హోమ్‌వర్క్ చేసుకోవడానికి సమయం ఎక్కడినుండి వస్తుంది?
యువత ఇలా అడుగుతోంది . . .
హోమ్‌వర్క్ చేసుకోవడానికి సమయం ఎక్కడినుండి వస్తుంది?
‘నేను ఇంటర్ విద్యార్థిని, నాకు చెప్పలేనంత ఒత్తిడివుంది . . . పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, ప్రజెంటేషన్లు చాలావున్నాయి, అదేమీ తమాషా కాదు. వాటిని పూర్తిచేయడానికి నాకు సమయం చాలడం లేదు.’ —పద్దెనిమిదేళ్ల అమ్మాయి.
ప్రతీరోజు మధ్యాహ్నం మీరు ఇంటికి తెచ్చుకునే గంపెడు హోమ్‌వర్క్ చేసుకోవడం మీకు తలకుమించిన భారంలా అనిపిస్తుందా? అదే నిజమైతే, అలా భావిస్తున్నది మీరొక్కరే కాదు. “దేశవ్యాప్తంగా పాఠశాలలు తమ ప్రమాణాల్ని అంటే పరీక్షల్లో మార్కుల ప్రమాణస్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తూ, ఎక్కువ హోమ్‌వర్క్ ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాల విద్యార్థులు రోజుకు మూడుగంటలు హోమ్‌వర్క్ చేస్తున్నట్లు చెబుతున్నారు. పిల్లలు 20 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు మూడింతలు ఎక్కువ హోమ్‌వర్క్ చేస్తున్నారని మిచిగాన్‌లోని ఒక యూనివర్సిటీ చేసిన అధ్యయనం సూచిస్తోంది” అని అమెరికాలోని ఒక పత్రికా నివేదిక చెబుతోంది.
ఎక్కువ హోమ్‌వర్క్ ఉండడమనేది, అమెరికా విద్యార్థులకు మాత్రమే పరిమితం కాదు. ఉదాహరణకు, అక్కడి 13 సంవత్సరాల పిల్లల్లో 30 శాతంమంది రోజుకు రెండు గంటలకంటే ఎక్కువ సమయం హోమ్‌వర్క్ చేస్తున్నట్లు నివేదిస్తుంటే, తైవాన్, కొరియాల్లో ఆ సంఖ్య 40 శాతంగాను, ఫ్రాన్సులో 50 శాతానికి పైగా ఉంది. “చేయాల్సిన హోమ్‌వర్క్ మిగిలిపోయినప్పుడు నేను కొన్నిసార్లు నిజంగా చాలా ఒత్తిడికి లోనవుతాను” అని అమెరికాలోని ఒక యూనివర్సిటీ విద్యార్థిని కేటీ వాపోతోంది. ఫ్రాన్సులోని మార్సిల్లీస్లో పాఠశాలకు వెళుతున్న మార్లిన్, బెలిండా కూడా ఆమెలాంటి భావాలనే వ్యక్తంచేస్తున్నారు. “రాత్రిళ్లు మేము తరచూ రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు హోమ్‌వర్క్ చేయడానికి వెచ్చిస్తున్నాం. మీకు ఇతర బాధ్యతలుంటే మాత్రం, సమయం దొరకడం చాలా కష్టమవుతుంది” అని మార్లిన్ చెబుతోంది.
నాకు సమయమెక్కడ దొరుకుతుంది?
హోమ్‌వర్క్ పూర్తిచేసుకుని, ఇతరత్రా పనులన్నీ చూసుకునేలా అవసరమైనప్పుడు రోజుకు అదనంగా కొన్ని గంటలు చేర్చుకోగల సామర్థ్యం మీకుంటే ఎంత బాగుంటుందో కదా? నిజానికి, ఎఫెసీయులు 5:15, 16 లో వున్న బైబిలు సూత్రాన్ని మీరు పాటిస్తే మీరు అలాంటిదే చేయగలుగుతారు. అదిలా చెబుతోంది: “మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.” ఆ మాటలు వ్రాసినప్పుడు బైబిలు రచయిత మదిలో ఉన్నది హోమ్‌వర్క్ గురించి కాకపోయినా, ఆ సూత్రాన్ని దైనందిన జీవితంలో అన్వయించుకోవచ్చు. మీరు దేనినైనా సద్వినియోగం చేసుకోవాలంటే లేదా కొనుక్కోవాలంటే దానికోసం మీరేదైనా చెల్లించాలి. ఇక్కడ విషయమేమిటంటే, చదువుకోవడానికి మీకు సమయం దొరకాలంటే, మీరు ఏదోకటి వదులుకోవాలి. కానీ దేనిని వదులుకోవాలి?
