కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ఆత్మ ఈనాడు ఎలా పనిచేస్తుంది?

దేవుని ఆత్మ ఈనాడు ఎలా పనిచేస్తుంది?

దేవుని ఆత్మ ఈనాడు ఎలా పనిచేస్తుంది?

ఒక భిక్షగాడు పుట్టుకతోనే అవిటివాడు. ప్రతిరోజూ, శృంగారం అనే దేవాలయపు ద్వారము దగ్గర కూర్చుని ఆలయానికి వచ్చేవారిని ధర్మం చేయమని అడిగేవాడు. అయితే, ఒకసారి అతడు కొన్ని చిన్న నాణెములకన్నా ఎంతో మిన్నయైన బహుమానాన్ని పొందాడు. అది ఆయన స్వస్థత పొందడమే !—అపొస్తలుల కార్యములు 3:2-8.

‘వాని పాదములును చీలమండలును బలము పొందే’లాగున ‘వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తి’ స్వస్థపరచింది అపొస్తలులైన పేతురు, యోహానులే అయినప్పటికీ, స్వస్థపర్చిన ఘనతను వాళ్లు తీసుకోలేదు. ఎందుకని? “ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంతశక్తిచేతనైనను భక్తిచేతనైనను నడవను వీరికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?” అని పేతురు అన్నాడు. వాస్తవానికి, తమ శక్తిచేత కాదుగానీ, దేవుని పరిశుద్ధాత్మ చేతనే అలాంటి కార్యాన్ని చేయగలమని పేతురు యోహానులకు తెలుసు.—అపొస్తలుల కార్యములు 3:7-16; 4:29-31.

లేతప్రాయంలో ఉన్న క్రైస్తవ సంఘానికి దైవిక మద్దతు ఉందన్న దాన్ని చూపించడానికే అప్పట్లో, అలాంటి ‘అద్భుతములు’ చేసే వరాలు ఇవ్వబడ్డాయి. (హెబ్రీయులు 2:4) అవి వాటి ఉద్దేశ్యాన్ని నెరవేర్చిన తర్వాత, “నిరర్థకమ”వుతాయని అపొస్తలుడైన పౌలు అన్నాడు. * (1 కొరింథీయులు 13:8) కనుకనే, నిజమైన క్రైస్తవ సంఘంలో దైవిక స్వస్థతలు, ప్రవచన సందేశాలు లేదా దయ్యాలను వెళ్ళగొట్టడం లాంటివి మనకు ఇప్పుడు కనిపించవు.

దానర్థం, దేవుని పరిశుద్ధాత్మ, ఇక పని చేయడం లేదనా? అలా కానే కాదు. పరిశుద్ధాత్మ మొదటి శతాబ్దంలో ఏయే విధాల్లో పని చేసిందో, ఇప్పుడు, మన ఈ కాలంలో మరే విధాల్లో పనిచేస్తోందో చూద్దాం.

“సత్యస్వరూపియైన ఆత్మ”

పరిశుద్ధాత్మ యొక్క ఒక పని ఏమిటంటే, విషయాలను తెలియజేయడం, ఆధ్యాత్మికంగా జ్ఞానోదయాన్ని కలిగించడం, సత్యాలను బయలుపరచడం. “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయతే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును” అని యేసు తన మరణానికి కొద్ది ముందు తన శిష్యులకు తెలియజేశాడు.—యోహాను 16:12, 13.

సా.శ. 33వ సంవత్సరం పెంతెకొస్తు దినమున, యెరూషలేములో పై అంతస్థులో కూడుకొని ఉన్న 120 మంది శిష్యులపై “సత్యస్వరూపియైన ఆత్మ” కుమ్మరించబడింది. ఆ విధంగా వాళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు. (అపొస్తలుల కార్యములు 2:1-4) ఆ సాంవత్సరిక పండుగకు హాజరైనవారిలో అపొస్తలుడైన పేతురు కూడా ఉన్నాడు. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై, “లేచి నిలిచి,” యేసును గూర్చిన కొన్ని సత్యాలను విశదంగా స్పష్టంగా చెప్పాడు. ఉదాహరణకు, “నజరేయుడగు యేసు” “దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి” ఉన్నాడని ఆయన చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 2:14, 22, 33) “మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలె”నని తన మాటలు వింటున్న యూదులకు ధైర్యంగా ప్రకటించేందుకు పరిశుద్ధాత్మ ఆయనను ప్రేరేపించింది. (అపొస్తలుల కార్యములు 2:36) పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు ఆ సందేశాన్ని ప్రకటించినందువల్ల, దాదాపు మూడు వేల మంది, “వాక్యము అంగీకరించి” బాప్తిస్మము పొందారు. ఈ విధంగా, వారిని సత్యంవైపుకు నడిపించేందుకు పరిశుద్ధాత్మ సహాయపడింది.—అపొస్తలుల కార్యములు 2:37-41.

