగా తయారయ్యారు.” *

తండ్రి ఎలా సహాయం చేయవచ్చు?

అలాంటి పరిస్థితుల్లో కావలసిన మద్దతును, సహాయాన్ని అందజేయడానికి బిడ్డ తండ్రే సరైన స్థానంలో ఉంటాడు. పసివాడు మధ్య రాత్రి లేచి ఏడ్చినప్పుడు చాలా సందర్భాల్లో తండ్రి బిడ్డ అవసరాలు తీర్చవచ్చు, తత్ఫలితంగా ఆయన భార్య నిద్రపోగలుగుతుంది. “భర్తలు జీవితంలో పాలివారైయున్న తమ భార్యలను అర్థం చేసుకుంటూ కాపురం చేయాలి.”​—1 పేతురు 3:7, ద జెరూసలెమ్‌ బైబిల్‌.

యేసుక్రీస్తు భర్తలు అనుసరించడానికి పరిపూర్ణమైన మాదిరిని ఉంచాడు. ఆయన తన అనుచరుల కోసం తన ప్రాణాలను కూడా అర్పించాడు. (ఎఫెసీయులు 5:28-30; 1 పేతురు 2:21-24) కాబట్టి తమ స్వంత సౌకర్యాన్ని త్యాగం చేసి పిల్లలను పెంచడంలో సహాయం చేసే భర్తలు క్రీస్తును అనుకరిస్తున్నారు. నిజానికి పిల్లలను పెంచడం అనేది తల్లిదండ్రులిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ కలిసి చేయవలసిన కృషి.

ఇద్దరూ కలిసి చేయవలసిన కృషి

“భార్యాభర్తలుగా మేము మా కుమార్తెను ఎలా పెంచాలనే విషయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని చర్చించుకున్నాము” అని రెండేళ్ళ పాప తండ్రి అయిన యోచెరో చెబుతున్నాడు. “సమస్య తలెత్తినప్పుడల్లా దానితో ఎలా వ్యవహరించాలో మేమిద్దరం కలిసి చర్చించుకుంటాము” అని ఆయన అంటున్నాడు. తన భార్యకు కూడా విశ్రాంతి అవసరమని గుర్తించిన యోచెరో తాను చిన్న చిన్న పనుల కోసం బయటకు వెళ్ళినప్పుడల్లా తన కూతురిని తనతో తీసుకొని వెళతాడు.

పూర్వం కుటుంబాలు పెద్దవిగా, ఎంతో సన్నిహితంగా ఉండేవి కాబట్టి తల్లిదండ్రులు తమ పసిపిల్లలను చూసుకోవడానికి ఇతర పెద్ద పిల్లల సహాయాన్ని, బంధువుల సహాయాన్ని తీసుకొనేవారు. కాబట్టి జపానులోని కవాసాకిలో పిల్లలను పెంచడానికి కావలసిన మద్దతును అందించే ఒక కేంద్రంలో పనిచేసే ఒక వ్యక్తి ఇలా వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యమేమీ లేదు: “చాలా సందర్భాల్లో తల్లులు ఏదైనా ఒక విషయం గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు వాళ్ళ మనసు కుదుటపడుతుంది. కేవలం కొంచెం సహాయంతో చాలామంది తల్లులు సమస్యలను అధిగమించగలిగారు.”

తల్లిదండ్రులకు “తమ చింతలను చెప్పుకోవడానికి కొంతమంది వ్యక్తులు అవసరం” అని పేరెంట్స్‌ అనే పత్రిక చెబుతోంది. అలాంటి వ్యక్తులు ఎక్కడ లభిస్తారు? కొత్తగా తల్లిదండ్రులైనవారు విశాల దృక్పథం కలిగివుండి తమ తల్లిదండ్రులు లేదా అత్తమామలు చెప్పే విషయాలను వినడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందవచ్చు. అయితే తుది నిర్ణయం యువ దంపతులదేనని తాతామామ్మలు కూడా గుర్తించాలి. *

కొత్తగా తల్లిదండ్రులైనవారు ఆధారపడదగిన మరో మూలం, వారి తోటి మత విశ్వాసులు. యెహోవాసాక్షుల స్థానిక సంఘంలో, పిల్లలను పెంచడంలో ఎన్నో సంవత్సరాల అనుభవంగల, మీ సమస్యలను వినడానికి సుముఖత చూపించే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మీకు కొన్ని సహాయకరమైన చిట్కాలు చెప్పవచ్చు. క్రైస్తవ సూత్రాలకు అనుగుణంగా జీవించడంలో ఎక్కువ అనుభవంగల స్త్రీలను బైబిలు “వృద్ధస్త్రీలు” అని పిలుస్తోంది, వారు యౌవన స్త్రీలకు సహాయం చేయడానికి సుముఖంగా ఉంటారు కాబట్టి మీరు వారి సహాయాన్ని కోరవచ్చు.​—తీతు 2:3-5.

