యెహోవా ఆలస్యం చేయడు
యెహోవా ఆలస్యం చేయడు
“అది [ఆ దర్శనవిషయము] ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.”—హబక్కూకు 2:3.
1. యెహోవా ప్రజలు ఏ కృతనిశ్చయాన్ని చూపించారు, ఏమి చేయటానికి అది వారిని కదిలించింది?
‘నేను నా కావలి స్థలముమీద కనిపెట్టుకొనియుందును.’ అది దేవుని ప్రవక్తయైన హబక్కూకు చేసుకున్న తీర్మానం. (హబక్కూకు 2:1) ఈ 20వ శతాబ్దంలోని యెహోవా ప్రజలు అదే విధమైన కృతనిశ్చయాన్ని చూపించారు. అందుకే వారు, 1922 సెప్టెంబరులో జరిగిన ఒక మలుపురాయిలాంటి సమావేశంలో బయలు వెడలిన ఈ పిలుపుకు ఆసక్తితో ప్రతిస్పందించారు: “దినములన్నిటిలోకెల్లా ఇదే దినము. చూడండి, రాజు ఏలుచున్నాడు! మీరు ఆయన బహిరంగ ప్రతినిధులు. కాబట్టి రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి.”
2. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, పులకరింపజేసే కార్యకలాపానికి పునరుద్ధరించబడినప్పుడు అభిషిక్త క్రైస్తవులు ఏమి ప్రకటించగలిగారు?
2 మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, యెహోవా ఒక తీవ్రతరమైన కార్యాన్ని చేసేందుకు అభిషిక్త శేషాన్ని పునరుద్ధరించాడు. అప్పుడు, హబక్కూకులా వారిలో ప్రతి ఒక్కరూ ఇలా ప్రకటించగల్గుతారు: “ఆయన నాకు ఏమి సెలవిచ్చునో . . . చూచుటకై నేను నా కావలి స్థలముమీదను గోపురముమీదను కనిపెట్టుకొనియుందును.” “కావలి,” ‘కనిపెట్టుకొని ఉండటం’ లేక ‘మెలకువగా ఉండటం’ కోసం వాడబడిన హెబ్రీ పదాలు, అనేక ప్రవచనాల్లో పదే పదే ఉపయోగించబడ్డాయి!
“జాగుచేయక వచ్చును”
3. మనం అవశ్యంగా ఎందుకు మెలకువగా ఉండాలి?
3 యెహోవా ప్రజలు నేడు హెచ్చరికను ప్రకటిస్తుండగా వాళ్లు, యేసు చెప్పిన గొప్ప ప్రవచనంలోని ఈ ముగింపు మాటలను లక్ష్యపెట్టేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: “ఇంటి యజమానుడు ప్రొద్దుగ్రుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాతుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండు[డి].” (మార్కు 13:35-37) హబక్కూకు వలెనే, యేసు మాటలకు అనుగుణంగా, మనం మెలకువగా ఉండాలి!
4. సా.శ.పూ. 628 లోని హబక్కూకు పరిస్థితికి మన పరిస్థితి ఎలా సమాంతరంగా ఉంది?
4 బబులోను, ఆధిపత్యంగల ప్రపంచ శక్తి కాకమునుపే, సా.శ.పూ. 628 లో హబక్కూకు తన పుస్తకాన్ని వ్రాయటం ముగించి ఉంటాడు. మతభ్రష్ట యెరూషలేముపై యెహోవా తీర్పులు అనేక సంవత్సరాలుగా ప్రకటించబడుతున్నాయి. అయినప్పటికీ, ఆ తీర్పు ఎప్పుడు అమలు చేయబడుతుందో తెలియజేసే స్పష్టమైన సూచనలేవీ లేవు. అందుకు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయనీ, బబులోను యెహోవా ఉపకరణం అవుతుందనీ ఎవరు మాత్రం నమ్మి ఉంటారు? అదే విధంగా నేడు, ఈ విధానాంతం కోసం నిర్ణయించబడిన ‘ఆ దినాన్ని గూర్చీ, గడియను గూర్చీ’ మనకు తెలియదు, కానీ యేసు మనలను ముందే ఇలా హెచ్చరించాడు: “మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.”—మత్తయి 24:36, 44.
