అంతియొకయలో పెరుగుదలకు హింసాకాండ కారణమవుతుంది
అంతియొకయలో పెరుగుదలకు హింసాకాండ కారణమవుతుంది
స్తెఫను హత సాక్షియైన తర్వాత తమపై కూడా హింస చెలరేగడంతో, చాలా మంది యేసు శిష్యులు యెరూషలేము నుండి పారిపోయారు. వాళ్ళు అలా పారిపోతూ ఆశ్రయాన్ని పొందిన స్థలాల్లో ఒకటి సిరియాలోని అంతియొకయ. అది యెరూషలేముకు ఉత్తరాన 350 మైళ్ళ దూరంలో ఉంది. (అపొస్తలుల కార్యములు 11:19) ఆ తర్వాత జరిగిన సంఘటనలు క్రైస్తవ చరిత్రంతటిపైనా ప్రభావం చూపాయి. అప్పుడు ఏం జరిగిందో అర్థం చేసుకునేందుకు, అంతియొకయ గురించి కొంత తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.
విస్తీర్ణాన్నీ, సిరిసంపదలను, ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుంటే, రోమా సామ్రాజ్యంలోని నగరాల్లో రోమ్, అలెగ్జాండ్రియాల తర్వాత అంతియొకయ వస్తుంది. అంతియొకయ, సిరియాలో ఉన్న ఒక ముఖ్య నగరం. ఈ నగరంలో ఎక్కువ భాగం మధ్యధరా సముద్రానికి ఈశాన్యమున ఉండేది. అంతియొకయ (టర్కీలోని ఆధునిక అంటాక్యా), పడవ ప్రయాణం చేయగల ఒరాంటీజ్ నది ఒడ్డున ఉంది. ఈ నది 20 మైళ్ళ దూరంలో ఉన్న సెలూసియా పెరియా ఓడరేవుకు ప్రవహిస్తుంది. రోమ్‌కీ, టైగ్రీస్-యూఫ్రటీస్ లోయ ప్రాంతానికీ మధ్య ఉన్న వ్యాపార రవాణా మార్గాలు అంతియొకయ నగరపు అధీనంలో ఉండేవి. ఈ నగరం, వాణిజ్య కేంద్రంగా ఉండేది, సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలతోను వ్యాపారం చేసేది. అలా అన్ని రకాల ప్రజలూ ఇక్కడికి రాకపోకలు జరిపేవారు. ఇక్కడికి వచ్చేవారు రోమా సామ్రాజ్యపు నలుమూలల జరుగుతున్న మతోద్యమాలన్నింటిని గురించిన వార్తలను తీసుకువచ్చేవారు.
గ్రీకుల మతమూ, తత్త్వశాస్త్రమూ అంతియొకయలో బాగా అభివృద్ధి చెందాయి. కానీ, “క్రీస్తు కాలంలో, ప్రజలు తమ సమస్యలను బట్టి, లక్ష్యాలను బట్టి, తమకిష్టమున్న మతంలో సంతృప్తిని పొందనారంభించడంతో, పాత మత తెగలను, తత్త్వశాస్త్రాలను అనుసరించాలా వద్దా అన్నది వ్యక్తిగత విషయాలుగా మారాయి” అని చరిత్రకారుడైన గ్లాన్‌వల్ డావ్‌నీ అంటున్నారు. (ఎ హిస్టరీ ఆఫ్ ఆంటియోక్ ఇన్ సిరియా) యూదా మతపు ఏకదైవారాధనలోను, ఆచారాల్లోను, నైతికతలోను అనేకులు సంతృప్తిని కనుగొన్నారు.
