కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“క్రైస్తవుడు” అనే పదం దాని అర్థాన్ని కోల్పోతోందా?

“క్రైస్తవుడు” అనే పదం దాని అర్థాన్ని కోల్పోతోందా?

“క్రైస్తవుడు” అనే పదం దాని అర్థాన్ని కోల్పోతోందా?

క్రైస్తవుడుగా ఉండడమంటే అర్థం ఏమిటి? ఈ ప్రశ్నకు మీరెలా జవాబిస్తారు? వివిధ దేశాల్లోని కొందరిని ఎంపిక చేసుకుని ఈ ప్రశ్న అడిగారు. వాళ్ళ జవాబుల్లో కొన్ని ఇలా ఉన్నాయి:

“యేసును అనుసరిస్తూ, ఆయనను అనుకరించడం.”

“మంచి వ్యక్తిగా ఉండడం, తమకున్నవాటిని ఇతరులతో పంచుకోవడం.”

“క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించడం.”

“మాస్‌కి వెళ్ళడం, జపమాలతో జపం చేయడం, ప్రభు రాత్రి భోజనంలో పాలు పంచుకోవడం.”

“ఒక క్రైస్తవుడుగా ఉండేందుకు చర్చికి వెళ్ళవలసిన అవసరముందని నేననుకోను.”

నిఘంటువులు సహితం దిగ్భ్రమను కలిగిస్తూ అనేకానేక నిర్వచనాలను ఇస్తున్నాయి. ఒక నిఘంటువులో, “క్రిస్టియన్‌” అనే పదం క్రింద, “యేసుక్రీస్తు మీద నమ్మకముంచేవాడు, లేదా యేసుక్రీస్తు మతానికి చెందినవాడు” అనే అర్థం మొదలుకొని, “మర్యాదస్థుడు, లేదా ఆమోదయోగ్యమైన వ్యక్తి” అనే అర్థం వరకు పది నిర్వచనాలనిచ్చింది. క్రైస్తవుడుగా ఉండడమంటే ఏమిటన్నది వివరించడం చాలా కష్టమని అనేకులు కనుగొనడంలో ఆశ్చర్యమేమీ లేదు.

స్వతంత్ర ధోరణి

నేడు క్రైస్తవులమని చెప్పుకునేవాళ్ళ మధ్యన—చర్చీలో ఒకే చోట కూర్చునేవారి మధ్యన సహితం—బైబిలు దైవప్రేరేపితమైనదా, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మవచ్చా, రాజకీయాల్లో చర్చి భాగం వహించవచ్చా, ఇతరులతో తమ విశ్వాసాన్ని పంచుకోవాలా వంటి అంశాలపై వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. గర్భస్రావం, సలింగ సంపర్కం, వివాహం చేసుకోకుండానే కలిసి జీవించడం మొదలైన నైతిక వివాదాంశాలపై గంభీరంగా చర్చలు జరుగుతున్నాయి. నేడు ఈ అంశాల్లో స్వతంత్ర ధోరణి కనబడుతోంది.

ఉదాహరణకు, “సలింగ సంపర్కం చేసే వ్యక్తి అయిన ఒక సంఘ పెద్దను తన పరిపాలక బోర్డులో సభ్యుడిగా” ఎంపిక చేసుకునే అధికారం చర్చికుందని ఒక ప్రొటెస్టెంట్‌ చర్చి న్యాయనిర్ణయ సంఘం ఇటీవల వెల్లడి చేసింది అని క్రిస్టియన్‌ సెంచురీ అనే పత్రిక పేర్కొంది. రక్షణ పొందేందుకు, యేసు మీద విశ్వాసం ఉండడం అంత ప్రాముఖ్యమేమీ కాదన్న అభిప్రాయాన్ని కూడా కొందరు వేదాంతులు తెలిపారు. యూదులూ, ముస్లిమ్‌లూ, మరితరులూ, “[క్రైస్తవులతో పాటు] పరలోకంలోకి ప్రవేశించవచ్చు” అని వాళ్ళు నమ్ముతున్నారని ద న్యూయార్క్‌ టైమ్స్‌లోని ఒక నివేదిక పేర్కొంటోంది.

ఒక మార్క్సిస్ట్‌ పెట్టుబడిదారీ వ్యవస్థను బోధిస్తున్నాడనుకోండి, లేదా ఒక ప్రజాస్వామ్యవాది నిరంకుశాధికారాన్నే బోధిస్తున్నాడనుకోండి లేదా ఒక పర్యావరణవాది అడవులను కొట్టివేయాలని బోధిస్తున్నాడనే అనుకోండి. “నిజానికి ఆ మార్క్సిస్ట్‌ మార్క్సిస్టూ కాడు, ఆ ప్రజాస్వామ్యవాది ప్రజాస్వామ్యవాదీ కాడు, ఆ పర్యావరణవాది పర్యావరణవాదీ కాడు” అని మీరంటారు. మీరంటున్నది నిజమే. అయితే, నేడు క్రైస్తవులమని చెప్పుకునేవారికున్న విభిన్న దృక్కోణాలను పరిశీలిస్తే, వాళ్ళ నమ్మకాలు ఉత్తర దక్షిణ ధృవాల్లా ఎంతో భిన్నంగా ఉన్నాయనీ, అవి చాలా మట్టుకు, క్రైస్తవత్వ స్థాపకుడైన యేసు క్రీస్తు బోధించినవాటికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయనీ మీరు కనుగొంటారు. అలాంటి భిన్నాభిప్రాయాలూ బోధలూ వాళ్ళ మధ్య ఉన్న క్రైస్తవత్వాన్ని గురించి ఏమని చెబుతున్నాయి?—1 కొరింథీయులు 1:10.

ఆయా కాలాలకు సరిపోయేలా క్రైస్తవ బోధలను మార్చాలన్న తాపత్రయానికి దీర్ఘకాల చరిత్రే ఉంది. మనం ఈ విషయాన్ని తర్వాతి శీర్షికలో చూడబోతున్నాం. అయితే అలాంటి మార్పులను గురించి దేవుడూ, యేసు క్రీస్తూ ఏమని భావిస్తారు? క్రీస్తులో వ్రేళ్ళూనని బోధలను నేర్పే చర్చీలను క్రైస్తవ చర్చీలని నిజంగా చెప్పవచ్చా? ఈ ప్రశ్నలను కూడా తర్వాతి శీర్షికలో పరిశీలించుదాం.