కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పంటినొప్పి ఆ బాధ ఎవరికీ తప్పలేదు

పంటినొప్పి ఆ బాధ ఎవరికీ తప్పలేదు

పంటినొప్పి ఆ బాధ ఎవరికీ తప్పలేదు

మధ్య యుగంలో, ఓ నగర కూడలిలో ఆడంబరంగా కనిపించే ఓ కపటవైద్యుడు నొప్పి తెలియకుండా పన్ను పీకగలనని ప్రగల్భాలు పలుకుతాడు. అతని సహచరుడొకడు, తటపటాయిస్తున్నట్లుగా నటిస్తూ గుంపులో నుండి ముందుకు వస్తాడు. ఆ వైద్యుడు పన్ను తీస్తున్నట్లుగా నటించి, రక్తపు మరకలున్న పన్నును అందరూ చూసేలా పైకెత్తి పట్టుకుంటాడు. దాంతో పంటినొప్పితో బాధపడేవారు, ఆ వైద్యునికి డబ్బుచెల్లించి పళ్లు తీయించుకునేందుకు ముందుకువస్తారు. ఇతరులు పళ్లు తీయించుకునేవారి అరుపులు విని నిరుత్సాహపడకుండా డప్పులను, మేళాలను పెద్దపెట్టున వాయిస్తారు. కొన్ని రోజుల్లోనే కొందరికి చీముపట్టి పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది, కానీ అప్పటికే ఆ కపట వైద్యుడు ఎక్కడికో జారుకునివుంటాడు.

ఇప్పుడైతే పంటినొప్పితో బాధపడేవారిలో దాదాపు ఎవరూ అలాంటి మోసగాళ్ల దగ్గరికి వెళ్లరు. ఆధునిక దంతవైద్యులు పంటినొప్పిని తగ్గించగలగడమేకాక, తరచూ పన్ను తీయించుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తారు. అయినా, చాలామంది దంతవైద్యుని దగ్గరకు వెళ్లాలంటే భయపడతారు. మొదట్లో వైద్యులు తమ దగ్గరికి వచ్చేవారి పంటినొప్పిని తగ్గించడాన్ని ఎలా నేర్చుకున్నారో తెలుసుకోవడం నేటి దంతవైద్యం పట్ల మీరు కృతజ్ఞత చూపించడానికి సహాయపడుతుంది.

సాధారణ జలుబు తర్వాత ఎక్కువమందిని పీడించే వ్యాధి దంతక్షయం. అది కొత్త వ్యాధేమీ కాదు. ప్రాచీన ఇశ్రాయేలులో వయసు పైబడినవారికి పళ్లు ఊడిపోవడం సహజమేనని రాజైన సొలొమోను పద్యరచన వెల్లడిస్తోంది.—ప్రసంగి 12:3.

రాజవంశస్థులకూ తప్పలేదు

ఎలిజబెత్‌ I ఇంగ్లాండ్‌కు రాణియైనా, పంటినొప్పి ఆమెనూ వదలలేదు. జర్మనీకు చెందిన ఓ సందర్శకుడు ఆమె నల్లని పళ్లను గమనించి, “పంచదారను అధికంగా వాడడం ఆంగ్లేయుల్లో సాధారణంగా కనిపించే లోపం” అని అన్నాడు. 1578 డిసెంబరులో ఆ రాణి పగలనక రేయనక పంటినొప్పితో ఎంతో బాధపడింది. పుచ్చిన పన్ను తీయించుకోమని వైద్యులు ఆమెకు సలహా ఇచ్చినా, బహుశా నొప్పి భయంతో ఆమె దానికి ఒప్పుకోలేదు. ఆమెను ఒప్పించడానికి లండన్‌కు బిషప్‌గా ఉన్న జాన్‌ ఏల్మర్‌, ఆమె ముందు బహుశా పుప్పిపన్నునొకదాన్ని తీయించుకున్నాడు. అది సాహసకార్యమనే చెప్పవచ్చు, ఎందుకంటే వృద్ధాప్యం కారణంగా ఆయనకు కొన్ని పళ్లు మాత్రమే ఉండేయి!

