కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బెయేర్షెబా—అచ్చట బావి అంటే జీవనాధారమే

బెయేర్షెబా—అచ్చట బావి అంటే జీవనాధారమే

వాగ్దాన దేశంలోని దృశ్యాలు

బెయేర్షెబా—అచ్చట బావి అంటే జీవనాధారమే

“దానునుండి బెయేర్షెబా వరకు.” బైబిలు పాఠకులకు ఇది బాగా పరిచయమున్న వాక్యం. అది ఉత్తరానగల దానునుండి దక్షిణానగల బెయేర్షెబా వరకున్న ఇశ్రాయేలు దేశమునంతటిని వివరిస్తుంది. సొలొమోను సమాధానకరమగు పరిపాలన ఇలా సూచించబడింది: “సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదావారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.”—1 రాజులు 4:25; న్యాయాధిపతులు 20:1.

అయితే దాను బెయేర్షెబాల మధ్యనున్న తేడాలో వాటి మధ్యనున్న దూరం కంటె ఇంకా అధికంగా ఇమిడివుంది. ఉదాహరణకు, దానులో వర్షం సమృద్ధిగా కురిసేది; పొటోలో కుడివైపున చూస్తున్నట్లు నీళ్లు భూమినుండి పొర్లి వచ్చి యోర్దాను నదియొక్క ముఖ్యభాగమయ్యేది. అయితే, ఎండిన భూభాగములో, సముద్రతీరానికి మృతసముద్రపు దక్షిణ ప్రాంతానికి మధ్యలోనున్న బెయేర్షెబా దానికెంతో వ్యత్యాసంగా వుండేది.

బెయేర్షెబా ప్రాంతంలో సంవత్సరంలో ఆరునుండి ఎనిమిది అంగుళాల (15 నుండి 20 సెంటీమీటర్ల) వర్షపాతమే ఉండేది. దీన్ని మనస్సునందుంచుకొని పైనున్న బెయేర్షెబాలోని మట్టి దిబ్బను లేదా దిమ్మెను చూడండి. * మీరు చూస్తున్న పచ్చని ప్రాంతం, బెయేర్షెబాలో చలికాలంలో కురిసిన కొద్దిపాటి వర్షంవల్ల కొంచెం కాలం మాత్రమే పొలాలు పచ్చగా వున్నప్పుడు తీసిన ఫోటోయని మీకది సూచిస్తుంది. సమీంపంలోనుండిన ప్రాంతాలు—అప్పుడు—ఇప్పుడుకూడా—ధాన్యపు పంటలకు ప్రసిద్ధిగాంచాయి.

ఆ ప్రాంతం ఎండిన భూభాగం గనుక బెయేర్షెబాలో బావులు, నీటి మడుగులున్నట్లు బైబిలు తెల్పుతుంది. పట్టణం దగ్గర్లో రోడ్లు లేక యాత్రికులు పయనించు మార్గాలున్నాయి, అవి అటు దక్షిణప్రాంతంలోని ఎడారిదాటి పోతున్నాయి. ఊహించండి, ప్రయాణీకులు యీ ప్రాంతాన్ని దాటివెళ్లేటప్పుడు గానీ, అక్కడ ఆగినపుడుగానీ వారికి వారి పశువులకు నీళ్లు అవసరమౌతాయి. ఇక్కడ దానులోవలె నీళ్లు భూమిలోనుండి ఉబికిరావు గానీ బావులలోనుండి తోడుకోవలసివుండేది. నిజానికి, బెయేర్‌ అనే హెబ్రీ పదం ఒక గుంటను లేదా నీటిని భూమినుండి తీయడానికి త్రవ్విన ఒక గొయ్యిని సూచిస్తుంది. బెయేర్షెబా అంటే “సాక్ష్యార్థమైన బావి” లేదా “ఏడింటి బావి” అని అర్థం.

