అనేక జనాంగాలకు వెలుగు ప్రకాశకుడు
జీవిత కథ
అనేక జనాంగాలకు వెలుగు ప్రకాశకుడు
జార్జ్ యంగ్ కథ రూత్ యంగ్ నికోల్సన్ చెప్పినది
“మన పులిపీఠాల మీద ఎందుకీ మౌనం? . . . నేను పైన పేర్కొన్న సంగతులు సత్యాలని మనకు నిరూపణ అయిన తర్వాత కూడా మనం వాటిని బోధించకుండా మౌనంగా ఉంటే మనమెలాంటి మనుష్యులం? మనం ప్రజలను అజ్ఞానంలో ఉంచకుండా సత్యాన్ని స్పష్టంగా తెలియజేద్దాం.”
ఈమాటలు చర్చి రిజిస్టర్లో నుండి తన పేరును తీసివేయమని అడుగుతూ మా నాన్నగారు 1913 లో వ్రాసిన 33 పేజీల ఉత్తరంలోని కొంతభాగం. అప్పటినుండే అనేక జనాంగాలకు వెలుగు ప్రకాశకుడిగా సేవ చేస్తూ ఆయన ఉత్తేజభరితమైన జీవితాన్ని ప్రారంభించారు. (ఫిలిప్పీయులు 2:16) నా చిన్నప్పటి నుండి, నాన్నగారి అనుభవాలను గూర్చిన కథలను, బంధువుల నుండి చరిత్రాత్మక మూలాల నుండి సేకరించాను, ఆ ముక్కలన్నింటినీ చేర్చి నాన్నగారి జీవితకథను వ్రాయడానికి స్నేహితులు సహాయం చేశారు. నాన్నగారి జీవితం నాకు చాలా విధాల్లో పౌలు జీవితాన్ని గుర్తు చేస్తుంది. ‘అన్యజనులకు అపొస్తలుడైన’ ఆయనలానే నాన్నగారు కూడా యెహోవా వర్తమానాన్ని ఏ దేశంలోనైనా ద్వీపంలోనైనా ప్రజలకు తెలియజేయడానికి ప్రయాణించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. (రోమీయులు 11:13, 14; కీర్తన 107:1-3) మా నాన్నగారైన జార్జ్ యంగ్ గురించి చెప్పనివ్వండి.
తొలి సంవత్సరాలు
మా నాన్నగారు స్కాటిష్ ప్రెస్బిటేరియన్లైన జాన్, మార్గరెట్ యంగ్‌ల చిన్న కుమారుడు. ఆ కుటుంబమంతా స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ నుండి పశ్చిమ కెనడాలోని బ్రిటీష్ కొలంబియాకు తరలివెళ్ళిన వెంటనే అంటే 1886 సెప్టెంబరు 8న ఆయన జన్మించారు. దానికి కొన్ని సంవత్సరాల ముందు ఆయన అన్నయ్యలైన అలెగ్జాండర్, జాన్, మాల్కమ్లు స్కాట్లాండ్లో జన్మించారు. వాళ్ళ చెల్లి నాన్నగారి
కన్నా రెండు సంవత్సరాలు చిన్నది, ఆమె పేరు మారియన్, కానీ ఆమెను వాళ్ళు ముద్దుగా నెల్లీ అని పిలిచేవారు.బ్రిటీష్ కొలంబియాలోని విక్టోరియాకు దగ్గరలో ఉన్న సానిచ్లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పెరుగుతూ పిల్లలు చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. అదే సమయంలో వాళ్ళు బాధ్యత చేపట్టడాన్ని కూడా నేర్చుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, అంటే మా తాత, నానమ్మలు విక్టోరియాకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటిలోని చిన్న చిన్న పనులు ముగించి ఇల్లంతా చక్కగా శుభ్రంగా ఉంచేవాళ్ళు.
కొంతకాలానికి, నాన్నగారికీ, ఆయన సహోదరులకూ గనుల్లోనూ కలపలోనూ ఆసక్తి పెరిగింది. ఈ అన్నదమ్ములు కలప కొనుగోలు చేసి అమ్మే వ్యాపారంలో మంచి పేరును సంపాదించారు, వాళ్ళ కలప వ్యాపారం బాగా సాగింది. నాన్నగారు ఆర్థిక సంబంధ వ్యవహారాలను చూసుకొనేవారు.
