కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి సలహా కోసం మీరు ఎక్కడికి వెళ్ళవచ్చు?

మంచి సలహా కోసం మీరు ఎక్కడికి వెళ్ళవచ్చు?

మంచి సలహా కోసం మీరు ఎక్కడికి వెళ్ళవచ్చు?

ప్రజలకు సహాయం అవసరం కనుక నేడు “సలహాల పరిశ్రమ” సంవత్సరానికి అనేక కోట్ల డాలర్ల లాభాలను సంపాదించిపెట్టే వ్యాపారంగా మారింది. “[నేటి సమాజంలో] విద్యా సంబంధంగాను సామాజికంగాను లోటుపాట్లు ఉన్నాయి. ఒకప్పుడున్న మత విలువలు ఇప్పుడు లేవు. కుటుంబాలు మునుపటంత పటిష్ఠంగా లేవు. . . . దాని ఫలితంగా ప్రజలు మానసిక అలజడికి గురవుతున్నారు” అని మానసిక ఆరోగ్య ప్రొఫెషనల్‌ అయిన హైన్స్‌ లేమాన్‌ ఒప్పుకుంటున్నారు. “మానసిక, ఆధ్యాత్మిక, శారీరక సమస్యల పరిష్కారం కోసం ఒకప్పుడు తమ తెగ పురోహితుని దగ్గరకు లేదా పాస్టర్‌ దగ్గరికి లేదా కుటుంబ వైద్యుని దగ్గరకు వెళ్ళిన వారు ఇప్పుడు వ్యక్తిగత పురోభివృద్ధికి తోడ్పడే సలహాలు గల పుస్తకాల వైపుకు మరలుతున్నారు” అని రచయితయైన ఎరిక్‌ మైసల్‌ అంటున్నారు.

అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమను గురించి పరిశోధించేందుకు అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ ఒక బృందాన్ని రూపొందించింది. “వ్యక్తులు తమను తాము అర్థం చేసుకునేందుకూ, ఇతరులను అర్థం చేసుకునేందుకూ” ఈ పరిశ్రమ సహాయపడుతున్నప్పటికీ, “పురోగతికి దోహదపడేలా తను చేస్తున్న సహాయాన్ని గురించి అది చెప్పే మాటలూ, దాని కార్యక్రమాలకు ఇవ్వబడిన పేర్లూ అతిశయోక్తులుగా ఉన్నాయి, అవి ఆశ్చర్యాన్ని గొలిపేవిగా ఉన్నాయి” అని ఆ బృందంలోని వాళ్ళు అన్నారు. “మతపరమైన ఆధ్యాత్మికమైన వేషధారణల విషయమై జాగ్రత్తపడండి. . . . ముఖ్యంగా, చాలా తక్కువ సమయంలో, చాలా తక్కువ ప్రయత్నంతో, ఏమంత క్రమశిక్షణ అవసరం లేకుండానే ఎంతో సహాయపడగలవని వాగ్దానం చేస్తున్న పుస్తకాలు, టేపులు లేదా సెమినార్ల విషయమై జాగ్రత్తపడండి” అని ఎ టొరొంటో స్టార్‌ అనే వార్తాపత్రికలోని ఒక రచయిత అన్నారు. నిజమే, అవసరంలో ఉన్నవారికి సహాయపడాలని హృదయపూర్వకంగా కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే, అవినీతిపరులైన అనేకానేక మంది వ్యక్తులు, ప్రజల ఒంటరితనాన్ని బాధలను ఆసరాగా తీసుకుంటూ, ప్రజలకు నిజమైన సహాయాన్ని ఇవ్వకుండానే నిజమైన పరిష్కారాలను తెలపకుండానే డబ్బు సంపాదిస్తున్నారు.

వీటన్నింటిని బట్టి, మనం నమ్మగల సహాయ మూలాన్ని తెలుసుకోగల మార్గం ఏమిటి? ఎడతెగక పనిచేయగల ఆచరణాత్మకమైన ఉపదేశాన్ని ఎక్కడ కనుగొనవచ్చు?

