కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి”

“యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి”

“యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి”

“తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.”—2 దినవృత్తాంతములు 16:9.

1. శక్తి అంటే ఏమిటి, మానవులు దాన్నెలా ఉపయోగించారు?

శక్తి అంటే అనేక అర్థాలు మనస్సుకి వస్తాయి. ఆదేశించే శక్తి, అధికారం, ఇతరులను ప్రభావితం చేసే శక్తి; చర్య తీసుకునే లేదా ప్రభావం చూపే సామర్థ్యం; శారీరక దారుఢ్యం (బలం); మానసిక నైతిక బలం వంటివి వాటిలో కొన్ని. అధికారం చెలాయించే విషయానికొస్తే మానవులకు అంత మంచి పేరు లేదు. రాజకీయవేత్తలకున్న అధికారాన్ని గురించి మాట్లాడుతూ లార్డ్‌ ఆక్టన్‌ అనే చరిత్రకారుడు ఇలా చెప్పాడు: “అధికారం భ్రష్టుపట్టిస్తుంది, సంపూర్ణాధికారం సంపూర్ణంగా భ్రష్టుపట్టిస్తుంది.” లార్డ్‌ ఆక్టన్‌ మాటల్లోని సత్యాన్ని నిరూపించే ఉదాహరణలు ఆధునిక చరిత్రలో సమృద్ధిగా ఉన్నాయి. మునుపెన్నడూ లేనంతగా, 20వ శతాబ్దంలో, “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట” జరిగింది. (ప్రసంగి 8:9) భ్రష్టులైన నియంతలు తమ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి లక్షలాదిమంది జీవితాలను కాలరాచారు. ప్రేమ, బుద్ధి, న్యాయములచే నియంత్రించబడని అధికారం ప్రమాదకరమైనది.

2. యెహోవా తన శక్తిని ఉపయోగించే విధానాన్ని ఇతర దైవిక లక్షణాలు ఎలా ప్రభావితం చేస్తాయో వివరించండి.

2 చాలామంది మానవుల్లా కాక, దేవుడు ఎల్లప్పుడూ తన శక్తిని మంచి చేయడానికే ఉపయోగిస్తాడు. “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దినవృత్తాంతములు 16:9) యెహోవా తనకున్న శక్తిని పూర్తి నియంత్రణతో ఉపయోగిస్తాడు. దేవుడు దుష్టులకు శిక్ష విధించకుండా, వారికి పశ్చాత్తాపపడే అవకాశాన్ని ఇచ్చేందుకు ఆయన సహనం ఆయన్ను వెనక్కిపట్టి ఉంచుతుంది. అన్ని రకాల మనుష్యులమీదా అంటే నీతిమంతుల మీదనూ, అనీతిమంతుల మీదనూ సూర్యుడు ప్రకాశించేలా చేసేందుకు ప్రేమ ఆయనను పురికొల్పుతుంది. చివరిగా, మరణము యొక్క బలముగలవాడైన అపవాదియగు సాతానును నిర్మూలించేందుకు తన అపరిమితమైన శక్తిని ఉపయోగించడానికి న్యాయం ఆయనను ప్రేరేపిస్తుంది.—మత్తయి 5:44, 45; హెబ్రీయులు 2:14; 2 పేతురు 3:9.

3. దేవుని నమ్మడానికి ఆయనకున్న సర్వశక్తి ఎందుకు ఒక కారణం?