చివరికి, ఆధ్యాత్మిక విషయాల పట్ల నాన్నగారికి ఉన్న ఆసక్తి ఆయన ప్రెస్బిటేరియన్ పాదిరి అవ్వాలని నిర్ణయించుకొనేందుకు నడిపించింది. సరిగ్గా అదే సమయంలో జాయన్స్ వాచ్ టవర్ ట్రాక్ట్ సొసైటీ మొదటి అధ్యక్షుడైన చార్లెస్ తేజ్ రస్సెల్ ప్రసంగాలు వార్తాపత్రికలో వచ్చేవి, అవి ఆయన జీవితంపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపించాయి. నాన్నగారు నేర్చుకున్న ఆ విషయాలే మనం పైన చదివిన రాజీనామా లేఖను వ్రాసి పంపేలా ఆయనను కదిలించాయి.
ఆత్మ అమర్త్యమైనదనీ దేవుడు మానవ ఆత్మలను నిరంతరం నరకాగ్నిలో కాలుస్తాడనీ చెప్తున్న చర్చి బోధలు తప్పని నిరూపించడానికి నాన్నగారు బైబిలు వచనాలను ఉపయోగిస్తూ చాలా దయతో, చాలా స్పష్టంగా వివరించారు. త్రిత్వ సిద్ధాంతము క్రైస్తవేతర మూలం నుండి వచ్చినదని, దానికి లేఖనాధారం ఎంతమాత్రమూ లేదని కూడా నాన్నగారు నిరూపించారు. అప్పటినుండి ఆయన తనకున్న శక్తి సామర్థ్యాలను యెహోవా మహిమార్థమై వినయంతో ఉపయోగిస్తూ యేసు క్రీస్తులానే క్రైస్తవ పరిచర్యను విడువకుండా కొనసాగించారు.
వాచ్ టవర్ సొసైటి నడిపింపు క్రింద ఆయన 1917 లో పిల్‌గ్రిమ్‌గా సేవచేయడం మొదలుపెట్టారు, యెహోవాసాక్షుల ప్రయాణ ప్రతినిధులను అప్పట్లో అలా పిలిచేవారు. కెనడాలోని పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ అంతటా ఆయన ప్రసంగాలిస్తూ “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్” అని పిలువబడే చలనచిత్రాన్ని, స్లైడ్లను చూపించేవారు. మా నాన్నగారి సందర్శనమప్పుడు థియేటర్లన్నీ నిండిపోయి ఉండేవి. ఆయన పిల్గ్రిమ్ సందర్శన కొరకైన ప్రణాళిక 1921వ సంవత్సరం వరకు కావలికోటలో వచ్చేది.
విన్నీపెగ్ నందలి ఒక వార్తాపత్రిక నివేదించింది ఏమిటంటే, సువార్తికుడైన యంగ్ 2,500 మంది ప్రేక్షకుల ఎదుట మాట్లాడుతున్నప్పుడు, హాలు జనంతో నిండిపోవడంతో మిగిలిన చాలామంది లోపలికి వెళ్ళలేకపోయారు. ఒట్టావాలో ఆయన “నరకానికి వెళ్ళి తిరిగి రావడం” అనే అంశంపై ప్రసంగించారు. అక్కడ ఉన్న ఒక పెద్దాయన ఇలా అన్నాడు: “ప్రసంగం అయిపోయిన తర్వాత, ఆ అంశాన్ని గూర్చి తనతో చర్చించడానికి వేదికపైకి రమ్మని ఆయన కొంతమంది మతనాయకులను ఆహ్వానించాడు, కానీ ఎవరు వెళ్ళలేదు. నేను సత్యాన్ని కనుగొన్నానని అప్పుడే గ్రహించాను.”