తప్పకుండా ఫలించే మార్గదర్శనం

“దేవుడిచ్చిన బైబిలు ఒక సముద్ర పటంలాంటిది. జీవితం, సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడలాంటిది. మీరు బైబిలు అనే సముద్ర పటం సహాయంతో మీ జీవితమనే ఓడను నడుపుకోవచ్చు, మీ ఓడ మునిగిపోకుండా కాపాడుకోవచ్చు. అది, ఓడరేవు ఎక్కడ ఉందో చూపిస్తుంది, మీరు పెద్ద పెద్ద బండల మీదికి ఇసుక దిబ్బల మీదికి వెళ్ళకుండా ఓడరేవును ఎలా చేరుకోవచ్చో అది చూపిస్తుంది” అని 19వ శతాబ్దపు అమెరికన్‌ మతబోధకుడైన హెన్రీ వార్డ్‌ బీచర్‌ అన్నాడు. “ఎవరూ ఎన్నడూ లేఖనాలను మించిపోలేరు; సంవత్సరాలు గడుస్తున్న కొలది ఈ పుస్తకం మరింత విశాలమైనదిగా, లోతైనదిగా మనకు కనిపిస్తుంది” అని బైబిలు గురించి మరొక వ్యక్తి అన్నాడు. ఈ పుస్తకాన్ని గురించి మీరు అంతగా ఎందుకు పట్టించుకోవాలి?

“దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” అని అంటూ బైబిలు తనను తాను సిఫారసు చేసుకుంటోంది. (2 తిమోతి 3:16, 17) బైబిలులో ఉన్న సమాచారం, జీవానికి మూలమైన యెహోవా దేవుడి నుండి వచ్చినదే. (కీర్తన 36:9) ఆయనకు మన శరీర నిర్మాణాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసు. “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు” అని కీర్తన 103:14 మనకు గుర్తు చేస్తుంది. కనుక, మన కోసం దేవుడు ఇచ్చిన సలహాలు ఉపదేశాలు ఉన్న బైబిలు మీద మనం సంపూర్ణమైన నమ్మకం కలిగివుండవచ్చు.

వాస్తవానికి, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మీ ప్రయోజనార్థం మీరు అన్వయించుకోగల సూత్రాలూ మార్గదర్శకాలూ బైబిలులో ఉన్నాయి. “ఇదే త్రోవ దీనిలో నడువుడి” అని బైబిలు ద్వారా దేవుడు మనకు చెబుతున్నాడు. (యెషయా 30:21) మరి నేటి వ్యక్తుల అవసరాలను బైబిలు నిజంగా తీర్చగలదా? చూద్దాం.

బైబిలు మన అవసరాలను తీరుస్తుంది . . .

చింతలను అధిగమించడానికి సహాయపడుతుంది. “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” అని బైబిలు మనకు చెబుతుంది. (ఫిలిప్పీయులు 4:6, 7) ఆర్థిక ఇబ్బందులు, లైంగిక అత్యాచారం, కఠినమైన మాటలు లేదా ప్రియమైన వ్యక్తి మరణం మొదలైనవాటికి సంబంధించిన భావోద్వేగపూరితమైన చింతలను అధిగమించడానికి ప్రార్థన ఫలప్రదమైన మార్గమని నిరూపించబడిందా? ఈ క్రింది అనుభవాన్ని పరిశీలించండి.