5. హబక్కూకు 2:2, 3 లో నమోదు చేయబడిన దేవుని మాటల్లో ప్రత్యేకంగా ఏవి ప్రోత్సాహకరంగా ఉన్నాయి?
5 తగిన కారణంతోనే, యెహోవా హబక్కూకునకు ఈ ప్రేరణాత్మకమైన నియామకాన్నిచ్చాడు: “చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక హబక్కూకు 2:2, 3) నేడు, మనం “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము”నకు అంచున ఉన్నామనే విషయాన్ని సూచిస్తూ, భూవ్యాప్తంగా దుష్టత్వం, దౌర్జన్యం వేగంగా విస్తరిస్తున్నాయి. (యోవేలు 2:31) ఆ దినం ‘జాగుచేయక వస్తుంది’ అన్న యెహోవా అభయపూర్వక మాటలు, వాస్తవంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి!
వచ్చును.” (6. రాబోయే తీర్పుదినాన్నుంచి మనమెలా తప్పించుకోగలం?
6 అయితే, తీర్పును అమలుచేసే, రానైయున్న ఆ దినాన్నుంచి మనమెలా తప్పించుకోగలం? నీతిమంతులకూ అనీతిమంతులకూ మధ్య ఉన్న తేడాను చూపిస్తూ యెహోవా జవాబిస్తున్నాడు: “వారు యథార్థపరులు కాక తమలోతాము అతిశయపడుదురు; అయతే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.” (హబక్కూకు 2:4) అహంకారులూ, అత్యాశాపరులూ అయిన పాలకులూ, ప్రజలూ కోట్లాదిమంది అమాయకుల రక్తంతో ఆధునిక చరిత్ర పుటలను కళంకితం చేశారు. ప్రాముఖ్యంగా రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ, జాతి సంబంధ రక్తపాతాల్లోనూ అలా చేశారు. దానికి భిన్నంగా, శాంతిని ప్రేమించే దేవుని ప్రజలు మాత్రం విశ్వాసంతో సహించారు. వారు “సత్యము నాచరించు [“విశ్వాస ప్రవర్తనను కాపాడుకుంటున్న,” NW] నీతిగల జనము.” ఈ జనము తమ సహవాసులైన “వేరే గొఱ్ఱెల”తోపాటు, ఈ ఉపదేశాన్ని అనుసరిస్తుంది: “యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.”—యెషయా 26:2-4; యోహాను 10:16.
7. హబక్కూకు 2:4ను పౌలు ఉపయోగించడాన్ని బట్టి మనం అవశ్యంగా ఏమి చేయాలి?
7 హెబ్రీ క్రైస్తవులకు వ్రాస్తూ అపొస్తలుడైన పౌలు, యెహోవా ప్రజలకు చెప్పబడిన హబక్కూకు 2:4వ వచనాన్ని ఉదహరించాడు: “మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.—ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును. నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.” (హెబ్రీయులు 10:36-38) ఉదాసీనంగా ఉండటానికిగానీ, లేక వస్తుసంబంధమైన ఉరుల్లో చిక్కుకోడానికిగానీ, సాతాను లోకపు వెఱ్ఱితలలువేసే వినోదపు మార్గాల్లోకి వెళ్లడానికిగానీ ఇది సమయంకాదు. కాబట్టి ‘బహు కొంచెముగా’ ఉన్న కాలం గతించిపోయేంతవరకూ మనం ఏమి చేయాలి? యెహోవా పవిత్ర జనాంగానికి చెందిన మనం పౌలువలే, ‘ముందున్న వాటికొరకై వేగిరపడుతూ’ నిత్యజీవమనే ‘గురి యొద్దకు విడువకుండా పరుగెత్తుదాము.’ (ఫిలిప్పీయులు 3:13, 14) యేసువలే, ‘మన యెదుట ఉంచబడిన ఆనందము కోసం అవమానాన్ని సహించాలి.’—హెబ్రీయులు 12:2.
8. హబక్కూకు 2:5 లోని మనుష్యుడు ఎవరు, ఎందుకని ఆయన విఫలుడవుతాడు?