నాన్నగారు తన పిల్గ్రిమ్ సందర్శనాల్లో సాధ్యమైనంత ఎక్కువ ఆధ్యాత్మిక విషయాలను చేర్చడానికి ప్రయత్నించేవారు. ఒక సందర్శనం తర్వాత ప్రణాళిక ప్రకారం మరొక ప్రదేశానికి వెళ్ళేందుకు ట్రైయిన్ అందుకోవడానికి ఆఘమేఘాల మీద వెళ్ళేవారు. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడైతే, మరో స్థలానికి వెళ్లడానికి తెల్లవారు జామునే సిద్ధపడి వెళ్ళేవారు. పట్టుదలగలవాడని మాత్రమే కాదు, ఇతరుల కష్టసుఖాలు ఆలోచించే వ్యక్తి అని కూడ నాన్నగారికి మంచి పేరుంది, అంతేకాక ఆయన తన క్రైస్తవ చర్యల మూలంగానూ ఔదార్యం మూలంగానూ మంచి పేరు సంపాదించుకున్నారు.
ఆయన హాజరైన అనేక తొలి సమావేశాల్లో ఒకటి, ప్రత్యేకంగా మరువరానిది 1918 లో ఆల్బెర్టాలోని ఎడ్మంటన్‌లో జరిగిన సమావేశం. నెల్లీ బాప్తిస్మానికి ఆయన కుటుంబ సభ్యులందరూ అక్కడ ఉన్నారు. ఆ సహోదరులందరూ కలిసి ఉన్నది అదే చివరిసారి. రెండు సంవత్సరాల తర్వాత మాల్కమ్ న్యూమోనియా వ్యాధి మూలంగా మరణించాడు. ఆయన ముగ్గురు సహోదరులు, ఆయన తండ్రి కలిగివున్నట్లుగానే మాల్కమ్ కూడా పరలోక జీవిత నిరీక్షణను కలిగివున్నాడు, వాళ్ళందరూ మరణం వరకూ దేవునికి నమ్మకంగా ఉన్నారు.—విదేశీ క్షేత్రానికి ప్రయాణం
నాన్నగారు 1921 సెప్టెంబరులో కెనడాలోని ప్రకటనా పర్యటన ముగించిన తర్వాత అప్పటి వాచ్ టవర్ సొసైటీ అధ్యక్షుడైన జోసెఫ్ ఎఫ్. రథర్‌ఫర్డ్ నిర్దేశం ప్రకారం కరీబియన్ దీవులకు వెళ్ళారు. నాన్నగారు “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్”ను చూపించిన ప్రతిచోట అది ప్రజలను బాగా ఆకట్టుకుంది. ట్రినిడాడ్ నుండి ఆయన ఇలా వ్రాశారు: “స్థలమంతా జనంతో క్రిక్కిరిసిపోవడంతో చాలామంది ప్రజలను వెనక్కి పంపిచేశారు. రెండవ రాత్రి కూడా ఆ భవనం ప్రజలతో క్రిక్కిరిసిపోయింది.”
ఆ తర్వాత 1923 లో నాన్నగారు బ్రెజిల్‌కు నియమించబడ్డారు. అక్కడ ఆయన పెద్ద సంఖ్యలోవున్న ప్రేక్షకుల ఎదుట మాట్లాడారు, కొన్నిసార్లు బయటి అనువాదకుల సహాయం తీసుకోవడం జరిగింది. డిసెంబరు 15, 1923 కావలికోట ఇలా నివేదించింది: “జూన్ 1 నుండి సెప్టెంబరు 30 వరకూ సహోదరుడైన యంగ్ 21 బహిరంగ కూటాలను నిర్వహించగా వాటికి 3,600 మంది హాజరయ్యారు, అలాగే 48 సంఘకూటాలను నిర్వహించగా వాటికి 1,100 మంది హాజరయ్యారు, పోర్చుగీసు భాషలో 5,000 పుస్తక ప్రతులను ఉచితంగా పంచిపెట్టారు.” “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది ఇంకెన్నడూ మరణించరు” అనే ప్రసంగాన్ని నాన్నగారు ఇచ్చినప్పుడు అనేకమంది ఆసక్తితో ప్రతిస్పందించారు.