దేవుని పరిశుద్ధాత్మ ఒక బోధకుడుగా, గుర్తు చేసేవాడిగా కూడా పనిచేసింది. “ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును” అని యేసు అన్నాడు.—యోహాను 14:26.

పరిశుద్ధాత్మ ఒక బోధకుడుగా ఎలా పని చేసింది? యేసు శిష్యులు మునుపు యేసు చెప్పగా విన్నప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన విషయాలు అర్థమయ్యేలా దేవుని పరిశుద్ధాత్మ వారి మనస్సులను తెరిచింది. ఉదాహరణకు, రోమీయుడైన యూదయ అధిపతియైన పొంతి పిలాతుతో, “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు” అని యేసు తన విచారణ సమయంలో చెప్పాడన్న విషయం అపొస్తలులకు తెలుసు. అయినప్పటికీ, ఆ తర్వాత నలభై రోజులు గడిచాక, యేసు పరలోకానికి ఆరోహణమయ్యే సమయంలో కూడా, యేసు ఈ భూమి మీదే తన రాజ్యాన్ని స్థాపిస్తాడన్న తప్పుడు అభిప్రాయంతో యేసు శిష్యులు ఉన్నారు. (యోహాను 18:36; అపొస్తలుల కార్యములు 1:6) సా.శ. 33వ సంవత్సరం, పెంతెకొస్తు దినమున దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరించబడే వరకూ కూడా, యేసు మాటలను అపొస్తలులు పూర్తిగా గ్రహించలేకపోయారు.

యేసు చేసిన వివిధ బోధలను వారికి గుర్తు చేయడం ద్వారా పరిశుద్ధాత్మ గుర్తుచేసేదిగా కూడా పనిచేసింది. ఉదాహరణకు, క్రీస్తు మరణానికీ, పునరుత్థానానికీ ఉన్న అర్థాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో, వాళ్ళు క్రొత్తగా అర్థం చేసుకున్నారు. (మత్తయి 16:21; యోహాను 12:16) యేసు బోధలను గుర్తు చేసుకోవడం, అపొస్తలులు తమ స్థానాన్ని గురించి రాజుల ఎదుటా అధికారుల ఎదుటా మత నాయకుల ఎదుటా ధైర్యంగా మాట్లాడగల్గేలా చేసింది.—మార్కు 13:9-11; అపొస్తలుల కార్యములు 4:5-20.

అంతేకాక, తొలి క్రైస్తవులు పరిచర్యలో ఫలవంతమైన ప్రాంతానికి వెళ్ళడానికి కూడా దేవుని పరిశుద్ధాత్మ సహాయం చేసింది. (అపొస్తలుల కార్యములు 16:6-10) సమస్త మానవాళి యొక్క ప్రయోజనార్థం, దేవుని వాక్యమైన బైబిలులోని కొంత భాగాన్ని వ్రాయడానికి కూడా తొలిక్రైస్తవులను పరిశుద్ధాత్మ కదిలించింది. (2 తిమోతి 3:16) పరిశుద్ధాత్మ మొదటి శతాబ్దంలో వివిధ విధాల్లో పనిచేసింది. కేవలం అద్భుతాలను చేయడానికే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు.

మన కాలంలో పరిశుద్ధాత్మ

పరిశుద్ధాత్మ, నిజ క్రైస్తవుల పక్షంగా కూడా నేడు పనిచేస్తోంది. 19వ శతాబ్దపు రెండవ సగభాగంలో, అమెరికాలోని, పెన్సిల్వేనియాలోని అలెగెనీలో బైబిలు విద్యార్థుల గుంపుపై అది స్పష్టంగా కనిపించింది. బైబిలును ఎంతో హృదయపూర్వకంగా చదివే వీరు, “సత్యము”ను తెలుసుకోవడానికి పరితపించిపోయారు.—యోహాను 8:32; 16:13.

ఈ గుంపులోని ఒక సభ్యుడైన చార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌, లేఖనాలు చెప్పే సత్యం కోసమైన తన దాహాన్ని గురించి చెబుతూ, “లేఖనాలను సరైనవిధంగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలనీ, దానికి ఆటంకంగా నిలవగల ఎటువంటి అభిప్రాయాన్నైనా నా హృదయంలో నుండీ మనస్సులో నుండీ నేను తొలగించుకోగల్గాలనీ . . . ప్రార్థించాను” అని వ్రాశాడు. వినయంగా చేసిన ఈ ప్రార్థనను దేవుడు ఆలకించాడు.

