కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంత్రవిద్య గురించి మీకేమి తెలిసి ఉండాలి

మంత్రవిద్య గురించి మీకేమి తెలిసి ఉండాలి

మంత్రవిద్య గురించి మీకేమి తెలిసి ఉండాలి

ఆధునిక కాలాల్లోని మంత్రవిద్యను నిర్వచించడం చాలా కష్టం. ఎందుకంటే నేడు మంత్ర తంత్రాలను అభ్యసించేవారు వివిధ రకాలుగా ఉంటారు. వాళ్ళ నమ్మకాలు భిన్నంగా ఉంటాయి. వాళ్ళ నమ్మకాలను ఏకీకరించేందుకు, ఒక వ్యక్తిని గానీ, ఒక సిద్ధాంతాన్నీ లేదా ఒక పవిత్ర పుస్తకాన్ని గానీ ఆధికారికంగా తీసుకోరు. వాళ్ళ పద్ధతుల్లోను, సంస్థీకరణల్లోను, ఆచారాల్లోను, ఏ దేవుళ్ళను పూజించాలి అనే దాన్ని గురించిన అభిప్రాయంలోను భిన్నంగా ఉంటారు. “ఈ అతీంద్రియ శక్తుల లోకం అంగడి స్థలంలాంటిది. వ్యక్తులు ‘తమకిష్టమైన’ తలంపులను ‘ఎంపిక చేసుకోవచ్చు’” అని ఒకరు అంటున్నారు. “క్రొత్తగా వివిధ దేవుళ్ళను ఆరాధిస్తున్న మాంత్రికులకు ఏ విషయంలోను ఏకాభిప్రాయం లేదు” అని మరొకరు అంటున్నారు.

అనేకులకు ఈ వైరుద్ధ్యాలు ఒక సమస్యే కాదు. “ఏ సమాచారాలైన పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తే, మీరు వాటిని పరిశీలించి, దేన్ని అనుసరించాలో మీరే ఎంపిక చేసుకోండి. మీ తర్కబుద్ధికి ఎలా తడితే అలా చేయండి. మరో మాటలో చెప్పాలంటే, ఇప్పటికే ప్రాబల్యంలో ఉన్న మంత్ర విధుల నుండి లేదా మంత్ర విధులను గురించిన పుస్తకాల నుండి ఏది మంచిది అనిపిస్తే దాన్ని నిస్సంకోచంగా ఎంపిక చేసుకోండి” అని మాంత్రికులయ్యేందుకు ప్రేరణనిచ్చే ఒక గైడ్‌బుక్‌ చెబుతుంది.

సత్యం ఎలా ఉంటుందన్నది తెలిసిన ప్రజలకు పరస్పర విరుద్ధమైన సమాచారం ఒక సమస్యగానే ఉంటుంది. సత్యం అనేది వాస్తవమై ఉంటుంది, నిజమైనదై ఉంటుంది. ఫలానిది సరైనదని ఒక వ్యక్తి కేవలం భావిస్తున్నందువల్లనో లేదా సరైనదై ఉంటుందని ఆశిస్తున్నందువల్లనో, లేదా నమ్ముతున్నందువల్లనో అది సత్యం కాదు. ఉదాహరణకు, ప్రాణంతో ఉన్న కోడిని రెండుగా కోసి, ఆ రెండు ముక్కలను రోగి ఛాతీపై పెడితే న్యుమోనియా నయమౌతుందని కొందరు వైద్యులు ఒకప్పుడు నమ్మేవారు. నిస్సందేహంగా, ఈ చికిత్స తమను బాగు చేస్తుందని చాలా మంది రోగులు నమ్మే ఉంటారు. వాళ్ళ నమ్మకాలూ, ఆశలూ వాస్తవవిరుద్ధంగా ఉన్నాయి. వాళ్ళు అలా నమ్మినంత మాత్రాన న్యుమోనియా నుండి విముక్తులు కాలేకపోయారు. ప్రజలు సత్యాన్ని సృష్టించలేరు గానీ, సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలరు.