బ్రెజిల్లో 1997 మార్చి 8న క్రొత్త బేతేలు భవనాలు ప్రతిష్ఠించబడినప్పుడు, దాన్ని వివరించే బ్రోషూర్ ఇలా నివేదించింది: “1923: జార్జ్ యంగ్ బ్రెజిల్‌కు వచ్చారు, రియో డి జనైరోలో ఆయన బ్రాంచ్ కార్యాలయాన్ని స్థాపించారు.” స్పానిష్ భాషలో బైబిలు సాహిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ, బ్రెజిల్ ప్రాథమిక భాషయైన పోర్చుగీస్ భాషలో కూడా బైబిలు సాహిత్యం అవసరం ఏర్పడింది. అలా, 1923 అక్టోబరు 1 నుండి కావలికోట పోర్చుగీస్ భాషలో ప్రచురించబడటం ప్రారంభమయ్యింది.
బ్రెజిల్లో నాన్నగారు చిరస్మరణీయులైన అనేకమందిని కలిశారు. వారిలో ఒకరు, జసీంతూ పీమెంటల్ కెబ్రాల్ అనే ఒక సంపన్నుడైన పోర్చుగీసు వ్యక్తి, ఆయన తన ఇంటిని కూటాలు జరుపుకునేందుకు ఇచ్చాడు. జసీంతూ త్వరలోనే బైబిలు సత్యాన్ని అంగీకరించి ఆ తర్వాత బ్రాంచ్ సిబ్బందిలో సభ్యుడయ్యాడు. మరో వ్యక్తి మాన్వెల్ డి సిల్వా జోర్డావో, ఈ యౌవనుడు ఒక పోర్చుగీసు తోటమాలి. ఈయన నాన్నగారిచ్చిన ఒక బహిరంగ ప్రసంగాన్ని విని పోర్చుగల్‌కు తిరిగి వెళ్ళి అక్కడ కల్‌పోర్చర్‌గా పనిచేయాలన్నంతగా కదిలించబడ్డాడు, అప్పట్లో యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకులను కల్పోర్చర్లని పిలిచేవారు.
నాన్నగారు బ్రెజిల్ అంతటా రైల్లో ప్రయాణిస్తూ ఆసక్తి ఉన్నవారిని కనుగొనగలిగాడు. ఆయన తన సందర్శనంలో ఒకసారి, బోనీ, కేటెరీనా గ్రీన్ అనే దంపతులను కలిసి వాళ్ళతో రెండు వారాలు గడిపి వాళ్ళకు లేఖనాలను వివరించారు. ఆ కుటుంబంలోని దాదాపు ఏడుమంది యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నారు.
మరో వ్యక్తి సేరా బెల్లోనా ఫెర్గూసన్, ఆమెను 1923 లో కలిశారు. ఆమె చిన్నప్పుడు అంటే 1867 లో, ఆమె సోదరుడైన ఎరాస్మస్ ఫుల్టన్ స్మిత్ ఇంకా కుటుంబంలోని మిగతా వాళ్ళు అమెరికా నుండి బ్రెజిల్‌కి వచ్చారు. ఆమె 1899 నుండి పోస్ట్ ద్వారా కావలికోటను క్రమంగా అందుకుంది. నాన్నగారి సందర్శన కోసం సేరా ఆమె పిల్లలు, ఇంకొక వ్యక్తి దీర్ఘకాలంగా ఎదురుచూశారు, ఆ వ్యక్తిని నాన్నగారు సెల్లీ ఆంటీ అని పిలిచేవారు, ఆ సందర్శన సమయంలో అంటే 1924, మార్చి 11న వీరందరూ బాప్తిస్మం తీసుకున్నారు.
త్వరలోనే నాన్నగారు దక్షిణ అమెరికా దేశాల్లో ప్రకటించడం మొదలుపెట్టారు. ఆయన 1924 నవంబరు 8న, పెరూ నుండి ఇలా వ్రాశారు: “లీమా, కాల్లో పట్టణాల్లో 17,000 కరపత్రాలను పంచిపెట్టడం ఇప్పుడే పూర్తి చేశాను.” ఆ తర్వాత కరపత్రాలను పంచిపెట్టడానికి ఆయన బోలీవియాకు వెళ్ళారు. ఆ సందర్శనం గురించి ఆయన, “మన తండ్రి మన కృషిని ఆశీర్వదిస్తున్నాడు. ఒక స్థానిక ఇండియన్ నాకు సహాయం చేశాడు. ఆయన ఇల్లు అమెజాన్ నది ముఖద్వారం వద్ద ఉంది. ఆయన 1,000 కరపత్రాలను కొన్ని పుస్తకాలను తనతోపాటు తీసుకొని వెళ్తున్నాడు” అని వ్రాశారు.
