తొలి క్రైస్తవులు, లోకము
తొలి క్రైస్తవులు, లోకము
షుమారు రెండువేల సంవత్సరముల క్రితం, మధ్య ఆసియాలో ఎంతో అద్భుతకరమైన సంఘటనొకటి జరిగింది. దేవుని అద్వితీయ కుమారుడు పరలోకమందలి తన నివాస స్థానమును విడిచి కొంతకాలం మానవజాతితో జీవించడానికి ఈ లోకానికి పంపబడ్డాడు. కానీ మానవజాతిలో ఎక్కువ మంది దానికి ఎలా స్పందించారు? అపొస్తలుడైన యోహాను సమాధానం ఇలా ఉంది: “ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయుల [ఇశ్రాయేలు] యొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.”—యోహాను 1:10, 11.
దేవుని కుమారుడైన యేసును లోకము అంగీకరించలేదు. ఎందుకు? కారణాన్ని వివరిస్తూ యేసు ఇలా అన్నాడు: “లోకము . . . దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.” (యోహాను 7:7) కడకు యూదా మతనాయకులు, ఎదోమీయుడైన రాజు, రోమాసామ్రాజ్య రాజకీయ నాయకుని ప్రాతినిధ్యంలో ఆ లోకమే యేసును చంపింది. (లూకా 22:66–23:25; అపొ. కార్యములు 3:14, 15; 4:24-28) మరి యేసు అనుచరుల విషయమేమిటి? వారిని లోకము సులభంగా అంగీకరిస్తుందా? లేదు. యేసు తన మరణమునకు కొంచెము ముందు ఇలా హెచ్చరించాడు: “మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.”—యోహాను 15:19.
అపొస్తలుల కాలములలో
యేసుయొక్క ఆ మాటలు సత్యమని రుజువైనవి. ఆయన మరణించిన కొద్దివారాల తర్వాత తన అపొస్తలులు బంధించబడి, బెదిరించబడి, కొట్టబడ్డారు. (అపొస్తలుల కార్యములు 4:1-3; 5:17, 18, 40) ఆ తర్వాత కొంతకాలానికి ఆసక్తిగల స్తెఫను యూదుల న్యాయసభ యెదుటికి తీసుకొనిపోబడి రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. (అపొస్తలుల కార్యములు 6:8-12; 7:54, 57, 58) తర్వాత అపొస్తలుడైన యాకోబును రాజైన హేరోదు అగ్రిప్ప I వధించాడు. (అపొ. కార్యములు 12:1, 2) మిషనరీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు పరదేశాలలో చెదరివున్న యూదుల ప్రేరణ మూలంగా పౌలు హింసించబడ్డాడు.—అపొస్తలుల కార్యములు 13:50; 14:2, 19.
అలాంటి వ్యతిరేకతకు తొలి క్రైస్తవులు ఎలా స్పందించారు? తొలి దినాలలో మతాధికారులు యేసు నామమున అపొస్తలులు ప్రకటించకూడదని నిషేధించారు. అయితే అపొస్తలులు అందుకు ఇలా అన్నారు: “మేము మనుష్యులకు కాదు దేవునికే లోబడవలెను గదా.” (అపొస్తలుల కార్యములు 4:19, 20; 5:29) వ్యతిరేకత వచ్చినప్పుడల్లా వారు ఇదే స్వభావమును కనపరచారు. అయినప్పటికి, అపొస్తలుడైన పౌలు రోమాలోని క్రైస్తవులను తమ “పై అధికారులకు లోబడియుండాలని” హెచ్చరించాడు. ఇంకా వారిని ఆయన సాధ్యమైనంతమట్టుకు “అందరితోను సమాధానముగా ఉండమని” హెచ్చరించాడు. (రోమీయులు 12:18; 13:1) అందువలన తొలి క్రైస్తవులు సమతూకమును నిలబెట్టుకొనుటకు కష్టపడవలసియుండెను. తమ పాలకునిగా మొదట వారు దేవునికి లోబడ్డారు. అదే సమయంలో వారు ప్రభుత్వ అధికారులకు లోబడియుండి సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండడానికి కృషిచేశారు.
రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులు
రోమా సామ్రాజ్యంనాటి లోకములోని మొదటి శతాబ్దపు క్రైస్తవులు రోమా సేనలు కాపాడిన పాక్స్ రోమానా లేదా రోమాపాలనయొక్క శాంతి నుండి నిశ్చయంగా మేలుపొందారు. స్థిరమైన శాసనాలు, చట్టాలు, మంచి రహదారులు, చాలా వరకు సురక్షితమైన సముద్ర ప్రయాణము మొదలగునవన్నీ క్రైస్తవత్వముయొక్క వ్యాప్తికి దోహదపడ్డాయి. తొలి క్రైస్తవులు సమాజముయెడల వారికున్న బాధ్యతను గుర్తించినవారై “కైసరువి కైసరుకు చెల్లించుడి” అను యేసు మాటలను గైకొన్నారు. (మార్కు 12:17) రోమా చక్రవర్తి ఆంటోనినస్ పియస్కు (సా.శ. 138-161) వ్రాస్తూ, జస్టిన్ మార్టర్ “క్రైస్తవులు ఇతరులందరికంటే ఎంతో సంసిద్ధతతో తమ పన్నులు చెల్లించారు” అని తెలియజేశాడు. (ఫస్ట్ అపొలజి, అధ్యాయము 17) సా.శ. 197 లో క్రైస్తవులు మనస్సాక్షి పూర్వకంగా పన్నులు చెల్లించే విధానాన్నిబట్టి సుంకము వసూళ్లు చేసేవారు వారికి కృతజ్ఞతను తెలుప రుణపడియున్నారని టెర్టూలియన్ రోమా పాలకులకు చెప్పాడు. (అపాలజి, అధ్యాయం 42) వారు పై అధికారులకు లోబడియుండాలని పౌలు ఇచ్చిన హెచ్చరికను అనుసరించుటలో వారికి ఇదొక విధమైయుండెను.
అంతేగాక వారి క్రైస్తవ సూత్రములు వారిననుమతించి నంతమేరకు తొలి క్రైస్తవులు తమ పొరుగువారితో సమాధానముగా జీవించడానికి ప్రయత్నించారు. కాని ఇది అంత సులభతరంగా కాలేదు. తమ చుట్టూవున్న లోకము విస్తారమైన అవినీతితోను గ్రీకు రోమీయుల విగ్రహారాధనతోను నిండివుంది, చక్రవర్తి ఆరాధన కూడా దానికి తోడయ్యింది. రోమీయుల
అన్యమతము ప్రభుత్వ మతమై, దానినవలంభించనివారు ప్రభుత్వ విరోధులుగా ఎంచబడ్డారు. ఈ పరిస్థితిలో క్రైస్తవుల స్థానమేమిటి?ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ ఇ. జి. హార్డి ఇలా వ్రాశారు: “విగ్రహారాధన యిమిడియున్నందున మనస్సాక్షిగల క్రైస్తవుడు చేయలేని అనేక విషయాలను టెర్టూలియన్ విశదీకరించాడు. ఉదాహరణకు ఒప్పందాల సమయాల్లో చేసే ప్రమాణాలు; పండుగ సమయాల్లో ద్వారములయొద్ద దీపాలు పెట్టడం మొదలైనవి; అన్యసంబంధమైన మత ఆచారములంటిని ఆటలు, సర్కస్లను; లౌకిక సాహిత్యమును బోధించే వృత్తి; సైనిక సేవ; ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేయడం వంటివి.”—క్రిష్టియానిటి అండ్ ది రోమన్ గవర్నమెంట్.