తన కూతురికి జరిగిన లైంగిక అత్యాచారాన్ని గురించి తెలుసుకున్నాక, “సొంత కూతురికి రక్షణనిచ్చుకోలేకపోయానే అన్న అపరాధ భావం ఇంత అంత అని మాటల్లో చెప్పలేను. కోపం క్రోథం ఉక్రోషాలతో నేను పోరాడవలసి వచ్చింది. అవి నా జీవితాన్ని పాడు చేయడం మొదలుపెట్టాయి. నా హృదయాన్ని కాపాడుకునేందుకు నాకు యెహోవా సహాయం చాలా అవసరమైంది” అని జాకీ అంటోంది. ఆమె, ఫిలిప్పీయులు 4:6, 7 వచనాలను మరలా మరలా చదివిన తర్వాత, ఆ ఉపదేశాన్ని అనుసరించేందుకు చాలా కృషి చేసింది. “న్యూనతా భావాలతో నన్ను నేను నాశనం చేసుకోకుండా ఉండేందుకు సహాయపడమని ప్రతి రోజూ మరల మరల ప్రార్థన చేస్తాను. నా హృదయాన్ని ప్రశాంతంగా సంతోషంగా ఉంచుకునేందుకు యెహోవా నాకు సహాయం చేశాడు. నిజంగా నేను ఇప్పుడు మనశ్శాంతిని అనుభవిస్తున్నాను” అని జాకీ చెబుతుంది.

బహుశా, మీరు అదుపు చేయలేని, మీ అంతట మీరు పరిష్కరించుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారేమో. అలాగైతే, భావోద్వేగపరమైన చింత మీలో ప్రారంభమౌతుంది. అలా చింతా భారంతో కృంగిపోయినప్పుడు ప్రార్థన చేయమని చెబుతున్న బైబిలు బోధను మీరు అనుసరిస్తే మీరు అటువంటి చింతలను ఫలప్రదంగా అధిగమించవచ్చు. “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును” అని అంటూ కీర్తన రచయిత మనలను ప్రోత్సహిస్తున్నాడు.—కీర్తన 37:5.

ప్రోత్సాహాన్నిస్తుంది. “యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములో యెహోవాను స్తుతించెదను” అని అంటూ కీర్తన రచయిత తన మెప్పుదలను వ్యక్తీకరించాడు. (కీర్తన 26:8, 12) యెహోవాను ఆరాధించేందుకు క్రమంగా సమకూడుకోవాలని బైబిలు మనలను ప్రోత్సహిస్తోంది. అలా సమకూడుకుని సహవసించడం వల్ల మీ అవసరాలు ఎలా తీరుతాయి? ఇతరులు ఎలా తీర్చుకున్నారు?

“నా తల్లిదండ్రులు యెహోవాను ఆరాధించరు. కనుక యెహోవా సేవకు సంబంధించి నేను ఏమైనా చెయ్యాలని ప్రయత్నిస్తే, వాళ్ళు నన్ను చిక్కుల్లో పెట్టేవారు. నేను కూటాలకు హాజరు కావాలంటే చాలా ప్రయత్నం చేయాలి” అని బెక్కీ అంటోంది. క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరు కావడానికి తాను చాలా శ్రమించినందుకే తనకు అనేక ఆశీర్వాదాలు లభించాయని ఆమె అనుకుంటుంది. “కూటాలు నా విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి కనుకనే, ఒక విద్యార్థినిగా కూతురుగా యెహోవా సేవకురాలిగా ప్రతిరోజు నాకెదురయ్యే ఒత్తిళ్ళను అధిగమించి నిలబడగల్గుతున్నాను. రాజ్యమందిరంలోని వారికీ, స్కూల్లో పిల్లలకూ ఎంత తేడా ఉంది ! రాజ్యమందిరంలోనివాళ్ళు నాపై ఎంతో శ్రద్ధ చూపుతారు, సహాయపడతారు. మా మధ్య జరిగే సంభాషణలు ఎల్లవేళలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాళ్ళే నా నిజమైన స్నేహితులు” అని ఆమె అంటోంది.

క్రమంగా సమకూడాలన్న బైబిలు నిర్దేశాన్ని అనుసరించినప్పుడు, మనకు అవసరమైన ప్రోత్సాహం అందేలా యెహోవా చూస్తాడు. “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు” అని కీర్తనల రచయిత వ్రాసిన మాటల్లోని సత్యాన్ని మనం సమకూడినప్పుడు గ్రహించగల్గుతాం.—కీర్తన 46:1.