“మొదట చేయాల్సిన పనుల పట్టిక వేసుకోండి,” అని జిలియన్ అనే అమ్మాయి చెబుతోంది. మరో మాటలో చెప్పాలంటే, అధిక ప్రాధాన్యతా విషయాలేవో మొదట నిశ్చయించుకోండి. మీ పట్టికలో క్రైస్తవ కూటాలు, ఆధ్యాత్మిక విషయాలు మొదట ఉండాలి. మీ కుటుంబ బాధ్యతలు, ఇంటిపనులు, అలాగే మీ హోమ్‌వర్క్ మర్చిపోకండి.
ఆ తర్వాత, ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు నిజానికి మీరెలా సమయం గడుపుతున్నారో డైరీ వ్రాయడానికి ప్రయత్నించండి. దానిలో మీరు కనుగొనే విషయాలు మీకు
ఆశ్చర్యం కలిగించవచ్చు. టీవీ చూడ్డానికి, ఇంటర్నెట్కు, సినిమాలకు వెళ్లడానికి, ఫోన్లో మాట్లాడ్డానికి, స్నేహితుల దగ్గరకు వెళ్లడానికి ఎంతెంత సమయం వెచ్చిస్తున్నారు? ఇప్పుడు మీ డైరీ వివరాలను మీరు ప్రాధాన్యతనిచ్చే విషయాలతో పోల్చిచూసినప్పుడు ఏమి వెల్లడవుతోంది? టీవీ చూడ్డానికి, ఫోన్‌కు లేదా ఇంటర్నెట్కు వెచ్చించే సమయాన్ని విశ్లేషించి వాటినుండి మరెంతో సమయాన్ని సంపాదించుకోవచ్చనే లేదా కొని సద్వినియోగం చేసుకోవచ్చనే విషయాన్ని అది బహుశా మీకు తెలియజేయవచ్చు.ప్రాముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యతనివ్వండి
అంటే మీరు మీ టీవీని ప్రక్కన పడేయాలనో లేదా సన్యాసం పుచ్చుకోవాలనో దీనర్థం కాదు. “ప్రాముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత” అనే నియమాన్ని మీరు పాటించాలి. అన్వయించుకోగల ఒక బైబిలు వచనం ఇలా చెబుతోంది: ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి.’ (ఫిలిప్పీయులు 1:9-10) ఉదాహరణకు, మీకు విద్యాభ్యాసం ప్రాముఖ్యం కాబట్టి, మీ పనులు ముగించుకొని, క్రైస్తవకూటాలకు సిద్ధపడి, అలాగే మీ హోమ్‌వర్క్ పూర్తిచేసుకునే వరకు టీవీ జోలికిపోకూడదనే నియమాన్ని మీకైమీరు పెట్టుకోవాలి. నిజమే మీ అభిమాన టీవీ కార్యక్రమాన్ని చూడలేకపోవడం నిరాశ కలిగిస్తుంది. నిజాయితీగా చెప్పాలంటే, మీ అభిమాన టీవీ కార్యక్రమం మాత్రమే చూద్దామని టీవి ముందు కూర్చొని దానిముందే వ్యర్థంగా సాయంకాలమంతా గడిపేసిన సందర్భాలు ఎన్ని ఉండవచ్చునంటారు?
మరోప్రక్క, క్రైస్తవ కూటాలకు హాజరుకావడానికి మీరు తగిన ప్రాముఖ్యత ఇవ్వాలి. ఉదాహరణకు, ముఖ్యమైన పరీక్ష లేదా హోమ్‌వర్క్ రాబోతోందని ముందే తెలిసినప్పుడు, కూటాలకు వెళ్ళేందుకు అది అడ్డుపడకుండా ఉండేలా ముందే అలాంటివాటి కోసం సిద్ధపడడానికి మీరు బహుశా ప్రయత్నించవచ్చు. మీటింగ్ రోజున చేయవలసివచ్చే హోమ్‌వర్క్ ఏదైనావుంటే ముందుగానే తెలియజేస్తే మీరెంతో కృతజ్ఞత చూపిస్తారని చెబుతూ మీ టీచర్లకు మీ పరిస్థితి గురించి వివరించడానికి కూడా ప్రయత్నించవచ్చు. కొంతమంది టీచర్లు సహకరించడానికి సుముఖంగా ఉండవచ్చు.
