విజ్ఞానశాస్త్రం ఆదికాండములోని వృత్తాంతానికి విరుద్ధంగా ఉందా?
బైబిలు ఉద్దేశము
విజ్ఞానశాస్త్రం ఆదికాండములోని వృత్తాంతానికి విరుద్ధంగా ఉందా?
విజ్ఞానశాస్త్రం బైబిల్లోని సృష్టి వృత్తాంతం తప్పని నిరూపిస్తుందని అనేకులు వాదిస్తారు. కానీ, అసలైన వ్యతిరేకత విజ్ఞానశాస్త్రానికీ బైబిలుకూ మధ్య లేదు కానీ విజ్ఞానశాస్త్రానికీ, క్రైస్తవ సనాతనవాదులమని చెప్పుకునే గుంపుల అభిప్రాయాలకూ మధ్య ఉంది. బైబిలు ప్రకారం భౌతిక సృష్టియంతా 10,000 సంవత్సరాల క్రితం, 24 గంటలున్న ఆరు దినాల్లోనే సృష్టించబడిందని ఆ గుంపుల్లో కొన్ని తప్పుగా వాదిస్తాయి.
అయితే, బైబిలు మాత్రం అలాంటి వాదనను సమర్థించట్లేదు. ఒకవేళ అలా సమర్థించి ఉంటే, గత వంద సంవత్సరాల్లో వైజ్ఞానికంగా క్రొత్తగా కనిపెట్టిన అనేక విషయాలు బైబిలు ప్రామాణికతను సవాలు చేస్తాయి. బైబిలు మూలపాఠాలను శ్రద్ధగా అధ్యయనం చేసినప్పుడు,
నిరూపించబడిన వైజ్ఞానిక వాస్తవాలకూ బైబిలుకూ మధ్య ఎలాంటి విభేదం లేదని వెల్లడౌతుంది. అందుకే యెహోవాసాక్షులు “క్రైస్తవ” సనాతనవాదులతో, అనేకమంది సృష్టివాదులతో ఏకీభవించరు. బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో ఈ క్రింది విషయాలు చూపిస్తాయి.“ఆది” అంటే ఎప్పుడు?
ఆదికాండములోని వృత్తాంతం సరళమైన, శక్తివంతమైన ఈ వాక్యంతో మొదలౌతుంది: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” (ఆదికాండము 1:1) ఈ వచనంలో వర్ణించబడిన సృష్టికార్యానికీ, మూడవ వచనం నుండి వర్ణించబడిన సృష్టి కార్యాలకూ మధ్య తేడావుందని బైబిలు విద్వాంసులు ఒప్పుకుంటున్నారు. ఆ వచనానికి లోతైన అర్థముంది. బైబిల్లోని ఆ ప్రారంభ వాక్యం ప్రకారం, మన భూగ్రహంతోపాటు విశ్వం సృష్టి దినాలు ప్రారంభం కాకముందే అనిశ్చిత కాలంగా ఉనికిలో ఉంది.
భూమి దాదాపు 400 కోట్ల సంవత్సరాలు పురాతనమైందని భూవిజ్ఞానశాస్త్రజ్ఞులు అంచనా వేశారు, అలాగే విశ్వం ఇంచుమించు 1,500 కోట్ల సంవత్సరాల పూర్వం నుండే ఉనికిలో ఉందని ఖగోళశాస్త్రజ్ఞుల లెక్కలేశారు. వారు కనిపెట్టిన ఈ విషయాలు, లేదా భవిష్యత్తులో వారు కనుగొనే విషయాలు ఆదికాండము 1:1 లోని వచనానికి విరుద్ధంగా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే, “భూమ్యాకాశములు” ఎంత కాలంగా ఉనికిలో ఉన్నాయో బైబిలు నిర్దిష్టంగా చెప్పట్లేదు. ఈ విషయంలో బైబిలు చెప్పేది తప్పని విజ్ఞానశాస్త్రం నిరూపించట్లేదు.
సృష్టి దినాల కాలనిడివి ఎంత?
మరి సృష్టి దినాల కాలనిడివి మాటేమిటి? అవి అక్షరార్థంగా 24 గంటలున్న రోజులా? ఆదికాండము వ్రాసిన మోషే, ఆ సృష్టి దినాల తర్వాత పేర్కొన్న ఏడవ దినం వారపు సబ్బాతుకు ఒక నమూనాగా ఉందని ఆ తర్వాత అన్నాడు కాబట్టి, అవి అక్షరార్థంగా 24 గంటలున్న రోజులే అని కొందరు వాదిస్తారు. (నిర్గమకాండము 20:11) ఆదికాండములోని పదాలు ఆ వాదనను సమర్థిస్తున్నాయా?