ఔను, క్రైస్తవ విశ్వాసమునకు అనుగుణ్యంగా యథార్థతతో జీవించడం రోమా సామ్రాజ్యంలో చాలా కష్టంగా ఉండేది. ఫ్రెంచి కాథోలిక్ రచయిత ఎ. ఆమన్ ఇలా రాస్తున్నారు: “దేవతా పరమైన విషయాలకు వేరుగా ఏ విషయం చేయడమైన అసాధ్యమైంది. క్రైస్తవునికి తన స్థానాన్నిబట్టి రోజు సమస్యలే ఎదురయ్యాయి. క్రైస్తవుడు సమాజమునకు వేరుగా బ్రతకవలసి వచ్చెను. అతడు తరచు ఇంట్లో సమస్యలు, వీధులలో, సంతలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. అతడు రోమా పౌరుడైనా, కాకపోయిన క్రైస్తవుడు ఒక గుడిని లేక విగ్రహాన్ని దాటి వెళ్లేటప్పుడు అతని తలపైనున్న ముసుకు తీసివేయాలి. ఎవరికి అనుమానం రానిరీతిలో దీనిని చేయకుండా లేక భక్తిప్రదమైన క్రియను చేయకుండా ఒక క్రైస్తవుడు ఎలా ఉండగలడు? అతను వ్యాపారంచేస్తూ తన వ్యాపారానికి డబ్బు అవసరమైతే, అతనికి డబ్బు ఇచ్చేవానితో దేవుళ్ల పేరున ప్రమాణం చెయ్యాలి. అతను ప్రభుత్వ ఉద్యోగాన్ని స్వీకరిస్తే తాను బలికూడా ఇవ్వాల్సి వచ్చేది. ఉద్యోగంలో ప్రవేశించిన తరువాత ప్రమాణం చేయడం, సైనిక ఆచారాలలో పాల్గొనడం వంటివి చేయకుండ ఎలా ఉండగలడు.—లా వీ కోటిడిఎన్ని డీ ప్రిమియర్ క్రెటియన్ (95-197) (తొలి క్రైస్తవుల అనుదిన జీవితం సా. శ. 95-197).
మంచి పౌరులు, అయినా దూషించబడ్డారు
సామాన్య శకము 60 లేక 61లో నీరో చక్రవర్తి తీర్పుకొరకు పౌలు కావలిలో ఉంచబడ్డప్పుడు యూదులలోని ప్రధానులు తొలి క్రైస్తవులను గూర్చి ఇలా అన్నారు: “ఈ మత భేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియుననిరి.” (అపొస్తలుల కార్యములు 28:22) తొలి క్రైస్తవులు దూషించబడ్డారని—కేవలం అన్యాయంగానే దూషించబడ్డారని చరిత్ర నివేదిక చూపుతుంది. ది రైజ్ ఆఫ్ క్రిష్టియానిటి అనే తన పుస్తకంలో ఇ. డబ్ల్యు. బార్న్జ్ ఇలా వివరిస్తున్నాడు. “దాని మొదటి వ్రాతలలో క్రైస్తవత్వము ప్రధానంగా నైతికమైన చట్టబద్ధమైన ఉద్యమానికి సూచనగా ఉంది. దాని సభ్యులు మంచి పౌరులుగా, యథార్థమైన పౌరులుగా ఉండవలసియుండిరి. అన్యమత లోపాలను, చెడుతనమును వారు విసర్జించారు. వ్యక్తిగత జీవితాలలో సమాధానకరమైన పొరుగువారిగా నమ్మకమైన స్నేహితులుగా ఉన్నారు. గంభీరమైన దృష్టితో మితానుభవులైయుండి, పరిశుభ్రమైన జీవితంతో కష్టించి పనిచేసేవారిగా ఉండాలని వారు బోధింపబడ్డారు. విస్తరించియున్న అవినీతి, విచ్చలవిడి ప్రవర్తనగల వారిమధ్య తమ సూత్రముల పట్ల నమ్మకత్వము చూపేవారై నిజాయితీగా, సత్యవంతంగా వుండేవారు. లైంగిక సంబంధంగా వారికున్న ప్రమాణాలు ఉన్నతమైనవి: వివాహ బాంధవ్యం గౌరవించబడి, స్వచ్ఛమైన కుటుంబ జీవితాన్ని కలిగివుండేవారు. అలాంటి సులక్షణాలతో నిండినవారిని ఒకరు ప్రమాదకరమైన పౌరులని అనలేరు. అయినా ఎంతో సుదీర్ఘకాలం వారు తృణీకరించబడి, దూషించబడి, ద్వేషించబడిరి.”
