బాణసంచాపట్ల ఆకర్షణ
బాణసంచాపట్ల ఆకర్షణ
పండుగలప్పుడు లేదా ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యేటప్పుడు ఆనందోత్సాహాలతో బాణసంచా కాల్చడం పరిపాటయ్యింది. అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడానికి, ఫ్రాన్సులో బాస్టిల్లి డే ఉత్సవాలకు, ప్రపంచంలోని ప్రతీ నగరంలో ప్రతీ నూతన సంవత్సర వేడుకల్లో బాణసంచా కాంతులతో ఆకాశం వెలిగిపోతుంది.
అయితే బాణసంచాపట్ల మనిషికి ఆకర్షణ ఎప్పుడు ఏర్పడింది? మిరుమిట్లుగొలిపే ఈ ప్రదర్శనలు సృష్టించడంలో ఎలాంటి నేర్పు ఇమిడివుంది?
ప్రాచ్యదేశపు ఆచారం
ప్రాచ్యదేశ రసాయన శాస్త్రవేత్తలు, సాల్ట్పెటర్ను (పొటాషియమ్ నైట్రేటును) గంధకంతో, కర్రబొగ్గుతో కలిపితే ప్రేలుడు పదార్థం తయారవుతుందని తెలుసుకొన్న మన సామాన్య శకం పదవ శతాబ్దంలోనే చైనీయులు బాణసంచా కనిపెట్టారని చాలామంది చరిత్రకారులు ఒప్పుకుంటారు. సులభంగా పేలే ఈ పదార్ధాన్ని మార్కొపొలో వంటి పాశ్చాత్య పరిశోధకులు లేదా అరబ్ వ్యాపారస్తులు బహుశా ఐరోపాకు తీసుకొచ్చి ఉంటారు, దానితో 14వ శతాబ్దానికల్లా యూరోపియన్ ప్రేక్షకులు అద్భుతమైన బాణసంచా ప్రదర్శనలు చూసి ఆనందించడం ఆరంభించారు.
అయితే అలాంటి ముచ్చటైన ప్రదర్శనలు అందించిన ఆ పొడి యూరప్ చరిత్ర దిశను కూడా మార్చివేసింది. గన్‌పౌడర్‌గా పేరుగాంచిన ఆ పదార్థాన్ని సైనికులు సీసపు బుల్లెట్లు పేల్చడానికి, భవంతుల గోడలు కూల్చడానికి, రాజకీయ ప్రభుత్వాల్ని పడద్రోయడానికి ఉపయోగించారు. “యూరప్ మధ్య యుగాల్లో సైనిక ప్రేలుడు పదార్థాలతో బాణసంచా పాశ్చాత్య దేశాలకు వ్యాపించగా, యూరప్‌లో సైనిక ప్రేలుడు పదార్థాల తయారీ నైపుణ్యత విజయోత్సవాల్లో, శాంతి ఉత్సవాల్లో బాణసంచా ప్రదర్శనలు నిర్వహించడానికి ఉపయోగించబడింది” అని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది.
ఇదిలా ఉండగా, చైనీయులు గన్పౌడర్కున్న వినాశక శక్తిని అంతగా పట్టించుకోనట్టుగా కనిపిస్తోంది. 16వ శతాబ్దంలో, చైనాలో మిషనరీగా ఉన్న ఇటలీదేశపు జెసూట్ అయిన మాటియో రిసి ఇలా వ్రాశాడు: “తుపాకులు, ఫిరంగులు ఉపయోగించడంలో చైనీయులు నైపుణ్యంగలవారు కాదు, పైగా వారు యుద్ధాల్లో వీటిని అంతగా ఉపయోగించలేదు. అయితే క్రీడలప్పుడు, పండుగలప్పుడు బాణసంచా ప్రదర్శనకు సాల్ట్పెటర్ విస్తృత మోతాదుల్లో ఉపయోగించబడేది. అలాంటి ప్రదర్శనల్లో చైనీయులు ఎంతో ఆనందించేవారు . . . బాణసంచా తయారీలో వారి నైపుణ్యం నిజంగా అసాధారణం.”