సా.శ.పూ. 300 లో, అంతియొకయ నగరపు పునాదివేయబడినప్పటి నుండే యూదుల పెద్ద జనసమూహము అక్కడ నివసించనారంభించింది. అక్కడి మొత్తం జనసంఖ్యలో పది శాతం కన్నా ఎక్కువ మంది యూదులేనని, అంటే యూదుల సంఖ్య 20,000 నుండి 60,000 వరకు ఉండేదని అంచనావేయబడింది. సెలూసిడ్ రాజవంశస్థులు యూదులకు సంపూర్ణ పౌర హక్కులను ఇచ్చి, ఆ నగరంలో ఉండమని ప్రోత్సహించారని చరిత్రకారుడైన జోసిఫస్ అంటున్నారు. వారి కాలంలో, హెబ్రీ లేఖనాలు గ్రీకు భాషలో లభ్యమయ్యేవి. అలా లభ్యం కావడం వల్ల, యూదుల్లాగే, మెస్సీయను గురించి నిరీక్షించిన యూదేతరులలో ఆసక్తి కలిగింది. ఆ విధంగా గ్రీకు దేశస్థుల్లో, అనేకులు యూదా మతానుసారులుగా మారారు. ఈ కారకాల వల్లే, అంతియొకయ, క్రీస్తు శిష్యులను తయారు చేసేందుకు సారవంతమైన క్షేత్రంగా మారింది.
అన్యులకు సాక్ష్యమివ్వడం
హింసాకాండ తలెత్తడంతో, యెరూషలేము నుండి చెల్లాచెదరై పోయిన యేసు అనుచరుల్లో అనేకులు తమ విశ్వాసాన్ని యూదులతో మాత్రమే పంచుకుంటున్నారు. అయితే, కుప్ర నుండీ కురేనియ నుండీ అంతియొకయకు వెళ్ళిన కొందరు శిష్యులు “గ్రీసు దేశపువారితో” అపొస్తలుల కార్యములు 11:20) సా.శ. 33వ సంవత్సరం పెంతెకొస్తు పండుగ దినము నుండి, గ్రీకు మాట్లాడే యూదులకూ, యూదా మతానుసారులకూ సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ, అంతియొకయలో జరిగిన ప్రకటనా పనిలో క్రొత్తదనం ఉంది. అది ఏంటంటే, అక్కడ యూదులకు మాత్రమే కాక అన్యులకు కూడా ప్రకటిస్తున్నారు. నిజమే, అన్యుడైన కొర్నేలీ, ఆయన కుటుంబ సభ్యులూ అప్పటికే శిష్యులయ్యారు. అయితే వాళ్ళు అలా శిష్యులయ్యేందుకు సహాయపడటానికి, అన్యులకు లేదా ఇతర జనాంగములకు ప్రకటించడం సముచితమేనని అపొస్తలుడైన పేతురు గ్రహించేందుకు యెహోవా ఒక దర్శనాన్ని ఉపయోగించవలసి వచ్చింది.—అపొస్తలుల కార్యములు 10:1-48.
కూడా తమ విశ్వాసాన్ని గురించి మాట్లాడారు. (అనేక సంవత్సరాలుగా అనేక మంది యూదులు అంతియొకయ నగరంలో ఉండేవారు. అక్కడ యూదులకూ అన్యులకూ మధ్య పెద్దగా శత్రు భావాలేమీ ఉండేవి కావు. కనుక యూదేతరులు క్రీస్తును గురించిన సాక్ష్యాన్ని అంగీకరించి, సువార్తకు అనుకూలంగా ప్రతిస్పందించారు. అవును, అలాంటి వికాసానికి తగిన వాతావరణం అక్కడ ఉంది. ఆ విధంగా అక్కడ, సువార్తను “నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.” (అపొస్తలుల కార్యములు 11:21) ఒకప్పుడు అన్యదేవుళ్ళను ఆరాధించి ఆ తర్వాత యూదా మతానుసారులైనవాళ్ళు క్రైస్తవులుగా మారారు, వాళ్ళు, అప్పటికింకా అబద్ధ దేవుళ్ళను ఆరాధిస్తున్న మిగతా అన్యులకు సాక్ష్యమివ్వడానికి సాటిలేని స్థానంలో ఉన్నారు.