రస్సెల్‌, ఆయన సహచరులూ, లేఖనాలను శ్రద్ధగా పరిశోధించగా అనేక విషయాలు స్పష్టమయ్యాయి. “వివిధ తెగలూ పక్షాలూ అనేక శతాబ్దాలుగా, బైబిలు సిద్ధాంతాలను విభజించుకుని, వాటికి మానవ కల్పితాలను, తప్పుడు తలంపులను చేర్చాయి అని మేము కనుగొన్నాం. వాళ్ళు ఆ విధంగా చేసినందువల్ల సత్యాన్ని ప్రక్కకు తోసివేయడం జరిగింది” అని రస్సెల్‌ వివరించాడు. ఆ విధంగా, శతాబ్దాలుగా క్రైస్తవమత సామ్రాజ్యంలో చొచ్చుకుపోయిన అన్యమత బోధల మూలంగా లేఖన సత్యాలు మరుగు చేయబడ్డాయి. కానీ, సత్యాన్ని తెలుసుకోవాలనీ, దాన్ని ప్రకటించాలనీ రస్సెల్‌ నిర్ణయించుకున్నాడు.

జాయన్స్‌ వాచ్‌ టవర్‌ అండ్‌ హెరాల్డ్‌ ఆఫ్‌ క్రైస్ట్స్‌ ప్రెజెన్స్‌ అనే పత్రిక ద్వారా, దేవుడ్ని తప్పుగా చిత్రీకరించే అబద్ధ మత బోధలను రస్సెల్‌, ఆయన సహచరులు ధైర్యంగా బట్టబయలు చేశారు. ప్రజాదరణ పొందిన మతాభిప్రాయానికి భిన్నంగా, భూమి మీది సకల జీవులు మర్త్యమైనవనీ, మరణించినప్పుడు మనం మట్టిలోకే చేరతామనీ, యెహోవాయే ఏక సత్య దేవుడు అనీ, ఆయన త్రిత్వంలో భాగం కాదనీ వాళ్ళు గ్రహించారు.

మీరు ఊహిస్తున్నట్లే, అబద్ధ బోధలను అలా బయటపెట్టడం వల్ల క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతనాయకులకు కోపం వచ్చింది. పలుకుబడిగల తమ హోదాను నిలబెట్టుకునే తాపత్రయంతో, చాలా మంది క్యాథలిక్‌, ప్రొటెస్టెంట్‌ నాయకులు, రస్సెల్‌ను అవమానపరచాలనే లక్ష్యంతో ప్రచార కార్యక్రమాన్ని సంస్థీకరించారు. కానీ, ఆయనా, ఆయన సహచరులూ అంతటితో విరమించుకోలేదు. వాళ్ళు మార్గదర్శనం కోసం నమ్మకంగా దేవుని ఆత్మమీద ఆధారపడ్డారు. “మన విమోచకుడూ, మధ్యవర్తీ, శిరస్సూ అయిన యేసు పక్షంగా పంపించబడిన పరలోక తండ్రి యొక్క పరిశుద్ధాత్మ మన నిర్దేశకుడుగా ఉంటుంది అని మన ప్రభువు హామీ ఇచ్చాడు” అని రస్సెల్‌ అన్నాడు. పరిశుద్ధాత్మ నిజంగానే వారికి కావలసిన నిర్దేశాలనిచ్చింది ! ఈ యథార్థ బైబిలు విద్యార్థులు, బైబిలులో ఉన్న స్వచ్ఛమైన సత్యపు నీటిని త్రాగుతూ, వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉద్ఘాటించడంలో కొనసాగారు.—ప్రకటన 22:17.

ఆధునిక దిన యెహోవాసాక్షుల సంస్థ, ఒక శతాబ్దానికి పైగా, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులకు అప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ ఉంది. యెహోవాసాక్షులు, దేవుని ఆత్మ క్రమక్రమంగా తమ ఆధ్యాత్మిక దృష్టిని మరింత తేటతెల్లం చేస్తుండగా, ప్రస్తుత అవగాహనకు అనుగుణ్యంగా ఉండేందుకు సిద్ధమనస్సుతో కావలసిన సవరింపులను చేసుకుంటున్నారు.—సామెతలు 4:18.