8 యెహోవా సేవకులకు భిన్నంగా, “పాతాళమంత విశాలముగా ఆశ” ఉన్నా తన గురిని చేరుకోవడంలో విఫలుడయ్యే ఒక బలిష్టుడైన మనుష్యుని గురించి హబక్కూకు 2:5వ వచనం వర్ణిస్తోంది. “తృప్తినొంద”ని ఆ మనుష్యుడు ఎవరు? హబక్కూకు కాలంనాటి అత్యాశపరురాలైన బబులోను వలే, ఆ సంయుక్త ‘మనుష్యుడు’ నేడు, తమ దేశ సరిహద్దుల్ని విస్తరింపచేసుకునేందుకు యుద్ధాల్లో పోరాడే రాజకీయ శక్తులతో రూపొందించబడ్డాడు. ఆ రాజకీయ శక్తులు ఫాసిస్టు, నాజీ, కమ్యూనిస్టు ఏవైనా కావొచ్చు, లేక ప్రజాస్వామ్య దేశాలని చెప్పుకుంటున్నవైనా కావొచ్చు. అతడు అమాయకుల ప్రాణాలతో పాతాళాన్ని అంటే, సమాధిని నింపుతున్నాడు. అయితే సాతాను లోకానికి చెందిన ఆ నయవంచక సంయుక్త ‘మనుష్యుడు’ తన స్వాతిశయంతో మత్తెక్కిన వాడై, ‘సకలజనములను వశపరచుకొనేందుకూ, సకల జనులను సమకూర్చుకొనేందుకూ’ చేసే ప్రయత్నంలో సఫలీకృతుడు కాడు. యెహోవా దేవుడు మాత్రమే సమస్త మానవాళినీ సమైక్యపరచగలడు, ఆయన దాన్ని మెస్సీయ రాజ్యం ద్వారా నెరవేరుస్తాడు.—మత్తయి 6:9, 10.
నాటకీయమైన ఐదు శ్రమల్లో మొదటిది
9, 10. (ఎ) యెహోవా హబక్కూకు ద్వారా ఏమని ప్రకటించాడు? (బి) అవినీతికరమైన సంపాదనకు సంబంధించి, ఈనాటి పరిస్థితి ఏమిటి?
9 యెహోవా తన ప్రవక్తయైన హబక్కూకు ద్వారా ఐదు శ్రమల పరంపరను అంటే, దేవుని నమ్మకమైన ఆరాధకులు నివసించేందుకు భూమిని సిద్ధం చేయడంలో అమలుపర్చాల్సిన తీర్పులను ప్రకటిస్తున్నాడు. అటువంటి యథార్థ హృదయులు, యెహోవా అందిస్తున్న ఈ ‘అపహాస్యపు సామెతను ఎత్తుకుంటారు.’ హబక్కూకు 2:6 లో మనమిలా చదువుతాము: “తనదికాని దాని నాక్రమించి యభివృద్ధినొందినవానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ;—వాడు ఎన్నాళ్లు నిలుచును.”
10 ఇక్కడ అవినీతికరమైన సంపాదన గురించి నొక్కి చెప్పడం జరిగింది. మన చుట్టూ ఉన్న లోకంలో, ధనికులు మరింత ధనికులు, పేదవారు మరింత పేదలు అవుతున్నారు. సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తుండగా, మాదక ద్రవ్య డీలర్లూ, మోసగాళ్లూ మరింత ఐశ్వర్యవంతులౌతున్నారు. ప్రపంచ జనాభాలో నాల్గవవంతు మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నట్లు చెప్పబడుతుంది. అనేక దేశాల్లో జీవన పరిస్థితులు భయం కలిగించేవిగా ఉన్నాయి. భూమిపై నీతి నివసించాలని ఎదురుచూసే వాళ్లు, ‘ఎన్నాళ్లపాటు’ ఈ దురన్యాయాలు పెరుగుతూ పోతాయని బాధను వ్యక్తపరుస్తున్నారు! అయితే, అంతం ఆసన్నమైంది! నిజానికి, ఆ దర్శనవిషయము, ‘జాగుచేయక వస్తుంది.’