యెరూషలేములోని సంఘం, అంతియొకయలోని సువార్త విస్తరణను గురించి విన్నప్పుడు, అక్కడి విషయాలను తెలుసుకునేందుకు బర్నబాను పంపింది. ఆయనను పంపడం వివేకవంతమైనది, ప్రేమపూర్వకమైనది. ఎందుకంటే, బర్నబా కుప్రీయుడు. ఇక్కడి యూదేతరులకు ప్రకటించనారంభించినవారిలో కొందరు కుప్రీయులే. కనుక, అంతియొకయలోని అన్యులతో వ్యవహరించడం బర్నబాకి ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించి ఉండదు. అలాగే, వాళ్ళు కూడా, ఆయనను తమకు పరిచయమున్న సమాజపు సభ్యుడిగా చూసి ఉంటారు. * కనుక, అక్కడ జరుగుతున్న పనికి ఆయన మద్దతు ఇవ్వగల్గాడు. ఆయన అక్కడ ‘దేవుని కృపను చూసి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనండి అని అందరిని హెచ్చరించాడు.’ అప్పుడు ‘అనేక మంది ప్రభువు పక్షమున చేరారు.’—అపొస్తలుల కార్యములు 11:22-24.
చరిత్రకారుడైన డౌనీ సూచిస్తున్నట్లు, ‘ఇక్కడ మొదట్లో జరిగిన ప్రకటనా పని సఫలమవ్వడానికి కారణాలు: మిషనరీలు యెరూషలేములో యూదా మత ఛాందసులకు భయపడినట్లు, ఈ నగరంలో భయపడవలసిన అవసరం ఉండేది కాదు; యూదా మత ఛాందసులను యూదా అధికారులు (కనీసం ఈ కాల వ్యవధిలో) నియంత్రించలేకపోవడం మూలంగా యెరూషలేములో హింసాకాండ జరిగినట్లు ఇక్కడి ప్రజలు హింసాత్మకంగా విరుచుకుపడే అవకాశాలు అధికంగా ఉండేవి కావు, ఎందుకంటే సిరియా రాజధానియైన ఈ నగరాన్ని ఒక లెగేట్ పరిపాలించడం వల్ల ప్రజా జీవితంలో చాలా మంచి క్రమబద్ధత ఉండేది.’
ఇలాంటి అనుకూలమైన పరిస్థితుల్లో, చేయవలసిన కార్యాలు ఎన్నో ఉండగా, తనకు సహాయం అవసరమని బర్నబా గ్రహించి, తన స్నేహితుడైన సౌలును గురించి ఆలోచించాడు. సౌలు లేదా పౌలు గురించి ఎందుకు ఆలోచించాడు? పౌలు 12 మంది అపొస్తలులలో ఒకడు కాకపోయినప్పటికీ, జనాంగముల దగ్గరకు వెళ్ళేందుకు ఆయన అపొస్తలత్వమును పొందాడు. (అపొస్తలుల కార్యములు 9:15, 27; రోమీయులు 1:7; ప్రకటన 21:14) కనుక, అన్య నగరమైన అంతియొకయలో సువార్తను ప్రకటించేందుకు పౌలు తగిన సహచరుడే. (గలతీయులు 1:15, 16) కనుక, బర్నబా తార్సుకు వెళ్ళి, సౌలును కనుగొని, ఆయనను అంతియొకయకు తీసుకువచ్చాడు.—అపొస్తలుల కార్యములు 11:25, 26; 26-7 పేజీల్లోని బాక్సును చూడండి.