నాన్నగారి ప్రయత్నాలవల్ల మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలలోని చాలా దేశాల్లో బైబిలు సత్య విత్తనాలు చల్లబడ్డాయి. “జార్జ్ యంగ్ దక్షిణ అమెరికాలో రెండు సంవత్సరాల నుండి ఉంటున్నారు. . . . మాజిల్లాన్ జలసంధిలో ఉన్న పుంటా అరినాస్‌కు సత్య వర్తమానాన్ని తీసుకువెళ్ళే ఆధిక్యత ఈ ప్రియ సహోదరునికివ్వబడింది” అని 1924 డిసెంబరు 1, కావలికోట నివేదించింది. కోస్టారికా, పనామా, వెనిజ్యులా వంటి దేశాల్లో
ప్రకటనా పనికి కూడా నాన్నగారు నాయకత్వం వహించారు. ఆయనకు మలేరియా వచ్చి, ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ ఆయన ఆ పనిలో కొనసాగారు.తర్వాత యూరప్‌కు
నాన్నగారు 1925 మార్చిలో యూరప్‌కు ఓడలో ప్రయాణం ప్రారంభించారు, అక్కడ ఆయన స్పెయిన్‌లోనూ పోర్చుగల్‌లోనూ 3,00,000 బైబిలు కరపత్రాలను పంచిపెట్టాలనీ అలాగే సహోదరుడు రథర్‌ఫర్డ్ బహిరంగ ప్రసంగాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలనీ అనుకున్నారు. అయితే స్పెయిన్‌కు చేరుకున్న తర్వాత, అక్కడ మత సహనం లేకపోవడం వల్ల సహోదరుడు రథర్‌ఫర్డ్ అలాంటి ప్రసంగాలు ఇవ్వడం విషయమై నాన్నగారు అభ్యంతరం తెలిపారు.
దానికి ప్రతిస్పందనగా సహోదరుడు రథర్‌ఫర్డ్, “నేను ఆకాశములను స్థాపించునట్లును, భూమిపునాదులను వేయునట్లును, నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను” అని ఉన్న యెషయా 51:16ను ఎత్తి చెప్తూ వ్రాశారు. దానితో నాన్నగారు ఇలా ముగింపుకు వచ్చారు: “నేను ముందుకు సాగి, ఫలితాలను తనకే విడిచిపెట్టాలన్నది ప్రభువు చిత్తమే.”
సహోదరుడైన రథర్‌ఫర్డ్ ఒక అనువాదకుని సహాయంతో 1925, మే 10న బార్సిలోనాలోని నోవిడాడెస్ థియేటర్లో ప్రసంగాన్నిచ్చారు. ఒక ప్రభుత్వ అధికారి, స్టేజి మీదున్న ఒక ప్రత్యేక గార్డ్‌తో సహా 2,000 కంటే ఎక్కువమంది హాజరయ్యారు. మాడ్రిడ్‌లో కూడా అదే విధమైన పద్ధతి అవలంబించబడింది, అక్కడ 1,200 మంది హాజరయ్యారు. ఈ ప్రసంగాల వల్ల ఏర్పడిన ఆసక్తి ఫలితంగా, యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం 1978 చెప్తున్నట్లుగా, “జార్జ్ యంగ్ నడిపింపు క్రింద” స్పెయిన్‌లో బ్రాంచి కార్యాలయం స్థాపించబడింది.