పురాతన లోకము యేసును ఎలా అర్థం చేసుకోలేదో అలాగే అది క్రైస్తవులను కూడా అర్థం చేసుకొనకుండా వారిని ద్వేషించింది. చక్రవర్తి ఆరాధననేగాని అన్యదైవాల ఆరాధననేగాని చేయడానికి అంగీకరించనందున వారు నాస్తికులని నిందించబడ్డారు. ఏదైనా విపత్తు సంభవిస్తే వీరే దేవుళ్లకు కోపము పుట్టించారని నిందించబడేవారు. దుర్నీతితోనిండిన నాటకాలకు, రక్తముతో నిండే కత్తిపోరాటాల ప్రదర్శనలకు హాజరుకానందున వీరు సంఘవ్యతిరేకులని, ‘మానవజాతినే ద్వేషించేవారని’ ఎంచబడ్డారు. ఈ క్రైస్తవ “తెగ” మూలంగా కుటుంబాలు విడిపోయాయి గనుక వీరు సమాజమును అస్థిరపరచేవారని వీరి శత్రువులు వారిని నిందించారు. అన్యులైన భర్తలలో కొందరు తమ భార్యలు క్రైస్తవులయ్యేదానికంటె వ్యభిచరించడం మేలనుకున్నవారు కూడా కలరని టెర్టూలియన్ ప్రస్తావించాడు.
ఆకాలంలో విస్తారంగా ఆభ్యసిస్తున్న గర్భస్రావాన్ని క్రైస్తవులు వ్యతిరేకించినందున వారు విమర్శించబడ్డారు. అయినా, పిల్లలను
చంపేవారని వారి శత్రువులు వారిని నిందించారు. వారి కూటాలలో వీరు బలివ్వబడిన పిల్లల రక్తాన్ని త్రాగేవారని కూడా ఆరోపించబడింది. అదే సమయంలో వారి శత్రువులు రక్తముతో తయారు చేయబడిన పదార్థాలు వీరి మనస్సాక్షికి విరుద్ధమైనవని ఎరిగి వాటిని తినేందుకు వీరిని బలవంతపెట్టేవారు. ఈ విధంగా ఈ వ్యతిరేకులు వారి ఆరోపణలు అబద్ధాలని చూపించారు.”—టెర్టూలియన్, అపోలజీ, అధ్యాయం 9.ఒక క్రొత్త తెగగా తృణీకరించబడ్డారు
చరిత్రకారుడైన కెన్నెత్ స్కాట్ లాటూరెట్ ఇలా వ్రాశాడు: “క్రైస్తవత్వము దానికి విరోధంగా వున్న [అన్య యూదామతము, గ్రీకు రోమను మతాల] సనాతన ధర్మాలకు భిన్నంగా ఇటీవలనే పుట్టుకొచ్చిందని హేళనచేసేవారు.” (ఎ హిస్టరీ ఆఫ్ ది ఎక్స్పేన్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ, వాల్యూమ్ 1, పేజీ 131) సా.శ. రెండవ శతాబ్దం తొలి భాగంలో రోమా చరిత్రకారుడు సుటోనియస్ క్రైస్తవత్వమును “ఒక కొత్త మోసపూరిత మూఢనమ్మకము” అని పిలిచాడు. క్రైస్తవుడు అనే పేరే ద్వేషించబడి, క్రైస్తవులు ఒక అయిష్టమైన తెగగా ఉన్నారని టెర్టూలియన్ అన్నాడు. రెండవ శతాబ్దములో క్రైస్తవులను రోమా ప్రభుత్వపు అధికారులు దృష్టించిన విధమును తెల్పుతూ రాబర్ట్ యం. గ్రాంట్ ఇలా వ్రాశాడు: “క్రైస్తవత్వం కేవలం అనవసరమైందని, చాలవరకు హానికరమైన మతమని దృష్టించేవారు.”—ఎర్లి క్రిష్టియానిటి అండ్ సొసైటి.