ఆధ్యాత్మిక విషయాలను గురించిన సత్యం బైబిలులో ఉందని బైబిలు చెబుతుంది. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, “నీ వాక్యమే సత్యము” అని ప్రార్థనలో తన తండ్రితో అన్నాడు. (యోహాను 17:17) బైబిలులోని “ప్రతిలేఖనము” ‘దైవావేశమువలన కలిగినది’ అని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. (2 తిమోతి 3:16) అయితే మంత్ర తంత్రాలను అభ్యసించే అనేకులు ఈ విషయాన్ని అంగీకరించరు. వాళ్ళు, ప్రేరేపణ కోసం, మార్గదర్శనం కోసం, కల్పిత కథల్లోకి, ప్రాచీన మతాల్లోకి, అంతెందుకు సైన్స్‌ ఫిక్షన్‌లలోకి చూస్తారు. అలాంటప్పుడు, బైబిలు ఏమి చెబుతుందన్న విషయాన్ని కూడా పరిశీలించడం సహేతుకమే కదా? ఎంత కాదన్నా, సార్వత్రికంగా, పవిత్ర గ్రంథంగా ఎంచబడుతున్న పుస్తకమది. ఇప్పటికీ ఉనికిలో ఉన్న అత్యంత పురాతన పుస్తకాల్లో అది ఒకటి. అది 1,600 సంవత్సరాల కాలవ్యవధిలో వ్రాయబడింది. అయినప్పటికీ, ఆ పుస్తకమంతటా కూడా అది చేసే బోధలు ఒకే విధంగా ఉన్నాయి. మంత్రవిద్యను పెంపొందించేవారు ఇటీవల వ్యక్తం చేసిన కొన్ని నమ్మకాలను బైబిలు బోధలతో పోల్చి చూద్దాం.

ఆత్మ సామ్రాజ్యంలో ఎవరు నివసిస్తున్నారు?

ఆత్మ సామ్రాజ్యంలో ఎవరు ఉంటున్నారు? అన్నది ఆధ్యాత్మిక అవగాహన కొరకైన అన్వేషణలో ప్రాథమిక ప్రశ్న. అత్యాధునిక మాంత్రికులు ప్రకృతినీ, అనేక దైవాలనూ ఆరాధిస్తారు, విశ్వసిస్తారు. కొందరు మాతృ దేవతను ఆరాధిస్తారు. ఆమె జీవితంలోని కన్య, తల్లి, వృద్ధ అనే మూడు దశలు జీవితంలోని ప్రాథమిక దశలను సూచిస్తున్నాయని అంటారు. ఆమె ప్రేమికుడు కొమ్ములున్న దేవుడు. మిగతా మాంత్రికులు ఒక దేవుడ్నీ దేవతనూ కలిపి ఆరాధిస్తారు. “ఆ దేవతనూ, దేవుడ్నీ, ప్రకృతిలోని స్త్రీ పురుష శక్తుల ప్రతీకలుగా దృష్టిస్తున్నారు. వారిరువురిలోను ఎవరి ప్రత్యేకతలు వారికే ఉన్నాయి, వాళ్ళిరువురూ కలిసినప్పుడు జీవం పొందికైన తీరులో ఉద్భవిస్తుంది” అని ఒక రచయిత అంటున్నాడు. “మంత్రవిద్యలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన ప్రత్యేకతల్లో ఒకటి ఏమిటంటే, మీకిష్టమైన దేవుళ్ళనూ దేవతలనూ మీరు ఎంపికచేసుకోవచ్చు. . . . మీరు సొంతంగా దైవాలను రూపించుకుని మీకిష్టమైన దేవుడ్ని ఎంచుకుని పూజించే స్వాతంత్ర్యం మీకుంది” అని మరొక రచయిత్రి వ్రాస్తుంది.

ఈ తలంపుల్లో దేనికీ బైబిలు మద్దతునివ్వడంలేదు. ‘అద్వితీయ సత్యదేవుడైన’ యెహోవా గురించి ఇతరులకు బోధించడానికే యేసుక్రీస్తు, తన పరిచర్య అంతటినీ ఉపయోగించాడు. (యోహాను 17:3) “యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు. సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు” అని బైబిలు చెబుతుంది.—1 దినవృత్తాంతములు 16:25.