అయితే తల్లిదండ్రులు ఇతరుల సలహాలను వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనడంలో సందేహం లేదు. “మా చుట్టూవున్న వారందరూ ఒక్కసారిగా, పిల్లలను పెంచడంలో నిపుణులమన్నట్లు మాట్లాడ్డం ప్రారంభించారు” అని యోచెరో చెబుతున్నాడు. ఆయన భార్య టకాకో ఇలా ఒప్పుకుంటోంది: “మొదట్లో నేను ఇతరుల సలహాలు విని చాలా కలత చెందేదాన్ని, ఎందుకంటే తల్లిగా నాకు అనుభవం లేదనే విషయాన్ని వాళ్ళు విమర్శిస్తున్నారని నాకు అనిపించేది.” కానీ చాలామంది భార్యాభర్తలు ఇతరుల నుండి నేర్చుకోవడం ద్వారా, తమ పిల్లలకు అవసరమైనదానిని వారికి అందించే విషయంలో సమతుల్యమైన దృక్పథాన్ని కలిగివుండడానికి సహాయం పొందారు.

అందుబాటులోవున్న అత్యుత్తమమైన సహాయం

మీకు సహాయం చేయడానికి ఎవ్వరూ అందుబాటులో లేరు అనిపించినప్పటికీ మీరు బలం కోసం ఆధారపడదగినవారు ఒకరు ఉన్నారు. ఆయనే మనలను సృష్టించిన యెహోవా దేవుడు, భూమిపై జన్మించేవారు ‘పిండమై ఉండగానే’ ఆయన కన్నులు వారిని చూడగలవు. (కీర్తన 139:16) యెహోవా వాక్యమైన బైబిలులో వ్రాయబడి ఉన్నట్లుగా, పూర్వకాలంలోని తన ప్రజలతో ఆయన ఒకసారి ఇలా అన్నాడు: “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.”​—యెషయా 49:15; కీర్తన 27:10.

అవును యెహోవా తల్లిదండ్రులను మరచిపోడు. పిల్లలను పెంచడానికి సంబంధించి చక్కని మార్గనిర్దేశాలను ఆయన బైబిలులో అందించాడు. ఉదాహరణకు దాదాపు 3,500 సంవత్సరాల క్రితం దేవుని ప్రవక్తయైన మోషే ఇలా వ్రాశాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.” ఆ తర్వాత మోషే ఇలా అన్నాడు: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు [యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించి, సేవించాలనే ఉద్బోధతో సహా] నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.”​—ద్వితీయోపదేశకాండము 6:5-7.

దేవుని వాక్యంలో ఇవ్వబడిన ఈ మార్గనిర్దేశం చెబుతున్న ముఖ్యమైన తలంపు ఏమిటని మీరనుకుంటున్నారు? పిల్లలకు ఉపదేశమివ్వడమనేది క్రమంగా ప్రతిరోజు చేయవలసిన పని అనే కదా? మీ పిల్లలతో అప్పుడప్పుడు విలువైన సమయం అని పిలువబడే సమయాన్ని గడిపేందుకు పట్టిక తయారు చేసుకుంటే సరిపోదు. సంభాషించుకోవలసిన ప్రాముఖ్యమైన సందర్భాలు వాటంతటవే వస్తాయి కాబట్టి మీరు మీ పిల్లలతో క్రమంగా సమయం గడపడం అవసరం. అలా చేయడం ద్వారా మీరు “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము” అనే బైబిలు ఆజ్ఞను నెరవేర్చగలరు.​—సామెతలు 22:6.

పిల్లలకు సరైన శిక్షణ ఇవ్వడంలో వారికి బిగ్గరగా చదివి వినిపించడం కూడా ఒక భాగమే. మొదటి శతాబ్దపు శిష్యుడైన తిమోతికి ‘బాల్యమునుండే పరిశుద్ధలేఖనములు తెలుసు’ అని బైబిలు మనకు చెబుతోంది. అంటే ఆయన తల్లి యునీకే, అవ్వ లోయి తిమోతి పసివాడిగా ఉన్నప్పటినుండే ఆయనకు చదివి వినిపించేవారని స్పష్టమవుతోంది. (2 తిమోతి 1:5; 3:14, 15) మీరు మీ శిశువుతో మాట్లాడడం ప్రారంభించినప్పటి నుండే వాడికి చదివి వినిపించడం ప్రారంభిస్తే మంచిది. కానీ మీరు వాడికి ఏమి చదివి వినిపించవచ్చు, పసివాడికి సహితం నేర్పించడానికి అత్యుత్తమమైన పద్ధతి ఏది?

