నైరోబీ “చల్లని నీళ్లున్న స్థలం”
నైరోబీ “చల్లని నీళ్లున్న స్థలం”
కెన్యాలోని తేజరిల్లు! రచయిత
“అది నిస్తేజమైన బురద నేల, అక్కడ గాలి బాగా వీస్తుంటుంది, మానవులు నివసిస్తున్నట్లు ఎలాంటి చిహ్నాలూ కనిపించవు, అక్కడ అన్ని జాతులకు చెందిన అడవి మృగాలు వేల కొలది వాసం ఏర్పరచుకున్నాయి. అప్పుడప్పుడు మానవులు సంచరించినట్లు తెలిపే ఒకే ఒక నిదర్శనంగా ఆ బురద నేలకు అంచుల్లో బిడారులు నడిచివెళ్ళినట్లుగా అడుగుజాడలు కనిపిస్తాయి.”—ద జెనిసిస్ ఆఫ్ కెన్యా కాలనీ.
ఈమాటలు శతాబ్దం కన్నా కాస్త ముందు సింహాలు, ఖడ్గమృగాలు, చిరుతపులులు, జిరాఫీలు, విషసర్పాలు, వేలాది ఇతర రకాల వన్యప్రాణులు తమ నివాస స్థలంగా చేసుకున్న నైరోబీని వర్ణించే మాటలవి. ధైర్యశాలులైన మాసైలు తాము విలువైనవిగా పరిగణించే పశువులను అక్కడున్న మంచినీటి నదిలో నీళ్ళు తాగించడానికి తీసుకువెళ్ళేవారు, ఆ ప్రదేశం సంచార జాతులవారికి ఇష్టమైన స్థలం. నిజానికి మాసైలు ఆ నదిని యువేసో నైరోబీ అని పిలిచారు, అంటే “చల్లని నీళ్లు” అని అర్థం, ఆ స్థలాన్ని ఎంకరీ నైరోబీ అని పిలిచారు, అంటే “చల్లని నీళ్లున్న స్థలం” అని అర్థం. ఆ విధంగా వారు, కెన్యా చరిత్రనే మార్చేసే ఆ స్థలానికి పేరు పెట్టారు.
* 1899 మధ్య కాలానికల్లా, కోస్తా పట్టణమైన మొంబాసా నుండి నైరోబీ వరకు 530 కిలోమీటర్ల రైలు మార్గం వేయబడింది. ఆ సమయంలో, దాన్ని నిర్మిస్తున్న కూలీలు “త్సావో నరభక్షకులు” అని పేరుగాంచిన రెండు సింహాల దాడులను ఎదుర్కొన్నారు. ఆ సింహాలు వారి తోటి కూలీల్లో చాలామందిని చంపేశాయి. అంతేగాక ఆ కూలీలు భయంకరమైన గ్రేట్ రిఫ్ట్ లోయ వైపుకు సాగుతున్నారు. రైలు పట్టాలు ఇంకా లోపలికి వేయాల్సి ఉంది కాబట్టి, అంతవరకూ ముఖ్య కేంద్రంగా ఉన్న మొంబాసా యోగ్యమైన స్థలంగా పరిగణించబడలేదు. దానికి బదులు, నైరోబీ అప్పుడు నివాసయోగ్యంగా లేకున్నా అది, కూలీలు విశ్రాంతి తీసుకోవడానికి చక్కని ప్రదేశంగా, నిర్మాణ వస్తువులకు ముఖ్య కేంద్రంగా పరిగణించబడింది. దానితో, ఆ తర్వాత అది కెన్యాకు రాజధాని అవడానికి దారితీసింది.