సంతృప్తికరమైన ప్రయోజనకరమైన పని. “మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి” అని బైబిలు సలహా ఇస్తుంది. (1 కొరింథీయులు 15:58) ‘ప్రభువు కార్యము’ నిజంగా సంతృప్తికరమైన పనేనా? క్రైస్తవ పరిచర్య వల్ల ప్రయోజనమేమైనా ఉందా?

క్రైస్తవ పరిచర్య విషయంలో అమీల్య అనే సహోదరి అనుభవాన్నే తీసుకుందాం. “విడాకులు ఇచ్చుకోబోతున్న ఇద్దరు దంపతులతో బైబిలు అధ్యయనం చేశాను. క్రూరంగా చంపబడిన ఒక అమ్మాయి తల్లికి కూడా నేను సహాయం చేయగల్గాను. మృతుల పరిస్థితి ఎలాంటిదో తెలియక ఆ స్త్రీ ఎంతో బాధననుభవించింది. బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా, ఆ దంపతులూ అలాగే ఆ స్త్రీ, మనశ్శాంతినీ నిరీక్షణనూ పొందగల్గారు. వాళ్ళకు సహాయపడడంలో నాకు కూడా కొంత భాగం ఉన్నందు వల్ల నాకెంతో ఆనందమూ సంతృప్తీ కలిగాయి” అని అమీల్య అంటోంది. “క్షేత్ర పరిచర్యలో మీకు మంచి అనుభవం కలిగినట్లయితే, మీరు క్రొత్త బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించినట్లైతే, లేదా అనియత సాక్ష్యం ఇవ్వడంలో మీరు సఫలులైతే, రానున్న సంవత్సరాల్లోను మీరు వాటి గురించి మాట్లాడుతారు. వాటి గురించి చెబుతున్న ప్రతిసారీ, మీకు మళ్ళీ మళ్ళీ అవే అనుభూతులు కలుగుతుంటాయి ! కలకాలం నిలిచే గొప్ప ఆనందాన్ని పొందేది పరిచర్యలోనే” అని స్కాట్‌ అంటున్నాడు.

ఈ వ్యక్తులు, క్రియాశీలురైన పరిచారకులుగా అవ్వమని బైబిలు ఇచ్చిన నిర్దేశాన్ని అనుసరించడం ద్వారా సంతృప్తికరమైన, ప్రయోజనకరమైన పనిని కనుగొన్నారు. దేవుని మార్గాలను సూత్రాలను అనుసరించడం ద్వారా మీరూ ప్రయోజనం పొందాలనీ వాటి గురించి ఇతరులకు తెలియజేయడంలో పాల్గొనమనీ మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం.—యెషయా 48:17; మత్తయి 28:19, 20.

దేవుని వాక్యం నుండి ప్రయోజనం పొందడం

నిస్సందేహంగా, నేటి లోకంలో, ఆచరణాత్మకమైన నిర్దేశములుగల నమ్మకమైన పుస్తకం బైబిలే. దానినుండి ప్రయోజనం పొందేందుకు, మనం ఎడతెగక కృషి చేయవలసిన అవసరం ఉంది. మనం తప్పనిసరిగా దాన్ని క్రమంగా చదవాలి, అధ్యయనం చేయాలి, దానిపై ధ్యానించాలి. “నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము” అని పౌలు బోధిస్తున్నాడు. (1 తిమోతి 4:15; ద్వితీయోపదేశకాండము 11:18-21) బైబిలులో కనుగొనబడుతున్న ఈ ఉపదేశాన్ని అన్వయించుకుంటే, మీరు సఫలీకృతులౌతారని దేవుడు హామీ ఇస్తున్నాడు. “యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.—సామెతలు 3:5, 6.

[31వ పేజీలోని చిత్రం]

బైబిలు ఉపదేశాన్ని అనుసరించినప్పుడు జీవితం మరింత సంతృప్తికరంగాను సార్థకమైనదిగాను ఉంటుంది