అపవాది విషయమేమిటి? మంత్రవిద్య అంటే, వెబ్‌స్టర్స్‌ నైన్త్‌ న్యూ కాలేజియేట్‌ డిక్షనరీ ప్రకారం, “అపవాదితో సంబంధాలు పెట్టుకోవడమే.” ఈ నిర్వచనంతో ఏకీభవించే మాంత్రికులను నేడు కనుగొనడం అరుదే. చాలా మంది మాంత్రికులు, అపవాదియైన సాతాను ఉనికిలో ఉన్నాడన్న విషయాన్ని కూడా అంగీకరించరు. “ఉన్నత స్థాయిలోని మాంత్రికురాలు, ఐర్లాండ్‌లోని అత్యంత ప్రముఖమైన మాంత్రిక గుంపుల్లో ఒక దాని నాయకురాలు” అని ది ఐరిష్‌ టైమ్స్‌ అనే పత్రికలో వర్ణించబడిన ఒక యువతి, “అపవాది ఉన్నాడని విశ్వసించడమంటే, క్రైస్తవత్వాన్ని అంగీకరించడమనే. దేవుడు లేని విశ్వంలో అపవాది ఉండలేడు” అని అంటోంది.

అయితే, అపవాది ఉన్నాడనీ, భూమి మీద ఉన్న కష్టాలకూ, సంక్షోభాలకూ అతడే కారణం అనీ బైబిలు రూఢిగా చెబుతుంది. (ప్రకటన 12:12) అపవాది ఉనికిలో ఉన్నాడని చెప్పడమే కాక, మనఃపూర్వకంగా కాకపోయినప్పటికి, అతనికి సేవచేసేయగలమని కూడా యేసు చెప్పాడు. ఉదాహరణకు, మొదటి శతాబ్దంలోని స్వనీతిమంతులైన మత నాయకులు తాము ఒక విధంగా దేవుని కుమారులమని నొక్కిచెప్పారు. తాము దేవుని చిత్తాన్ని చేస్తున్నామనీ నమ్మారు. వాళ్ళు దేవుని చిత్తాన్ని చేసేవారు కాదని యేసుకు తెలుసు. వారి హృదయాల్లో ఏముందో యేసు గ్రహించగల్గేవాడు. “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు” అని ఆయన సూటిగా చెప్పాడు. (యోహాను 8:44) అంతేకాక, అపవాది “సర్వలోకమును మోస పుచ్చుచు”న్నాడు అని బైబిలు పుస్తకమైన ప్రకటన చెబుతుంది.—ప్రకటన 12:9.

ఇంద్రజాలమూ, కనికట్టూ మంచివా?

ఇంద్రజాలానికీ, కనికట్టుకూ అతీంద్రియ శక్తులతో సంబంధముంది. * మాంత్రికులు ఇతరులకు హాని కలిగించడానికే ఇంద్రజాలాన్నీ కనికట్టునూ ఉపయోగిస్తున్నారని పాత కాలానికి చెందినవారూ ఆధునిక కాలానికి చెందినవారూ నమ్ముతారు. ఇతరులకు విపరీతమైన బాధను కలిగించే శక్తీ, వాళ్ళు మరణించేలా చేసే శక్తీ కూడా ఇంద్రజాలానికీ కనికట్టుకూ ఉందని చెప్పుకోబడుతుంది. రోగం, మరణం, పంట నష్టం వంటి అనేక దుర్ఘటనల పరంపరకు కారణం కూడా మాంత్రికులేనని చెప్పుకోబడుతుంది.