నైరోబీ అభివృద్ధిలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన కెన్యాలో రైలు మార్గం నిర్మించడం, ఒకప్పుడు దాన్ని లూనాటిక్ ఎక్స్‌ప్రెస్ అనేవారు.20వ శతాబ్ద ఆరంభంలో, కొత్తగా సృష్టించబడిన ఈస్ట్ ఆఫ్రికన్ ప్రొటెక్టోరేట్‌కు నైరోబీ కార్యనిర్వాహక కేంద్రంగా ఎంపిక చేయబడింది, కెన్యా అప్పట్లో ఈస్ట్ ఆఫ్రికన్ ప్రొటెక్టోరేట్ అనే పిలువబడేది. ముందుగా ప్రణాళిక వేసుకోవడం, అభివృద్ధి చెందుతున్న ఆ నగరానికి ప్రయోజనకరంగా ఉండేది. అలా కాకుండా రైల్వే స్టేషనుకు చుట్టుపక్కల క్రమరహితంగా చౌకరకం కట్టడాలు లేచాయి. కలపతో, వంకులు వంకులుగా ఉన్న ఇనుప రేకులతో, ఇతర స్థానిక వస్తువులతో నిర్మించబడిన కట్టడాలు నైరోబీని భవిష్యత్ అంతర్జాతీయ కేంద్రంగా కాకుండా చిన్న చిన్న ఇళ్ళున్న కుగ్రామంలా కనబడేటట్లు చేశాయి. 20వ శతాబ్దపు మలిదశలో నైరోబీలో నిర్మించబడిన కొన్ని కట్టడాలు కూడా అది అంతర్జాతీయ కేంద్రంగా మారుతుందనే సాధ్యతను దృష్టిలో పెట్టుకుని నిర్మించబడలేదు. అంతేకాక ఆ పరిసరాల్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండే క్రూర జంతువుల భయం ఇంకా అలాగే ఉంది.
ఆ క్రొత్త నివాసం మీద త్వరలోనే వ్యాధులు దాడిచేశాయి. అప్పుడు పెల్లుబికిన మహమ్మారి, కొత్త కార్యనిర్వాహకులకు మొట్టమొదటి పరీక్ష అయింది. సత్వర చికిత్స ఏమిటి? అది ఇంకా వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకని ఆ పట్టణంలోని, మహమ్మారికి గురైన ప్రాంతాలను కాల్చివేశారు. తర్వాతి అర్థ శతాబ్దంలో, నైరోబీ అసహ్యమైన తన గతం నుండి నెమ్మదిగా కోలుకొని వాణిజ్యపరంగా, సమాజపరంగా తూర్పు ఆఫ్రికాకు కేంద్రస్థానమయింది.
ఆధునిక నగరం అభివృద్ధి చెందిన విధానం
సుమారు 1,680 మీటర్ల ఎత్తులో ఉన్న నైరోబీ నుండి చూస్తే దాని చుట్టుపక్కల ప్రాంతం ముగ్ధమనోహరంగా కనబడుతుంది. వాతావరణం నిర్మలంగా ఉండే రోజుల్లో, ఆఫ్రికాలోని రెండు విశేష చిహ్నాలు సులభంగా కనబడతాయి. ఒకటి ఉత్తరాన ఉన్న కెన్యా పర్వతం, దాని ఎత్తు 5,199 మీటర్లు, అది ఆ దేశంలో ఉన్నవాటిలోకెల్లా ఎత్తైనది, ఆఫ్రికాలో ఉన్నవాటిలోకెల్లా ఎత్తు విషయంలో రెండవ స్థానం వహిస్తుంది. మరొకటి సుదూరంగా దక్షిణాన కెన్యా టాంజానియాల సరిహద్దులో ఉన్న కిలిమంజారో పర్వతం, దీని ఎత్తు 5,895 మీటర్లు, ఇది ఆఫ్రికాలో ఉన్నవాటిలోకెల్లా అత్యంత ఎత్తైన పర్వతం. భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న కిలిమంజారో పర్వత శిఖరంపై నిత్యం కనబడే మంచు, 150 సంవత్సరాల క్రితం యూరోపియన్ భూగోళ శాస్త్రజ్ఞులకూ పరిశోధకులకూ ఆసక్తి రేకెత్తించింది.
