కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము”

“నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము”

“నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము”

ప్రవక్త అయిన సమూయేలుతో యెహోవా ఇలా అన్నాడు: “మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; . . . మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” (1 సమూయేలు 16:7) అలాగే కీర్తనల గ్రంథకర్తయైన దావీదు, సూచనార్థక హృదయంపై అవధానాన్ని మళ్ళిస్తూ ఇలా పాడాడు: “రాత్రివేళ నీవు [యెహోవా] నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత నేను అతిక్రమింపను.”—కీర్తన 17:3.

అవును, మనం నిజంగా ఏమైవున్నామో నిర్ధారించుకోవటానికి యెహోవా మన హృదయాల్లోకి చూస్తాడు. (సామెతలు 17:3) కాబట్టి ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఇలా సలహా ఇవ్వటం సహేతుకమే: “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.” (సామెతలు 4:23) మనం మన సూచనార్థక హృదయాన్ని ఎలా భద్రంగా కాపాడుకోగలము? సామెతలు 4వ అధ్యాయం ఆ ప్రశ్నకు జవాబిస్తుంది.

తండ్రి ఇచ్చే ఉపదేశాన్ని చెవినబెట్టండి

సామెతలు 4వ అధ్యాయం ఈ మాటలతో ప్రారంభమౌతుంది: “కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి.”సామెతలు 4:1, 2.

దైవభక్తిగల తమ తల్లిదండ్రులిచ్చే, ప్రత్యేకంగా తండ్రి ఇచ్చే స్థిరమైన ఉపదేశాన్ని వినాలన్నదే యౌవనస్థులకు ఇవ్వబడిన సలహా. ఆయనకు కుటుంబపు భౌతిక, ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చే లేఖనాధార బాధ్యత ఉంది. (ద్వితీయోపదేశకాండము 6:6, 7; 1 తిమోతి 5:8) అటువంటి నడిపింపు లేకుండా ఒక యౌవనస్థుడు పరిణతికెదగటం ఎంత కష్టసాధ్యం ! అందుకని ఒక పిల్లవాడు తన తండ్రి ఇచ్చే ఉపదేశాన్ని గౌరవంతో స్వీకరించవద్దా?

అయితే, తండ్రి లేని కుటుంబంలో పిల్లలకు ఉపదేశమిచ్చే విషయమేమిటి? ఉదాహరణకు పదకొండు సంవత్సరాల జేసన్‌కు * నాలుగు సంవత్సరాలున్నప్పుడు అతని తండ్రి చనిపోయాడు. తన జీవితంలో అత్యంత కలతపర్చే విషయం ఏమిటని ఒక క్రైస్తవ పెద్ద జేసన్‌ను అడిగినప్పుడు ఆ పిల్లవాడు వెంటనే, “నాకు నాన్న లేడు. అందుకే కొన్నిసార్లు నేను నిజంగా చాలా బాధపడతాను” అని అన్నాడు. అయితే, తల్లిదండ్రుల నిర్దేశనం లేని పిల్లలకు ఓదార్పునిచ్చే సలహాలు అందుబాటులో ఉన్నాయి. జేసన్‌, అలాగే అలాంటి మరితరులూ క్రైస్తవ సంఘంలోని పెద్దల నుండీ పరిణతి చెందిన వారి నుండీ, ఒక తండ్రి తన కుమారునికి ఎలాంటి సలహాలిస్తాడో అలాంటి సలహాలను పొందవచ్చు.—యాకోబు 1:27.

సొలొమోను తన సొంత క్రమశిక్షణను గురించి మననం చేసుకుంటూ, ఇలా కొనసాగిస్తున్నాడు: “నా తండ్రికి నేను [“నిజమైన,” NW] కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యేక కుమారుడనైయుంటిని.” (సామెతలు 4:3) ఈ రాజు తన చిన్నతనాన్ని ఎంతో ఇష్టంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి ఇచ్చే సలహాలను హృదయంలోనికి స్వీకరించిన ఒక ‘నిజమైన కుమారునిగా’ ఉన్న యౌవనుడైన సొలొమోనుకు తన తండ్రియైన దావీదుతో సన్నిహితమైన సంబంధం ఉండివుంటుంది. అదీగాక, సొలొమోను ‘ఏక కుమారుడు,’ అంటే దాని భావం ఆయన ఎంతో ప్రేమించబడినవాడు. ఒక పిల్లవాడు, హృదయాల్ని ఉత్తేజపర్చే వాతావరణం ఉన్న ఇంట్లోనూ, తల్లిదండ్రులతో స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణం ఉన్న ఇంట్లోనూ పెరగడం ఎంత ప్రాముఖ్యం !