3 మన పరలోకపు తండ్రి చేసిన వాగ్దానాల్లోనూ, ఆయనిచ్చే కాపుదలలోనూ నమ్మకముంచడానికీ వాటిని విశ్వసించడానికీ ఒక కారణం, ఆయనకున్న అసాధారణమైన శక్తే. ఒక చిన్నపిల్లవాడు అపరిచితుల మధ్యన ఉన్నప్పుడు తన తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకుని సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాడు ఎందుకంటే, తన తండ్రి తనకు ఏ హానీ జరుగనివ్వడని వాడికి తెలుసు. అలాగే, ‘రక్షించుటకు బలాఢ్యుడైన’ మన పరలోకపు తండ్రితో మనం కలిసి నడిస్తే ఆయన మనకు ఏ విధంగానూ శాశ్వతమైన హానీ జరుగకుండా కాపాడుతాడు. (యెషయా 63:1; మీకా 6:8) మంచి తండ్రిగా యెహోవా ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఆయనకున్న అపరిమితమైన శక్తి, ఆయన ‘నోటనుండి వచ్చు వచనము ఆయన పంపిన కార్యమును సఫలము’ చేస్తుందని హామీ ఇస్తుంది.—యెషయా 55:11; తీతు 1:1-2.

4, 5. (ఎ) రాజైన ఆసా యెహోవాను ప్రగాఢంగా విశ్వసించినప్పుడు ఏమి జరిగింది? (బి) మనం మన సమస్యలకు మానవ పరిష్కారాలపై ఆధారపడితే ఏమి జరుగవచ్చు?

4 మన పరలోకపు తండ్రి ఇచ్చే కాపుదలను మనం విస్మరించకూడదని నిశ్చయించుకోవటం ఎందుకంత ప్రాముఖ్యం? ఎందుకంటే మనం మన పరిస్థితులను బట్టి ఉక్కిరిబిక్కిరి అయిపోయి మన వాస్తవమైన భద్రత ఎక్కడుందో మర్చిపోయే సాధ్యత ఉంది. రాజైన ఆసా ఉదాహరణలో దీన్ని చూడవచ్చు, ఆయనకు సాధారణంగా యెహోవాయందు నమ్మకముంది. ఆసా పరిపాలిస్తున్న కాలంలో, పది లక్షల మంది ఐతియోపీయులున్న సైన్యం యూదాపై దాడి చేసింది. సైనిక శక్తి తన శత్రువుల పక్షాన ఎక్కువగా ఉందని గ్రహించి ఆసా ఇలా ప్రార్థించాడు: “యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే ఆ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని విజయమొందనియ్యకుము.” (2 దినవృత్తాంతములు 14:11) యెహోవా ఆసా విన్నపాన్ని విని, ఆయనకు నిర్ణయాత్మకమైన విజయాన్ని అనుగ్రహించాడు.

5 అయితే ఎన్నో సంవత్సరాల నమ్మకమైన సేవ తర్వాత, యెహోవా రక్షణ శక్తినందు ఆసాకున్న నమ్మకం సన్నగిల్లింది. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం నుండి వచ్చే సైనిక విపత్తును తప్పించుకునేందుకు ఆయన సిరియా సహాయాన్ని అర్థించాడు. (2 దినవృత్తాంతములు 16:1-3) సిరియా రాజైన బెన్హదదుకు ఆసా ఇచ్చిన లంచం, ఇశ్రాయేలు జనాంగం యూదాపైకి తీసుకురాబోయిన విపత్తును తప్పించినప్పటికీ, ఆసా సిరియాతో చేసుకున్న ఈ సంధి ఆయనకు యెహోవాయందు నమ్మకం లేకపోవడాన్ని చూపించింది. హానానీ అనే ప్రవక్త సూటిగా ఆయననిలా అడిగాడు: “బహు విస్తారమైన రథములును గుఱ్ఱపు రౌతులునుగల కూషీయులును లూబీయులును గొప్ప దండైవచ్చిరిగదా? అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతి కప్పగించెను.” (2 దినవృత్తాంతములు 16:7, 8) అలా మందలించినప్పటికీ, ఆసా దాన్ని తిరస్కరించాడు. (2 దినవృత్తాంతములు 16:9-12) మనం సమస్యలను ఎదుర్కుంటున్నప్పుడు మానవ పరిష్కారాలపై ఆధారపడకూడదు. బదులుగా, మనం దేవునియందు నమ్మకాన్ని కనపర్చాలి, ఎందుకంటే నరమాత్రులను నమ్ముకోవడం అనివార్యంగా నిరాశకే నడిపిస్తుంది.—కీర్తన 146:3-5.