నేటి మాంత్రికులు అలాంటి ఆరోపణలను బలంగా ఎదిరిస్తారు. కీడు చేసే మాంత్రికులు అక్కడక్కడ ఉన్నారన్న విషయాన్ని ఒకవైపు ఒప్పుకుంటూ, మేము ఇంద్రజాలాన్నీ కనికట్టునూ సాధారణంగా ప్రయోజనార్థమే ఉపయోగిస్తాము గానీ, కీడుకోసం ఉపయోగించమని చాలా మంది మాంత్రికులు అంటుంటారు. వాటితో కీడు తలపెడితే, దానికి మూడు రెట్లు, తామే అనుభవించవలసి వస్తుంది అని వీకా మతం వాళ్ళు బోధిస్తారు, అలా జరుగుతుంది కనుక, ఇతరులకు చెడు జరిగేలా శపించమని ఆ మతం వాళ్ళు అంటారు. ప్రయోజనకరమైన ఇంద్రజాలంలోను కనికట్టులోను, మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకూ, మీరుంటున్న ఇంటిలో మునుపున్నవారి మూలంగా వచ్చిన దుష్ట శక్తులను తొలగించేందుకూ, మీకు ఇష్టమైన వ్యక్తి మీతో ప్రేమలో పడేందుకూ, స్వస్థత పొందేందుకూ, ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకూ, మీ ఉద్యోగం కోల్పోకుండా ఉండేందుకూ, డబ్బు సంపాదించేందుకూ మంత్రించడం ఇమిడి ఉంది. అంత విస్తృతమైన శక్తులు మంత్రవిద్యకున్నాయని చెప్పబడుతుంది కనుక, అది అంత ప్రజాదరణను పొందడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

ఇంద్రజాలంలో ఫలానిది మంచిది, ఫలానిది చెడ్డది అన్న తేడా ఏమీ బైబిలు చూపడం లేదు. మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో, దేవుడు తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశాడు. “మంత్రయోగములు చేయకూడదు” అని దేవుడు చెప్పాడు. (లేవీయకాండము 19:26) “చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు” అని కూడా మనం చదువుతాం.—ద్వితీయోపదేశకాండము 18:10, 11.

దేవుడు ఎందుకు అలా చెప్పాడు? మనకు ఏది ప్రయోజనకరంగా ఉంటుందో దాన్ని నిషేధించాలని ఆయన కోరుకోవడం లేదు. యెహోవా తన ప్రజలను ప్రేమించి, అనవసర భయాలకూ, అంధవిశ్వాసాలకూ వాళ్ళు బానిసలై పోకూడదని కోరుకుంటున్నాడు గనుకనే ఈ ఆజ్ఞలను ఇచ్చాడు. తమ అవసరాల కోసం తన దగ్గరకు రమ్మని ఆయన తన సేవకులను ఆహ్వానిస్తున్నాడు. “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరము”ను ఇచ్చేవాడు ఆయనే. (యాకోబు 1:17) “మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును” అని అపొస్తలుడైన యోహాను తన తోటి విశ్వాసులకు హామీ ఇచ్చాడు.—1 యోహాను 3:22.

దుష్టాత్మల విషయమేమిటి?

దుష్టాత్మలు ఉన్నాయి అని బైబిలు చెబుతున్న దానితో చాలా మంది మాంత్రికులు ఏకీభవిస్తారు. “అక్కడ కొన్ని నీడలు ఉన్నాయి: అవి మన లోకానికి సాదృశ్యమైన లోకంలో ఉన్నాయి. అవి జీవిస్తున్న ప్రాణులే. . . . ‘దయ్యము,’ ‘దుష్టాత్మ,’ ‘భూతం,’ వంటివి ఉన్నాయన్నది నిజమే. అవి చాలా శక్తివంతమైనవి. . . . ఈ ప్రాణుల్లో అత్యంత మేధావులైన వైవిధ్యభరితమైన ప్రాణులు . . . (వాటి కోసం మార్గాన్ని తెరిచి ఉంచేంత సహాయ మనస్కులు ఉంటే) అవి మన లోకంలోకి ప్రవేశించగలవు. . . . మన శరీరంలోకి కూడా ప్రవేశించగలవు. . . . మన మీద కాస్త అధికారం కూడా చెలాయించగలవు. దయ్యాలు పట్టాయని పాత కథల్లో చెబుతున్నట్లే మానవుల్లో ప్రవేశించగలవు” అని మంత్రవిద్యను పెంపొందించే ఒక వ్యక్తి ఒక వ్యాసంలో హెచ్చరించాడు.