బాణసంచా ప్రదర్శనలోని కిటుకులు
తొలికాలాల్లో వివిధరకాల బాణసంచా ప్రదర్శనల రూపకల్పన చేసేటప్పుడు, ఆ తయారీదారులకు ఇటు నైపుణ్యం అటు ధైర్యం అవసరమయ్యాయనడంలో సందేహం లేదు. గన్‌పౌడర్ పెద్ద గుళికలు నెమ్మదిగా కాలితే, సూక్ష్మంగావుండే నూకలు చిటచిటలాడుతూ కాలతాయని వారు కనుగొన్నారు. పొడవైన వెదురు బొంగు లేదా కాగితపు గొట్టాన్ని ఒకవైపు మూసి క్రింది భాగంలో గన్‌పౌడర్ పెద్దగుళికలతో కూర్చి రాకెట్లు తయారు చేసేవారు. ఆ గన్‌పౌడర్‌ను వెలిగించినప్పుడు, చప్పున వ్యాపించే పొగ, గొట్టం యొక్క తెరిచివున్న భాగం నుండి వేగంగా బయటకువస్తూ రాకెట్‌ను ఆకాశంలోకి నెడుతుంది. (ఈ ప్రాథమిక సూత్రమే రోదసీ యాత్రికులను అంతరిక్షంలోకి పంపడానికి నేడు ఉపయోగించబడుతోంది.) రాకెట్ గొట్టపు పైభాగంలో మెత్తగావుండే గన్‌పౌడర్ కూర్చినందువల్ల, అంతా సక్రమంగా జరిగితే, ఆ రాకెట్ పైకివెళ్లి చివర్లో పేలుతుంది.
శతాబ్దాల కాలంలో బాణసంచాలో సాంకేతికంగా అంతగా మార్పు జరగలేదు. అయితే, కొంత అభివృద్ధి సాధించబడింది. ప్రాచ్యదేశాల వారికి మొదట్లో కేవలం తెలుపు, బంగారువర్ణంలో ప్రదర్శనలు రూపొందించడమే తెలుసు. ఇటాలియన్లు వాటికి రంగులు చేర్చారు. 19వ శతాబ్ద ఆరంభంలో,
గన్‌పౌడర్‌కు పొటాషియమ్ క్లోరేట్ కలిపి ఆ మిశ్రమాన్ని, తీవ్ర ఉష్ణోగ్రతతో కాల్చినప్పుడు వచ్చే మంటకు రంగులు ఏర్పడతాయని తెలుసుకున్నారు. నేడు, ఎర్ర మంట రావడానికి స్ట్రాన్షియమ్ కార్బొనేట్ చేర్చబడుతోంది. టిటానియమ్, అల్యూమినియమ్, మెగ్నీషియమ్ ప్రకాశవంతమైన తెల్లని మంటను, రాగి మిశ్రిత పదార్థాలు నీలిరంగు మంటను, బేరియం నైట్రేటులు ఆకుపచ్చ మంటను, సోడియం ఆక్సెలేటు మిశ్రమాలు పసుపు మంటను కలిగిస్తాయి.బాణసంచా ప్రదర్శనలకు కంప్యూటర్లు అదనపు వన్నె చేకూర్చాయి. బాణసంచాను చేత్తో వెలిగించడానికి బదులు, సంగీతానికి అనుగుణంగా విద్యుత్తుతో బాణసంచా వెలిగించబడేలా కంప్యూటర్లతో ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా టెక్నీషియన్లు తమ ప్రదర్శనలను సమయంతో అనుసంధానం చేయగలుగుతున్నారు.