యెహోవా ఇచ్చే శక్తిని పొందండి

6. మనం ఎందుకు ‘యెహోవాను ఆయన బలాన్ని వెదకాలి’?

6 యెహోవా తన సేవకులకు శక్తినివ్వగలడు, అలాగే వారిని కాపాడగలడు. “యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి” అని బైబిలు మనకు ఉద్బోధిస్తుంది. (కీర్తన 105:4) ఎందుకు? ఎందుకంటే మనం దేవుడిచ్చే శక్తితో పనులు చేసినప్పుడు, మన అధికారం ఇతరుల హానికి కాక ఇతరుల క్షేమానికే ఉపయోగపడుతుంది. ఈ విషయంలో యేసు కన్నా శ్రేష్ఠమైన ఉదాహరణ మరొకటేదీ లేదు, ఆయన “ప్రభువు [“యెహోవా,” NW] శక్తి”తో అనేక అద్భుతాలు చేశాడు. (లూకా 5:17) యేసు తాను సంపన్నవంతుడయ్యేందుకు, పేరుప్రతిష్ఠలు సంపాదించుకునేందుకు, లేక చివరికి సర్వశక్తిమంతుడైన రాజు అయ్యేందుకు కృషిచేసి ఉండగలిగేవాడే. (లూకా 4:5-7) బదులుగా, దేవుడు తనకిచ్చిన అధికారాన్ని ఆయన శిక్షణనిచ్చేందుకూ బోధించేందుకు, సహాయం చేసేందుకూ స్వస్థపరిచేందుకు ఉపయోగించాడు. (మార్కు 7:37; యోహాను 7:46) మనకెంత చక్కని మాదిరి!

7. మనం మన స్వంత శక్తితో కాక దేవుని బలంతో పనులు చేసినప్పుడు ఏ ఆవశ్యకమైన లక్షణాన్ని అలవర్చుకుంటాము?

7 అంతేగాక మనం “దేవుడు అనుగ్రహించు సామర్థ్యము”తో పనులు చేయడం, వినయస్థులమై ఉండడానికి మనకు సహాయం చేస్తుంది. (1 పేతురు 4:11) తమకోసం తాము అధికారం సంపాదించుకునేందుకు ప్రయత్నించేవారు అహంకారులుగా తయారౌతారు. ఒక ఉదాహరణ ఏమిటంటే, అష్షూరు రాజైన ఏసర్హద్దోను డాంబికంగా ఇలా పలికాడు: “నేను శక్తిమంతుడ్ని, నేను సర్వశక్తిమంతుడ్ని, నేనొక వీరుడ్ని, నేను దృఢకాయుడ్ని, నేను మహాబలవంతుడ్ని.” దీనికి పూర్తి భిన్నంగా, యెహోవా “బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని . . . ఏర్పరచుకొనియున్నాడు.” కాబట్టి, ఒక నిజ క్రైస్తవుడు ప్రగల్భాలు పలికితే, అతడు యెహోవా విషయంలోనే ప్రగల్భాలు పలుకుతాడు, ఎందుకంటే తాను సాధించినది తన స్వంత శక్తితో కాదని ఆయనకు తెలుసు. దేవుని “బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై” ఉండడం నిజమైన ఘనతను తెస్తుంది.—1 కొరింథీయులు 1:26-31; 1 పేతురు 5:6.

8. యెహోవా శక్తిని పొందడానికి మనం మొదట ఏమి చేయాలి?