లేదు. నిజానికి, “దినము” అని అనువదించబడిన హెబ్రీ పదం కేవలం 24 గంటల కాలవవ్యధిని మాత్రమే కాక, వివిధ నిడివిగల కాలవ్యవధుల్ని కూడా సూచించవచ్చు. ఉదాహరణకు, మోషే దేవుని సృష్టినంతటినీ సంక్షిప్తంగా వర్ణిస్తూ, ఆరు సృష్టి దినాలను ఒకే దినముగా పేర్కొన్నాడు. (ఆదికాండము 2:4) అలాగే, మొదటి సృష్టి దినములో “దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను.” (ఆదికాండము 1:5) ఇక్కడ 24 గంటల కాలవ్యవధిలో కొంతభాగమే ‘పగలు’ లేదా దినము అని పేర్కొనబడింది. కాబట్టి, ప్రతీ సృష్టి దినము 24 గంటలున్న రోజే అని సొంత అభిప్రాయాల ఆధారంగా చెప్పేందుకు లేఖనాల్లో ఎలాంటి ఆధారాలు లేవు.
మరి సృష్టి దినాల కాలనిడివి ఎంత? ఆదికాండము 1, 2 అధ్యాయాల్లోని మాటలు, సృష్టి దినాలు ఎంతో కాలనిడిగలవని సూచిస్తున్నాయి.
సృష్టి క్రమంగా ఉనికిలోకి వచ్చింది
మోషే తన వృత్తాంతాన్ని హెబ్రీ భాషలో వ్రాశాడు, అంతేకాక ఆయన భూమ్మీద జీవించే ఒక వ్యక్తి దృక్కోణం నుండి వ్రాశాడు. ఆ రెండు విషయాల అవగాహనతోపాటు సృష్టి కాలాలు లేదా “దినములు” ప్రారంభమవకముందే విశ్వమంతా ఉనికిలో ఉందనే పరిజ్ఞానం, సృష్టి వృత్తాంతానికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు సహాయం చేస్తాయి. ఎలా?
ఆదికాండములోని వృత్తాంతాన్ని శ్రద్ధగా పరిశీలించినప్పుడు, మొదటి సృష్టి “దినము” ప్రారంభించబడిన కార్యాలు ఆ తర్వాత ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ దినాల్లో కొనసాగాయని అది తెలియజేస్తుంది. ఉదాహరణకు, మొదటి “దినము” ప్రారంభం కాకముందే, అప్పటికే ఉనికిలో ఉన్న సూర్యుని నుండి వచ్చే కాంతి ఏదో ఒక కారణంగా, బహుశా దట్టమైన మేఘాలు అడ్డుకున్న కారణంగా భూమికి చేరుకోలేదు. (యోబు 38:9) మొదటి “దినము” గడుస్తుండగా కాంతి కిరణాలు వాతావరణాన్ని ఛేదించుకుని భూమిని చేరుకునేలా ఆ అడ్డు క్రమంగా తొలగిపోవడం ఆరంభమైంది. *
ఆదికాండము 1:14-16) వేరే మాటల్లో చెప్పాలంటే, భూమ్మీద ఉన్న వ్యక్తికి సూర్యుడు, చంద్రుడు కనిపించడం ఆరంభించాయి. ఆ సంఘటనలు క్రమంగా సంభవించాయి.
రెండవ “దినము” వాతావరణం మరింత నిర్మలమై పైనున్న దట్టమైన మేఘాలకు, క్రిందున్న మహాసముద్రాలకు మధ్య విశాలం ఏర్పడింది. నాల్గవ “దినము,” వాతావరణం క్రమేణా మరింత నిర్మలంగా మారి, “ఆకాశవిశాలమందు” సూర్యచంద్రులు ప్రత్యక్షమయ్యాయి. (అలా వాతావరణం నిర్మలమౌతుండగా, ఐదవ ‘దినమున’ ఆకాశపక్షులు సృష్టించబడ్డాయని ఆదికాండములోని వృత్తాంతం తెలియజేస్తుంది. ఆకాశపక్షులను సూచించేందుకు ఉపయోగించబడిన ప్రాథమిక హెబ్రీ పదం ఎగిరే కీటకాలను, తేనెటీగల్లాంటి కీటకాలను కూడా సూచించవచ్చు. అయితే, ఆరవ ‘దినమున,’ దేవుడు ఇంకా “ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించే” పనిలో ఉన్నాడని బైబిలు సూచిస్తోంది.—ఆదికాండము 2:19.
ప్రతీ “దినములో” లేదా సృష్టి జరిగిన కాలంలో, కొన్ని గొప్ప కార్యాలు చేయబడినా, అవి అకస్మాత్తుగాకాక, క్రమేణా చేయబడ్డాయి. బహుశా వాటిలో కొన్నింటిని తర్వాతి సృష్టి “దినములలో” కూడా కొనసాగించి ఉండవచ్చని తలంచేందుకు అవకాశముందని బైబిల్లో ఉపయోగించబడిన పదాలు సూచిస్తున్నాయి.