జ్ఞానాన్నీ వివేకాన్నీ సంపాదించుకోండి

తన తండ్రి యొక్క ప్రేమపూర్వకమైన ఉపదేశాన్ని గుర్తుచేసుకుంటూ సొలొమోను ఇలా చెబుతున్నాడు: “అప్పుడు నా తండ్రి నాకు ఇలా నేర్పాడు: ‘నా మాటలను నీ హృదయం గట్టిగా చేపట్టాలి. నా ఆజ్ఞలను పాటిస్తే నీవు బ్రతుకుతావు. నా నోటి మాటలను మర్చిపోకు. వాటినుంచి తొలగిపోకు. జ్ఞానం, వివేకం సంపాదించుకో. జ్ఞానాన్ని విడిచిపెట్టకు అప్పుడు అది నిన్ను సంరక్షిస్తుంది. దాన్ని ప్రేమిస్తే అది నీకు కాపుదల ! జ్ఞానం ప్రధానం. జ్ఞానాన్ని సంపాదించుకో. ఎంత ఇవ్వవలసివచ్చినా వివేకాన్ని సంపాదించుకో.’”సామెతలు 4:4-7, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

జ్ఞానం ఎందుకంత “ప్రధానం”? లేఖనాల ప్రకారం, తనకున్న విషయ పరిజ్ఞానాన్నీ తనలోని వివేకాన్నీ మంచి ఫలితాలు తెచ్చేలా ఉపయోగించినప్పుడు ఒక వ్యక్తి జ్ఞాని అవుతాడు. ఇలాంటి జ్ఞానయుక్తమైన వ్యక్తిగా తయారుకావాలంటే, విషయాల్ని గమనించడం ద్వారా స్వీయానుభవం ద్వారా, లేదా చదవడం ద్వారా పఠించడం ద్వారా వాస్తవాలతో సుపరిచితమై ఉండటం వాటిని తెలుసుకోవడం అంటే విషయ పరిజ్ఞానాన్ని సంపాదించడం చాలా అవసరం. కానీ ఈ విషయ పరిజ్ఞానాన్నంతటినీ మంచి ఉపయోగంలోకి పెట్టే సామర్థ్యం లేనట్లైతే అదంతా నిరుపయోగమైపోతుంది. మనం బైబిలునూ, ‘నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందించే బైబిలు సాహిత్యాన్నీ క్రమంగా చదువుతూ ఉండటమే కాక, మనం వాటినుండి నేర్చుకునేవాటిని అన్వయించుకోవడానికి కూడా కృషిచేయాలి.—మత్తయి 24:45.

జ్ఞానయుక్తమైన వ్యక్తిగా తయారుకావడంతోపాటు వివేకాన్ని సంపాదించడం కూడా ప్రాముఖ్యం. అది లేకుండా, మనం ఏదైనా విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు వాస్తవాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధించివున్నాయో ఎలా చూడగలం, పూర్తి అవగాహన ఎలా పొందగలం? మనలో వివేకం కొరవడితే, ఫలాని విషయం ఎందుకలా ఉంది, కారణం ఏమిటి అన్నది ఎలా గ్రహించగలం? అంతర్దృష్టినీ వివేచననీ ఎలా పొందగలం? అవును, మనదగ్గరున్న వాస్తవాల ఆధారంగా ఒక సరైన ముగింపుకు రావడానికి మనకు వివేకం అవసరం.—దానియేలు 9:22, 23, NW.

సొలొమోను తన తండ్రి మాటల్ని చెబుతూ కొనసాగిస్తున్నాడు: “దాని [జ్ఞానమును] గొప్పచేసినయెడల అది నిన్ను హెచ్చించును దాని కౌగలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.” (సామెతలు 4:8, 9) దైవిక జ్ఞానాన్ని హృదయానికి హత్తుకునే వ్యక్తిని అది కాపాడుతుంది. అంతేగాక, అది ఆ వ్యక్తికి ఘనతను తెస్తుంది, ముఖంలో ప్రకాశం ఉట్టిపడేలా చేస్తుంది. అందుకని మనం దైవిక జ్ఞానాన్ని సంపాదిద్దాము.