8 మనమెలా దేవుని నుండి శక్తిని పొందుతాము? మొదటిగా, మనం దానికోసం ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ కోసం అడిగేవారికి తన తండ్రి దాన్ని తప్పక అనుగ్రహిస్తాడని యేసు తన శిష్యులకు హామీ ఇచ్చాడు. (లూకా 11:10-13) అది, యేసు గురించి సాక్ష్యమివ్వడాన్ని ఆపమని ఆజ్ఞాపించిన మతనాయకులకు విధేయత చూపే బదులు దేవునికి విధేయత చూపడానికి క్రీస్తు శిష్యులు ఎంపిక చేసుకున్నప్పుడు ఆ హామీ వారిని ఎంతగా బలపర్చి ఉంటుందో ఆలోచించండి. వారు యెహోవా సహాయం కోసం ప్రార్థించినప్పుడు, వారి యథార్థ ప్రార్థనలకు సమాధానం లభించింది, ధైర్యంగా సువార్త ప్రకటించడంలో కొనసాగేందుకు పరిశుద్ధాత్మ వారిని శక్తిమంతులను చేసింది.—అపొస్తలుల కార్యములు 4:19, 20, 29-31, 33.

9. మన ఆధ్యాత్మిక శక్తికి రెండవ మూలమేమిటి, దాని సామర్థ్యాన్ని చూపించడానికి ఒక లేఖనాధార ఉదాహరణను చెప్పండి.

9 రెండవదిగా, మనం బైబిలు నుండి ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చు. (హెబ్రీయులు 4:12) రాజైన యోషీయా కాలంలో దేవుని వాక్య శక్తి స్పష్టమైంది. ఈ యూదా రాజు దేశంలో నుండి అన్యమత విగ్రహాలను అప్పటికే తీసివేసినప్పటికీ, ఆలయంలో యెహోవా ధర్మశాస్త్రం అనుకోకుండా కనుగొనబడడం ఈ ప్రక్షాళనా కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేసేలా ఆయనను పురికొల్పింది. * యోషీయా వ్యక్తిగతంగా ధర్మశాస్త్రాన్ని ప్రజలకు చదివి వినిపించిన తర్వాత, మొత్తం జనాంగమంతా యెహోవాతో నిబంధన చేసింది, అలా విగ్రహారాధనకు వ్యతిరేకంగా రెండవసారి, మరింత తీవ్రమైన ప్రచారం ప్రారంభమైంది. యోషీయా చేసిన సంస్కరణకు చక్కని ఫలితమేమిటంటే, “అతని దినములన్నియు వారు . . . యెహోవాను అనుసరించుట మానలేదు.”—2 దినవృత్తాంతములు 34:33.

10. యెహోవా నుండి శక్తిని పొందడానికి మూడవ మార్గం ఏమిటి, అది ఎందుకు ఆవశ్యకం?

10 మూడవదిగా, మనం క్రైస్తవ సహవాసం ద్వారా యెహోవా నుండి బలాన్ని పొందుతాము. “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును,” అలాగే ఒకరినొకరు ప్రోత్సహించుకొనుటకును కూటాలకు క్రమంగా హాజరుకమ్మని పౌలు క్రైస్తవులను ప్రోత్సహించాడు. (హెబ్రీయులు 10:24, 25) పేతురు అద్భుతరీతిగా చెరసాల నుండి విడుదల చేయబడిన తర్వాత, తన సహోదరులతో ఉండాలని కోరుకున్నాడు, కాబట్టి ఆయన తిన్నగా, “అనేకులుకూడి ప్రార్థనచేయుచుండి”న, మార్కు అను మారు పేరుగల యోహాను తల్లి ఇంటికి వెళ్లాడు. (అపొస్తలుల కార్యములు 12:12) వాళ్లందరూ ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేయగలిగేవారే. కానీ ఆ కష్ట సమయంలో వారు ప్రార్థించేందుకూ, ఒకరినొకరు ప్రోత్సహించుకునేందుకూ ఒకటిగా సమకూడటానికి నిర్ణయించుకున్నారు. పౌలు రోముకు చేసిన సుదీర్ఘమైన, ప్రమాదకరమైన ప్రయాణంలో, పొతియొలీలో ఆయన కొంతమంది సహోదరులను కలిసాడు, ఆ తర్వాత, ఆయనను కలవడానికి ప్రయాణించి వచ్చిన వారిని కూడా కలిసాడు. తత్ఫలితంగా ఆయనెలా భావించాడు? “పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.” (అపొస్తలుల కార్యములు 28:13-15) మరోసారి తోటి క్రైస్తవులను కలుసుకోగల్గినందుకు ఆయన బలపర్చబడ్డాడు. మనం కూడా తోటి క్రైస్తవులతో సహవసించడం ద్వారా బలాన్ని పొందుతాము. మనకు స్వేచ్ఛ ఉన్నంతవరకూ, ఒకరితో ఒకరం సహవసించే అవకాశం ఉన్నంతవరకూ, జీవానికి నడిపించే మార్గంపై మనం ఒంటరిగా నడవడానికి ప్రయత్నించకూడదు.—సామెతలు 18:1; మత్తయి 7:14.