‘మీరు నాకు సాక్షులైయుందురు’

యేసు, “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు . . . భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురని” తన శిష్యులకు చెప్పినప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ మరే విధాల్లో కనిపిస్తుందో తెలియజేశాడు. (అపొస్తలుల కార్యములు 1:8) దైవనియుక్త పనిని కొనసాగించేందుకు, తన శిష్యులకు “శక్తి”నీ “పరిశుద్ధాత్మ”నూ ఇస్తానని యేసు చేసిన వాగ్దానం నేటికీ వర్తిస్తుంది.

యెహోవాసాక్షులు ఒక గుంపుగా, తమ ప్రకటనా పనికి పేరుగాంచారు. (బాక్స్‌ చూడండి.) వాస్తవానికి, వారు 230 కన్నా ఎక్కువ దేశాల్లోను, దీవుల్లోను సత్యపు సందేశాన్ని గురించి మాట్లాడుతున్నారు. తమ ప్రాణాన్ని కూడా పణంగా పెడుతూ, యుద్ధ బాధిత ప్రాంతాలతో సహా మీరు ఊహించగల అన్ని రకాల పరిస్థితుల్లోనూ, వారు దేవుని రాజ్యానికి మద్దతునివ్వడంలో తమ స్వరాలను ధైర్యంగా వినిపిస్తున్నారు. పరిచర్య మీద వాళ్ళకున్న ఆసక్తి, పరిశుద్ధాత్మ నేడు కూడా పనిచేస్తుందనే దానికి శక్తిమంతమైన రుజువుగా ఉంది. యెహోవా దేవుడు వాళ్ళ ప్రయత్నాలను ఆశీర్వదిస్తున్నాడన్నది స్పష్టం.

ఉదాహరణకు, గత సంవత్సరం, దేవుని రాజ్య సువార్తను ప్రకటించేందుకు వంద కోట్ల కన్నా ఎక్కువ గంటలు వెచ్చించబడ్డాయి. దాని ఫలితం? దాదాపు 3,23,439 మంది ప్రజలు నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా దేవునికి తమను తాము సమర్పించుకున్నామని చూపించారు. అంతేకాక, క్రొత్తగా ఆసక్తిగలవారితో వారపు గృహ బైబిలు పఠనాలు నిర్వహించబడుతున్నాయి. అలా నిర్వహించబడుతున్న గృహ బైబిలు పఠనాల సంఖ్య 44,33,884. మొత్తమ్మీద, 2,46,07,741 పుస్తకాలనూ, 63,11,62,309 పత్రికలనూ, 6,34,95,728 బ్రోషూర్లనూ చిన్నపుస్తకాలనూ ప్రజలకు అందించారు. దేవుని పరిశుద్ధాత్మ క్రియాశీలంగా ఉందనేందుకు ఎంతటి రుజువు !

దేవుని ఆత్మా, మీరూ

ఒక వ్యక్తి సువార్తకు అనుకూలంగా ప్రతిస్పందించి, దేవుని ప్రమాణాలకు అనుగుణ్యంగా తన జీవితాన్ని మలచుకుని, విమోచన క్రయధన ఏర్పాటులో విశ్వాసముంచినప్పుడు, దేవుని ఎదుట నిర్మలమైన స్థానాన్ని కలిగి ఉండే అవకాశం తెరువబడుతుంది. అలాంటి వాళ్ళతో అపొస్తలుడైన పౌలు, “[దేవుడు] మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహిం[చాడు]” అని అంటున్నాడు.—1 థెస్సలొనీకయులు 4:7, 8; 1 కొరింథీయులు 6:9-11.

దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉండడం వల్ల అనేక ఆశీర్వాదాలు వస్తాయి. ఎలాంటి ఆశీర్వాదాలు? “ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” అని దేవుని వాక్యమైన బైబిలు చెబుతుంది. (గలతీయులు 5:22, 23) కనుక, దేవుని పరిశుద్ధాత్మ మంచి చేయడానికి చాలా శక్తివంతమైన ప్రేరణగా ఉండి, దైవిక గుణాలను కనబరచేందుకు సహాయపడుతుంది.

అంతేకాక, మీరు బైబిలును చదివి, దాని నుండి మీరు నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెడితే, మీరు వివేకంలోను, జ్ఞానంలోను, మంచి అవగాహనలోను, విషయాలను గురించి సరైన నిర్ధారణకు రావడంలోను, ఆలోచించే సామర్థ్యంలోను ఎదగడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయపడుతుంది. సొలొమోను మానవులను కాక దేవుడ్నే ప్రీతిపర్చాలని ప్రయత్నం చేశాడు కనుక, “దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను.” (1 రాజులు 4:29) యెహోవా దేవుడు సొలొమోనుకు పరిశుద్ధాత్మను ఇచ్చాడంటే, నేడు కూడా ఆయనను ప్రీతిపరచాలని ప్రయత్నించేవారికి తన పరిశుద్ధాత్మను ఇవ్వకుండా ఉండడు.