మీరు మీ పిల్లవాడికి బైబిలు చదివి వినిపించండి. తిమోతికి కూడా అదే చదివి వినిపించబడినట్లు తెలుస్తోంది. రంగురంగుల చిత్రాల ద్వారా పిల్లలకు బైబిలుతో పరిచయమేర్పరిచే పుస్తకాలు కూడా లభ్యమవుతున్నాయి. బైబిలు బోధించే విషయాలను పిల్లలు తమ మనసుల్లో దృశ్యీకరించుకోవడానికి అలాంటి పుస్తకాలు సహాయం చేస్తాయి. ఉదాహరణకు నా బైబిలు కథల పుస్తకము, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి వంటి పుస్తకాలు ఉన్నాయి. అలాంటి పుస్తకాల ద్వారా లక్షలాదిమంది చిన్నపిల్లల మనస్సులపై హృదయాలపై బైబిలు బోధలు ముద్రించబడ్డాయి.

బైబిలు చెబుతున్నట్లుగా “కుమారులు [మరియు కుమార్తెలు] యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము; గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.” (కీర్తన 127:3) మీ సృష్టికర్త ముద్దులొలికే పసిబిడ్డను మీకు “స్వాస్థ్యము”గా ఇచ్చాడు, ఆ బిడ్డ మీరు గర్వపడేందుకు, ఆనందించేందుకు మూలం కావచ్చు. పిల్లలను పెంచడం, ప్రత్యేకంగా తమ సృష్టికర్తను ఘనపరిచేవారిగా వాళ్ళను పెంచడం నిజంగానే ప్రతిఫలదాయకమైన పని! (g03 12/22)

[అధస్సూచీలు]

^ ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లే కాకుండా నికోటిన్‌, మద్యపానీయాలు, ఇతర మాదకద్రవ్యాలు కూడా పిండంపై ప్రతికూలమైన ప్రభావాలు చూపించవచ్చు. గర్భవతులు ప్రమాదకరమైన ఏ పదార్థానికైనా దూరంగా ఉండడం మంచిది. అంతేకాకుండా తల్లి తీసుకొనే మందులు పిండంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో డాక్టర్‌ను అడిగి తెలుసుకోవడం ఆవశ్యకం.

^ ఒక తల్లి తీవ్రమైన దుఃఖానికి నిరాశా నిస్పృహలకు లోనయ్యి తన బిడ్డ నుండి, ప్రపంచం నుండి దూరంగా వెళ్ళిపోవాలని ఆమెకు అనిపిస్తే బహుశా ఆమె పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌తో బాధపడుతుండవచ్చు. ఒకవేళ అలా జరిగితే ఆమె ప్రసూతి వైద్యులను సంప్రదించాలి. తేజరిల్లు! (ఆంగ్లం) జూలై 22, 2002 19-23 పేజీలు, జూన్‌ 8, 2003 21-3 పేజీలు చూడండి.

^ “తాతామామ్మలు​—వారి ఆనందాలు, సవాళ్ళు” అనే ఆర్టికల్‌ను 1999, మార్చి 22 తేజరిల్లు! (ఆంగ్లం)లో చదవండి.

[8వ పేజీలోని చిత్రం]

గర్భస్థ శిశువుపట్ల తల్లికివుండే భావాలు చాలా ప్రాముఖ్యమైనవి

[9వ పేజీలోని చిత్రం]

ప్రసవం తర్వాత స్త్రీ మానసిక స్థితి తరచూ మారుతున్నప్పటికీ, ఆమె తన బిడ్డ తాను ప్రేమించబడుతున్నట్లు, భద్రంగా ఉన్నట్లు భావించడానికి ఎంతో చేయవచ్చు

[10వ పేజీలోని చిత్రం]

పిల్లలను పెంచడంలో భాగం వహించవలసిన బాధ్యత తండ్రులకు కూడా ఉంది

[10వ పేజీలోని చిత్రం]

పిల్లలకు చదివి వినిపించడం బాల్యం నుండే ప్రారంభించాలి