యేసు స్నేహితురాలైన మార్తకు సంబంధించిన బైబిలు వృత్తాంతంలో మరో సహాయకరమైన సూత్రం నేర్పించబడింది. ఆమె కష్టపడి పనిచేసే తత్వంగల మనిషి, అయితే ఆమె వేటికి ప్రాధాన్యతనివ్వాలో సరిగా నిశ్చయించుకోలేదు. ఒక సందర్భంలో, యేసు కోసం బహుశా రకరకాల వంటకాలతో భోజనం సిద్ధంచేయడంలో ఆమె తలమునకలవుతుంటే, ఆమె సహోదరి మరియ ఆమెకు సహాయం చేయకుండా యేసు చెబుతున్నది వింటోంది. దీని విషయమై మార్త యేసుకు ఫిర్యాదు చేసినప్పుడు యేసు “మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదు” అని ఆమెతో అన్నాడు.—లూకా 10:41, 42.
దీనిలో మనకే పాఠముంది? అన్నింటిని సరళంగా ఉంచుకోండి. మీ పరిస్థితికి మీరు ఈ సూత్రాన్నెలా అన్వయించుకోవచ్చు? బహుశా మీరు హోమ్‌వర్క్, పార్ట్‌టైమ్ జాబ్ ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక ‘అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచుండవచ్చు.’ మీరు ఉద్యోగమే చేస్తుంటే, మీ కుటుంబానికి నిజంగా డబ్బు అవసరమా? లేక నిజంగా అవసరం లేకపోయినా, కావాలనుకున్నవి కొనుక్కోవడానికి మీ దగ్గర అదనంగా డబ్బు ఉండాలని మాత్రమే ఇష్టపడుతున్నారా?
ఉదాహరణకు, కొన్ని దేశాల్లో యౌవనులు తమ సొంత కారు కొనుక్కోవడానికి ఆత్రపడుతుంటారు. “కారు ఉండడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి నేడు యౌవనులు తమ దగ్గర డబ్బు ఉంచుకోవడానికి లేదా సంపాదించుకోవడానికి తీవ్ర ఒత్తిడి క్రింద ఉన్నారని” ఉన్నత పాఠశాల సలహాదారు కరేన్ టర్నర్ అంటోంది. అయితే ఆమె చివరికిలా చెబుతోంది: “పాఠశాలేతర కార్యక్రమాలు, వాటితోపాటు ఉద్యోగం, అధిక హోమ్‌వర్క్ వంటివి చేయడం ప్రతిబంధకాలుగా ఉంటాయి. అలాంటప్పుడు విద్యార్థిపై మోయలేని భారం పడుతుంది.” అనవసరంగా మీకైమీరు ఎందుకు మోయలేని భారం పెంచుకుంటారు? మీ హోమ్‌వర్క్‌పై ప్రభావం పడుతుంటే, మీరు కొద్దిగంటల కొరకే పనిచేయవచ్చు లేదా ఆ ఉద్యోగం వదిలేయవచ్చు.
పాఠశాలలో ‘సమయం సద్వినియోగం చేసుకోండి’
కాలేజీ వెలుపల అదనపు గంటలకోసం చూడడానికి తోడుగా, కాలేజీలో ఉన్నప్పుడే మీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో ఆలోచించండి. “స్టడీ పీరియడ్స్‌లోనే ఎక్కువ హోమ్‌వర్క్ చేసేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఆ రోజు తరగతిలో నాకు అర్థంకానిది వెంటనే తెలుసుకోవడానికి నేను టీచరు దగ్గరకు వెళ్లడానికి అది నాకు అవకాశమిస్తుంది” అని హోస్వే చెబుతున్నాడు.
మీరు తీసుకొంటున్న ఎలెక్టివ్ క్లాసుల సంఖ్య తగ్గించుకోవడం గురించి మీరు ఆలోచించవచ్చు. అంతేకాకుండా, మీరు పాల్గొనే పాఠశాలేతర కార్యక్రమాలు కొన్ని మానుకోవాలని మీరు కోరుకోవచ్చు. ఈ రంగాల్లో సర్దుబాట్లు చేసుకోవడం ద్వారా మీరు అదనపు అధ్యయనం కోసం సమయం సంపాదించుకోవచ్చు.