అప్పట్లో పన్ను తీయించుకోవాలనుకునేవారు మంగలి దగ్గరికో లేక కంసాలి దగ్గరికో వెళ్లేవారు. ప్రజల్లో చాలామంది పంచదార కొనుక్కునే తాహతుకు పెరిగేసరికి, పంటినొప్పి సమస్య అధికమై వాటిని పీకడంలో నైపుణ్యం ఉన్నవారి అవసరం కూడా పెరిగింది. అందుకే, కొందరు వైద్యులు, శస్త్రచికిత్సచేసేవారు దంతక్షయానికి వైద్యం చేయడంపై ఆసక్తి చూపించడం ప్రారంభించారు. అయితే వారు తమంతట తామే వైద్య మెళకువలను నేర్చుకోవాల్సివచ్చేది ఎందుకంటే నిపుణులు తమ వృత్తికి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచేవారు. ఆ విషయంపై పుస్తకాలు కూడా ఎక్కువగా ఉండేవి కావు.

ఎలిజబెత్‌ I పంటినొప్పితో బాధపడ్డ వంద సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్‌లో లూయిస్‌ XIV రాజుగా పరిపాలించాడు. ఆయన తన జీవితంలో ఎక్కువభాగం పంటినొప్పితో బాధపడ్డాడు, చివరకు 1685లో ఎడమవైపు పైనున్న పళ్లన్నీ తీయించేసుకున్నాడు. ఆ రాజు పుప్పిపళ్ల నొప్పి కారణంగానే ఫ్రాన్స్‌లో ఆరాధనా స్వేచ్ఛకు సంబంధించిన శాసనాన్ని రద్దు చేయాలనే రాజశాసనంపై సంతకం చేశాడని కొందరు అంటారు. ఆ విపత్కర రాజశాసనంవల్ల అల్పసంఖ్యాక మతాలు దారుణమైన హింసకు గురయ్యాయి.

ఆధునిక దంతవైద్యం ఎలా ప్రారంభమైంది?

పారిస్‌ నగరంలో విలాసవంతంగా జీవనవిధానాలు సాగిస్తున్న వ్యక్తులపై లూయిస్‌ XIV ప్రభావం దంతవైద్య వృత్తికి నాంది పలికింది. రాజుల ఆస్థానంలో తమ పదవిని నిలబెట్టుకోవాలంటే వారు ఆకర్షణీయంగా కనిపించాలి. ఆహారం తినడానికి కాదుగాని అందంగా కనిపించాలనే తపనతో కట్టుడుపళ్ళు పెట్టించుకోవడం పట్ల ప్రజల్లో మోజు పెరిగింది, దాంతో అలాంటి సంపన్నులకు దంతవైద్యం చేసే శస్త్రవైద్యుల కొత్త గుంపు తెరమీదికొచ్చింది. ఫ్రాన్స్‌లోని నావికాదళంలో శస్త్రచికిత్స చేయడం నేర్చుకున్న పయర్‌ ఫాశార్‌ పారిస్‌లో దంతవైద్యునిగా ప్రఖ్యాతిగాంచాడు. వైద్యం తెలియని మంగలివాళ్ల దగ్గరో లేదా కపటవైద్యుల దగ్గరో పళ్ళు తీయించుకోవడాన్ని సమర్థించిన శస్త్రవైద్యులను ఆయన విమర్శించాడు, దంత శస్త్రవైద్యుడని మొదటిసారి స్వయంగా పేరు పెట్టుకున్నది కూడా ఆయనే.

ఫాశార్‌ ఇతరుల్లా వృత్తిపరమైన మెళకువలను రహస్యంగా ఉంచే బదులు 1728లో, తనకు తెలిసిన పద్ధతులన్నింటినీ ఒక పుస్తకంలో రాశాడు. దాంతో ఆయనకు “దంతవైద్యశాస్త్ర పిత” అనే పేరు వచ్చింది. రోగులను నేలపైకాక కుర్చీల్లో కూర్చోబెట్టి చికిత్స చేయడాన్ని కూడా ఆయనే మొదలుపెట్టాడు. పళ్లు తీయడానికి ఆయనే ఐదు వివిధ ఉపకరణాలను తయారుచేశాడు, అయితే ఆయన పళ్లు తీయడంకన్నా మరింత ఎక్కువే చేశాడు. ఆయన దంతవైద్యుల కోసం డ్రిల్లును (పళ్ళలో రంధ్రాలు చేయడానికి ఉపయోగించే పరికరం) తయారుచేయడమేకాక, పుప్పిపళ్లను పూడ్చే పద్ధతులను కూడా కనిపెట్టాడు. పంటి మూలంవరకు శుభ్రంచేసి దానిని పూడ్చడాన్ని, మూలానికి కట్టుడుపన్ను అమర్చడాన్ని కూడా నేర్చుకున్నాడు. ఏనుగు దంతంతో చేసిన ఆయన కట్టుడుపళ్ల సెట్టుకు స్ప్రింగు అమర్చబడి ఉండేది, అది పైదవడ పళ్ల సెట్టును స్థిరంగా ఉంచేది. ఫాశార్‌ దంతవైద్యాన్ని వృత్తిగా స్థాపించాడు. ఆయన వైద్యవిధానం అమెరికా వరకు వ్యాపించింది.

