కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“పోలిష్‌ బ్రద్‌రెన్‌”—ఎందుకు వేధించబడింది?

“పోలిష్‌ బ్రద్‌రెన్‌”—ఎందుకు వేధించబడింది?

“పోలిష్‌ బ్రద్‌రెన్‌”—ఎందుకు వేధించబడింది?

1638 లో, పోలిష్‌ బ్రద్‌రెన్‌ అనే పేరున తెలియబడుతున్న చిన్న గుంపుపై పోలండ్‌ పార్లమెంట్‌ పెద్ద దెబ్బ వేసింది. ఆ గుంపుకు చెందిన ఒక చర్చినీ, ఒక ప్రెస్సునూ నాశనం చేశారు. యూనివర్శిటీ ఆఫ్‌ రాకూ మూతవేయబడింది, ఆ యూనివర్శిటీలో బోధించిన ప్రొఫెసర్లను దేశం నుండి బహిష్కరించారు.

ఇరవై సంవత్సరాల తర్వాత, పార్లమెంట్‌ మరో అడుగు ముందుకు వెళ్ళింది. అది ఆ గుంపులోని సభ్యులందరూ దేశం వదిలి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించింది—ఆ గుంపులో 10,000 లేదా అంత కన్నా ఎక్కువ మంది ఉండి ఉండవచ్చు. అప్పట్లో, యూరప్‌ అంతటిలో అత్యంత సహనశీలం గల దేశంగా తలంచబడిన పోలండ్‌లో పరిస్థితి ఎందుకంత సంక్షోభమయంగా మారింది? అంత తీవ్రమైన శిక్షను పొందేంతగా పోలిష్‌ బ్రద్‌రెన్‌ ఏం చేసింది?

పోలండ్‌లోని కాల్వినిస్ట్‌ చర్చిలో గొప్ప అభిప్రాయభేదం తలెత్తడంతో సంక్షోభం మొదలైంది. త్రిత్వ సిద్ధాంతం గురించే పెద్ద వివాదం వచ్చింది. ఆ చర్చికే చెందిన అభ్యుదయ ఉద్యమ నాయకులు లేఖనాధారం లేనిదంటూ ఈ సిద్ధాంతాన్ని ఖండించారు. దీనితో చర్చి నాయకులు కన్నెర్ర చేయడంతో, ఆ అభ్యుదయ ఉద్యమము చర్చి నుండి విడిపోయింది.

అభిప్రాయభేదంగల వీరిని ఆరియన్స్‌ * అని కాల్వినిస్ట్‌లు పిలిచారు. అయితే, ఈ క్రొత్త గుంపుకు చెందినవారు తమను తాము క్రిస్టియన్స్‌ అని గానీ, పోలిష్‌ బ్రద్‌రెన్‌ (అంటే పోలండ్‌ సహోదరులు) అని గానీ చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. సెర్విటస్‌చే ప్రభావితుడైన, ఇటలీ దేశస్థుడైన లైల్‌యూస్‌ సోకీనూస్‌ పేరుమీదుగా వాళ్ళను సోకీనియన్స్‌ అని కూడా పిలిచేవారు. సోకీనూస్‌ సోదరుని కుమారుడైన ఫాస్టస్‌ సోకీనూస్‌ పోలండ్‌కు వచ్చి, ఈ ఉద్యమంలో ప్రముఖుడయ్యాడు.

క్రొత్త చర్చి “ప్రశాంతమైన, ఏకాంతమైన స్థలం”లో అభివృద్ధి చెందాలని అప్పట్లో పోలండ్‌లో ప్రముఖుడైన జాన్‌ సీన్‌స్కి అనేవారు. ఆయన అలాంటి స్థలం కోసం ప్రయత్నించారు. ఆయన తనకు పోలండ్‌ రాజు ఇచ్చిన ప్రత్యేక ఆధిక్యతను ఉపయోగిస్తూ రాకూ పట్టణానికి పునాది వేశాడు. ఆ పట్టణమే తర్వాత పోలండ్‌లో సెంటర్‌ ఆఫ్‌ సోకీనియానిసమ్‌గా మారింది. రాకూ పౌరులకు సీన్‌స్కి ఇచ్చిన అనేక హక్కుల్లో స్వేచ్ఛగా ఆరాధన జరుపుకునే హక్కు కూడా ఉంది.