దేవుని కటాక్షముతో క్రైస్తవులు అని పిలువబడ్డారు
బర్నబా, సౌలూ, సంవత్సరమంతా “సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.” యూదులు యేసును మెస్సీయగా గానీ క్రీస్తుగా గానీ అంగీకరించరు. యేసు అనుచరులను క్రైస్తవులని వాళ్ళే పిలిస్తే, ఆయన క్రీస్తు అని వాళ్ళు పరోక్షంగా అంగీకరించినట్లవుతుంది. కాబట్టి, యేసు అనుచరులను క్రైస్తవులు (గ్రీకులో) లేదా మెస్సీయనిస్టులు (హెబ్రీలో) అని మొదట పిలిచింది యూదులై ఉండరు. అన్యులే పరిహాస భావంతో లేదా తిరస్కార భావంతో వాళ్ళకు ఎగతాళిగా ఆ పేరు పెట్టి ఉంటారని కొందరు అనుకుంటారు. అయితే క్రైస్తవులు అనే పేరు దేవుడు ఇచ్చినదే అని బైబిలు చూపిస్తుంది.—అపొస్తలుల కార్యములు 11:26.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, క్రొత్త పేరుకు సంబంధించి ఉపయోగించిన క్రియాపదాన్ని, ‘అనబడిరి’ అని గానీ పిలువబడిరి అని
గానీ అనువదించారంటే, ప్రకృతాతీమైన, లేదా ప్రవచన సంబంధమైన లేదా దైవికమైన ఏదైన ఒక విషయంతో ఆ క్రియా పదానికి సాధారణంగా సంబంధం ఉంటుంది. కనుక, దాన్ని అనువదించడానికి, “ప్రవచించడం” “దైవికంగా తెలియజేయడం,” లేదా “దైవిక ఆజ్ఞగానీ ఉపదేశం గానీ ఇవ్వడం లేదా పరలోకం నుండి బోధించబడడం” అనే క్రియా పదాలను విద్వాంసులు ఉపయోగిస్తారు. యేసు అనుచరులు దేవుని కటాక్షము ద్వారా క్రైస్తవులు అని పిలువబడ్డారు. వాళ్ళకు ఆ పేరు పెట్టేందుకు యెహోవాయే సౌలునూ, బర్నబానూ నడిపించి ఉంటాడు.క్రీస్తు శిష్యులకు క్రైస్తవులు అనే క్రొత్త పేరు అలాగే ఉండిపోయింది. వాళ్ళు యూదా మతానికి సంబంధించిన ఒక తెగవారని ఎవరూ ఇక పొరబడరు. వాళ్ళు యూదా మతస్థులకు చాలా భిన్నమైనవారని సులభంగా గుర్తించవచ్చు. సా.శ. 58 నాటికి, రోమా అధికారులకు సహితం క్రైస్తవులు అంటే ఎవరో బాగా తెలుసు. (అపొస్తలుల కార్యములు 26:28) చరిత్రకారుడైన టాసిటస్ అభిప్రాయం ప్రకారం, సా.శ. 64 నాటికి, రోమ్‌లోని ప్రజల మధ్య కూడా ఈ పేరు బాగా చలామణి అయ్యింది.
యెహోవా తన పట్ల నమ్మకంగా ఉండేవారిని ఉపయోగించుకుంటాడు
అంతియొకయలో సువార్త బాగా ప్రచురించబడింది. ప్రకటిస్తూనే ఉండాలన్న యేసు అనుచరుల దృఢ సంకల్పానికి యెహోవా ఆశీర్వాదం తోడు కావడం వల్ల, మొదటి శతాబ్దంలో క్రైస్తవత్వానికి అంతియొకయ కేంద్రమైంది. సువార్తను సూదూర ప్రాంతాల వరకు వ్యాపింపజేసేందుకు దేవుడు ఈ సంఘాన్ని ఉపయోగించాడు. ఉదాహరణకు, పౌలు క్రొత్తగా చేసే మిషనరీ ప్రయాణాలన్నీ అంతియొకయ నుండే మొదలయ్యేవి.
ఆధునిక దినాల్లో, వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ, క్రైస్తవుల్లో అభినివేశమూ దృఢ నిశ్చయమూ ఉండడం, నిజ క్రైస్తవత్వం వ్యాప్తి చెందడానికి తోడ్పడుతోంది. అలా వ్యాప్తి చెందడం వల్ల, అనేకులు సువార్తను విని, దాని మీద మెప్పుదల చూపించగలుగుతున్నారు. * కనుక మీరు స్వచ్ఛారాధనకు మద్దతునిస్తున్నందువల్ల మీరు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లయితే, యెహోవా దాన్ని అనుమతించడానికి ఆయనకు ఏవో కారణాలు ఉండి ఉంటాయన్న విషయాన్ని మనస్సులో పెట్టుకోండి. దేవుని రాజ్యాన్ని గురించి విని, దాని పక్షంగా నిలబడగల్గేందుకు మొదటి శతాబ్దంలోలాగే నేటి ప్రజలకు కూడా అవకాశమివ్వడం తప్పనిసరి. సత్యాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని తెలుసుకునేలా ఒకరికి మీరు సహాయపడేందుకు కావలసిందల్లా మీరు యెహోవాకు నమ్మకంగా సేవచేస్తూనే ఉండాలన్న మీ దృఢ నిశ్చయమే కావచ్చు.