మతంతో సంబంధం
జెసూట్ మిషనరీ రిసి ప్రస్తావించినట్లుగా, బాణసంచా చైనీయుల మత ఉత్సవాల్లో అంతర్భాగంగా ఉండేది. బాణసంచాను “నూతన సంవత్సర, మరితర సాంప్రదాయ సందర్భాల్లో దయ్యాలను వెళ్లగొట్టడానికి చైనీయులు కనిపెట్టారు” అని పాపులర్ మెకానిక్స్ అనే పత్రిక వివరిస్తోంది. డేస్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ అనే తన పుస్తకంలో హోవార్డ్ వి. హార్పర్ ఇలా చెబుతున్నాడు: “అన్యమత తొలికాలాలనుండి ప్రజలు తమ ప్రాముఖ్యమైన మత సందర్భాల్లో కాగడాలు తీసుకెళ్లేవారు, పెద్దయెత్తున భోగిమంటలు వెలిగించేవారు. ఆ మత పండుగల్లో రంగురంగుల వెలుగులు విరజిమ్మే బాణసంచా ప్రదర్శనలు కూడా సహజంగానే చేర్చబడ్డాయి.”
నామకార్థ క్రైస్తవులు బాణసంచా ఉపయోగించడం మొదలుపెట్టిన వెంటనే, బాణసంచా తయారీదారులకు సంబంధిత సెయింట్ నియమించబడడం జరిగింది. ద కొలంబియా ఎన్సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “[సెయింట్ బార్బరా] క్రైస్తవురాలుగా ఉన్నందుకు ఆమె తండ్రి ఆమెను ఒక గోపురంలో బంధించి హతమార్చినట్లు చెప్పబడుతోంది. ఆ సమయంలో మెరిసిన పెద్ద మెరుపువల్ల మంటల్లో అతను కాలిబొగ్గయ్యాడు, దానితో సెయింట్ బార్బరా ఫిరంగులు, బాణసంచా కాల్చేవారి, తయారుచేసేవారి సెయింట్ అయింది.”
ఖర్చుతో పనిలేదు
అవి మతపరమైన ఉత్సవాలైనా లేదా లౌకిక ఉత్సవాలైనా, ప్రజలకు మరింత పెద్దవైన, శ్రేష్ఠమైన బాణసంచా ప్రదర్శనలపట్ల తనివితీరని కోరిక ఉన్నట్లు కనిపిస్తోంది. 16వ శతాబ్దంలో జరిగిన చైనీయుల బాణసంచా ప్రదర్శనను వర్ణిస్తూ, రిసి ఇలా వ్రాశాడు: “నేను నాన్యాంగ్లో ఉన్నప్పుడు, ఆ సంవత్సరపు మొదటి నెలకు సంబంధించిన ఉత్సవంలో నేనొక బాణసంచా ప్రదర్శన చూశాను. ఈ సందర్భంలో, నేను లెక్కగట్టిన ప్రకారం, వారు అనేక సంవత్సరాలపాటు చేయగల యుద్ధంలో ఉపయోగించడానికి సరిపోయేంత పరిమాణంలో గన్‌పౌడర్‌ను ఉపయోగించారు.” ఈ ప్రదర్శనకు అయిన ఖర్చు గురించి ఆయనిలా అన్నాడు: “బాణసంచా విషయానికొస్తే వారు ఖర్చుకు వెనుకాడుతున్నట్లు కనిపించదు.”
గడిచిన శతాబ్దాల్లో పరిస్థితేమీ మారలేదు. 2000 సంవత్సరంలో, ఓడరేవు తీరాల్లో 10 లక్షలు అంతకంటే ఎక్కువ సంఖ్యలో సమకూడిన ప్రేక్షకులను అలరించడానికి సిడ్నీ హార్బర్ వంతెనమీద ఏర్పాటు చేయబడిన ఒక ఉత్సవంలో 20 టన్నుల బాణసంచా కాల్చబడింది. అదే సంవత్సరం అమెరికాలో దాదాపు 7,00,00,000 కిలోల బాణసంచా కాల్చడానికి 62.5 కోట్ల డాలర్లు ఖర్చుచేయబడ్డాయి. నిశ్చయంగా చాలా సంస్కృతుల్లో బాణసంచా పారవశ్యం కలిగిస్తూనేవుంది. అందువల్ల “బాణసంచా విషయానికొస్తే వారు ఖర్చుకు వెనుకాడుతున్నట్లు కనిపించదు” అని ఇప్పటికీ చెప్పవచ్చు. (g04 2/8)
[19వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]