బైబిలు కాలాల్లో, దయ్యాలు ప్రజలను వివిధ రకాలుగా పట్టి పీడించాయి. దయ్యములు పట్టిన కొందరు మాట్లాడలేకపోయారు, కొందరు గ్రుడ్డివారయ్యారు, కొందరికైతే పిచ్చిపట్టింది, మరికొందరికి మానవాతీత శక్తి వచ్చింది. (మత్తయి 9:32; 12:22; 17:15, 18; మార్కు 5:2-5; లూకా 8:29; 9:42; 11:14; అపొస్తలుల కార్యములు 19:16) కొన్నిసార్లు, ఒక వ్యక్తిని అనేక దయ్యములు పట్టడం వల్ల, అతని పరిస్థితి భయంకరంగా ఉండేది. (లూకా 8:2, 30) కాబట్టి మంత్రవిద్యకు దూరంగా ఉండమని, దయ్యములతో సంబంధాలు పెట్టుకోవద్దని యెహోవా తన ప్రజలను హెచ్చరించడానికి ఖచ్చితంగా మంచి కారణమే ఉంది.

సత్యంపై ఆధారపడిన మతం

మంత్రవిద్య హానికరమైనది కాదనీ, మృదువైనదనీ, ప్రకృతిని ఆరాధించే మతమనీ అనిపిస్తుంది కనుక, చాలా మంది దానికి ఆకర్షితులౌతున్నారు. కొన్ని సమాజాల్లో, అది అంగీకరించబడింది కూడా. దాని గురించి వారెవరూ భయపడడం లేదు. తరచూ దాన్ని మామూలు విషయంగా ఎంచుతున్నారు. మత సహనం ఉన్న వాతావరణంలో, అనాగరికమైన మంత్రవిద్య గౌరవాన్ని సంపాదించుకుంది.

నిజానికి, ప్రజలు ఒక జత చెప్పులను ఎలాగైతే ఎంపిక చేసుకుంటారో, అలాగే, తమ అవసరాలకు తగిన మతాన్ని ఎంపిక చేసుకోగల అంగడి స్థలంగా ప్రపంచ మతాలు మారాయి. దానికి విరుద్ధంగా, యేసు రెండే రెండు ఎంపికలను గురించి మాట్లాడాడు. “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే” అని ఆయన అన్నాడు. (మత్తయి 7:13, 14) స్వాభావికంగానే, మనం ఏ దారిన వెళ్ళాలి అన్నది ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యం మనకుంది. అయితే మన శాశ్వత భవిష్యత్తు ప్రమాదంలో పడగలదు కనుక, మనం ఎలాంటి ఎంపిక చేసుకుంటామన్నది చాలా ప్రాముఖ్యం. ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగేందుకు, సత్యపు మార్గాన్ని, అంటే దేవుని వాక్యమైన బైబిలు చూపించే మార్గాన్ని మనం తప్పనిసరిగా అవలంబించవలసి ఉంది.

[అధస్సూచీలు]

^ పేరా 12 కనికట్టుకూ, వేదిక మీద చూపించే ఇంద్రజాలానికీ, ఇంగ్లీష్‌లో మ్యాజిక్‌ అనే అంటారు. అయితే, వీటి మధ్య తేడాను చూపించేందుకు, స్పెల్లింగ్‌లో చిన్న మార్పు చూపిస్తారు. “మంత్రవిద్య నభ్యసించుటలో ప్రమాదమున్నదా?” అనే శీర్షిక కోసం తేజరిల్లు! డిశంబరు 8, 1993 పేజీలు 23, 24 చూడండి.

[5వ పేజీలోని చిత్రం]

మంత్రవిద్య అంటే ప్రకృతిని ఆరాధించే హానిరహితమైన మతం అని నేడు అనేకులు దృష్టిస్తున్నారు

[6వ పేజీలోని చిత్రం]

మంత్రవిద్యకు దయ్యములతో సంబంధముంది

[6వ పేజీలోని చిత్రం]

మంత్రవిద్యను అభ్యసించేవారు తమకు తెలియకుండానే అపవాది చిత్తాన్ని నెరవేరుస్తున్నారా?

[7వ పేజీలోని చిత్రాలు]

సత్యపు మార్గాన్ని బైబిలు బయలుపరుస్తుంది