11. మానవ రక్తాన్ని చిందించటాన్ని గురించి హబక్కూకు ఏమని చెప్పాడు, ఈనాడు భూమిపై గొప్ప రక్తాపరాధం ఉందని మనం ఎందుకని చెప్పవచ్చు?
11 ఆ ప్రవక్త దుష్టునితో ఇలా చెబుతున్నాడు: “బహు జనముల ఆస్తిని నీవు కొల్లపెట్టియున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యనుబట్టియు బలాత్కారమునుబట్టియు నిన్ను కొల్లపెట్టుదురు.” (హబక్కూకు 2:8) నేడు భూమిపై మనం ఎంతటి రక్తాపరాధాన్ని చూస్తున్నామో కదా! యేసు స్పష్టంగా ఇలా పేర్కొన్నాడు: “కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” (మత్తయి 26:52) అయినప్పటికీ, ఈ ఒక్క 20వ శతాబ్దంలోనే, రక్తాపరాధ దేశాలూ జాతీయ గుంపులూ పది కోట్ల కన్నా ఎక్కువమంది మానవుల ఊచకోతకు బాధ్యులు. ఈ రక్తపాతాల్లో భాగం వహిస్తున్నవారికి శ్రమ!
రెండవ శ్రమ
12. హబక్కూకు నమోదు చేసిన రెండవ శ్రమ ఏమిటి, అవినీతి సంపాదన ఎందుకూ కొరగాకుండా పోతుందని మనం ఎలా నిశ్చయత కల్గివుండగలం?
12హబక్కూకు 2:9-11 వచనాల్లో నమోదు చేయబడిన రెండవ శ్రమ, “తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యంటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొను వాని”పై పడుతుంది. “ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యంటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వానివెంట దిగదు” అని కీర్తనకర్త స్పష్టం చేస్తున్నట్టుగానే, అవినీతితో సంపాదించినది ఎందుకూ కొరగాకుండా పోతుంది. (కీర్తన 49:16, 17) అపొస్తలుడైన పౌలు ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఈ సలహా గమనించదగినది: “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.”—1 తిమోతి 6:17.
13. దేవుని హెచ్చరికను మనం ఎందుకు ప్రకటిస్తూనే ఉండాలి?
13 దేవుని తీర్పు సందేశాలు నేడు ప్రకటించబడటం ఎంత ప్రాముఖ్యమో కదా! “ప్రభువు పేరట వచ్చు రాజు” అని యేసును స్తుతిస్తున్న జనసమూహాలకు పరిసయ్యులు అడ్డుచెప్పినప్పుడు, “వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయు[ను]” అని ఆయన సమాధానమిచ్చాడు. (లూకా 19:38, 40) అదే విధంగా, ఈ ప్రపంచంలోవున్న దుష్టత్వాన్ని బహిర్గతం చేయడంలో దేవుని ప్రజలు నేడు విఫలులైతే, ‘గోడలలోని రాళ్లు మొఱ్ఱ పెడతాయి.’ (హబక్కూకు 2:11) కాబట్టి మనం దేవుని హెచ్చరికల్ని ధైర్యంగా ప్రకటిస్తూ ఉందాము!
మూడవ శ్రమ, రక్తాపరాధ వివాదాంశం
14. ఏ రక్తాపరాధానికి ప్రపంచ మతాలు బాధ్యత వహించాలి?
14 హబక్కూకు ద్వారా ప్రకటించబడిన మూడవ శ్రమ రక్తాపరాధ వివాదాంశాన్ని ప్రస్తావిస్తుంది. హబక్కూకు 2:12 ఇలా చెబుతుంది: “నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించువారికి శ్రమ; దుష్టత్వము జరిగించుటచేత కోటను స్థాపించు వారికి శ్రమ.” ఈ వ్యవస్థలో, అవినీతీ, రక్తాపరాధం రెండూ ఒకదాని వెంబడి మరొకటి తరచూ జరుగుతున్నాయి. విశేషంగా ప్రపంచ మతాలు, చరిత్రలోని అత్యంత నీచమైన రక్తపాతాలు జరగడానికి కారణమయ్యాయి. క్రైస్తవులమని చెప్పుకుంటున్న వాళ్లు ముస్లింలకు విరుద్ధంగా జరిపిన క్రూసేడ్ యుద్ధాలను గురించీ; స్పెయిన్, లాటిన్ అమెరికాలలో జరిగిన ఇంక్విజిషన్లను గురించీ; ప్రొటెస్టెంట్లకూ క్యాథలిక్కులకూ మధ్య యూరప్‌లో జరిగిన ముప్ఫై ఏండ్ల యుద్ధం గురించీ; వాటన్నింటికన్నా అత్యంత అధికంగా రక్తాన్ని చిందించిన, అంటే మన శతాబ్దంలోనే క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన దేశాల్లో ప్రారంభమైన రెండు ప్రపంచ యుద్ధాలను గురించీ మనం ఇక ప్రస్తావించనక్కర్లేదు.