ఈ క్రొత్త పట్టణానికి పనివాళ్ళూ, వైద్యులూ, మందులను తయారుచేసేవాళ్ళూ, పట్టణవాసులూ, వివిధ మతతెగలకు చెందిన ఉన్నత వర్గాలవాళ్ళూ ఆకర్షితులయ్యారు. అంతేకాక, పోలండ్‌, లిథువేనియా, ట్రాన్సిల్వేనియా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌లలో ఉన్న క్రైస్తవ మత పరిచారకులు కూడా ఇక్కడికి వచ్చారు. అయినప్పటికీ, ఇక్కడికి వచ్చిన క్రొత్తవాళ్ళందరూ సోకీనియన్‌ నమ్మకాలను విశ్వసించలేదు; కనుక, తర్వాతి మూడు సంవత్సరాలు—1569 నుండి 1572 వరకు—రాకూ, అంతం లేని దైవశాస్త్ర చర్చల వేదికగా మారింది. దాని ఫలితం ఏమిటి?

అభిప్రాయభేదాలు తలెత్తాయి

కొందరు సమూల మార్పులు కావాలన్న దృక్పథాన్ని వెల్లడిచేయగా, మరి కొందరు, కొన్ని మార్పులు సరిపోతాయనే దృక్పథాన్ని వెలిబుచ్చడంతో సోకీనియన్‌ ఉద్యమంలో అభిప్రాయభేదం తలెత్తింది. వాళ్ళకు అభిప్రాయభేదాలున్నప్పటికీ, వాళ్ళకందరికీ ఉండిన నమ్మకాలు మాత్రం ఒకటే. వారందరూ, త్రిత్వాన్ని తిరస్కరించారు; శిశువులకు బాప్తిస్మమిచ్చే సాంప్రదాయాన్ని నిరాకరించారు; మొత్తంమీద వాళ్ళెవరూ ఆయుధాలను ధరించలేదు, వాళ్ళెవరూ కూడా ప్రభుత్వ అధికార స్థానాలను స్వీకరించేవారు కాదు. * అలాగే, నరకమనే దండన స్థలముందంటే వాళ్ళు అంగీకరించలేదు. ఇలా చేయడంలో, జనాదరణగల మతసంబంధ పారంపర్యాలను వాళ్ళు పట్టించుకోలేదు.

అందువల్ల, కాల్వినిస్ట్‌, క్యాథలిక్‌ మతాల నాయకులు ఈ గుంపు మీదికి తీవ్రమైన వ్యతిరేకతను తీసుకువచ్చారు. సిగిస్‌మండ్‌ II అగస్టస్‌, స్టీఫన్‌ బేతరీ వంటి పోలండ్‌ రాజులు మత సహిష్ణుతను లోగడ వృద్ధి చేశారు. ఆ వాతావరణాన్ని సోకీనియన్‌ మత పరిచారకులు తమ తలంపులను బోధించేందుకు ఉపయోగించుకున్నారు.

బూడ్‌నీ అనువాదం ఒక గీటురాయి

అప్పట్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న కాల్వినిస్ట్‌ బైబిల్‌ అనువాదం అనేక మంది పాఠకుల అవసరాలను తీర్చలేకపోయింది. అది మూల భాష నుండి అనువదించబడినది కాదు, అది లాటిన్‌ వల్గేట్‌ (లాటిన్‌ భాషలోని బైబిలు) నుండి, సమకాలీనమైన ఫ్రెంచ్‌ అనువాదం నుండి భాషాంతరీకరణ చేయబడింది. “సుందర శైలి కోసమైన ప్రయత్నంలో మూలభాషలో ఉన్న తలంపును నమ్మకంగా ఖచ్చితంగా అందజేయడం జరగలేదు” అని ఒక ఆధికారిక పుస్తకం చెబుతుంది. అందులో చాలా తప్పులు చోటు చేసుకున్నాయి. కనుక, ఆ అనువాదంలోని తప్పులు దిద్దేందుకు షైమన్‌ బూడ్‌నీ అనే ప్రసిద్ధిగాంచిన పండితుడ్ని ఆహ్వానించారు. ఆ పాత అనువాదాన్ని సరిదిద్దే బదులు, తిరిగి క్రొత్తగా అనువదించడమే సులభమని ఆయన నిర్ణయించాడు. దాదాపు 1567 లో ఆయన ఆ పని చేయడానికి ఉపక్రమించాడు.