అమెరికా మొదటి అధ్యక్షుని తీవ్రబాధ

లూయిస్‌ XIV పంటినొప్పితో బాధపడిన శతాబ్దం తర్వాత అమెరికాలో జార్జ్‌ వాషింగ్‌టన్‌కు అదే సమస్య ఎదురైంది. ఆయనకు 22 ఏళ్లు వచ్చినప్పటినుండి సంవత్సరానికి ఒకటి చొప్పున పళ్లు తీయించుకోవడం మొదలుపెట్టాడు. తీవ్రమైన పంటినొప్పిని భరిస్తూనే, ఆయన బ్రిటన్‌కు వ్యతిరేకంగా తన సైన్యాన్ని నడిపించడాన్ని ఊహించుకోండి! ఆయన 1789లో అమెరికాకు మొదటి అధ్యక్షుడయ్యే సమయానికి ఆయనకు దాదాపు పళ్లే లేకుండాపోయాయి.

పళ్లు ఊడిపోవడంవల్ల అందవిహీనంగా కనిపిస్తున్నాననే బాధ, సరిగ్గా అమరని కట్టుడుపళ్ల వల్ల కలిగిన ఇబ్బంది వాషింగ్‌టన్‌ను మానసికంగా కృంగదీసాయి. ఒక కొత్త దేశానికి అధ్యక్షునిగా ఆయన ప్రజల మధ్య తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో తను కనబడే తీరు గురించి అత్యంత జాగ్రత్తగా ఉండేవాడు. ఆ రోజుల్లో కట్టుడుపళ్లు నోటి అచ్చుతీసుకుని కాదు కానీ ఏనుగు దంతాలతో తయారు చేయబడేవి కాబట్టి అవి చిగుళ్లకు అంటిపెట్టుకుని ఉండేవి కావు. వాషింగ్‌టన్‌కు ఎదురైన సమస్యలే ఇతర ఆంగ్లేయులకు కూడా ఎదురయ్యాయి. వారు తమ కట్టుడుపళ్లు కనిపిస్తాయనే భయంతో పెద్దగా నవ్వేవారు కాదు, దానివల్లే వారిలో హాస్యచతురత లోపించిందని చెప్పబడుతోంది.

వాషింగ్‌టన్‌ చెక్కతో చేసిన కట్టుడుపళ్లు పెట్టుకునేవాడనే కట్టుకథ ఉండేది, కానీ అది నిజం కాదు. ఆయనకు మనిషి పళ్లతో, ఏనుగు దంతంతో, సీసంతో చేసిన పళ్లు ఉండేవి కానీ చెక్కతో చేసినవి కాదు. బహుశా ఆయన దంతవైద్యులు, చనిపోయిన దొంగల నుండి పళ్లును సేకరించివుండవచ్చు. అప్పట్లో పళ్ల వర్తకులు యుద్ధం తర్వాత చనిపోయినవారి, చనిపోబోతున్నవారి పళ్లను తొలగించి తీసుకువెళ్లడానికి సైన్యాలవెంట వెళ్లేవారు. ఆ విధంగా కట్టుడుపళ్లు పెట్టించుకోవడం కేవలం సంపన్నులకే సాధ్యమయ్యేది. అయితే, 1850లలో వల్కనైజ్డ్‌ రబ్బరును కనిపెట్టడంతో దానిని కట్టుడుపళ్ల అడుగుభాగంలో ఉపయోగించడం ప్రారంభించారు, అప్పుడే అవి సామాన్య ప్రజల అందుబాటులోకి వచ్చాయి. వాషింగ్‌టన్‌కు వైద్యం చేసిన వైద్యులు దంతవైద్య వృత్తి ఉన్నత శిఖరాలను చేరుతున్న సమయంలోనే జీవించినా, అసలు పంటినొప్పికి కారణమేమిటో వారు పూర్తిగా అర్థంచేసుకోలేకపోయారు.