11. “బలాధిక్యము” ప్రాముఖ్యంగా అవసరమయ్యే కొన్ని సందర్భాలను చెప్పండి.

11 క్రమంగా ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని పఠించడం, తోటి విశ్వాసులతో సహవసించడం వంటివాటి ద్వారా మనం ‘ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులమై ఉంటాము.’ (ఎఫెసీయులు 6:10) మనకందరికీ నిస్సందేహంగా, “ప్రభువుయొక్క మహా శక్తి” అవసరం. కొంతమంది బలహీనపర్చే అనారోగ్య అస్వస్థతలతో బాధపడుతుండవచ్చు, ఇతరులు వృద్ధాప్యం మూలంగా వచ్చే కష్టాలతోనో లేదా జీవిత భాగస్వామిని పోగొట్టుకునో బాధపడుతుండవచ్చు. (కీర్తన 41:3) మరితరులు అవిశ్వాసియైన జత నుండి వ్యతిరేకతను సహిస్తుండవచ్చు. తల్లిదండ్రులు, ప్రాముఖ్యంగా ఒంటరి తల్లి/తండ్రి, కుటుంబాన్ని పోషిస్తూ పూర్తికాలం ఉద్యోగం చేయడం చాలా కష్టతరమైన బాధ్యతగా భావిస్తుండవచ్చు. తోటివారి ఒత్తిడిని ఎదిరించి, మాదకద్రవ్యాలనూ అనైతికతనూ కాదనడానికి యౌవనస్థులైన క్రైస్తవులకు బలం కావాలి. అలాంటి సవాళ్లను ఎదిరించేందుకు కావలసిన “బలాధిక్యము” ఇవ్వమని యెహోవాను వేడుకునేందుకు ఎవరూ వెనుకాడకూడదు.—2 కొరింథీయులు 4:7.

“సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు”

12. క్రైస్తవ పరిచర్యలో యెహోవా మనల్ని ఎలా బలపరుస్తాడు?

12 అంతేగాక, యెహోవా తన సేవకులు తమ పరిచర్యను కొనసాగించేందుకు వారికి శక్తినిస్తాడు. యెషయా ప్రవచనంలో మనమిలా చదువుతాము: “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. . . . యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు.” (యెషయా 40:29-31) తన పరిచర్యను తుదముట్టించేందుకు అపొస్తలుడైన పౌలు వ్యక్తిగతంగా శక్తిని పొందాడు. తత్ఫలితంగా, ఆయన పరిచర్య ఎంతో ప్రభావవంతంగా ఉంది. థెస్సలొనీకలోని క్రైస్తవులకు ఆయనిలా వ్రాశాడు: “మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను . . . మీయొద్దకు వచ్చియున్న[ది].” (1 థెస్సలొనీకయులు 1:4) ఆయన ప్రకటనాపనికీ, బోధకూ, ఆయన చెప్పేది వినేవారి జీవితాల్లో గొప్ప మార్పును తీసుకువచ్చే శక్తి ఉంది.