[అధస్సూచీలు]
^ పేరా 9 పగలు బాగా వెలుతురు ఉన్నప్పుడు, అంతియొకయకు నైరృతిన ఉన్న కాసీయస్ పర్వతం దగ్గర నుండి చూస్తే కుప్ర దీవి కనిపిస్తుంది.
^ పేరా 18 ఆగస్టు 1, 1999 కావలికోట 9వ పేజీ; మే 8, 1999 తేజరిల్లు ! 13-4 పేజీలు; 1999 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం, 250-2 పేజీలు చూడండి.
[26, 27వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
సౌలు గురించి “తెలియని సంవత్సరాలు”
దాదాపు సా.శ. 36 లో యెరూషలేములో పౌలును చంపాలని యూదులు చేసిన పథకాన్ని ఆయన తోటి విశ్వాసులు విఫలం చేసి, ఆయనను తార్సుకు పంపిన సంఘటననూ ఆ తర్వాత, దాదాపు సా.శ. 45 లో సౌలు అంతియొకయకు వెళ్ళిన విషయాన్నీ అపొస్తలుల కార్యములు పేర్కొంది. (అపొస్తలుల కార్యములు 9:28-30; 11:25) అయితే, సా.శ. 36కీ 45కీ మధ్య ఉన్న తొమ్మిది సంవత్సరాల్లో సౌలు ఏమి చేశాడన్నది ప్రత్యక్షంగా పేర్కొనలేదు. ఆ సంవత్సరాల్లో ఆయన ఏమి చేసి ఉంటాడు?
ఆయన యెరూషలేము నుండి సిరియాకూ కిలికియకూ వెళ్ళాడు, “మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి” యూదయలో ఉన్న సంఘంలోనివారు విన్నారు. (గలతీయులు 1:21-24) వాళ్ళు విన్నది, అంతియొకయలో, బర్నబాతోపాటు ఆయన చేసిన పరిచర్యను గురించి కావచ్చు. అయితే, సౌలు అంతియొకయకు వెళ్ళక ముందు కూడా ఊరికనే ఉండలేదు. సా.శ. 49 నాటికి, సిరియాలోను, కిలికియలోను అనేక సంఘాలు ఉన్నాయి. అంతియొకయలో ఒక సంఘం ఉండేది, ఆ సంఘం తప్పించి మిగతా సంఘాలన్నీ, ఆ తొమ్మిది సంవత్సరాల కాలంలోనే సౌలు పరిచర్య మూలంగా ఉనికిలోకి వచ్చి ఉంటాయని కొందరు అనుకుంటారు.—అపొస్తలుల కార్యములు 11:26; 15:23, 40, 41.
సౌలు జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు ఈ కాలవ్యవధిలోనే జరిగి ఉంటాయని కొందరు పండితులు నమ్ముతున్నారు. ‘క్రీస్తు పరిచారకుడు’గా ఆయన తన మిషనరీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఆ తొమ్మిది సంవత్సరాల్లో కాకుండా మరెప్పుడు అనుభవించి ఉంటాడన్నది చెప్పడం కష్టమే. (2 కొరింథీయులు 11:23-27) సౌలు ఐదు సార్లు 39 దెబ్బలు చొప్పున తిన్నది ఎప్పుడు? బెత్తముతో మూడుసార్లు దెబ్బలు తిన్నది ఎక్కడ ఉన్నప్పుడు? “అనేక పర్యాయములు” చెరసాలలో ఉన్నది ఎక్కడ? ఆయన రోమ్‌లో నిర్బంధంలో ఉన్నది వీటి తర్వాతనే. ఫిలిప్పీలో, ఆయనను కొట్టి జైలులో ఒకసారి వేసిన వృత్తాంతం బైబిలులో ఉంది. మరైతే ఆయన జైలులో వేయబడిన మిగతా సందర్భాల విషయమేమిటి? (అపొస్తలుల కార్యములు 16:22, 23) “డయాస్పోరాలోని సమాజమందిరాల్లో క్రీస్తును గురించి సౌలు సాక్ష్యమిచ్చిందీ, మతాధికారులూ ప్రభుత్వాధికారులూ ఆయనపై హింసను తలపెట్టిందీ” ఈ కాలవ్యవధిలోనే అని ఒక లేఖికుడు సూచిస్తున్నాడు.