దాదాపు 50 సంవత్సరాల చరిత్ర ఉన్న నైరోబీ నగరం పూర్తిగా మారిపోయింది. దాని ఎదుగుదలకు నిదర్శనం నిరంతరం మారుతున్న ఆకాశహర్మ్యాలే. గాజు, స్టీలుతో కట్టిన నేటి ఎత్తైన భవనాలు ఉష్ణమండల సూర్యాస్తమయపు వెలుగులో
కాంతులీనుతూ ఎంతో అందంగా కనబడతాయి. నైరోబీ ప్రధాన వ్యాపార ప్రాంతాన్ని సందర్శించే ఒక వ్యక్తికి, తాను నడుస్తున్న ఆ స్థలం కేవలం వంద సంవత్సరాల క్రితం క్రూర మృగాలకు స్థావరంగా, మానవులకు ప్రమాదకర ప్రదేశంగా ఉండేదని తెలిస్తే నమ్మలేకపోవచ్చు.కాలక్రమేణా ఆ పరిస్థితి మారిపోయింది. అందమైన బోగన్‌విల్లా పూలు, గుచ్ఛాలుగా పూసే జకరండా పూలు వంటి విజాతీయ పుష్పాలతోపాటు, వేగంగా పెరిగే నీలగిరి, వాటల్ చెట్లు వచ్చాయి. ఆ విధంగా గతంలో దుమ్ముతో నిండిన దార్లు క్రమక్రమంగా ఇరువైపులా చెట్లున్న వీధులుగా మారాయి, వేసవి కాలాల్లో పాదచారులకు ఆ చెట్లు చల్లని నీడనిస్తాయి. నగర కేంద్రానికి దగ్గరలో ఉన్న అర్బోరేటమ్ (పరిశోధన కోసం, విద్య కోసం చెట్లను పెంచే స్థలం)లో దాదాపు 270 రకాల చెట్లు ఉన్నాయి. నైరోబీ “సహజమైన అడవుల మధ్య కట్టినట్లు కనిపిస్తుంది” అని మరొక రచయిత ఎందుకన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. పుష్కలమైన వృక్షజాతి నైరోబీలో ఆహ్లాదకరమైన శీతోష్టస్థితులు అంటే వెచ్చని పగలు, చల్లని రాత్రులు ఉండడానికి ఎంతో దోహదపడ్డాయి.
మిశ్రిత సంస్కృతులు
ఒక పెద్ద అయస్కాంతం లాగ నైరోబీ ఎన్నో రకాల ప్రజలను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ నగరంలోని మొత్తం జనాభా 20 లక్షలకుపైనే ఉంది. రైలు మార్గం పూర్తవడంతో ప్రజలు అక్కడ స్థిరపడ్డారు. రైలు మార్గ నిర్మాణంలో సహాయపడిన భారతీయులు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాపారం ప్రారంభించడానికి అక్కడే స్థిరపడిపోయారు. అదే ఉద్దేశంతో ఆస్ట్రేలియా, కెనడా, ఆఫ్రికాలోని కొన్ని దేశాల నుండి ఇతర వర్తకులు కూడా వచ్చి చేరారు.
నైరోబీ అనేక సంస్కృతులకు నిలయం. అక్కడ వీధుల్లో చీర కట్టుకున్న ఒక భారత నారి షాపింగ్ మాల్‌కు వెళుతూ, ఒక పాకిస్తానీ ఇంజినీర్ నిర్మాణ స్థలానికి పరుగెడుతూ, ఒక్క ముడత కూడా ఉండని చక్కని దుస్తులతో నెదర్‌లాండ్స్‌కు చెందిన ఒక ఫ్లైట్ అటెండెంట్ నగరంలోని ఒక హోటల్‌లో ప్రవేశిస్తూ, జపానుకు చెందిన ఒక వ్యాపారస్తుడు ఒక ముఖ్యమైన మీటింగుకో, లేదా నైరోబీలో అభివృద్ధి చెందుతున్న స్టాక్ మార్కెట్‌కు హడావిడిగా వెళుతూనో కనబడవచ్చు. వీరితోపాటు స్థానికులు బస్టాపుల్లో ఎదురుచూస్తూ, స్టాళ్ళలో, ఆరుబయట సంతల్లో, దుకాణాల్లో వ్యాపారం చేస్తూ, ఆఫీసుల్లో లేదా నైరోబీలోని అనేక పరిశ్రమల్లో పనిచేస్తూ కనబడతారు.