అబ్రాహాము అతని కుటుంబం యీ బెయేర్షెబా చుట్టుప్రక్కల చాలా కాలం నివసించారు. మరి వారికి బావుల ప్రాముఖ్యత తెలుసు. శారా దాసియైన హాగరు అరణ్యప్రాంతానికి పారిపోయినప్పుడు ఆమె బావులలోనుండి లేదా సీనాయి ద్వీప కల్పములోని ఒక బావినుండి అనగా ప్రక్క పేజీలో పై వైపున కనబడే నీళ్లుచేదుకుంటున్న ఎడారి స్త్రీలనుండి నీళ్లు తీసుకుందామని అనుకొనియుండవచ్చును. తుంటరియైన తన కుమారునితోపాటు హాగరును అక్కడనుండి తరిమి వేయాలనుకొన్నపుడు అబ్రాహాము కనికరముతో వారికి నీళ్ల సంచియిచ్చి పంపించాడు. ఆ నీళ్లు అయిపోయినపుడేమి జరిగింది? “దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.”—ఆదికాండము 21:19.

హాగరు నీళ్ల తిత్తిని నింపడానికి అబ్రాహాము ఎక్కడనుండి నీళ్లు తెచ్చాడు? బహుశా తాను నాటిన పిచుల వృక్షము దగ్గర తాను త్రవ్విన బావి నీళ్లే కావచ్చు. (ఆదికాండము 21:25-33) అబ్రాహాము ఈ పిచుల వృక్షాన్ని ఎంపిక చేసికొనుటలోగల జ్ఞానాన్ని శాస్త్రజ్ఞులిప్పుడు గమనించగలరని చెప్పవచ్చును, ఎందుకంటె యీ చెట్టుకున్న చిన్న ఆకులు కొద్దిపాటి తేమను మాత్రమే విడుదలచేస్తాయి, అలా ఆ ఎండ ప్రాంతంలో కూడ అవి తాళుకోగలవు. క్రిందనున్న చిత్రాన్ని చూడండి.

అబ్రాహాముకు ఫిలిష్తీయుల రాజుకు జరిగిన వివాదంలో ఆయన త్రవ్వించిన బావి కూడా ప్రస్తావించబడింది. సాధారణ నీళ్ల కొరత కారణంగా బావి నిజంగా విలువైన ఆస్తే, మరి లోతైన బావిని త్రవ్వడానికి కూలివారు అవసరమే. నిజానికి ఆనాడు అనుమతి లేకుండ బావిలోని నీళ్లుచేదుకొనుట ఆస్తిహక్కును ఉల్లంఘించినట్లు భావించేవారు—సంఖ్యాకాండము 20:17, 19 పోల్చండి.

మీరు బెయేర్షెబాను సందర్శిస్తే ఈశాన్య భాగానున్న ఏటవాలు ప్రాంతంలో లోతైన బావిలోనికి తొంగిచూడవచ్చును. మొదట ఎవరు ఆ గట్టి బండను తొలచి లోతుగా తెగగొట్టి (క్రింద కనిపిస్తున్నట్లు) మరల రాళ్లతోనే కట్టించారో ఎవరికీ తెలియదు. ఆధునిక పురావస్తు శాస్త్రజ్ఞులు నూరడుగుల లోతుకుదాన్ని తీశారుగాని అడుక్కి వెళ్లలేకపోయారు. వారిలో ఒకాయన ఇలా అన్నాడు: “ఇది అబ్రాహాము, అబీమెలెకు మధ్య జరిగిన నిబంధన స్థలములోని ‘సాక్షార్థమైన బావి’ అనే నిర్ణయానికి రావడం ఆకర్షణీయంగా అనిపిస్తుంది.”—బిబ్లికల్‌ ఆర్కియాలజీ రివ్యూ.

అటుతర్వాత బైబిలు కాలంలో నిజంగా బెయేర్షెబా పెద్ద బలమైన నగరంగా వృద్ధిచెందింది. అయితే దాని విజయానికి ఉనికికి, మూలాధారం ముఖ్యంగా దాని లోతైన బావిలోని నీళ్లే.

[Footnotes]

^ పేరా 5 బెయేర్షెబాలోని మట్టిదిబ్బ పెద్ద చిత్రాన్ని చూడాలనుకుంటే 1993 సం. యెహోవాసాక్షుల క్యాలెండర్‌ చూడండి.

[Picture Credit Line on page 24]

Pictorial Archive (Near Eastern History) Est.

[Picture Credit Line on page 25]

Pictorial Archive (Near Eastern History) Est.