బూడ్‌నీ, అనువాదం చేస్తున్నప్పుడు, ప్రతి మాటనూ దాని విభిన్న రూపాలనూ—మునుపెన్నడూ పోలండ్‌లోని ఇంకెవరూ విశ్లేషించనంతగా—విశ్లేషించాడు. హెబ్రీలో ఉన్న మాటలు పోలిష్‌ భాషలోకి అనువదించడం కష్టమైనప్పుడు, మార్జిన్‌లో అక్షరానువాదం చేశాడు. అవసరమైనప్పుడు, ఆయన క్రొత్త మాటలను రూపొందించాడు, సరళమైన మాటలనూ, తన కాలంలో పోలండ్‌లో దైనందిన జీవితంలో ఉపయోగించిన మాటలనూ ఉపయోగించడానికి ప్రయత్నం చేశాడు. పాఠకునికి నమ్మదగిన, ఖచ్చితమైన బైబిలు అనువాదాన్ని సమర్పించాలన్నదే ఆయన లక్ష్యం.

బూడ్‌నీ చేసిన సంపూర్ణ బైబిలు అనువాదాన్ని 1572 లో ప్రచురించారు. అయితే, ఈ అనువాదాన్ని ప్రచురించిన ప్రకాశకులు, గ్రీకు లేఖనాల అనువాదంలో మార్పులు చేశారు. అయితే, బూడ్‌నీ పట్టువిడువక, వాటిని తిరిగి సరిదిద్దడం మొదలెట్టాడు. అలా ఆ పని తర్వాతి రెండు సంవత్సరాల్లో పూర్తయ్యింది. బూడ్‌నీ గ్రీకు లేఖనాలను ఎంత చక్కగా అనువదించాడంటే పోలిష్‌ భాషలోని మునుపటి అనువాదాలన్నింటికన్నా శ్రేష్ఠంగా ఉంది. అంతేకాక, ఆదిమ బైబిలులో ఉన్న యెహోవా అనే దైవ నామాన్ని అనేక చోట్ల ఉపయోగించాడు కూడా.

16వ శతాబ్దపు తుది భాగంలోను, 17వ శతాబ్దపు మొదటి మూడు దశాబ్దాల్లోను, ఈ అభ్యుదయ ఉద్యమానికి కేంద్రస్థానంగా ఉన్న రాకూ నగరం, మతసంబంధమైన మేధాసంబంధమైన కేంద్రంగా మారింది. పోలిష్‌ బ్రద్‌రెన్‌ గుంపుకు చెందిన నాయకులూ, లేఖికులూ తాము వ్రాసిన కరపత్రాలను పుస్తకాలను అక్కడ ప్రచురించారు.

వాళ్ళు విద్యను వృద్ధిచేశారు

దాదాపు 1600వ సంవత్సరంలో రాకూలో, ప్రింటింగ్‌ ప్రెస్‌ను స్థాపించిన తర్వాత, పోలిష్‌ బ్రద్‌రెన్‌వారి ప్రచురణా పని వేగం పుంజుకుంది. ఆ ప్రింటింగ్‌ ప్రెస్‌, అనేక భాషల్లో చిన్న పుస్తకాలనూ అలాగే పెద్ద పుస్తకాలను కూడా ఉత్పత్తి చేయగలిగింది. త్వరలోనే, రాకూ యూరప్‌ అంతటిలో సాటిలేని ముద్రణా కేంద్రంగా మారింది. ఈ ప్రెస్సులో తర్వాతి 40 సంవత్సరాల వ్యవధిలో, 200 ప్రచురణల వరకూ ముద్రించారని నమ్ముతున్నారు. పోలిష్‌ బ్రద్‌రెన్‌కు చెందిన, సమీపంలోవున్న పేపర్‌ మిల్లు ఈ సాహిత్యాల ముద్రణ కోసం మంచి నాణ్యతగల కాగితాలను సరఫరా చేసింది.

