ప్రపంచ విశేషాలు
అమెరికా
పోలీసులు కారుల్లో నేరస్తులను వెంటాడుతున్నప్పుడు వేగం వల్ల ప్రమాదాలు జరగకుండా కొన్ని పరికరాలను ఉపయోగిస్తున్నారు. కొన్ని పోలీసు కార్లకు గన్‌లా పనిచేసే పరికరాన్ని బిగిస్తారు. దాని ద్వారా నేరస్తుల కారు మీదికి జీ.పీ.ఎస్ పరికరాన్ని (ఎక్కడున్నామో చెప్పే పరికరం) వదులుతారు. అది వెళ్లి నేరస్తుని కారుకు అతుక్కుని ఆ కారున్న చోటును చూపిస్తుంది. అలా పోలీసులు వేగం తెచ్చే ప్రమాదాలను నివారిస్తూ నేరస్తులను పట్టుకుంటున్నారు.
భారతదేశం
ఒక అంచనా ప్రకారం కట్నం గొడవల్లో గంటకు ఒక స్త్రీని చంపేస్తున్నారు. చట్ట ప్రకారం కట్నం ఇచ్చినా తీసుకున్నా నేరం. అయినా 2012లో పెళ్లి కొడుకులు, అతని కుటుంబ సభ్యులు కట్నం సరిపోలేదని 8,200 కన్నా ఎక్కువ మంది స్త్రీలను చంపేశారు.
స్విట్జర్లాండ్
ఆల్పైన్ స్విఫ్ట్ పక్షుల కదలికను కనిపెట్టడానికి అవి జతకట్టే ప్రాంతాల్లో ఉన్నప్పుడు మూడు పక్షులకు చిన్న యంత్రాలను పెట్టారు. ఈ యంత్రాల ద్వారా ఆ పక్షులు దాదాపు 200 రోజులు ఆగకుండా ఎగురుతూ ఆఫ్రికాకు చేరుకుంటున్నాయని తెలుసుకున్నారు. సముద్ర జంతువులు మాత్రమే అంత ఎక్కువ ప్రయాణం చేస్తాయని అంతకుముందు అనుకున్నారు.
హార్న్ ఆఫ్ ఆఫ్రికా
సముద్ర దొంగలు (పైరేట్స్) 2005 ఏప్రిల్ నుండి 2012 డిసెంబరు వరకు తూర్పు ఆఫ్రికా తీరంలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని పిలిచే సొమాలియా, ఇతియోపియా, జిబౌటి, ఎరిట్రియా దేశాల సముద్రాల్లో 179 ఓడల్ని దొంగిలించారు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ఈ దొంగలు ఆ ఓడల్ని వదిలేయడానికి దాదాపు 2502 కోట్ల రూపాయలు తీసుకున్నారు. (g14-E 10)