“క్రమశిక్షణను . . . గట్టిగా పట్టుకొనుము”

తన తండ్రి నిర్దేశాల్ని గురించి ఇంకా చెబుతూ, ఇశ్రాయేలు రాజు తర్వాత ఇలా అంటున్నాడు: “నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను. నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు. ఉపదేశమును [“క్రమశిక్షణను,” NW] విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము.”సామెతలు 4:10-13.

తన తండ్రికి నిజమైన కుమారునిగా ఉన్న సొలొమోనుకు నిర్దేశాల్నీ, దిద్దుబాటునూ అందజేసే ప్రేమపూర్వకమైన క్రమశిక్షణలోని విలువ ఏమిటో తెలుసు. సమతూకమైన క్రమశిక్షణ లేనట్లైతే మనం ఆధ్యాత్మిక పరిణతికి ఎలా ఎదగగలం, లేదా మన జీవితపు నాణ్యతను ఎలా మెరుగుపర్చుకోగలం? మన తప్పుల నుండి మనం నేర్చుకోకపోతే లేదా తప్పుడు తలంపుల్ని సరిదిద్దుకోలేకపోతే మనలో ఆధ్యాత్మిక అభివృద్ధి నిజంగా శూన్యమే. క్రమశిక్షణ సమంజసంగా ఇవ్వబడినప్పుడు దైవిక ప్రవర్తన వృద్ధియవుతుంది, తద్వారా మనం ‘యథార్థమార్గములో నడవడానికి’ సహాయపడుతుంది.

మరో రకమైన క్రమశిక్షణ కూడా ‘మనం దీర్ఘాయుష్మంతులమయ్యేలా’ చేస్తుంది. ఎలా? యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.” (లూకా 16:10) చిన్న విషయాల్లో మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకుంటే, పెద్ద విషయాల్లో కూడా అలాగే చేసుకోవడం సుళువుగా ఉండదా? కొన్నిసార్లు ఆ పెద్ద విషయాలపైనే మన జీవితాలు ఆధారపడుతుండవచ్చు. ఉదాహరణకు, ‘ఒక స్త్రీని మోహపుచూపుతో చూస్తూ’ ఉండకుండా మన కంటికి శిక్షణనిస్తే, అప్పుడు మనం అనైతిక ప్రవర్తనలో పడిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. (మత్తయి 5:28) అయితే ఒక్కమాట, ఈ సూత్రం స్త్రీపురుషులిరువురికీ వర్తిస్తుంది. మనం గనుక మనలోని ‘ప్రతి ఆలోచనను చెరపట్టేలా’ మన మనస్సులకు క్రమశిక్షణనిస్తే అప్పుడు మన మాటలో గాని క్రియలో గాని ఘోరమైన తప్పిదాలు చేసే ప్రమాదం తక్కువగా ఉంటుంది.—2 కొరింథీయులు 10:5.

నిజమే క్రమశిక్షణను స్వీకరించడం సాధారణంగా కష్టంగా ఉంటుంది, అది కఠినంగా ఉన్నట్లు అన్పించవచ్చు. (హెబ్రీయులు 12:11) అయినా, మనం గనుక క్రమశిక్షణను గట్టిగా పట్టుకున్నట్లైతే మనం ముందుకు సాగిపోయేలా మార్గాలు సరాళం అవుతాయని జ్ఞానియైన రాజు మనకు హామీనిస్తున్నాడు. సరియైన శిక్షణను పొందడం ద్వారా పరుగుపందెంలో ఒక వ్యక్తి ఎలాగైతే ఏమాత్రం తొట్రుపడకుండా తూటాలా ముందుకు దూసుకుపోతాడో, అలాగే క్రమశిక్షణను గట్టిగా పట్టుకోవడం ద్వారా జీవానికి తీసుకెళ్ళే మార్గంలో మనం తొట్రిల్లకుండా స్థిరంగా ముందుకు సాగిపోతాం. అయితే మనం ఎంపిక చేసుకునే మార్గం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

“భక్తిహీనుల త్రోవను” త్యజించండి

సొలొమోను ఎంతో అత్యవసర భావంతో ఇలా హెచ్చరిస్తున్నాడు: “భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు. కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు.”సామెతలు 4:14-17.

