పత్రిక ముఖ్యాంశం
మానసిక సమస్య ఉంటే భయపడాలా?
“నాకు మానసిక వ్యాధి (బైపోలార్ డిజార్డర్, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్) ఉందని డాక్టర్లు చెప్పగానే ఒక్క నిమిషం ఊపిరాడలేదు. మానసిక వ్యాధి ఉందంటే అందరూ వింతగా చూస్తారని చాలా భయమేసింది” అని క్లాడీయ అంది.
“పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. ఈ పరిస్థితిలో నేను నా భార్యకు తోడుగా ఉంటూ ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాను” అని ఆమె భర్త మార్క్ చెప్పాడు.
మీకు గానీ, మీవాళ్లెవరికైనా గానీ మానసిక వ్యాధి ఉందని తెలిస్తే మీకెలా అనిపిస్తుంది? కంగారు పడకండి, ఈ వ్యాధులకు చికిత్స ఉంది. మానసిక వ్యాధుల గురించి మనం తెలుసుకోవాల్సిన వాటిని చూద్దాం. తెలుసుకుంటే చాలా ఉపయోగాలున్నాయి. a
మానసిక వ్యాధుల గురించి కొన్ని నిజాలు
“ప్రపంచంలో కోట్లమంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. వీటివల్ల వాళ్ల కుటుంబ సభ్యులు కూడా బాధ పడుతున్నారు. ప్రతీ నలుగురిలో ఒకరు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మానసిక వ్యాధితో బాధపడతారు. మానసిక వ్యాధుల్లో ఎక్కువమందిలో కనిపించేది డిప్రెషన్ అయితే ఎక్కువగా ఇబ్బందిపెట్టే వ్యాధులు మాత్రం వేరే ఉన్నాయి. అవి స్కిట్సొఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్. . . . మానసిక వ్యాధులతో చాలామంది బాధపడుతున్నా వాటిని బయటకు చెప్పడం లేదు, సరైన వైద్య సహాయం అందట్లేదు, వాళ్లను చులకనగా చూస్తున్నారు.”—ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).
మానసిక వ్యాధి ఉందని తెలిస్తే అవమానమని చాలామంది వైద్య సహాయం తీసుకోవడానికి వెనకాడుతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది.
మానసిక వ్యాధులకు చికిత్స ఉన్నా గడిచిన సంవత్సరంలో అమెరికాలో ఆ వ్యాధులతో బాధపడుతున్న పెద్దవాళ్లలో దాదాపు 60 శాతం, 8 నుండి 15 ఏళ్ల పిల్లల్లో 50 శాతం చికిత్స పొందలేదు అని నేషనల్ అలయన్స్ ఆన్ మెంటల్ ఇల్నెస్ అనే సంస్థ చెప్పింది.
మానసిక వ్యాధుల గురించి తెలుసుకోండి
మానసిక వ్యాధి అంటే సరిగ్గా ఆలోచించలేకపోవడం, ప్రవర్తించలేకపోవడం; కోపం, సంతోషం, దుఃఖం లాంటివి వచ్చినప్పుడు విపరీతంగా ప్రవర్తించడం అని డాక్టర్లు చెబుతున్నారు. మానసిక వ్యాధి వల్ల ఎదుటి వాళ్లను అర్థం చేసుకోలేక పోవడం, అందరిలా ఉండలేకపోవడం, రోజువారీ పనుల్ని చేసుకోలేకపోవడం జరగవచ్చు.
మానసిక వ్యాధులు మనలో ఉండే బలహీనతల వల్ల రావు
వ్యాధి లక్షణాలు ఎంత కాలంగా ఉన్నాయి, ఎంత ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక్కొక్కరి సమస్య, పరిస్థితిని బట్టి మారుతుంది. ఆడామగ, చిన్నాపెద్ద, మతం, ప్రాంతం, చదువు, ఆస్తి లాంటి వాటితో సంబంధం లేకుండా ఎవరికైనా ఇవి రావచ్చు. మానసిక వ్యాధులు మనలో ఉండే బలహీనతల వల్ల రావు. సరైన వైద్య సహాయం తీసుకుంటే వ్యాధి తగ్గిపోతుంది, అప్పుడు అందరిలాగే జీవిస్తారు, పనిచేస్తారు.