13. వ్యతిరేకత ఉన్నప్పటికీ కొనసాగేందుకు యిర్మీయాను ఏది బలపర్చింది?

13 ఏ ప్రతిస్పందనా లేకపోయినా మనం ఎన్నో సంవత్సరాలపాటు పదే పదే ప్రకటించిన మన పరిచర్య ప్రాంతంలో ఉదాసీనతను ఎదుర్కున్నప్పుడు మనం నిరుత్సాహపడవచ్చు. యిర్మీయా కూడా తాను ఎదుర్కున్న వ్యతిరేకతను, అపహాస్యాన్ని, ఉదాసీనతను బట్టి నిరుత్సాహపడ్డాడు. “[దేవుని] పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను,” అని తనకు తాను చెప్పుకున్నాడు. కానీ ఆయన నిశ్శబ్దంగా ఉండలేకపోయాడు. ఆయన సందేశం “అగ్నివలె మండుచు [ఆయన] యెముకలలోనే మూయబడి యున్నట్లున్నది.” (యిర్మీయా 20:9) అంతటి దురవస్థ సమయంలో ఆయనకు ఏది నూతన శక్తినిచ్చింది? “పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు” అని యిర్మీయా చెప్తున్నాడు. (యిర్మీయా 20:11) ఆయన సందేశాన్ని గూర్చిన, దేవుడు ఆయనకిచ్చిన నియామకాన్ని గూర్చిన ప్రాముఖ్యత పట్ల యిర్మీయాకున్న మెప్పుదల యెహోవా ఇచ్చే ప్రోత్సాహానికి ఆయన స్పందించేలా చేసింది.

గాయపర్చే శక్తి, స్వస్థపర్చే శక్తి

14. (ఎ) నాలుక ఎంత శక్తివంతమైన ఉపకరణం? (బి) నాలుక కల్గించగల హానిని చూపించడానికి ఉదాహరణలను ఇవ్వండి.

14 మనకున్న శక్తి అంతా సూటిగా దేవుని నుండి వచ్చినదే కాదు. ఉదాహరణకు, మన నాలుకకు గాయపర్చే శక్తి ఉంది, అలాగే స్వస్థపర్చే శక్తీ ఉంది. “జీవమరణములు నాలుక వశము” అని సొలొమోను హెచ్చరించాడు. (సామెతలు 18:21) హవ్వతో సాతాను జరిపిన స్వల్ప సంభాషణా ఫలితాలు, మాటల ద్వారా ఎంత విధ్వంసం జరుగవచ్చో చూపిస్తున్నాయి. మనం కూడా నాలుకతో ఎంతో హాని చేయవచ్చు. ఒక యౌవనస్థురాలి బరువును గురించి అవహేళనగా చేసే వ్యాఖ్యానం ఆమె తన బరువును గూర్చి విపరీతంగా చింతిస్తుండేలా చేయవచ్చు. ఒక అపనిందను అనాలోచితంగా పునరుచ్ఛరించడం జీవితాంత స్నేహాన్ని కూలదోయవచ్చు. అవును, నాలుకను అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఉంది.

15. ప్రోత్సహించడానికీ, స్వస్థపర్చడానికీ మనం మన నాలుకను ఎలా ఉపయోగించగలము?