తోటి విశ్వాసులకూ, మరితరులకూ విద్యనభ్యసింపజేయవలసిన అవసరముందని పోలిష్‌ బ్రద్‌రెన్‌ గుంపు త్వరలోనే గ్రహించింది. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను, 1602 లో యూనివర్సిటీ ఆఫ్‌ రాకూ స్థాపించబడింది. పోలిష్‌ బ్రద్‌రెన్‌ గుంపుకు చెందినవారి కొడుకులూ, అలాగే, క్యాథలిక్‌, ప్రొటెస్టెంట్‌ మతాలకు చెందిన కొడుకులూ అక్కడి క్లాసులకు వెళ్ళారు. ఆ యూనివర్శిటీ, దైవశాస్త్ర సంబంధ శిక్షణనే ఇస్తున్నప్పటికీ, అక్కడ మతాన్ని గురించి మాత్రమే బోధించలేదు. విదేశ భాషలూ, నీతిశాస్త్రమూ, అర్థశాస్త్రమూ, చరిత్రా, న్యాయశాస్త్రమూ, తర్కశాస్త్రమూ, విజ్ఞానశాస్త్రమూ, గణితశాస్త్రమూ, వైద్యశాస్త్రమూ, వ్యాయామాభ్యాసాలూ కూడా పాఠ్యక్రమంలో భాగంగా ఉండేవి. యూనివర్శిటీలో పెద్ద గ్రంథాలయం ఉండేది. స్థానిక ప్రింటింగ్‌ ప్రెస్‌ మూలంగా, ఆ గ్రంథాలయం అంతకంతకూ అభివృద్ధిచెందుతూ వచ్చింది.

17వ శతాబ్దం మొదలవ్వగా, పోలిష్‌ బ్రద్‌రెన్‌ ఇకపైన కూడా బాగా వర్ధిల్లుతూనే ఉంటుందని అనిపించింది. కానీ అలా జరగలేదు.

చర్చికీ ప్రభుత్వానికీ మధ్య పోరాటం

“17వ శతాబ్దపు మూడవ దశాబ్దాంతంలో, పోలండ్‌లోని ఆరియన్‌ల పరిస్థితి అతి త్వరగా క్షీణించనారంభించింది” అని పోలిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందిన బీగ్‌న్యేవ్‌ ఆగానాఫ్‌స్కీ వివరించారు. అలా క్షీణించడానికి కారణం, క్యాథలిక్‌ మతనాయకులు అంతకంతకూ అతిగా ప్రవర్తించడానికి సాహసించడమే. పోలిష్‌ బ్రద్‌రెన్‌ను అవమానపరచేందుకు, అపవాదులు అభియోగపత్రాలతో సహా, సాధ్యమైన ప్రతిమార్గాన్నీ మతనాయకులు ఉపయోగించారు. పోలండ్‌లో రాజకీయ పరిస్థితి మారడంతో, పోలిష్‌ బ్రద్‌రెన్‌లపై దాడిచేయడం మరింత సులభమయ్యింది. పోలండ్‌ క్రొత్త రాజైన, సీగిస్‌మండ్‌ III వాసా పోలిష్‌ బ్రద్‌రెన్‌కు శత్రువు. అతని తరువాతి వారు, ముఖ్యంగా జాన్‌ II కాజమీర్‌ వాసా కూడా పోలిష్‌ బ్రద్‌రెన్‌ను అడ్డగించేందుకు క్యాథలిక్‌ చర్చి చేసే ప్రయత్నాలకు మద్దతునిచ్చారు.

కొందరు రాకూ విద్యార్థులు కావాలనే సిలువను తిరస్కార భావంతో చూశారన్న ఆరోపణతో పరిస్థితి పూర్తిగా విషమించిపోయింది. పోలిష్‌ బ్రద్‌రెన్‌ ఉద్యమానికి కేంద్రస్థానంగా ఉన్న రాకూ నగరాన్ని నాశనం చేసేందుకు ఈ సంఘటనను సాకుగా తీసుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ రాకూకూ దాని ప్రింటింగ్‌ ప్రెస్స్‌కీ మద్దతునివ్వడం ద్వారా ‘దుష్టత్వం వృద్ధి చేశావు’ అని పార్లమెంటరీ కోర్టు ఎదుట యూనివర్శిటీ ఆఫ్‌ రాకూ యజమానిపై నేరారోపణ చేశారు. నైతికతను నాశనం చేస్తున్నారనీ, త్రాగి తందనాలాడుతున్నారనీ, అనైతిక జీవితాలను గడుపుతున్నారనీ పోలిష్‌ బ్రద్‌రెన్‌ను నిందించారు. రాకూ యూనివర్శిటీనీ మూసివేయాలనీ, పోలిష్‌ బ్రద్‌రెన్‌కు చెందిన ప్రింటింగ్‌ ప్రెస్‌నీ, చర్చినీ నాశనం చేయాలనీ పార్లమెంట్‌ నిర్ణయించింది. ఈ మత విశ్వాసులు రాకూ పట్టణాన్ని వదిలి వెళ్ళాలని ఆజ్ఞాపించింది. యూనివర్శిటీ ప్రొఫెసర్‌లను దేశం నుండి బహిష్కరించింది, దేశం వదిలి వెళ్ళకపోతే మరణశిక్ష పడుతుందని చెప్పింది. అలా సిలేషియా, స్లోవేకియా వంటి అనుకూలమైన ప్రాంతాలకు పోలిష్‌ బ్రద్‌రెన్‌కు చెందిన కొందరు తరలివెళ్ళారు.