అయితే విచిత్రంగా, నగరంలో నివసిస్తున్న కేవలం కొంతమంది కెన్యా నివాసులనే నిజమైన “నైరోబియన్లు” అని అనవచ్చు. వారిలో
చాలామంది దేశంలోని ఇతర ప్రాంతాల నుండి “మెరుగైన పరిస్థితుల” కోసం వెతుక్కుంటూ వచ్చినవారే. మొత్తానికి నైరోబీ నివాసులు స్నేహశీలురూ ఆదరానుభూతి గలవారూ. బహుశా అలాంటి ఆతిథ్య స్వభావం ఉండడం వల్లనే కావచ్చు ఆ నగరం ఇతర ప్రపంచానికీ సంస్థలకూ అతిథేయి అయింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ ప్రపంచ ప్రధాన కార్యాలయం నైరోబీలోనే ఉంది.సందర్శకులను ఆకర్షించేది ఏమిటి?
కెన్యా దేశంలో అనేక రకాల వన్య ప్రాణులు విస్తృతంగా ఉన్నాయి. అక్కడున్న అనేక నేషనల్ పార్కులూ జంతు ప్రదర్శన శాలలూ ప్రతి సంవత్సరం వేలాది సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నైరోబీ నుండి అనేక విహారయాత్రలు ఏర్పాటు చేయబడుతున్నాయి. అయినా నైరోబీ కూడా ఒక పర్యాటక స్థలమే. ఇంటి గుమ్మం దగ్గర కూడా జంతువులు సంచరించే నగరాలు ప్రపంచంలో చాలా తక్కువ. నగర కేంద్రానికి పది కిలోమీటర్లలోపే ఉన్న నైరోబీ నేషనల్ పార్క్ సందర్శకులు చూడదగినది. * ఇక్కడ నైరోబీ మొట్టమొదటి నివాసులను నేరుగా చూడవచ్చు. జంతువులకూ మానవులకూ మధ్య కేవలం కొన్ని తీగలే అడ్డుగా ఉంటాయి. ఇటీవలే అంటే 2002 సెప్టెంబరులో, నైరోబీలోని ఒక ఇంటి వసారాలో ఎదిగిన ఒక మగ చిరుతపులిని పట్టుకున్నారు, అది సమీపంలోని అడవి నుండి తప్పిపోయి వచ్చింది!
నగర కేంద్రం నుండి కొన్ని నిమిషాలు నడిచివెళ్లేంత దూరంలో నైరోబీ మ్యూజియం ఉంది. ఆసక్తికరమైన కెన్యా చరిత్ర గురించి తెలుసుకోవడానికి అక్కడికి ప్రతిరోజు వందలాది మంది సందర్శకులు వస్తుంటారు. మ్యూజియంలో ఉన్న పాముల విభాగంలో అనేక జాతుల సరీసృపాలు ఉన్నాయి. మొసళ్ళు సందర్శకుల చూపులవల్ల ఏ మాత్రం భంగం వాటిల్లినట్లు కనిపించవు. అక్కడికి కాస్త దగ్గరలోని తాబేలు కూడా తన చుట్టూ ఉన్న లోకం ఎంత రద్దీగా ఉన్నా తనకు ఏమీ పట్టనట్టే ఉంటుంది. అక్కడి ముఖ్య నివాసులు మాత్రం నాగుపాములు, కొండచిలువలు, కట్లపాములు వంటి పాకే ప్రాణులే. చుట్టూ అలాంటి ప్రాణులు ఉంటాయి కాబట్టి, “అతిక్రమించిన వారికి విషం ఎక్కుతుంది” అని ఉన్న బోర్డును చూడడం తప్పనిసరి!