సహోదరుడు రథర్‌ఫర్డ్ 1925 మే 13న, పోర్చుగల్‌కు రాజధానియైన లిస్బన్లో ప్రసంగించారు. చర్చి పాదిరీలు కేకలువేస్తూ కుర్చీలను విరగగొట్టి కూటానికి అంతరాయం కలిగించాలని చూసినా అక్కడ కూడా ఆయన సందర్శన విజయవంతమైంది. స్పెయిన్‌లోనూ పోర్చుగల్‌లోనూ సహోదరుడు రథర్‌ఫర్డ్ ప్రసంగాలు ఇచ్చిన తర్వాత నాన్నగారు “ఫోటో డ్రామా”ను చూపించేవారు, ఆ ప్రదేశాల్లో బైబిలు సాహిత్యాన్ని ముద్రించి పంచిపెట్టేందుకు ఏర్పాట్లు కూడా ఆయన చేశారు. సువార్త “స్పెయిన్‌లోని ప్రతి నగరంలోనూ పట్టణంలోనూ ప్రకటించబడింది” అని 1927 లో ఆయన నివేదించారు.
రష్యాలో ప్రకటించడం
నాన్నగారి తర్వాత మిషనరీ నియామకం రష్యాలో, 1928 ఆగస్టు 28న ఆయన అక్కడికి చేరుకున్నారు. ఆయన 1928 అక్టోబరు 10న, వ్రాసిన ఒక ఉత్తరంలో కొంతభాగం ఇలా ఉంది:
“రష్యాకు వచ్చిన తర్వాత నేను నిజంగానే ‘నీరాజ్యము వచ్చుగాక’ అని హృదయపూర్వకంగా ప్రార్థించాను. నేను నెమ్మదిగానే భాషను నేర్చుకుంటున్నాను. నా అనువాదకుడు చాలా అసాధారణమైన వ్యక్తి, ఆయన యూదుడు, కానీ ఆయన క్రీస్తును నమ్ముతాడు, బైబిలును ఇష్టపడతాడు. నాకు కొన్ని ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయి, కానీ నేను ఎంత కాలం ఇక్కడ ఉండేందుకు అనుమతింపబడతానన్నది నాకు తెలియదు. గత వారం 24 గంటలలో నన్ను వెళ్ళిపొమ్మన్నారు, కానీ ఆ సమస్య పరిష్కరించబడటంతో నేను చాలా ఎక్కువ కాలమే ఉండగలను.”
ఇప్పటి యుక్రేయిన్‌లో ప్రముఖ నగరమైన ఖార్కోవ్‌లోని కొంతమంది బైబిలు విద్యార్థులను కలిసి పరస్పరం యోగ క్షేమాలు తెలుసుకోవడంతో వారి కళ్ళల్లోంచి ఆనందబాష్పాలు జలజలా రాలాయి. ప్రతి రోజు అర్థరాత్రి వరకూ ఒక చిన్న సమావేశము జరిగేది. సహోదరులతో జరిగిన ఈ సమావేశం గురించి వ్రాస్తూ నాన్నగారిలా పేర్కొన్నారు: “అధికారులు ఆ సహోదరుల దగ్గరున్న కొన్ని పుస్తకాలనూ లాక్కున్నారు, వారితో అంత స్నేహంగాలేకపోయినా, సహోదరులు సంతోషంగానే ఉన్నారు.”
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 1997 జూన్ 21న క్రొత్త బ్రాంచి సదుపాయాలను ప్రతిష్ఠించినప్పుడు రూపొందించబడిన ఒక ప్రత్యేక బ్రోషూర్‌లో, రష్యాలో నాన్నగారు చేసిన పరిచర్య ఉన్నతపర్చబడింది. నాన్నగారిని మాస్కోకు పంపించారనీ, “ఫ్రీడమ్ ఫర్ ద పీపుల్స్, వేర్ ఆర్ ద డెడ్? అనే చిన్న పుస్తకాల 15,000 కాపీలను ఉత్పత్తి చేసి రష్యాలో పంచిపెట్టడానికి” ఆయన అనుమతి సంపాదించారనీ ఆ బ్రోషూర్ చెబుతుంది.