పట్టుదలతో మతమార్పిడి చేసేవారిగా నిందించబడ్డారు
లా ప్రెమ్యా శ్యాక్ల్ డి లాక్లీజ్ (ది ఎర్లీ సెంచరీస్ ఆఫ్ ది చర్చ్) అనే పుస్తకంలో సార్బోన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసరు జీన్ బెర్నార్డి ఇలా వ్రాశారు: “క్రైస్తవులు బయటకు వెళ్లి ప్రతిచోట ప్రతిఒక్కరితో మాట్లాడ వలసి ఉండెను. ప్రధాన రహదారుల్లో, నగరాలలో, బహిరంగ కూడలిలో, ఇండ్లలో వారిని ఆహ్వానించినా, ఆహ్వానించకపోయినా మాట్లాడేవారు. తమ వస్తుసంపదతో చిక్కుకొనివున్న ధనికులతోను, పేదవారితోను, ఎన్నికలేనివారితోను, రోమా రాష్ట్ర గవర్నర్లతోను . . . రహదారులలో, ఓడలలో ప్రయాణించి, భూదిగంతముల వరకు వెళ్లవలసి ఉండేది.”
వారు ఇలా చేశారా? నిశ్చయంగా చేశారు. ప్రొఫెసరు లియోన్ హామో తెల్పేదేమంటే వీరు “తీవ్రంగా మత మార్పిడి” చేయిస్తున్నందున ప్రజలలో వీరిపై వ్యతిరేక భావముండేది. ప్రొఫెసర్ లాటూరెట్ తెలుపుతున్న ప్రకారం మతం మార్చడంలో యూదులు ఆసక్తిని కోల్పోయారు, “క్రైస్తవులైతే పట్టుదలతో మిషనరీ పనిచేస్తూ, వారికి కోపం పుట్టించేవారు.”
సామాన్య శకం రెండవ శతాబ్దములో రోమా తత్త్వవేత్త సెల్సస్ క్రైస్తవుల ప్రకటనా పద్ధతిని విమర్శించాడు. ‘క్రైస్తవత్వం కేవలం విద్యావిహీనులకని, కేవలం అది మూర్ఖులను, దాసులను, స్త్రీలను, చిన్న పిల్లలను మాత్రమే ఒప్పించగలదని’ అతనన్నాడు. క్రైస్తవులు “అమాయక ప్రజలకు” సిద్ధాంతాలను నూరిపోశారని, వారిని “సహేతుక తలంపు నమ్మునట్లు” చేసేవారని ఆరోపించాడు. వారు కొత్త శిష్యులతో “ప్రశ్నలడగవద్దు; కేవలం నమ్మండి” అని చెప్పేవారని అన్నాడు. అయితే, ఓరిజెన్ ప్రకారం సెల్సెస్ తానుగా అంగీకరించినదేమనగా, “యేసు మతమును అంగీకరించడానికి ఆయన సిద్ధాంతాలవలన నడిపించబడ్డవారు ఎన్నికలేని విద్యావిహీనులు మాత్రమే కాదు.”
సర్వమత సమ్మిళితం సమ్మతంకాదు
మేము నిజమైన సత్యదేవుని సత్యమును కలిగివున్నామని చెప్పుకున్నందుకు కూడా తొలి క్రైస్తవులు విమర్శకు గురయ్యారు. సర్వమత సమ్మిళితానికేగాని, లేక కలగలుపుల విశ్వాసాన్నిగాని వారు అంగీకరించలేదు. లాటూరెట్ ఇలా వ్రాశాడు: “ఆ కాలమునాటి విశ్వాసము లన్నింటికి భిన్నంగా వారు ఇతర మతములపట్ల వ్యతిరేకంగా ఉన్నారు. . . . ఇతర విశ్వాసాలన్నిటిని అంగీకరించే ఆ కాలమునాటి విశ్వాసాలకు భిన్నంగా వారు తామే దృఢమైన, సాటిలేని సత్యమును కలిగివున్నామని ప్రకటించారు.”