మనం ఎవరి మార్గాలను త్యజించాలని సొలొమోను చెబుతున్నాడో ఆ దుష్టులు పనికిమాలిన పనులు చేస్తూనే బతుకుతారు. చెడు చేయడం వారికి ఆహారపానీయాల వంటిది. వారు బలాత్కారపు క్రియలు చేయనిదే వారికి నిద్రరాదు. వారి వ్యక్తిత్వమే భ్రష్టమైనది ! మనం వారి సహచర్యంలో ఉంటూ మన హృదయాల్ని నిజంగా భద్రంగా కాపాడుకోగలమా? నేటి ప్రపంచంలోని వినోదమాధ్యమాల్లో కన్పించే హింసాత్మక దృశ్యాలకు బహిర్గతం కావడం ద్వారా ‘దుష్టుల మార్గంలో నడవడం’ ఎంత మూర్ఖత్వం ! టీవీల్లోను చలనచిత్రాల్లోను కన్పించే చెడుతనాన్ని చూస్తూపోతే మనం స్తబ్దుగా మారిపోతాము, అప్పుడు మనం కోమలమైన, కనికరంతో కూడిన ప్రవర్తనను అలవర్చుకోవడం దుర్లభం.

వెలుగులో ఉండండి

మార్గాన్నే ఇంకా పోలికగా ఉపయోగిస్తూ సొలొమోను ఇలా ప్రకటిస్తున్నాడు: “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.” (సామెతలు 4:18) బైబిలు పఠనాన్ని ప్రారంభించి, అది చెప్పేదాన్ని జీవితంలో అన్వయించుకోవటానికి ప్రయత్నించడాన్ని, తెల్లవారు జామున ఇంకా చీకటిగా ఉండగానే ప్రయాణం ప్రారంభించడంతో పోల్చవచ్చు. అటుతర్వాత నెమ్మదిగా కారు చీకట్లు పోయి తూరుపు తెలతెల వారుతుండగా మనకు దారికిరువైపులా ఉన్నవన్నీ స్పష్టంగా కన్పించవు. కానీ సూర్యోదయం అయిన తర్వాత మనం పరిసరాల్ని స్పష్టంగా గుర్తించగల్గుతాము. చివరికి సూర్యుడు పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్నప్పుడు మనకు ప్రతీదీ విస్పష్టంగా ఉంటుంది. అవును, మనం లేఖనాల్ని ఓర్పుతో శ్రద్ధాసక్తులతో పఠిస్తూ ఉంటే అప్పుడు సత్యం మనకు నెమ్మదిగా స్పష్టం అవుతుంది. మన హృదయాన్ని కుతర్కం చేసే ప్రమాదం నుండి భద్రంగా కాపాడుకోవాలంటే దానికి ఆధ్యాత్మికంగా పోషణనందించటం చాలా అవసరం.

బైబిలు ప్రవచనాల అర్థము లేదా ప్రాముఖ్యము కూడా నెమ్మదిగా అవగతం అవుతూవుంటుంది. యెహోవా పరిశుద్ధాత్మ ప్రవచనాలపై వెలుగు ప్రసరింపజేస్తూ ఉండగా, అవి లోకంలో జరిగే సంఘటనల రూపంలోనూ దేవుని ప్రజల అనుభవాల రూపంలోనూ నెరవేరుతూ ఉండగా అవి మనకు స్పష్టం అవుతూవుంటాయి. వాటి నెరవేర్పుల గురించి అసహనంగా ఊహాగానాలు చేయడానికి బదులు మనం ‘వెలుగు తేజరిల్లేంత వరకు’ వేచివుండాల్సిన అవసరం ఉంది.

దేవుని వెలుగులో నడవటానికి తిరస్కరిస్తూ దేవుని నిర్దేశాన్ని తృణీకరించేవారి విషయం ఏమిటి? “భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము” అంటున్నాడు సొలొమోను. “తాము దేనిమీద పడునది వారికి తెలియదు.” (సామెతలు 4:19) భక్తిహీనులు, చీకట్లో తడుముకుంటూ దేనికో తట్టుకుని పడిపోయే వ్యక్తిలాంటివారు. తాము దేనికి తట్టుకున్నారో కూడా వారికి తెలియదు. భక్తిహీనులు తమ అవినీతి ప్రవర్తనతో, వర్ధిల్లుతున్నట్లుగా కన్పించినా వారి బూటకపు విజయం తాత్కాలికమే. అటువంటివారి గురించి కీర్తన గ్రంథకర్త ఇలా పాడాడు: “నిశ్చయముగా నీవు [యెహోవా] వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు. వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు.”—కీర్తన 73:18.

జాగరూకతతో ఉండాలి

ఇశ్రాయేలు రాజు ఇంకా ఇలా అంటున్నాడు: “నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము”సామెతలు 4:20-23.

హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలన్న సలహా ఎంత విలువైనదన్నదానికి సొలొమోను సొంత ఉదాహరణే ఒక రుజువు. నిజమే ఆయన తన యౌవనంలో తన తండ్రికి ‘నిజమైన కుమారునిగా’ ఉన్నాడు, అలాగే పెద్దవాడయ్యేంత వరకూ యెహోవాకు విశ్వసనీయంగా ఉంటూవచ్చాడు. కానీ, “సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయములను ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను” అని బైబిలు వివరిస్తుంది. (1 రాజులు 11:4) నిరంతరమూ జాగరూకులుగా ఉండనట్లైతే ఎంతో మంచి స్థితిలో ఉన్న హృదయాలు కూడా చెడు చేసే ప్రలోభంలో పడిపోతాయి. (యిర్మీయా 17:9) మనం దేవుని వాక్యంలోని జ్ఞాపికలను మన హృదయాలకు సమీపంగా—“హృదయమందు” ఉంచుకోవాలి. ఈ జ్ఞాపికల్లో సామెతలు 4వ అధ్యాయంలోని నిర్దేశనాలు కూడా ఇమిడివున్నాయి.

మీ హృదయస్థితిని పరిశీలించుకోండి

మనం మన సూచనార్థక హృదయాన్ని భద్రంగా కాపాడుకోగల్గుతున్నామా? మన అంతరంగ వ్యక్తి స్థితి ఎలా ఉందో మనమెలా తెలుసుకోగలము? “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును” అన్నాడు యేసు. (మత్తయి 12.34) ఆయనింకా ఇలా కూడా అన్నాడు: “దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును.” (మత్తయి 15:19, 20) అవును, మనం అసలు హృదయమందు ఎలాంటి వ్యక్తిగా ఉన్నామో మన మాటలు, క్రియలు ఎలుగెత్తి చాటుతాయి.

యుక్తమైన విధంగానే సొలొమోను ఇలా ఉద్బోధ చేస్తున్నాడు: “మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము.”సామెతలు 4:24-27.

సొలొమోను ఇచ్చిన ఉద్బోధ ప్రకారం మనం మన మాటల్నీ చర్యల్నీ జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మనం మన హృదయాల్ని భద్రంగా కాపాడుకుంటూ దేవుణ్ణి ప్రీతిపర్చాలనుకుంటే వక్రమైన మాటలు, కుటిలమైన ప్రవర్తనల నుండి దూరంగా ఉండాలి. (సామెతలు 3:32) అందుకోసం మన మాటలు చేతలు మన గురించి ఏమి వెల్లడిచేస్తున్నాయో ప్రార్థనపూర్వకంగా ఆలోచించుకోవాలి. తర్వాత ఏదైనా బలహీనత కనబడితే దాని సరిచేసుకోవటానికి యెహోవా అందించే సహాయం కోసం వెదకాలి.—కీర్తన 139: 23, 24.

అన్నింటికీ మించి, ‘మన కన్నులు సరిగా చూడాలి.’ మనం మన పరలోకపు తండ్రికి మనస్ఫూర్తిగా సేవచేయాలన్న లక్ష్యంపై మన కన్నులను కేంద్రీకరిద్దాము. (కొలొస్సయులు 3:23) మీరు వ్యక్తిగతంగా అటువంటి నీతిగల మార్గంలో నడుస్తూండగా, మీ ‘మార్గాలన్నింటిలో’ యెహోవా మీకు విజయాన్ని అందించుగాక, “హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అన్న ప్రేరేపిత సలహాను పాటిస్తున్నందుకు ఆయన మిమ్మల్ని బహుగా ఆశీర్వదించుగాక !

[అధస్సూచీలు]

^ పేరా 7 ఆయన అసలు పేరు కాదు.

[22వ పేజీలోని బ్లర్బ్‌]

హింసాత్మక దృశ్యాల్ని చూపించే వినోదాన్ని మీరు త్యజిస్తారా?

[21వ పేజీలోని చిత్రం]

అనుభవజ్ఞుల సలహాల నుండి ప్రయోజనం పొందండి

[23వ పేజీలోని చిత్రం]

క్రమశిక్షణ మీ అభివృద్ధిని కుంటుపర్చదు

[24వ పేజీలోని చిత్రం]

బైబిలు పఠించే విషయంలో పట్టుదలగా ఉండండి