పంటినొప్పికి అసలు కారణం

మొదటి నుండి ప్రజలు క్రిముల వల్లే పంటినొప్పి వచ్చేదని నమ్మేవారు, 1700వ శతాబ్దం వచ్చేంతవరకు వారు అలాగే అనుకున్నారు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ బెర్లిన్‌లో పనిచేస్తున్న, అమెరికా దంతవైద్యుడు విల్లోగ్బీ మిల్లర్‌ 1890లో దంతక్షయానికి, పంటినొప్పికి ముఖ్య కారకాన్ని గుర్తించాడు. ప్రత్యేకంగా పంచదారవల్లనే వృద్ధయ్యే ఒక రకమైన సూక్ష్మజీవులు పళ్లకు హాని కలిగించే ఆమ్లాన్ని వృద్ధిచేస్తాయి. అయితే దంతక్షయాన్ని ఎలా నివారించవచ్చు? దానికి జవాబు యాదృచ్ఛికంగానే వెల్లడైంది.

అమెరికాలోని కొలొరాడోలో జీవించే అనేకుల పళ్లపై మచ్చలు ఎందుకు వస్తున్నాయో అక్కడి దంతవైద్యులు ఎన్నో ఏళ్లవరకు కనిపెట్టలేకపోయారు. చివరకు, నీటి సరఫరాలో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉండడమే దానికి కారణమని కనిపెట్టారు. కానీ ఆ స్థానిక సమస్యను గురించి అధ్యయనం చేస్తుండగా, పంటినొప్పిని తగ్గించేందుకు లోకవ్యాప్తంగా పనికివచ్చే ఒక విషయాన్ని పరిశోధకులకు కనుగొన్నారు: నీటిలో ఫ్లోరైడ్‌ తక్కువగా ఉన్నచోట పెరిగినవారికే దంతక్షయం ఎక్కువగా వచ్చేది. అనేకచోట్ల నీటి సరఫరాలో సహజంగా ఉండే ఫ్లోరైడ్‌, పంటిపైని ఎనామిల్‌లో ఉండే ఒక పదార్థం. నీటి సరఫరాలో ఫ్లోరైడ్‌ లోపించిన వారికి తగిన మోతాదులో దానిని ఇచ్చినప్పుడు, దంతక్షయం దాదాపు 65 శాతం వరకు తగ్గుతుంది.

అలా ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. చాలా సందర్భాల్లో పంటినొప్పికి దంతక్షయమే కారణం. పంచదార వల్ల పుప్పిపళ్లు ఏర్పడతాయి. ఫ్లోరైడ్‌ దానిని నివారిస్తుంది. అయితే, సరిగ్గా పళ్లు తోముకుని, శుభ్రం చేసుకోవడానికి అది ప్రత్యామ్నాయం మాత్రం కాదు.

నొప్పిలేని దంతవైద్యం కోసం అన్వేషణ

మత్తుమందు కనిపెట్టబడకముందు దంతవైద్య పద్ధతులు రోగులకు విపరీతమైన నొప్పి కలిగించేవి. దంతవైద్యులు నొప్పిపెడుతున్న పుప్పిపళ్లలో పదునైన ఉపకరణాలతో రంధ్రము చేసి శుభ్రంచేసేవారు, తర్వాత ఆ రంధ్రంలో వేడివేడి లోహాన్ని కూరేవారు. వారిదగ్గర ఆంటిబయాటిక్స్‌ ఉండేవి కాదు కాబట్టి, ఎర్రగా కాల్చిన కడ్డీని పంటి మూలం వరకు దూర్చి పుచ్చిన లేదా కుళ్లిన భాగాన్ని కాల్చేవారు. ప్రత్యేక ఉపకరణాలు, మత్తుమందు కనిపెట్టబడక ముందు పళ్లు పీకించుకోవడం ఒక భయంకరమైన అనుభవంగా ఉండేది. పంటినొప్పితో జీవించడం ఇంకా భయంకరంగా ఉండేది కాబట్టే ప్రజలు అలాంటి వైద్యవిధానానికి తలొగ్గేవారు. అప్పటికి దశాబ్దాలుగా నల్లమందు, గంజాయి, పుత్రదాత వృక్షపు పండ్లు ఉపయోగించబడుతున్నా అవి నొప్పిని కొద్దిగా మాత్రమే తగ్గించేవి. దంతవైద్యులు నొప్పిలేకుండా ఎప్పటికైనా వైద్యం చేయగల్గుతారా?