మానసిక వ్యాధులకు చికిత్స
చికిత్స ద్వారా డాక్టర్లు మానసిక వ్యాధులను పూర్తిగా తగ్గిస్తారు. ముందు చేయాల్సిన పనేంటంటే చికిత్స చేయడంలో అనుభవం ఉన్న డాక్టరుతో పూర్తిగా పరీక్ష చేయించుకుని సమస్యను తెలుసుకోవాలి.
డాక్టరుకు చూపించుకుంటే సరిపోదు ఆయనిచ్చిన మందులు వాడాలి, సలహాలను పాటించాలి. డాక్టరుకు సమస్య గురించి ఏమీ దాచిపెట్టకుండా చెప్పాలి. మీ వ్యాధి ఏంటో, రోజూ మీకు ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో డాక్టరు, ఆయనతో పనిచేసే వాళ్లు చెబుతారు. అంతేకాక వాళ్లు చికిత్స పూర్తయ్యేవరకు దాన్ని ఆపకూడదు అని కూడా చెబుతారు. చికిత్స కోసం వెళ్తున్నప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, మీకు ధైర్యం చెప్పే వాళ్లను తోడుగా తీసుకువెళ్లాలి.
చాలామంది సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల, డాక్టరు చెప్పిన వైద్యాన్ని పాటించడం వల్ల వ్యాధిని తగ్గించుకున్నారు. “నా భార్యకు సమస్య ఉందని తెలీక ముందు, మాకు మానసిక వ్యాధుల గురించి అంతగా తెలీదు. వ్యాధివల్ల వచ్చే ఇబ్బందులను మెల్లమెల్లగా పరిష్కరించుకుంటూ పరిస్థితికి తగినట్లు ఎలా మారాలో ఇప్పుడు నేర్చుకున్నాం. డాక్టర్లు, ఆయనతో పనిచేసేవాళ్లు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయం మాకెంతో ఉపయోగపడింది” అని మొదట్లో చూసిన మార్క్ అన్నాడు.
ముందు చేయాల్సిన పనేంటంటే మంచి డాక్టరుతో పరీక్ష చేయించుకుని, సమస్యను పూర్తిగా తెలుసుకోవాలి
“నాకు వ్యాధి ఉందని తెలిసినప్పుడు, జైల్లో పడేసినట్లు అనిపించింది. నా వ్యాధి వల్ల నేను, నా భర్త
ప్రతీది చేయలేం. కానీ ప్రయత్నిస్తే కష్టంగా అనిపించే వాటిని కూడా పరిష్కరించుకోవచ్చు అని అర్థమైంది. నాకు వైద్య సహాయం ఇస్తున్న వాళ్ళు చెప్పేవన్నీ పాటిస్తూ, అందరితో స్నేహంగా ఉంటూ, ఇబ్బందులను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ నా వ్యాధిని తగ్గించుకుంటున్నాను” అని క్లాడీయ చెప్పింది.దేవుని మీద భక్తి కూడా అవసరం
కేవలం దేవుని మీద భక్తి మాత్రమే వ్యాధుల్ని తగ్గిస్తుందని బైబిలు చెప్పడం లేదు. కానీ బైబిల్లో ఉన్న విషయాల నుండి ప్రపంచంలో చాలా కుటుంబాలు ఓదార్పును, ధైర్యాన్ని పొందారు. మనల్ని ప్రేమించే సృష్టికర్త “విరిగిన హృదయం,” “నలిగిన మనస్సు” ఉన్న వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటాడని బైబిలు హామీ ఇస్తుంది.—కీర్తన 34:18.
బైబిలు వైద్య పుస్తకం కాకపోయినా మనసంతా బాధతో నిండినప్పుడు, తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో, ఏమి చేయాలో బైబిల్లో ఉంది. జీవితంలో బాధలు, వ్యాధులు ఇంకెప్పుడూ ఉండని రోజులు రాబోతున్నాయి అనే ఊరటను కూడా బైబిలు ఇస్తుంది. “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును” అని దేవుడు మాటిస్తున్నాడు.—యెషయా 35:5, 6. ◼ (g14-E 12)
a ఈ ఆర్టికల్లో “మానసిక వ్యాధి” అంటే మానసిక సమస్యలు, మామూలుగా ప్రవర్తించకపోవడం వంటివి.