15 అయితే, నాలుక ప్రోత్సహించగలదు, అలాగే కూలద్రోయనూగలదు. బైబిలు సామెత ఇలా చెప్తుంది: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” (సామెతలు 12:18) జ్ఞానవంతులైన క్రైస్తవులు దుఃఖితులను, బాధితులను ఓదార్చడానికి నాలుకకున్న శక్తిని ఉపయోగిస్తారు. హానికరమైన తోటివారి ఒత్తిడినెదుర్కునేందుకు పోరాడుతున్న యౌవనస్థులను సానుభూతి వచనాలు ప్రోత్సహించగలవు. ఆలోచనగల నాలుక, వృద్ధ సహోదర సహోదరీలు ఇప్పటికీ అవసరమైనవారేననీ, ఇంకా ప్రేమింపబడుతున్నారనీ వారికి హామీ ఇవ్వగలదు. దయగల మాటలు రోగులకు ఉత్సాహాన్నివ్వగలవు. అన్నిటికన్నా ఎక్కువగా, శక్తివంతమైన రాజ్య సందేశాన్ని దాన్ని వినేవారందరితో పంచుకునేందుకు మన నాలుకను ఉపయోగించవచ్చు. మనం హృదయపూర్వకంగా చేస్తే, దేవుని వాక్యాన్ని ప్రకటించడమన్నది మన శక్తికి మించిన పనేమీ కాదు. బైబిలు ఇలా చెప్తుంది: “మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.”—సామెతలు 3:27.

అధికారాన్ని సరైన విధంగా ఉపయోగించడం

16, 17. పెద్దలు, తల్లిదండ్రులు, భర్తలు, భార్యలు తమకు దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించేటప్పుడు యెహోవాను ఎలా అనుకరించగలరు?

16 యెహోవా సర్వశక్తిమంతుడే అయినప్పటికీ, ఆయన సంఘాన్ని ప్రేమతో పరిపాలిస్తున్నాడు. (1 యోహాను 4:8) ఆయనను అనుకరిస్తూ క్రైస్తవ పైవిచారణకర్తలు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రేమపూర్వకంగా ఉపయోగిస్తూ దేవుని మంద గురించి శ్రద్ధ తీసుకుంటారు. నిజమే, పైవిచారణకర్తలు కొన్నిసార్లు ‘ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి,’ కానీ అదంతా కూడా ‘సంపూర్ణమైన దీర్ఘశాంతముతోనూ, ఉపదేశిస్తూ’ చేయాలి. (2 తిమోతి 4:2) “బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి” అని అపొస్తలుడైన పేతురు, సంఘంలో అధికారం ఉన్న వారికి వ్రాసిన మాటలను పెద్దలు ఎడతెగక ధ్యానిస్తారు.—1 పేతురు 5:2, 3; 1 థెస్సలొనీకయులు 2:7, 8.

17 తల్లిదండ్రులకు, భర్తలకు కూడా యెహోవా ఇచ్చిన అధికారం ఉంది, దాన్ని మద్దతునిచ్చేందుకు, పోషించేందుకు, ప్రేమించేందుకు ఉపయోగించాలి. (ఎఫెసీయులు 5:22, 28-30; 6:4) అధికారాన్ని ప్రేమపూర్వకమైన విధంగానే ఎంతో ప్రభావవంతంగా ఉపయోగించవచ్చని యేసు మాదిరి చూపిస్తుంది. క్రమశిక్షణ సమతూకంగానూ, సంగతంగానూ ఉన్నప్పుడు పిల్లలు నిరుత్సాహపడరు. (కొలొస్సయులు 3:21) క్రైస్తవ భర్తలు తమ శిరస్సత్వాన్ని ప్రేమపూర్వకంగా ఉపయోగించినప్పుడు, భార్యలు దేవుడు తమకు నియమించిన పరిధిని దాటిపోయి పెత్తనం చెలాయించే బదులు లేక తమ పట్టు సాధించుకునే బదులు తమ భర్తల శిరస్సత్వాన్ని ప్రగాఢంగా గౌరవించినప్పుడే వివాహ సంబంధాలు బలపర్చబడతాయి.—ఎఫెసీయులు 5:28, 33; 1 పేతురు 3:7.