జోసెఫ్‌ ప్రీస్ట్‌లీ అనే ఆంగ్ల రసాయనశాస్త్రవేత 1772లో నైట్రస్‌ ఆక్సైడ్‌ లేదా లాఫింగ్‌ గాస్‌ అని పిలువబడే వాయువును మొదటిసారిగా తయారుచేసిన తర్వాత దానిలోని మత్తెక్కించే గుణాలను గుర్తించడం జరిగింది. కానీ 1844 వరకు దాన్ని ఎవరూ మత్తుమందుగా ఉపయోగించలేదు. ఆ సంవత్సరం డిసెంబరు 10న, అమెరికాలోని కోనెక్టికట్‌లో ఉన్న హార్ట్‌ఫోర్డ్‌లో దంతవైద్యునిగా పనిచేస్తున్న హోరేస్‌ వెల్స్‌ ఒక సభకు హాజరయ్యాడు. అక్కడ ప్రజల్ని లాఫింగ్‌ గ్యాస్‌తో అలరించడం జరిగింది. దాని ప్రభావంలో ఉన్న ఒక వ్యక్తి తన మోకాళ్లు బరువైన బెంచీకు తగిలినా ఎలాంటి నొప్పి కలగనట్లే ప్రవర్తించడాన్ని వెల్స్‌ గమనించాడు. వెల్స్‌ సానుభూతిగల వ్యక్తి, ఆయన తన దగ్గరికి వచ్చే రోగులకు తను కలిగించే నొప్పి విషయంలో ఎంతో బాధపడేవాడు. వెల్స్‌కు వెంటనే ఆ వాయువును మత్తుమందుగా ఉపయోగించాలనే ఆలోచన తట్టింది. కానీ దాన్ని ఇతరులకు ఇచ్చే ముందు తనపై ప్రయోగించి చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ మరుసటి రోజే ఆయన కుర్చీలో కూర్చుని స్పృహ కోల్పోయేంతగా ఆ గాలిని పీల్చాడు. ఆ తర్వాత నొప్పిగా ఉన్న ఆయన జ్ఞానదంతాన్ని ఆయన తోటి ఉద్యోగి తొలగించాడు. చరిత్రలో అదొక మలుపురాయి. నొప్పిలేని దంతవైద్యానికి ఆ సంఘటన నాంది పలికింది! *

అప్పటినుండి దంతవైద్యం సాంకేతికపరంగా ఎంతో అభివృద్ధి చెందింది. అందుకే నేడు మీరు దంతవైద్యుని దగ్గరికి వెళ్తే అదో భయంకరమైన అనుభవంగా ఉండదు. (g 9/07)

[అధస్సూచి]

^ నేడు నైట్రస్‌ ఆక్సైడ్‌కన్నా, నొప్పివున్న భాగాన్నే మొద్దుబారజేసే మత్తుమందునే (లోకల్‌ ఆనస్థీషియా) మరింత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

[28వ పేజీలోని చిత్రం]

అమెరికాకు మొదటి అధ్యక్షుడైన జార్జ్‌ వాషింగ్‌టన్‌ వాడిన ఏనుగు దంతపు కట్టుడుపళ్లు

[చిత్రసౌజన్యం]

Courtesy of The National Museum of Dentistry, Baltimore, MD

[29వ పేజీలోని చిత్రం]

నైట్రస్‌ ఆక్సైడ్‌ను మత్తుమందుగా ఉపయోగించి మొదటిసారిగా చేసిన దంత శస్త్రచికిత్సను ఉదాహరిస్తూ 1844లో గీసిన చిత్రకారుని ఊహాచిత్రం

[చిత్రసౌజన్యం]

Courtesy of the National Library of Medicine

[29వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of the National Library of Medicine