రష్యా నుండి తిరిగి వచ్చిన తర్వాత పిల్గ్రిమ్ పని కోసం నాన్నగారిని అమెరికాకు పంపించారు. ఆయన దక్షిణ డకోటాలో నెల్లేనా, వెర్దా పూల్ అనే ఇద్దరు సహోదరీల గృహాన్ని సందర్శించారు, స్వంత అక్కచెళ్లెలైన వాళ్లిద్దరూ చాలా సంవత్సరాల తర్వాత పెరూలో మిషనరీలయ్యారు. నాన్నగారు అలుపెరుగక చేసిన పరిచర్యపట్ల వాళ్లు అనురాగపూరితమైన మెప్పుదలను వ్యక్తం చేస్తూ ఇలా పేర్కొన్నారు: “పాత కాలంలోని ఆ సహోదరులకు నిజంగా పయినీరు స్ఫూర్తి ఉండేది, ఎందుకంటే వాళ్ళు తమ వద్ద వస్తుసంబంధంగా ఎక్కువేమీ లేకపోయినా యెహోవా పట్ల పొంగిపొరలుతున్న ప్రేమ వల్లనే ఆ విదేశీ ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళు సాధించిన ఘనవిజయాలకు ప్రేరణ ఆ ప్రేమే.”
వివాహం, రెండవ ప్రయాణం
ఒంటారియాలోని మానిటోలిన్ ద్వీపానికి చెందిన హబ్బెర్ట్ క్లారాతో నాన్నగారు చాలా సంవత్సరాలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఒహాయాలోని కొలంబస్లో 1931 జూలై 26న జరిగిన సమావేశంలో బైబిలు విద్యార్థులు యెహోవాసాక్షులనే పేరును స్వీకరించారు, ఆ సమావేశానికి వారిద్దరూ హాజరయ్యారు. (యెషయా 43:10-12) ఒక వారం తర్వాత వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. చాలా త్వరలోనే నాన్న తిరిగి రెండవ మిషనరీ ప్రయాణానికి కరీబియన్ ద్వీపాలకు వెళ్ళిపోయారు. అక్కడ ఆయన కూటాలను సంస్థీకరించడానికి, ఇంటింటి పరిచర్యలో ఇతరులకు శిక్షణనివ్వడానికి సహాయపడ్డారు.
సురినామ్, సెయింట్ కీట్స్ల నుండీ ఇంకా ఇతర ప్రదేశాల నుండీ చిత్రాలు, కార్డులు, ఉత్తరాలు అమ్మకు పంపిస్తూ ఉండేవారు. ఆయన వ్రాసిన ఉత్తరాల్లో ప్రకటనా పని యొక్క అభివృద్ధి గురించీ కొన్నిసార్లు ఆయన ఉంటున్న దేశంలోని పక్షులు, జంతువులు, మొక్కలను గురించీ ఏదో ఒక అంశం ఉండేది. నాన్నగారు కరీబియన్‌లోని తన నియమకాన్ని 1932 జూన్‌కల్లా పూర్తి చేసి, ఎప్పటిలానే ఓడలో తిరిగి కెనడాకి వచ్చేశారు. ఆ తర్వాత, ఆయనా అమ్మ కలిసి 1932/33 లో చలికాలాన్ని గడిపేందుకు ఒట్టావా ప్రాంతానికి వెళ్ళి, అక్కడ ఇతర పూర్తికాల పరిచారకుల పెద్ద గుంపుతో పూర్తికాల ప్రకటనా పనిని చేపట్టారు.
స్వల్పమైన కుటుంబ జీవితం
మా అన్నయ్య డేవిడ్ 1934 లో జన్మించాడు. ఇంకా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే అమ్మ టోపీల డబ్బా మీద నిలబడి తన “ప్రసంగాలను” ప్రాక్టీస్ చేసేవాడు. తన జీవితమంతటిలోనూ ఆయన తన తండ్రిలానే యెహోవా పట్ల ఉత్సాహాన్ని కనపర్చాడు. కెనడా తూర్పు తీరం నుండి పశ్చిమ తీరం వరకున్న సంఘాలను వాళ్ళు సందర్శిస్తున్నప్పుడు, ముగ్గురు కలసి సౌండ్ పరికరాలను కారు పైన పెట్టుకుని కారులో ప్రయాణించేవారు. నాన్నగారు బ్రిటీష్ కొలంబియాలో సేవ చేస్తున్నప్పుడు 1938 లో నేను పుట్టాను. నన్ను మంచంమీద పడుకోబెట్టి నాన్నగారు, అమ్మ, డేవిడ్ ముగ్గురూ మంచం చుట్టూ మోకాళ్ళూనితే నాన్నగారు నా గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించడం డేవిడ్‌కు జ్ఞాపకం ఉంది.