క్రైస్తవులు సాతానుతోను దయ్యములతోను ఈ దుష్ట విధానముతోను పతనమైన తమ శరీరపు పాపభరిత వైఖరులతోను పోరాడేందుకు కూడా దేవుని పరిశుద్ధాత్మ సహాయపడుతుంది. అదెలా సాధ్యం? “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని అపొస్తలుడైన పౌలు జవాబిస్తున్నాడు. (ఫిలిప్పీయులు 4:13) పరిశుద్ధాత్మ, పరీక్షలనూ ప్రలోభాలనూ తీసివేయకపోవచ్చు; అయితే మీరు వాటిని ఓర్చుకోవడానికి సహాయపడగలదు. మన దేవుని పరిశుద్ధాత్మపై ఆధారపడడం ద్వారా, ఏ సమస్యనైనా విపత్తునైనా ఎదుర్కొనేందుకు, “బలాధిక్యమును” అంటే అసాధారణ బలమును పొందగలం.—2 కొరింథీయులు 4:7; 1 కొరింథీయులు 10:13.

మీరు ఈ రుజువులనన్నీ లెక్కలోకి తీసుకుంటే, నేడు కూడా దేవుని పరిశుద్ధాత్మ పని చేస్తుందనడానికి సందేహమే ఉండదు. యెహోవా దేవుని గొప్ప ఉద్దేశాలను గురించి సాక్ష్యమిచ్చేందుకు ఆయన పరిశుద్ధాత్మ ఆయన సేవకులకు శక్తినిస్తుంది. అది ఆధ్యాత్మిక వెలుగులను విరజిమ్మడంలో కొనసాగుతుంది, మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, మన సృష్టికర్త ఎడల నమ్మకంగా కొనసాగడానికి మనకు సహాయపడుతుంది. నేడు నమ్మకస్థులైన తన దాసులకు పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమై ఉండాలి !

[అధస్సూచీలు]

^ పేరా 4 కావలికోట ఆగస్టు 15, 1971 ఆంగ్ల సంచిక 501-5 పేజీల్లో ఉన్న “అద్భుతాలను చేసే ఆత్మ వరాలు ఎందుకు ఆగిపోయాయి?” అన్న శీర్షికను చూడండి.

[10వ పేజీలోని బాక్సు]

యెహోవాసాక్షులను గురించి ఇతరులు అంటున్నది

“ఇతర చర్చీలు ప్రజలను చర్చిలోకి తిరిగి ఆకర్షించేందుకు సలహాదారుల్ని డబ్బిచ్చి పిలిపించుకుంటున్నాయి, సలింగ సంపర్కం, అబార్షన్‌ మొదలైన వివాద విషయాలను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే, మారుతున్న లోకంతో రాజీపడే ప్రయత్నం సాక్షులు ఏ మాత్రం చేయడంలేదు. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం సువార్తతో భూమిని నింపుతున్నారు.”—అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ కౌంటీ నగరంలోని ఆరెంజ్‌ కౌంటీ రిజిస్టర్‌ అనే పత్రిక.

“విశ్వాసాన్ని అంతటా వ్యాపింపజేసే విషయంలో, . . . యెహోవాసాక్షులు చూపించేంత ఉత్సాహాన్ని మరే మతశాఖలూ చూపించడం లేదు.”—అమెరికాలోని, ఇండియానాలోని, కొలంబస్‌లోని ద రిపబ్లిక్‌.

“బైబిలు సూత్రాలను అన్వయించుకుంటూ, సువార్తతో ఇంటింటా వెళ్ళేది వాళ్ళు మాత్రమే.”—పోలండ్‌లోని జకీ లిటరాస్క్య.

“యెహోవాసాక్షులు మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ప్రకటనా పని చేస్తూ, యెహోవా సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నారు.”—అమెరికాలోని పెన్సిల్వేనియాలోని టమాక్వాలోని న్యూస్‌-అబ్జర్వర్‌.

[9వ పేజీలోని చిత్రాలు]

దేవుని పరిశుద్ధాత్మ, మనం ఆధ్యాత్మికంగా జ్ఞానోదయం పొందేందుకు సహాయపడుతుంది,

. . . మంచి క్రైస్తవ లక్షణాలను పెంపొందింపజేస్తుంది,

. . . ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిలో మనకు మద్దతునిస్తుంది