సామాన్య శకము 202లో చక్రవర్తియైన సెప్టిమియస్ సెవిరస్ క్రైస్తవులు మతము మార్చడాన్ని మానుకోవాలని ఆజ్ఞను
జారీచేశాడు. అయితే, దీన్నిబట్టి వారు తమ విశ్వాసాన్నిగూర్చి సాక్ష్యమివ్వకుండా ఆగలేదు. తత్ఫలితాన్ని లాటూరెట్ ఇలా వివరించాడు: “అప్పటి అన్యమతంతో, అనేక సాంఘిక ఆచారాలు, నైతిక అలవాట్లతో రాజీపడడానికి తిరస్కరించినందువల్ల, [తొలి క్రైస్తవత్వం] సామాన్య సమాజానికి వ్యతిరేకంగా ఒక పటుత్వంగల సంస్థను ఏర్పాటుచేయగలిగింది. దానిలో ప్రవేశించడానికి వారు తెగతెంపులు చేసుకోవలసిన పరిస్థితే, దీన్ని చేపట్టినందువలన కలిగే హింసను తట్టుకోడానికి శక్తినిచ్చింది, ఇతరులను మార్చడానికి ఆసక్తినిచ్చింది.”అందుచేత చారిత్రాత్మక వృత్తాంతము స్పష్టంగా ఉన్నది. ముఖ్యంగా తొలి క్రైస్తవులు మంచి పౌరులుగావుంటూ, అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పటికి, ‘లోక సంబంధులై’ దానిలో భాగస్థులయ్యేందుకు అంగీకరించలేదు. (యోహాను 15:19) వారు అధికారులను గౌరవించేవారు. అయితే కైసరు వారిని ప్రకటించకూడదని ఆజ్ఞాపించినప్పుడు, ప్రకటించకుండా ఉండేవారు మాత్రం కాదు. వారు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండేందుకు ప్రయత్నించారుగాని, వారితో నైతిక ప్రమాణాలందు లేక అన్య విగ్రహారాధనతో ఏకీభవించేందుకు మాత్రం అంగీకరించలేదు. వీటన్నిటి మూలంగా వారు తృణీకరించబడ్డారు, దూషించబడ్డారు, ద్వేషించబడ్డారు, క్రీస్తు ముందుగానే ప్రవచించినట్లుగా హింసించబడ్డారు.—యోహాను 16:33.
అయితే లోకంతో వేరైయుండే వారి ప్రత్యేకత అలాగే కొనసాగిందా? లేక కాలం గడిచేకొలది క్రైస్తవత్వమును అనుసరిస్తున్నామని చెప్పుకొనేవారు వారి స్వభావాన్ని మార్చుకున్నారా?
[Blurb on page 4]
“క్రైస్తవునికి తన స్థానాన్నిబట్టి రోజు సమస్యలే ఎదురయ్యాయి. క్రైస్తవుడు సమాజమునకు వేరుగా బ్రతకవలసి వచ్చెను.”
[Blurb on page 6]
“క్రైస్తవత్వము దానికి విరోధంగా వున్న . . . మతాల సనాతన ధర్మాలకు భిన్నంగా ఇటీవలనే పుట్టుకొచ్చిందని హేళనచేసేవారు.”
[Picture Credit Line on page 2]
Cover: Alinari/Art Resource, N.Y.
[Picture on page 3]
క్రైస్తవులు రోమా చక్రవర్తిని, వారి అన్య దేవుళ్లను ఆరాధించుటకు అంగీకరించనందున వారు నాస్తికులని నిందించబడిరి
[Credit Line]
Museo della Civiltà Romana, Roma
[Picture on page 7]
మొదటి శతాబ్దపు క్రైస్తవులు రాజ్యవర్తమానమును ఆసక్తితో ప్రకటించేవారని పేరుతెచ్చుకొన్నారు