18. (ఎ) మన కోపాన్ని అదుపు చేసుకునే విషయంలో మనం యెహోవా మాదిరిని ఎలా అనుకరించాలి? (బి) అధికారంలో ఉన్న వారు తమ స్వాధీనంలో ఉన్న వారిలో ఏమి పెంపొందింపజేయడానికి ప్రయత్నించాలి?

18 కుటుంబంలోనూ, సంఘంలోనూ అధికారం గలవాళ్లు తమ ఆగ్రహాన్ని అదుపు చేసుకునే విషయంలో ప్రాముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే, ఆగ్రహం ప్రేమకంటే ఎక్కువగా భయాన్ని పెంపొందింపజేస్తుంది. ప్రవక్తయైన నహూము ఇలా చెప్పాడు: “యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలముగలవాడు.” (నహూము 1:3; కొలొస్సయులు 3:19) మన కోపాన్ని అదుపు చేసుకోగల్గడం మన బలాన్ని చూపిస్తుంది, దాన్ని వెళ్లగ్రక్కడం మన బలహీనతను చూపిస్తుంది. (సామెతలు 16:32) కుటుంబంలోనూ, సంఘంలోనూ ప్రేమను పెంపొందింపజేయడమే ధ్యేయం—యెహోవా పట్ల ప్రేమ, ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, సరైన సూత్రాలపట్ల ప్రేమ. ప్రేమ ఐక్యతకు అనుబంధమైనది, అది మంచి చేయడానికి బలమైన ప్రేరణ.—1 కొరింథీయులు 13:8, 13; కొలొస్సయులు 3:14.

19. యెహోవా ఏ ఓదార్పుకరమైన హామీని ఇస్తున్నాడు, మనమెలా ప్రతిస్పందించాలి?

19 యెహోవాను తెలుసుకోవడమంటే ఆయన శక్తిని గుర్తించడమే. యెషయా ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు.” (యెషయా 40:28) యెహోవాకున్న శక్తి హరించిపోనిది. మనం మనపై కాక ఆయనపై ఆధారపడితే, ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన మనకిలా హామీ ఇస్తున్నాడు: “నీకు తోడైయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము. నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.” (యెషయా 41:9-10) ఆయన ప్రేమపూర్వక శ్రద్ధకు మనమెలా ప్రతిస్పందించాలి? యెహోవా మనకిచ్చే ఏ శక్తినైనా, యేసు వలే, మనం ఎల్లప్పుడూ సహాయం చేయడానికీ, ప్రోత్సహించడానికీ ఉపయోగిద్దాము. మన నాలుక హాని చేసే బదులు స్వస్థపర్చేలా దాన్ని మనం అదుపులో ఉంచుకుందాము. మనం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా మెలకువగా ఉందాము, విశ్వాసంలో దృఢంగా ఉందాము, మన మహా సృష్టికర్తయైన యెహోవా దేవుని శక్తియందు బలవంతులమౌదాము.—1 కొరింథీయులు 16:13.

[అధస్సూచీలు]

^ పేరా 9 శతాబ్దాల క్రితం ఆలయంలో ఉంచబడిన మోషే ధర్మశాస్త్రపు అసలు ప్రతిని యూదులు కనుగొన్నారని స్పష్టమౌతుంది.

మీరు వివరించగలరా?

• యెహోవా తన శక్తిని ఎలా ఉపయోగిస్తాడు?

• మనం యెహోవా శక్తిని ఏయే విధాలుగా పొందగలము?

• నాలుకకున్న శక్తిని ఎలా ఉపయోగించాలి?

• దేవుడిచ్చే అధికారం ఎలా ఒక ఆశీర్వాదం కాగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

ఇతరులకు సహాయం చేయడానికి యేసు యెహోవా శక్తిని ఉపయోగించాడు

[17వ పేజీలోని చిత్రాలు]

మనం హృదయపూర్వకంగా చేస్తే, దేవుని వాక్యాన్ని ప్రకటించడమన్నది మన శక్తికి మించిన పనేమీ కాదు