మేము 1939 చలికాలంలో వాంకూవర్‌లో ఉండగా నాన్నగారు చుట్టు ప్రక్కల సంఘాలను దర్శించేవారు. సంవత్సరాలన్నింటిలో మేము అందుకున్న ఉత్తరాల్లో ఒకటి ఆయన జనవరి 14, 1939 లో బ్రిటీష్ కొలంబియాలోని వెర్నోన్లో ఉన్నప్పుడు వ్రాసినది. ఆయన క్లారా, డేవిడ్ మరియు రూత్లకు వ్రాసిన ఆ ఉత్తరంలో, “మీకు నా ముద్దులు, ప్రేమలు” అని తెలియజేశారు. అందులో మాకు ప్రతి ఒక్కరికీ సందేశం ఉంది. అక్కడ కోత విస్తారంగా ఉందనీ పనివారు కొద్దిగా ఉన్నారనీ ఆయన అన్నారు.—మత్తయి 9:37, 38.
తన నియామకం నుండి వాంకూవర్‌కు తిరిగి వచ్చిన ఒక వారం తర్వాత ఒక కూటంలో నాన్నగారు సృహతప్పి పడిపోయారు. ఒకదాని తర్వాత మరొకటి పరీక్షలు చేయగా ఆయనకు మెదడులో క్యాన్సర్‌కు సంబంధించిన కంతి ఉందని నిర్ధారించబడింది. ఆయన 1939 మే 1న, తన భూజీవితాన్ని ముగించారు. అప్పుడు నాకు తొమ్మిదినెలలు, డేవిడ్‌కు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు. పరలోక నిరీక్షణ కలిగిన మా ప్రియమైన అమ్మ కూడా 1963 జూన్ 19న తన మరణం వరకూ దేవునికి నమ్మకంగా నిలిచింది.
చాలా దేశాలకు సువార్తను తీసుకెళ్ళడమనే తనకున్న ఆధిక్యతను గురించి ఆయనెలా భావిస్తున్నారన్నదాని గురించి అమ్మకు వ్రాసిన ఒక ఉత్తరంలో చాలా చక్కగా వ్రాశారు. దానిలో ఆయనిలా చెప్పారు: “ఈ దేశాలకు రాజ్యసందేశాన్ని తెలియజేసేందుకు వెలుగు ప్రకాశకునిగా వెళ్ళేలా యెహోవా దయాపూర్వకంగా అనుమతించాడు. ఆయన పరిశుద్ధనామం స్తుతించబడాలి. దౌర్భల్యత, అయోగ్యత, బలహీనతల్లో ఆయన మహిమ ప్రకాశిస్తుంది.”
ఇప్పుడు జార్జ్, క్లారా యంగ్‌ల పిల్లలు, మనుమలు, మునిమనుమలు కూడా మన ప్రేమగల దేవుడైన యెహోవాను సేవిస్తున్నారు. “మీరు చేసిన కార్యమును, . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు” అని చెప్తున్న హెబ్రీయులు 6:10ని నాన్నగారు తరచూ ఎత్తిచెప్పే వారన్న సంగతి నాకు తెలిసింది. మేము కూడా నాన్నగారి పనిని మర్చిపోలేదు.
[23వ పేజీలోని చిత్రం]
కుడిప్రక్క, తన ముగ్గురి సహోదరులతో మా నాన్నగారు
[25వ పేజీలోని చిత్రాలు]
సహోదరులైన వుడ్వోర్త్, రథర్‌ఫర్డ్, మెక్‌మిలన్‌తో నాన్నగారు (నిలబడ్డారు)
క్రింద: సహోదరుడైన రస్సెల్‌తో ఉన్న గుంపులో నాన్నగారు (పూర్తిగా ఎడమవైపుకు)
[26వ పేజీలోని చిత్రాలు]
అమ్మ, నాన్న
క్రింద: వాళ్ళ పెళ్ళిరోజు
[27వ పేజీలోని చిత్రం]
నాన్నగారు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత డేవిడ్‌తో అమ్మతో