కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదటి శతాబ్దంలో అనేకులను అలరించిన వినోదం

మొదటి శతాబ్దంలో అనేకులను అలరించిన వినోదం

మొదటి శతాబ్దంలో అనేకులను అలరించిన వినోదం

దక్షిణ ఇటలీలోని రెండు ఇరుగుపొరుగు నగరాల ప్రత్యర్థ క్రీడాభిమానుల మధ్య చెలరేగిన అలజడిలో అసంఖ్యాకులు క్షతగాత్రులయ్యారు, కొంతమంది పిల్లలతోపాటు అనేకులు మృత్యువాత పడ్డారు. ఆ విషాద సంఘటన కారణంగా ఆ ఆంఫీథియేటర్‌ను (రోములోని క్రీడా ప్రాంగణాన్ని) పది సంవత్సరాలపాటు మూసివేయాలని అధికారులు ఆజ్ఞ జారీచేశారు.

నేటి వార్తాపత్రికల్లో అలాంటి అల్లర్ల గురించిన నివేదికలు మామూలైపోయాయి. కానీ పైన పేర్కొనబడిన సంఘటన దాదాపు 2,000 సంవత్సరాల క్రితం నీరో చక్రవర్తి హయాంలో సంభవించింది. పాంపేయీలోని ఆంఫీథియేటర్‌లో క్రీడా యుద్ధాలు జరుగుతుండగా, పాంపేయీ నివాసులు పొరుగు నగరమైన న్యూసీరియాలోని క్రీడాభిమానులతో తలపడినప్పుడు చెలరేగిన ఆ అలజడిలో ఏమి జరిగిందో రోమన్‌ చరిత్రకారుడైన టాసిటస్‌ వివరించాడు.

మొదటి శతాబ్దంలో, వినోదం అనేకులను ఆకర్షించేది. రోములోని ప్రధాన నగరాల్లో థియేటర్లు, ఆంఫీథియేటర్లు, సర్కస్‌లు ఉండేవి, కొన్ని నగరాల్లో ఈ మూడూ ఉండేవి. “ఆ ఆటల్లో భీకరమైన ప్రమాదం, ఉత్తేజం ఉండేది . . . ఇరుపక్షాల మధ్య క్రమపద్ధతిలో రక్తపాతం జరిగేది” అని అట్లాస్‌ ఆఫ్‌ ద రోమన్‌ వరల్డ్‌ పుస్తకం చెబుతోంది. రథసారథులు ప్రత్యేకంగా కనిపించే రంగుల దుస్తులు ధరించేవారు, ప్రతీ జట్టు ఫలానా సమాజంలోని రాజకీయపరమైన లేదా సామాజికపరమైన ఒక గుంపును సూచించేది. వాళ్ళ అభిమాన జట్టు కనిపించినప్పుడు అభిమానులు ఆవేశంతో కేకలువేస్తూ అల్లరి చేసేవారు. రథసారథులు ఎంత ప్రజాదరణ పొందారంటే ప్రజలు వారి చిత్రాలను తమ ఇళ్ళలో అలంకరించుకునేవారు, వారికి పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వబడేది.

రక్తసిక్తమయ్యే క్రీడా యుద్ధాలను, మనుష్యులు క్రూరమృగాలతో తలపడడాన్ని, కొన్నిసార్లు నిరాయుధులుగానే అలా తలపడడాన్ని నగరాల్లో ప్రదర్శించేవారు. చరిత్రకారుడు విల్‌ డ్యూరాన్ట్‌ ప్రకారం, “మరణశిక్ష విధించబడిన నేరస్థులు జంతువుల్లా కనిపించేలా కొన్నిసార్లు వారిపై జంతుచర్మాలు కప్పి, ఆకలితో నకనకలాడే మృగాల ముందు పడేసేవారు, అలాంటి పరిస్థితుల్లో వారు వేదనభరితమైన మరణం అనుభవించేవారు.”

అలాంటి భక్తిహీన వినోదాన్ని ఆనందించిన ప్రజలు నిజంగానే “అంధకారమైన మనస్సుగలవారై,” “సిగ్గులేనివా[రిగా]” ఉన్నారు. (ఎఫెసీయులు 4:​17-19) రెండవ శతాబ్దంలో టెర్టూలియన్‌ ఇలా వ్రాశాడు: “సర్కస్‌లలో కనిపించే పిచ్చి ఆవేశం, థియేటర్‌లో ప్రదర్శించబడే అశ్లీలత, క్రీడా ప్రాంగణాల్లోని క్రూరత్వం గురించి [క్రైస్తవులు] మాట్లాడుకోవడంగానీ, చూడడంగానీ లేదా వినడంగానీ చేసేవారు కాదు.” నేడు నిజ క్రైస్తవులు కూడా “బలాత్కారాసక్తులు” యెహోవాకు “అసహ్యులు” అనే విషయాన్ని గుర్తుంచుకుని, పుస్తకాలు, టీవీ లేదా కంప్యూటర్‌ గేమ్స్‌లాంటి వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే దౌర్జన్యపూరితమైన వినోదానికి దూరంగా ఉండేలా జాగ్రత్తపడతారు.​—కీర్తన 11:5. (g 11/06)

[14వ పేజీలోని చిత్రం]

విజయోత్సాహపు రథసారథి కళాస్వరూపం

[14వ పేజీలోని చిత్రం]

ఆడ సింహంతో తలపడుతున్న వ్యక్తిని గోడపై చిత్రీకరించారు

[14వ పేజీలోని చిత్రం]

మొదటి శతాబ్దపు రోమన్‌ థియేటర్‌

[చిత్రసౌజన్యం]

Ciudad de Mérida

[14వ పేజీలోని చిత్రసౌజన్యం]

పైన, క్రింద ఎడమవైపు: Museo Nacional de Arte Romano, Mérida