వాటి వాటి జాతుల ప్రకారం
చెట్లు, జంతువులు క్రమేణా ఉనికిలోకి వచ్చాయనే విషయం, ప్రాణుల్లో వైవిధ్యాన్ని కలిగించడానికి దేవుడు పరిణామ ప్రక్రియను ఉపయోగించాడని సూచిస్తోందా? లేదు. దేవుడు అన్ని ప్రధాన “జాతుల” చెట్లను, జంతువుల్ని సృష్టించాడని ఆ వృత్తాంతం స్పష్టంగా చెబుతోంది. (ఆదికాండము 1:11, 12, 20-25) ఆ ప్రధాన “జాతుల” చెట్లు, జంతువులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యంతో సృష్టించబడ్డాయా? ఒక “జాతి” ఎంతవరకు మారుతుందనేది ఏది నిర్ణయిస్తుంది? వీటికి కూడా బైబిలు జవాబివ్వడం లేదు. అయితే, దేవుడు “వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని” సృష్టించాడని మాత్రం అది చెబుతోంది. (ఆదికాండము 1:24) ఒక “జాతి”లో ఎంతవరకు మార్పులు సంభవిస్తాయి అనేదానికి పరిమితులున్నాయని ఈ వాక్యం సూచిస్తోంది. వేల సంవత్సరాలుగా, చెట్ల, జంతువుల ప్రధాన జాతుల్లో చాలా తక్కువ మార్పులు సంభవించాయనే విషయాన్ని శిలాజాల వివరాలు, ఆధునిక పరిశోధనలు కూడా సమర్థిస్తున్నాయి.
కొందరు సనాతనవాదులు వాదిస్తున్నట్లుగా, ఈ విశ్వం, భూమి, దానిలోని ప్రాణులన్నీ కేవలం స్వల్పకాలంలోనే, అదీ కొంత కాలం క్రితమే సృష్టించబడ్డాయని ఆదికాండము బోధించడం లేదు. బదులుగా, విశ్వసృష్టి గురించిన, భూమిలో జీవం ఆవిర్భవించడం గురించిన ఆదికాండములోని వృత్తాంతంలో ఉన్న వర్ణన ఇటీవల విజ్ఞానశాస్త్రం క్రొత్తగా కనుగొన్న విషయాలతో పొందికగా ఉంది.
శాస్త్రవేత్తలు చాలామంది తమ తత్వసంబంధ నమ్మకాలవల్ల దేవుడే అన్నింటినీ సృష్టించాడని బైబిలు చెప్పేదాన్ని నిరాకరిస్తున్నారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రాచీన బైబిలు పుస్తకమైన ఆదికాండములో మోషే ఈ విశ్వానికి ఆరంభం ఉందనీ, ప్రాణులన్నీ క్రమేణా దశలవారిగా, వివిధ కాలవ్యవధుల్లో ఉనికిలోకి వచ్చాయని వ్రాశాడు. మోషేకు దాదాపు 3,500 సంవత్సరాల క్రితమే ఇలాంటి విజ్ఞానపరంగా ఖచ్చితమైన సమాచారం ఎలా తెలిసింది? దానికి ఒకేఒక న్యాయసమ్మతమైన వివరణ ఉంది. ఆకాశాన్ని, భూమిని సృష్టించగల శక్తి, జ్ఞానం ఉన్న దేవుడే మోషేకు అలాంటి విజ్ఞానపరంగా ఖచ్చితమైన జ్ఞానాన్ని ఇవ్వగలడు. ఇది “దైవావేశమువలన” కలిగిందని బైబిలు చెప్పుకునే విషయాన్ని సమర్థిస్తోంది.—2 తిమోతి 3:16. (g 9/06)
మీరెప్పుడైనా ఆలోచించారా?
◼ దేవుడు ఈ విశ్వాన్ని ఎంతకాలం క్రితం సృష్టించాడు?—ఆదికాండము 1:1.
◼ భూమి 24 గంటలున్న ఆరు దినాల్లో సృష్టించబడిందా?—ఆదికాండము 2:4.
◼ భూమి ఆరంభం గురించి మోషే వ్రాసినవి విజ్ఞానపరంగా ఎందుకు ఖచ్చితంగా ఉన్నాయి?—2 తిమోతి 3:16.
[అధస్సూచి]
^ మొదటి “దినము”లో జరిగిన సృష్టిని వర్ణిస్తున్నప్పుడు, వెలుగును వర్ణించడానికి సాధారణ వెలుగును సూచించే హెబ్రీ పదమైన ఓర్ ఉపయోగించబడింది; కానీ నాల్గవ “దినము” జరిగిన సృష్టిని వర్ణిస్తున్నప్పుడు వెలుగు మూలాన్ని సూచించే మా ఓర్ అనే పదం ఉపయోగించబడింది.
[19వ పేజీలోని బ్లర్బ్]
ఈ విశ్వం కేవలం స్వల్పకాలంలోనే, అదీ కొంతకాలం క్రితమే సృష్టించబడిందని ఆదికాండము బోధించడం లేదు
[20వ పేజీలోని బ్లర్బ్]
“ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.”—ఆదికాండము 1:1
[18వ పేజీలోని చిత్రసౌజన్యం]
విశ్వం: IAC/RGO/David Malin Images
[20వ పేజీలోని చిత్రసౌజన్యం]
NASA photo