మీ సమయాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడం
మీరు త్యాగాలు, సర్దుబాట్లు చేసుకుని హోమ్‌వర్క్‌కు మరింత సమయం సంపాదించుకున్నారే అనుకుందాం. ఇక ఆ సమయాన్ని మీరెంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు? మీరు అంతే సమయంలో అదనంగా 50 శాతం హోమ్‌వర్క్ చేసుకోగలిగితే, మీకు 50 శాతం అదనపు సమయం దొరికినట్టే కదా? మీ సమర్థతను వృద్ధిచేసుకోవడానికి ఇక్కడ మీకు కొన్ని సూచనలున్నాయి.
◼ ప్రణాళిక వేసుకోండి. మీ హోమ్‌వర్క్ ఆరంభించడానికి ముందు, ఈ విషయాల గురించి కాస్త ఆలోచించండి: ఏ సబ్జెక్టులకు మొదటి స్థానమివ్వాలి? ఆ అసైన్మెంటుకు ఎంత సమయం పడుతుంది? అది పూర్తిచేయడానికి మీకు పుస్తకాలు, పేపరు, పెన్నులు, కాలెక్యులేటర్ వంటివి అవసరమా?
◼ అధ్యయనానికి ఒక స్థలం చూసుకోండి. అది పరధ్యానాలకు తావివ్వని చక్కని స్థలంగా ఉండాలి. ‘మీకు డెస్కువుంటే దానిని ఉపయోగించండి. మంచంమీద పడుకోవడానికి బదులు అలా కూర్చోవడం ఏకాగ్రత నిలపడానికి మీకు సహాయం చేస్తుంది’ అని ఎలీస్ అనే యౌవనురాలు చెబుతోంది. మీకంటూ ఒక సొంత గది లేకపోతే, మీరు ప్రశాంతంగా, నిశబ్దంగా చదువుకోవడానికి మీ తమ్ముళ్లు, చెల్లెళ్లు తోడ్పడవచ్చు. లేదా మీరు పార్కుగానీ, ప్రజా లైబ్రరీగానీ ఉపయోగించుకోవచ్చు. మీకు మీ సొంత గది ఉంటే, మీరు చదువుకోవడానికి ప్రయత్నిస్తునప్పుడు టీవీ పెట్టడం, పరధ్యానం కలిగించే సంగీతం ప్లే చేయడం ద్వారా మీ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయకండి.
◼ అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోండి. కొంతసేపైన తర్వాత ఏకాగ్రత కోల్పోతున్నట్టు మీకనిపిస్తే, క్లుప్త విరామం తిరిగి పనికి సిద్ధం కావడానికి మీకు సహాయం చేయవచ్చు.
◼ వాయిదా వేయకండి. “వాయిదావేసే పెద్ద జబ్బు నాకుంది. అసైన్మెంట్ పూర్తిచేయకుండా చివరి క్షణంవరకు వాయిదావేయడం నాకు తప్పదన్నట్లు అనిపిస్తోంది” అని ముందు ప్రస్తావించబడిన కేటీ చెబుతోంది. మీ హోమ్‌వర్క్‌కు ఖచ్చితమైన పట్టికవేసుకొని, దానికి కట్టుబడి ఉండడం ద్వారా వాయిదావేయడాన్ని నివారించండి.
హోమ్‌వర్క్ ప్రాముఖ్యమే, అయితే యేసు మార్తకు సూచించినట్లుగా అతి ప్రాముఖ్యమైనవి అంటే ‘ఉత్తమమైనవి’ ఆధ్యాత్మిక విషయాలు. హోమ్‌వర్క్ కారణంగా బైబిలు పఠనం, పరిచర్యలో పాల్గొనడం, క్రైస్తవ కూటాలకు హాజరు కావడం వంటి ప్రాముఖ్యమైన కార్యకలాపాలకు సమయం లేకుండా చేసుకోకండి. ఇవి మీ జీవితాన్ని యుగయుగాలు సుసంపన్నంచేసే విషయాలు.—కీర్తన 1:1, 2; హెబ్రీయులు 10:24, 25. (g04 1/22)
[23వ పేజీలోని చిత్రాలు]
చాలా కార్యకలాపాలు పెట్టుకుంటే మీ హోమ్‌వర్క్‌కు సమయం దొరకడం కష్టం కావచ్చు
[23వ పేజీలోని చిత్రం]
చక్కని వ్యవస్థీకరణ మీ హోమ్‌వర్క్‌కు ఎక్కువ సమయం దొరికేలా చేయగలదు