పేకాట, జూదం
పేకాట, జూదం
కొంతమంది పేకాట, జూదం సరదా కోసం ఆడే ఆటలు అంటారు, ఇంకొంతమంది వాటిని చెడు అలవాటులు అంటారు.
జూదం ఆడడం తప్పా?
అందరూ ఏమంటున్నారు . . .
చట్టం పెట్టిన నియమాలు పాటించినంత వరకు సరదాగా జూదం ఆడడంలో తప్పు లేదని చాలామంది అంటారు. ప్రభుత్వమే కొన్ని రకాల లాటరీలు, పందెములు పెడుతుంది. వాటి నుండి వచ్చే ఆదాయాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు.
దేవుడు ఏమంటున్నాడు . . .
జూదం అనే పదం దేవుని వాక్యంలో కనిపించదు. కానీ జూదం విషయంలో దేవుని అభిప్రాయం చెప్పే విషయాలు అందులో చాలా ఉన్నాయి.
జూదం అంటేనే వేరేవాళ్ల డబ్బుల్ని గెలుచుకోవడం. “ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి” అనే దేవుని వాక్యంలోని హెచ్చరికకు అది పూర్తి వ్యతిరేకం. (లూకా 12:15) నిజానికి, అత్యాశతోనే జూదం ఆడుతుంటారు. జూదం, పేకాట క్లబ్బులు ఎక్కువ డబ్బులు గెలుచుకునే పెద్దపెద్ద జాక్పాట్ల గురించి ప్రకటనలు చేస్తాయి, కానీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ అనే విషయాన్ని మాత్రం దాచేస్తాయి. ఎక్కువ డబ్బు గెలవాలని కలలుకంటూ ఎక్కువ డబ్బులు పెట్టి ఆడతారని వాళ్లకు బాగా తెలుసు. లోభానికి లేదా అత్యాశకు దూరం చేసే బదులు, డబ్బులు సులభంగా సంపాదించాలనే కోరికను జూదం పెంచుతుంది.
వేరేవాళ్ళను ఓడించి డబ్బుల్ని గెలుచుకోవాలి అనే స్వార్థంతోనే జూదం ఆడతారు. అయితే, “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను” అని దేవుని కోరిక. (1 కొరింథీయులు 10:24) “నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు” అనేది పది ఆజ్ఞల్లో ఒకటి. (నిర్గమకాండము 20:17) జూదం ఆడే వాళ్లు గెలవాలని కోరుకుంటారు. అంటే వాళ్లు మనసులో అవతలివాళ్లు ఓడిపోవాలి, ఆ డబ్బంతా వాళ్లకే దక్కాలి అని ఆశిస్తుంటారు.
అదృష్టం ఉంటే కోరుకున్నవన్నీ దక్కుతాయి అనే ఆలోచన కూడా ప్రమాదమని దేవుడు చెబుతున్నాడు. పూర్వం ఇశ్రాయేలీయుల్లో కొందరు దేవునిపై నమ్మకం లేక అదృష్టదేవిని పూజించారు. దేవున్ని కాదని అదృష్టాన్ని నమ్ముకోవడం ఆయనకు నచ్చుతుందా? నచ్చదు. దేవుడు వాళ్లతో ఏమన్నాడంటే: “నా దృష్టికి చెడ్డదైనదాని చేసితిరి నాకిష్టము కానిదాని కోరితిరి.”—యెషయా 65:11, 12.
కొన్ని దేశాల్లో ప్రభుత్వం అనుమతి పొందిన జూదం నుండి వచ్చే డబ్బుల్ని పిల్లల చదువుల కోసం, ఆర్థిక అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు. అయితే ఆ డబ్బులు ఎక్కడినుండి వచ్చాయి? అత్యాశ, స్వార్థం, బద్దకాన్ని పెంచి పోషించిన ఆటల నుండే కదా. ఒకరి నోటి దగ్గర నుండి తీసుకున్న డబ్బులతో ఇంకొకరికి మేలు చేయడం సరైనదేనంటారా?
“నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.”—నిర్గమకాండము 20:17.
జూదం ఆడేవాళ్లకు జరిగే నష్టాలు ఏమిటి?
దేవుడు ఏమంటున్నాడు . . .
“ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును” అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. (1 తిమోతి 6:9) జూదం ఆడడానికి కారణం అత్యాశ. అత్యాశ మనిషిని మెల్లమెల్లగా నాశనం చేస్తుంది. అందుకే దేవుని వాక్యం అత్యాశ లేదా ‘లోభత్వాన్ని’ అస్సలు అలవాటు చేసుకోకూడని విషయాల్లో కలిపింది.—ఎఫెసీయులు 5:3.
కష్టపడకుండా ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో జూదం ఆడేవాళ్లు డబ్బు మీద ప్రేమను పెంచుకుంటారు. అయితే, డబ్బు మీద ప్రేమ “సమస్తమైన కీడులకు మూలము” అనేది దేవుని మాట. డబ్బు మీద ఆశ సులువుగా మనిషిని మాయలోకి దించేసి, తర్వాత విపరీతమైన ఆందోళనకు గురిచేసి చివరికి దేవుని మీద నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఆ మాయలో పడిన వాళ్ల గురించి దేవుడు ఒకవిధంగా ఏమంటున్నాడంటే వాళ్లు “నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”—1 తిమోతి 6:10.
అత్యాశ ఉన్నవాళ్లకు సంతృప్తి ఉండదు. వాళ్లకు ఎన్ని డబ్బులున్నా తృప్తిలేక ఇంకా కావాలనే కోరికతో సంతోషాన్ని పాడుచేసుకుంటారు. “ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు; ఇదియు వ్యర్థమే.”—ప్రసంగి 5:10.
జూదంలోకి దిగిన లక్షలమంది దానికి ఘోరంగా బానిసలైపోయారు. ఈ సమస్య అన్ని చోట్లా ఉంది. ఒక్క అమెరికాలోనే ఎన్నో లక్షలమంది అలా బానిసలైపోయారని అంచనా.
ఒక సామెత ఇలా చెప్తుంది: “మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.” (సామెతలు 20:21) జూదానికి బానిసలైన వాళ్లు అప్పుల్లో పడిపోయి, దివాలా తీసి, ఉద్యోగాలు, సంసారాలు, స్నేహాలు పోగొట్టుకున్నారు. దేవుడు ఇచ్చే సలహాలు పాటిస్తే జీవితాన్ని, సంతోషాన్ని పాడుచేసే జూదానికి దూరంగా ఉండవచ్చు.
“ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.”—1 తిమోతి 6:9.