విభిన్నమైన నీళ్లు
నైరోబీకి ఆ పేరు రావడానికి కారణమైన నైరోబీ నది నిత్యం ప్రవహిస్తూనే ఉండగా, పరిశ్రమలు వదిలే వ్యర్థ పదార్థాలూ జనవర్జితాలూ దాని నీళ్లను కలుషితం చేస్తున్నాయి, అభివృద్ధి చెందుతున్న అనేక నగరాల్లో ఇది సర్వసాధారణమైన విషయమే. అయితే నైరోబీ నివాసులకు, ఉన్నత మూలం నుండి వస్తున్న “నీళ్లు” చాలా సంవత్సరాలుగా సరఫరా అవుతున్నాయి. అదే యెహోవాసాక్షులు బోధిస్తున్న, బైబిలులోని జీవ సందేశం.—యోహాను 4:14.
ప్రస్తుతం నైరోబీ కలిగివున్న ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి చాలాకాలం ముందు, అంటే 1931లో, దక్షిణాఫ్రికాకు చెందిన అన్నదమ్ములైన గ్రే, ఫ్రాంక్ స్మిత్‌లు బైబిలు సత్యాలను వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో కెన్యాకు వచ్చారు. వారు మొంబాసా నుండి రైలు మార్గంలోనే పయనిస్తూ అనేక ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు క్రూర జంతువులకు చాలా దగ్గర్లో నిద్రించారు కూడా. వారు నైరోబీలో 600 చిన్న పుస్తకాలతోపాటు ఇతర బైబిలు సాహిత్యాలను కూడా పంచగలిగారు. రాజధాని నగరమైన నైరోబీలో ఇప్పుడున్న 61 సంఘాల్లో దాదాపు 5,000 మంది సాక్షులు ఉన్నారు. సంఘ కూటాలు, సమావేశాలు, అంతర్జాతీయ సమావేశాల వంటివాటి ద్వారా నైరోబీ నివాసులకు ఇప్పుడు యెహోవాసాక్షుల కార్యకలాపాల గురించి తెలుసు. వారు ప్రకటించే బైబిలు ఆధారిత నిరీక్షణా సందేశాన్ని చాలామంది సంతోషంగా స్వీకరించారు.
ఉజ్జ్వలమైన భవిష్యత్తు
“పారిశ్రామిక నగరాల్లో తరచూ వసతుల కొరత ఉంటుంది . . . ఫ్యాక్టరీలు, గాలినీ నీటి మూలాలనూ కలుషితం చేస్తుంటాయి” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. ఈ విషయంలో నైరోబీ మినహాయింపు ఏమీ కాదు. అంతేకాక మారుమూల ప్రాంతాల నుండి ప్రతిరోజూ ప్రజలు వలస వస్తున్నారు కాబట్టి ఈ సమస్యలు ఇంకా అధికం కావచ్చు. నైరోబీ ఇలాంటి సమస్యలకు తరచూ గురైతే రత్నంలా మెరుస్తున్న ఆ నగరం సులభంగా మసకబారగలదు.
అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే, నేడు నగర జీవితాన్ని కష్టభరితం చేసే సమస్యలు లేకుండా, దేవుని రాజ్యంలో ప్రజలందరూ జీవితాన్ని పూర్తిగా ఆనందించే కాలం వస్తోంది.—2 పేతురు 3:13. (g04 11/8)
[అధస్సూచీలు]
^ రైలు మార్గ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం, తేజరిల్లు! (ఆంగ్లం) సెప్టెంబరు 22, 1998 21-4 పేజీల్లో ఉన్న “తూర్పు ఆఫ్రికా ‘లూనాటిక్ ఎక్స్‌ప్రెస్’” అనే ఆర్టికల్‌ను చూడండి.
^ తేజరిల్లు! (ఆంగ్లం) జూన్ 8, 2003 సంచికలోని 24-7 పేజీలు చూడండి.
[16వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
నైరోబీ
[18వ పేజీలోని చిత్రం]
కిలిమంజారో పర్వతం
[18వ పేజీలోని చిత్రం]
కెన్యా పర్వతం
[చిత్రసౌజన్యం]
Duncan Willetts, Camerapix
[18వ పేజీలోని చిత్రం]
ఆరు బయట అంగడి
[19వ పేజీలోని చిత్రం]
ఫ్రాంక్, గ్రే స్మిత్‌లు 1931లో
[17వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Crispin Hughes/Panos Pictures