15. (ఎ) చర్చీ మద్దతుతో లేక సమ్మతితో దేశాలు ఏమి చేస్తూనే ఉన్నాయి? (బి) ఆయుధాలు సేకరించకుండా ఈ ప్రపంచాన్ని ఐక్యరాజ్య సమితి ఆపగలదా?
15 రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన పరమ దుర్మార్గపు అంశాల్లో ఒకటేమిటంటే, యూరప్‌లో ఉన్న లక్షలాది మంది యూదులనూ, అమాయకులైన ఇతరులనూ పొట్టనపెట్టుకున్న నాజీ మారణహోమకాండే. లక్షలాదిమంది బాధితులను నాజీ మరణ ఛాంబర్లలోకి పంపించడాన్ని వ్యతిరేకించకపోవడం తమ తప్పని, ఫ్రాన్స్‌లోని రోమన్ క్యాథలిక్ హైరార్చీ కేవలం ఇటీవలనే అంగీకరించింది. అయినప్పటికీ, చర్చీ మద్దతుతో లేక సమ్మతితో రక్తాన్ని చిందించడానికి దేశాలు ఇంకా సిద్ధపడుతూనే ఉన్నాయి. రష్యన్ ఆర్థడాక్స్ చర్చిని గురించి మాట్లాడుతూ, టైమ్ పత్రిక (అంతర్జాతీయ సంచిక) ఇటీవల ఇలా పేర్కొన్నది: “పునరుద్ధరించబడిన చర్చి, ఏ పరిధిపై తన ప్రభావాన్ని చూపించాలన్న ఆలోచన ఒకప్పుడు లేదో ఆ పరిధిపై తన సంక్లిష్టమైన ప్రభావాన్ని చూపిస్తోంది: అదే రష్యన్ యుద్ధ యంత్రాంగం. . . . జెట్ యుద్ధ విమానాల్నీ, బారకాసులనూ ఆశీర్వదించడం దాదాపు రివాజైపోయింది. నవంబరు నెలలో, రష్యన్ పేట్రియార్స్ స్థానమైన మాస్కోలోని డానిలోవ్స్కీ మొనాస్ట్రీలో చర్చి, రష్యా దేశపు అణ్వస్త్రాలను పవిత్రపర్చేంత దూరం వెళ్లింది.” పైశాచిక యుద్ధోపకరణాలతో ఈ లోకం, తన అంబులపొదిని నవీకరించుకోకుండా ఐక్యరాజ్య సమితి ఆపగలదా? ఎంత మాత్రం ఆపలేదు! నోబెల్ శాంతి బహుమతిని పొందిన ఒక వ్యక్తి, ఇంగ్లాండ్‌లోని లండన్ నగరంలో ప్రచురించబడే ద గార్డియన్ వార్తాపత్రికలో ఇలా వ్యాఖ్యానించాడు: “ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంగల ఐదు దేశాలూ ప్రపంచంలో ఆయుధాలను సప్లై చేసే ఐదు ముఖ్యమైన దేశాలు అన్న విషయం నిజంగా కలవరపరిచే విషయమైవుంది.”
16. యుద్ధోన్మాద దేశాలకు సంబంధించి యెహోవా ఏమి చేస్తాడు?