పోలిష్‌ బ్రద్‌రెన్‌కు చెందినవాళ్ళు తమ ఆస్తులను అమ్ముకుని మూడేళ్ళలోగా విదేశాలకు తరలిపోవాలని 1658 లో పార్లమెంట్‌ ఆజ్ఞాపించింది. తర్వాత, ఆ కాలవ్యవధిని, రెండేళ్ళుగా చేశారు. ఒకవేళ ఆ తర్వాత, ఎవరైనా తాము పోలిష్‌ బ్రద్‌రెన్‌వాళ్ళమని చెప్పుకుంటే మరణశిక్ష వేయబడుతుంది.

కొందరు సోకీనియన్లు నెదర్‌ల్యాండ్‌లో స్థిరపడి, అక్కడ తమ ముద్రణా పనిని కొనసాగించారు. ట్రాన్సిల్వేనియాలో ఒక సంఘం రూపొంది 18వ శతాబ్దపు ఆరంభం వరకూ కొనసాగింది. వాళ్ళు వారానికి మూడుసార్ల వరకు కూటాలను జరుపుకునేవారు. ఆ కూటాల్లో వాళ్ళు కీర్తనలు పాడేవారు, ప్రసంగాలను వినేవారు, తమ బోధలను వివరించేందుకు సిద్ధం చేయబడిన ముద్రిత ప్రశ్నోత్తరాలను చదివేవారు. సంఘ పవిత్రతను కాపాడేందుకు, తోటి విశ్వాసులను సరిదిద్దేవారు, ఉపదేశమిచ్చేవారు, అవసరమైతే, సంఘం నుండి బహిష్కరించేవారు.

పోలిష్‌ బ్రద్‌రెన్‌ గుంపు దేవుని వాక్య విద్యార్థుల గుంపు. ఆ గుంపువాళ్ళు కొన్ని ప్రశస్తమైన సత్యాలను కనుగొని, వాటిని ఇతరులతో నిస్సందేహంగా పంచుకునేవారు. అయితే, చివరికి వాళ్ళు యూరప్‌ అంతటా చెల్లా చెదురయ్యారు, వాళ్ళు ఐక్యంగా ఒక దగ్గర ఉండడం చాలా కష్టమైపోయింది. కాలక్రమంగా, పోలిష్‌ బ్రద్‌రెన్‌ గుంపు అంతర్థానమైపోయింది.

[అధస్సూచీలు]

^ పేరా 5 తండ్రి కన్నా యేసు తక్కువవాడు అని అలెగ్జాండ్రియాకు చెందిన యాజకుడైన ఆరియూస్‌ (సా.శ. 250-336) వాదించాడు. సా.శ. 325 లో కౌన్సిల్‌ ఆఫ్‌ నైసియా ఆయన వీక్షణాన్ని తిరస్కరించింది.—జూన్‌ 22, 1989, తేజరిల్లు! (ఆంగ్లం) 27వ పేజీ చూడండి.

^ పేరా 9 నవంబరు 22, 1988 తేజరిల్లు! (ఆంగ్లం) 19వ పేజీలో, “సోకీనియన్స్‌—త్రిత్వాన్ని ఎందుకు తిరస్కరించారు?” అనే శీర్షికను చూడండి.

[23వ పేజీలోని చిత్రం]

ఒక సోకీనియన్‌ పరిచారకుని ఇల్లు

[23వ పేజీలోని చిత్రాలు]

పైన: నేడు రాకూ; కుడివైపున, “ఆరియనిజమ్‌” జాడలు ఏ మాత్రం కనిపించినా వాటిని నిర్మూలం చేసేందుకు 1650 లో స్థాపించబడిన సన్యాసిమఠం; క్రింద: పోలిష్‌ బ్రద్‌రెన్‌కు వ్యతిరేకంగా ఘర్షణను రేపేందుకు క్యాథలిక్‌ మతనాయకులు ఇక్కడ సిలువను నిలబెట్టారు

[21వ పేజీలోని చిత్రసౌజన్యం]

Title card of Biblia nieświeska by Szymon Budny, 1572