ఓడ బద్దలయిన పరిస్థితిని సౌలు నాలుగు సార్లు ఎదుర్కొన్నాడు. కానీ లేఖనాలు కేవలం ఒక సందర్భాన్ని గురించిన వివరణలనే ఇస్తున్నాయి. అది, ఆయన కొరింథీయులకు వ్రాసిన పత్రికలో తాను పడిన కష్టాలను గురించిన పట్టికను ఇచ్చిన తర్వాత జరిగింది. (అపొస్తలుల కార్యములు 27:27-44) మరో మూడుసార్లు ఓడ బద్ధలైనది, ఆయన చేసిన మనకు తెలియని ప్రయాణాల్లో ఎదురై ఉండవచ్చు. సౌలు ఇచ్చిన పట్టికలోని అన్నీ గానీ, కొన్ని గానీ ఈ “తెలియని సంవత్సరాల్లోనే” జరిగి ఉండవచ్చు.
‘క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు, పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మనుష్యుడు పలకకూడని మాటలు వినెను’ అని 2 కొరింథీయులు 12:2-5 లో సౌలు వర్ణించిన మరొక సంఘటన ఈ కాలఘట్టంలోనే జరిగి ఉండవచ్చునని అనిపిస్తుంది. ఈ వచనాల్లో, పౌలు తన గురించే మాట్లాడుతున్నాడన్నది స్పష్టం. ఆయన ఈ మాటలను దాదాపు సా.శ. 55 లో వ్రాశాడు. ఈ సంఘటన ఆయన వ్రాసిన నాటికి 14 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే పౌలును గురించి “తెలియని సంవత్సరాల” మధ్య కాలంలో, అంటే సా.శ. 41 లో జరిగింది.
నిస్సందేహంగా, ఈ దర్శనం, సౌలుకు అసమానమైన అవగాహనను కలిగించి ఉంటుంది. “అన్యజనులకు అపొస్తలుడు”గా ఆయనను సమర్థుడుగా చేసేందుకే ఈ దర్శనం కలిగి ఉంటుందా? (రోమీయులు 11:14) ఈ దర్శనం, ఆయన ఆలోచనా విధానాన్నీ, వ్రాతలనూ, మాటలనూ ప్రభావితం చేసి ఉంటుందా? సౌలు క్రైస్తవుడుగా మారినది మొదలుకొని, అంతియొకయలో సేవచేయడానికి పిలువబడినప్పటి వరకు ఉన్న కాలం, భవిష్యత్తు నియామకం కోసం తర్ఫీదు పొందేందుకు పరిపక్వతను సాధించేందుకు ఆయనకు తోడ్పడిందా? అలాంటి ప్రశ్నలకు జవాబులేమైనప్పటికీ, అంతియొకయలో ప్రకటనా పనిని వ్యాపింపజేసేందుకు తనకు సహాయం చేయమని బర్నబా తనను ఆహ్వానించినప్పుడు, అభినివేశం గల సౌలు ఆ నియామకాన్ని నిర్వర్తించేందుకు సమర్థుడై ఉన్నాడన్నది నిశ్చయం.—అపొస్తలుల కార్యములు 11:19-26.
[25వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
సిరియా
ఒరాంటీజ్
అంతియొకయ
సెలూసియ
కుప్ర
మధ్యధరా సముద్రం
యెరూషలేము
[చిత్రసౌజన్యం]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.
[24వ పేజీలోని చిత్రం]
పైన: ఆధునిక అంతియొకయ
మధ్య: సెలూసియ దక్షిణ దృశ్యం
క్రింద: సెలూసియ ఓడరేవు గోడ