16 యుద్ధోన్మాద దేశాలపై, యెహోవా తీర్పును అమలు చేస్తాడా? హబక్కూకు 2:13 ఇలా అంటుంది: “జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు; వ్యర్థమైనదానికొరకు కష్టపడి జనులు క్షీణించుదురు; ఇది సైన్యముల కధిపతియగు యెహోవా చేతనే యగునుగదా.” “సైన్యముల కధిపతియగు యెహోవా”! అవును, యెహోవా దేవునికి పరలోక దూతల సైన్యాలు ఉన్నాయి. ఆయన యుద్ధోన్మాదులనూ, యుద్ధోన్మాద దేశాలనూ నాశనం చేసేందుకు వాటిని ఉపయోగిస్తాడు!
17. దౌర్జన్యపూరితమైన జాతీయ గుంపులపై యెహోవా తీర్పును అమలు చేసిన తర్వాత యెహోవాను గూర్చిన జ్ఞానము ఈ భూమిపై ఎంతమేరకు విస్తరిస్తుంది?
17 దౌర్జన్యపూరితమైన ఆ జాతీయ గుంపులపై యెహోవా తీర్పులు అమలుపర్చబడిన తర్వాత, ఏమి జరుగుతుంది? దానికి జవాబును హబక్కూకు 2:14వ వచనం ఇస్తోంది: “సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మాహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును.” అదెంతటి గొప్ప ఉత్తరాపేక్షో కదా! అర్మగిద్దోను నందు, యెహోవా సర్వాధిపత్యం నిరంతరం నిరూపించబడుతుంది. (ప్రకటన 16:16) మనం నివసిస్తున్న ఈ భూమియైన తన ‘పాదస్థలమును మహిమపరుస్తానని’ యెహోవా మనకు అభయాన్నిస్తున్నాడు. (యెషయా 60:13) సముద్రము జలములతో నిండియున్నట్టు, యెహోవా మహోన్నత సంకల్పాలను గూర్చిన జ్ఞానంతో భూమి నిండి ఉండేలా సర్వమానవాళికీ దైవిక జీవిత మార్గం బోధించబడుతుంది.
నాల్గవ, ఐదవ శ్రమలు
18. హబక్కూకు ద్వారా ప్రకటించబడిన నాల్గవ శ్రమ ఏమిటి, ఈనాటి లోకపు నైతికస్థితిలో అది ఎలా ప్రతిఫలిస్తుంది?
18 నాల్గవ శ్రమ, హబక్కూకు 2:15వ వచనంలో ఇలా వర్ణించబడింది: “తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ.” ఆధునిక లోకపు దారితప్పిన, నీచమైన మార్గాన్నది సూచిస్తోంది. వేటినైనా అనుమతించే మతాల మద్దతును పొందిన లోకపు అవినీతి పూర్తిగా దిగజారిపోయింది. ఎయిడ్స్, మరితర సుఖ వ్యాధుల వంటి మహమ్మారులు, భూవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. “యెహోవా మహిమను” ప్రతిబింబించడానికి బదులు, నేనే-ముందు అనే నేటి తరం దుర్నీతిలోనికి మరింత లోతుకు కూరుకుపోతూ, దేవుని తీర్పులను పొందే దిశగా పయనిస్తోంది. ‘ఘనతకు మారుగా అవమానముతో నిండిన,’ దారి తప్పిన ఈ లోకం, తన పట్ల యెహోవా చిత్తాన్ని ప్రతిబింబించే ఆయన కోపోద్రేకమనే పాత్రలో నుంచి త్రాగనైయుంది. ‘అవమానకరమైన వమనము దాని ఘనతమీదపడును.’—హబక్కూకు 2:16.
19. హబక్కూకు ద్వారా ప్రకటించబడిన ఐదవ శ్రమ పరిచయ మాటలు దేనికి సంబంధించినవి, అలాంటి మాటలు ఈనాటి లోకంలో ఎందుకని ప్రాధాన్యత కల్గివున్నాయి?
19 ఐదవ శ్రమను పరిచయంచేసే మాటలు, చెక్కబడిన విగ్రహాలను ఆరాధించడానికి విరుద్ధంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. “కఱ్ఱనుచూచి—మేలుకొమ్మనియు, మూగరాతినిచూచి—లెమ్మనియు చెప్పువానికి శ్రమ; అది ఏమైన బోధింపగలదా? అది బంగారముతోను వెండితోను పూతపూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు” అన్న శక్తివంతమైన ఆ మాటలను ప్రకటించమని యెహోవా తన ప్రవక్తకు చెబుతాడు. (హబక్కూకు 2:19) నేటికీ కూడా, క్రైస్తవ మత సామ్రాజ్యం, అనాగరిక మత సామ్రాజ్యం రెండూ కూడా, తమ సిలువలకూ, మడోనాలకూ, విగ్రహాలకూ, మానవ రూపంలోనూ మృగ రూపంలోనూ ఉన్న వాటికీ వంగి నమస్కరిస్తున్నాయి. తీర్పు తీర్చేందుకు యెహోవా వచ్చినప్పుడు, వాటిలో ఏ ఒక్కటీ తమ ఆరాధకులను రక్షించడానికి మేలుకోలేవు. నిత్య దేవుడైన యెహోవా మహిమతోనూ, సజీవంగా ఉన్న ఆయన సృష్టి ప్రాణుల ఘనతతోనూ పోల్చిచూస్తే, వాటి పై పూతయైన వెండి బంగారాలు పూర్తిగా అర్థరహితమైనవిగా అవుతాయి. ఆయన అసమానమైన నామాన్ని మనం ఎల్లప్పుడూ ఘనపరుద్దాం!
20. ఎటువంటి ఆలయ ఏర్పాటులో ఆనందంగా సేవచేసే ఆధిక్యత మనకుంది?
20 అవును, మన దేవుడైన యెహోవా, సమస్త స్తుతినీ పొందడానికి అర్హుడు. ఆయన పట్ల లోతైన భయాన్ని కలిగి ఉండి, విగ్రహారాధనకు విరుద్ధంగా ఇవ్వబడిన తీవ్రమైన హెచ్చరికను లక్ష్యపెడదాం. అయితే వినండి! యెహోవా ఇంకా మాట్లాడుతున్నాడు: “యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక”! (హబక్కూకు 2:20) ఆ ప్రవక్త మదిలో యెరూషలేము ఆలయం ఉందనడంలో సందేహం లేదు. అయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధానయాజకునిగా ఉన్న ఆధ్యాత్మిక ఆలయ ఏర్పాటులో అంటే ఎంతో సమున్నతమైన ఆధ్యాత్మిక ఆలయ ఏర్పాటులో ఆరాధించగల ఆధిక్యత నేడు మనకుంది. ఆ ఆలయానికి సంబంధించిన భూ ప్రాంగణంలో మనం కలుసుకుంటాం, సేవచేస్తాం, ప్రార్థిస్తాం, యెహోవా మహిమగల నామానికి తగిన ఘనతను చెల్లిస్తాం. మన ప్రేమగల పరలోకపు తండ్రికి మన హృదయపూర్వక ఆరాధనను అర్పించటం మనకు ఎంత ఆనందకరమైనదో గదా!
మీకు జ్ఞాపకమున్నాయా?
• అది “జాగుచేయక వచ్చును” అనే యెహోవా మాటల్ని మీరెలా దృష్టిస్తారు?
• హబక్కూకు ద్వారా ప్రకటించబడిన శ్రమలకు ప్రస్తుత-దినం ఉన్న ప్రాధాన్యత ఏమిటి?
• యెహోవా హెచ్చరికను మనం ఎందుకు ప్రకటిస్తూనే ఉండాలి?
• ఏ ఆలయపు ఆవరణలో సేవ చేసే ఆధిక్యత మనకు ఉంది?
[అధ్యయన ప్రశ్నలు]
[15వ పేజీలోని చిత్రాలు]
యెహోవా ఆలస్యం చేయడని హబక్కూకునకువలే, దేవుని ప్రస్తుతదిన సేవకులకు కూడా తెలుసు
[18వ పేజీలోని చిత్రాలు]
యెహోవా ఆధ్యాత్మిక ఆలయ ఆవరణలో ఆయనను ఆరాధించే ఆధిక్యతను మీరు అభినందిస్తారా?
[16వ పేజీలోని చిత్రసౌజన్యం]
U.S. Army photo